Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

నిజం నిలకడమీద తెలుస్తుంది

పశ్చాత్తాపం

సీతా, గీతా పామర్రు పాఠశాలలో ఏడో తరగతి చదువు తున్నారు. ఇద్దరూ చాలా తెలివైనవారే. ఇద్దరికిద్దరే పోటీ. ఐతే గీతకు సీతంటే కాస్తంత అసూయ కలగసాగింది. కారణం తనకంటే మంచి ఛాయలో, అందంగా ఉండటం. ఆమె కురులు పొడవుగా రింగులుగా పెద్ద జడతో ఉండటం. అందరితో కలుపుగోలుగా మాట్లాడటం తెలివితో పాటుగా ఆమె కున్న అదనపు అర్హతలు.

గీత కాస్త ధనవంతుల బిడ్డ, అందుకే అందరితో కలుపుగోలుగా ఉండదు. రోజూ మంచి బట్టలు ధరించి, స్నేహితులకు బహుమతులు ఇస్తూ ఉంటుంది. రోజూ సైకిల్లో స్కూలుకు వస్తుంటుంది. అంతా తన వెంటే ఉండాలని ఆశిస్తుంది.

సీత అలాకాదు. మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చింది. అందరితో కలగలుపుగా ఉంటుంది. అంతా ‘సీతా సీతా‘ అంటూ ఆమె వెంటే ఉంటారు. ఎవరికే సాయం కావాలన్నా అడక్కుండానే చేసేస్తుంటుంది.

ఒకమారు తమ క్లాసు చదివే భాస్కరుకు ఆటల్లో పడిచేయి కొద్దిగా వాచిపోయి పదిరోజులు నోట్సులు రాసుకోలేక పోతే అతడు అడక్కుండానే వాని నోట్సులన్నీ వ్రాసిపెట్టింది. మరోమారు మాలతికి జ్వరం వచ్చి స్కూలుకు రాలేకపోతే తానే నోట్సులన్నీ వ్రాసిచ్చి ఇంటికెళ్ళి క్లాసులో జరిగిన పాఠాలన్నీ చెప్పింది. ఇలా ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయం చేస్తూనే ఉంటుంది. మితంగా మాట్లాడుతుంది. ఎవ్వరితో అతిగా స్నేహంచేయదు. అందరినీ పలకరిస్తుంటుంది.

గీత అనుకుంటుంది సీత గురించి పేద బుధ్ధులని. ఎలాగైనా సీత కన్నా తనకు ఎక్కువ మార్కులు రావాలని ఒక పధకం ఆలోచించింది.

వాళ్ల స్కూల్లో పెద్దపంతులు గారు మూడో క్లాసు నుంచే పిల్లలకు గ్రంధపఠనం నేర్పించి, పుస్తకపఠనం పట్ల ఆసక్తి పెంచాలని ప్రతిక్లాసులోనూ వారిస్థాయికి తగిన పుస్తకాలు ఉంచి వారు అవి చదివి తమ సొంత మాటలతో నోట్సుతయారు చేసి, పాయింట్లన్నీ వ్రాసి మూడునెలలకో మారు క్లాసు టీచరు గారికి ఇవ్వాలి. ఎవరైతే బాగా చదివి నోట్సు తయారు చేసి ఇస్తారో వారికి అదనపు పాయింట్లు ఇచ్చి, సంవత్సరాంతాన మంచి బహుమతులు ఇచ్చేవారు.

ఆ మాటు ఏడోక్లాసు వారికి ఒక్కోరికి ఒక్కో కాపీ చొప్పున గాంధీ జీవిత చరిత్ర ఇచ్చారు. గీతా, సీతా రోజూ తాము ఎన్నిపేజీలు చదివిందీ అందరితో చెప్పుకునే వారు. గీత మంచి ప్లాను వేసింది. తాను రోజుకు ముప్పై పేజీలు చదువుతూ సీతకు పదేసి పేజీలు చదివినట్లే చెప్పేది. సీత గీత మాటలు నమ్మింది. తానూ నిదానంగా చదవసాగింది.

ఒక రోజున ఆ క్లాసులో ఉండే ఉమ, గీత తన పుస్తకం బ్యాగు మీదే ఉంచి ఏదో పని మీదవెళ్ళగా, పక్కనే కూర్చుంటున్న ఉమ మధ్యలో బుక్కు మార్కు పెట్టి ఉన్న గీత పుస్తకం చూసింది. అప్పటికే అర్ధభాగం పూర్తిచేసి ఉండటం గమనించింది. గీత వచ్చి తన పుస్తకం బ్యాగులో దాచేసుకుంది. సీత వచ్చి కూర్చోగానే 'ఏంటో సీతా! నాకీ మారు ‘గాంధీ చరిత్ర’ చదవనే సమయం చిక్కట్లేదు. ఇప్పటికి పది పేజీలే చదివాను'. అనడం ఉమ వినింది.

ఆ సాయంకాలం ఇంటికెళ్ళేప్పుడు సీతతో ఉమ తాను గమనించిన విషయం చెప్పింది. సీత నవ్వింది."ఉమా మనం చదివేది మనకోసమే కానీ ఇతరుల కోసం కాదు కదా!. మనం నేర్చుకున్న ఙ్ఞానం మనం ఉపయోగించుకునేందుకే, ఆచరించడం కోసమే!, పోనీలే ఉమా! చెప్పినందుకు థాంక్స్" అంది.

కాలం గడుస్తున్నది. ఆరోజే పిల్లలంతా తాము వ్రాసిన నోట్స్ ను టీచర్ గారికి ఇవ్వవలసి ఉంది. అందరికంటే ముందే గీత వెళ్లి నోట్స్ ఇచ్చి వచ్చింది. చివరగా సీత వెళ్ళి ఇచ్చింది. టీచరుగారు అందరి నోట్సులూ చూశాక. ముందుగా గాంధీ జీవిత చరిత్ర గురించి పాయింట్సు వ్రాసిన సీతను వచ్చి చదవమని కోరారు.

సీత తాను గాంధీజీ జీవిత చరిత్ర నుంచి సేకరించి వ్రాసిన పాయింట్లు చదవసాగింది. 'పరిశుద్ధమైన  ప్రేమ వల్ల జరగని పని అంటూ ఏదీఉండదు. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. ఉయ్ కెన్ మూవ్ మౌంటేయిన్స్ విత్ లవ్. ఎవరి సత్యనిష్ఠ పవిత్రంగా ఉంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూవుంటాడు. మరొకరిని మోసగించని వారెన్నడూ చిక్కుల్లో పడరు. నిజం మాట్లాడేవారు, నిజాయితీగా వ్యవహరించేవారు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనకు నచ్చని విషయాలను విని మర్చిపోవాలి. నచ్చిన విషయాలను ఆచరణలో పెట్టాలి. సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది, నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కంటే మంచివారితోనే స్నేహం చేయడం ఉత్తమం. భగవంతుని మైత్రిని కోరుకునేవాడు ఏకాకిగా ఉండాలి లేదా ప్రపంచమంతటితో స్నేహంగా వుండాలి. ఏ ఒక్కరితోనో అతి స్నేహం చేయకూడదు. ప్రపంచం నీతి మీద నిలబడి వుంటుంది. నీతి అనేది సత్యంతో కూడివుంది. అపకారానికి ప్రతీకారం అపకారం కాక, ఉపకారమేచేయాలి.! సత్యారాధకునికి మౌనం అవసరం. సామాన్యంగా అబద్ధం చెప్పడం, తెలిసో తెలియకో అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మరుగు పరచడం మనిషికి కలిగే సహజదౌర్బల్యాలు. ఐతే మితబాషి అర్థంలేని మాటలు మాట్లాడదు. ప్రతిమాట ఆచితూచి మాట్లాడతాడు. అందుకే మిత భాషణం అవసరం. అతిభాష మతి హామి. మితభాష అతిహాయి. ప్రతిరోజూ నడుస్తూండటంవల్ల జబ్బులు రాకపోవడమేగాక శారీరక ధృఢత్వం కూడా కలుగుతుంది. సత్యం వజ్రం వలె కఠోరం, కుసుమంవలె కోమలం. మనం ఎల్లప్పుడూ మంచి పనులే చేయాలి. చెడ్డ పనులను ఎన్నడూ చేయరాదు. సత్యాన్నిపాటించడం వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం మొదలైనవి సహజంగా తగ్గిపోతాయి.'

టీచరు గారు సీత చదివిన పాయింట్లను ఎంతో మెచ్చుకుని వందకు వంద మార్కులు కేటాయించారు.'

"చూడండి పిల్లలూ! లేత వయస్సులోనే మంచి నేర్చుకోవాలి. సీత చక్కగా పాయింట్లు ఏరి వ్రాసింది. ప్రేమ, సత్యం, మంచిస్నేహం ఇవే మీరు నేర్చుకోవలసింది. అసూయ, అసత్యం మనిషిని పతనంచేస్తాయి. కనుక ఎన్నడూ ఎవ్వరినీ మోసగించాలని అనుకోకండి. నేర్చుకున్నవి పాటించండి. మంచినే అనుసరించండి." అని చెప్పాక గీత లేచి వచ్చి "మన్నించండి టీచర్. నేను సీత మీద అసూయతో అసత్యం చెప్పాను. సీతను మోసగించాలని చూశాను. సీతా! మన్నించు. నీలాంటి మంచి వారితో స్నేహం చేసి నా లోపాలు పోగొట్టుకుంటాను." అని మన్నింపు కోరింది.

సీత గీతను ఆలింగనంచేసుకుని "స్నేహితుల మధ్య మన్నింపులేంటి! మనం మంచి స్నేహితులం సరా!" అంది.

టీచరు గారు "పిల్లలూ ! చూడండి. గీత మంచి తనం వెల్లడైంది. తమ తప్పు తెలుసు కుని పశ్చాత్తాప పడేవారే నిజమైన మనుషులు. నిజాన్ని నిలకడ మీద తెలుసుకుని గీత చక్కగా తనను తాను సరిచేసుకుంది. గీతను అంతా అభినందించండి." అంటూ కరతాళ ధ్వనులు చేయించారు. పిల్లలూ! ఏదైనా అప్పటి కప్పుడు కాక కాస్తంత సమయం తీసుకుని ఆలోచిస్తే నిజం తప్పక మన మనస్సులో చేరి మన తప్పులను మనకు తెలియజేస్తుంది. అందుకే నిజం నిలకడ మీద  తెలుస్తుంది అన్నారు పెద్దలు.

Posted in December 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!