Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

నమ్మక ద్రోహం

Nammaka Droham Panchatantra story

అనగనగా ఒక గ్రామంలో ఒక విద్యావంతుడైన సన్యాసి ఉండేవాడు. అతడు ఊరూరా తిరుగుతూ భక్తి ప్రవచనాలు చెప్తుండేవాడు. సన్యాసి బోధలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. తమ శక్తి కొలదీ ఫలాలూ దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు.

‘ఇవన్నీఎందుకు నాయనా’ అంటూనే వాటిని తీసుకుని మనసులో మాత్రం తెగ సంతోషిస్తుండేవాడు. ఫలాలు తాను తినగలిగినంత తిని మిగిలినవి ప్రసాదం పేరుతో తిరిగి భక్తులకు ఇస్తుండేవాడు. దక్షిణ రూపేణా వచ్చిన ధనాన్ని మాత్రం ఒక బొంతలో (నాలుగైదు వస్త్రాలు కలిపి దట్టంగా కుట్టినది – పలుచటి పరుపు వంటిది) దాచి, దానిని ఎప్పుడూ వదలకుండా తనవెంటే పెట్టుకుని తిరిగేవాడు.

ఇదంతా ఒక యువకుడు గమనించాడు. ఎలాగైనా ఆ బొంతలోని ధనాన్ని కాజేయాలని ఒక ఉపాయం ఆలోచించాడు. నెమ్మదిగా సన్యాసి వద్దకు వెళ్ళి మాయ మాటలు చెప్పి శిష్యుడిగా చేరాడు. ఎంతో వినయ విధేయతలతో మసులుకుంటూ సన్యాసికి సేవలు చేశాడు. కొన్నాళ్ళకి ఆ యువ శిష్యుడిపై సన్యాసికి బాగా నమ్మకం కుదిరింది. ఎక్కడికి వెళ్లినా తన శిష్యుడిని వెంటబెట్టుకుని వెళ్ళసాగాడు.

ఒకసారి పొరుగు గ్రామం వెళ్ళి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు గురుశిష్యులు. కొంత దూరం నడిచాక ‘గురువుగారూ అపచారం జరిగిపోయింది?’ అన్నాడు శిష్యుడు బాధగా.

‘ఏమైంది శిష్యా?’ అడిగాడు సన్యాసి గురువు .

‘నిన్నరాత్రి మనం నిదురించిన వారి ఇంటి చీపురుపుల్ల ఒకటి నా సంచికి అంటుకుంది. అది నేనిప్పుడే గమనించాను. గడ్డిపరకైనా పరుల సొమ్మేకదా. పరుల సొమ్ము కాజేయరాదని మీరే చెప్పారు కదా. నేనిప్పుడే వెళ్ళి ఇది వారికి ఇచ్చి వస్తాను‘ అని పరుగు పరుగున వెనక్కి బయలుదేరి కొంతసేపు అక్కడా ఇక్కడా గడిపి తిరిగి వచ్చాడు.

శిష్యుడి నిజాయితీకి సన్యాసి ఎంతో సంతోషించి ‘నీవంటి శిష్యుడు దొరకడం నిజంగా నా అదృష్టం’ అని వాణ్ణి ఎంతగానో పొగిడాడు.

గురు శిష్యులిద్దరూ తిరిగి ప్రయాణం కొనసాగించారు. ఇంతలో సాయంకాలమయింది. సన్యాసి సంధ్యావందనం (బ్రాహ్మణులు, మునులు వంటివారు ఉదయం, సాయంకాలం చేసుకునే పూజ) చేసుకుందామని తన బొంత, ఇతర సామగ్రి శిష్యుడికి ఇచ్చి ‘నాయనా! నేను వచ్చేదాకా వీటిని జాగ్రత్తగా చూస్తుండు.ఎక్కడికీ వెళ్ళకు’ అని చెప్పి, దగ్గరలోనే ఉన్న చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకుందామని వెళ్ళాడు. అదే సరైన సమయమని తలచి శిష్యుడు గురువుగారి ధనం దాచి ఉన్న బొంత తీసుకుని పారిపోయాడు.

పూజ ముగించుకుని తిరిగి వచ్చిన సన్యాసి, శిష్యుడు కనిపించకపోయేసరికి ‘నాయనా ఎక్కడున్నావు’ అని పిలుస్తూ ఆ చుట్టు ప్రక్కలంతా చాలాసేపు వెతికాడు కానీ లాభం లేకపోయింది.

‘అయ్యో! ఎంతో మంచివాడని నమ్మి ఎన్నాళ్ళనుండో కూడబెట్టిన నా ధనమంతా వాడి చేతిలో పెట్టానే! ఎంత మోసం చేశాడు’ అంటూ దుఃఖించాడు.

నీతి: ఎవ్వరినీ కూడా మరీ గ్రుడ్డిగా నమ్మకూడదు.

Posted in December 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!