Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

వాస్తవానికి వేయి రూపాలు -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

కొన్ని కఠోర కుఠారాలు
కొన్ని మృదు సుమహారాలు
కొన్ని సుస్నిగ్ధతుషారాలు
కొన్ని పవనవీచీవిహారాలు

కొన్ని సుమధుర మధుస్రోతస్సులు
కొన్ని కష్టసైకతభూముల ఒయాసిస్సులు
కొన్ని ధ్యానోచిత నీరవ నిశ్చల మనస్సులు
కొన్ని ఆశాద్వీపాలకావలి ఉషస్సులు

కొన్ని వాస్తవానుభూతినిచ్చేఅవాస్తవాలు
కొన్ని అవాస్తవాల వంటి వాస్తవాలు
కొన్ని తప్పించలేని విధి చేతివ్రాలు
కొన్ని ప్రకృతి నైజానికే పెను సవాలు

కొన్ని కృత్రిమ మైపూతల చందనాలు
కొన్ని సహజపరీమళ నందనాలు
కొన్ని సస్నేహదరహాసకుందనాలు
కొన్ని సత్యాన్వేషకుల స్పందనాలు

వెరసి మానవ జీవితం
భూతం. భవత్. భవితవ్యం

“నేను” (దీర్ఘ కవిత) - విశ్వర్షి వాసిలి

కేరాఫ్ కాలేనివాణ్ణి

నేను
నిశ్చల మనసును
మృత మనసును కాను.
***
నేను
ఏ ధ్యానాన్నీ కాను
ఏ ధ్యాసనూ కాను.
***
నేను
ఏ వరాన్నీ కాను
ఏ శాపాన్నీ కాను.
***
నేను
ఏ కర్మశేషాన్నీ కాను
ఏ కర్మఫలాన్నీ కాను.
***
నేను
ఏ మూటనూ కాను
ఏ మూతనూ కాను.
***
నేను
గాటకు కట్టినవాణ్ణి కాను
కులమత ఇరుసును కాను
సిద్ధాంతాల బరువును కాను
నీ-నాల సరిపద్దును కాను.
***
నేను
అంధవిశ్వాసాలను ఆరేసినవాణ్ణి
ఆధిపత్యాలను పాతరేసినవాణ్ణి
మతమౌఢ్యాన్ని ధిక్కరించినవాణ్ణి
నిబద్ధీకరణ నుండి విడివడినవాణ్ణి
కొత్తను ఆవిష్కరించుకుంటున్నవాణ్ణి.
***
అవును,
విడదీయటంలోని
ఆనందానుభూతి తెలియనివాణ్ణి
విభజించి
పబ్బంగడుపుకోవటం తెలియనివాణ్ణి
భంగపడుతూ
భగవంతుడికి కేరాఫ్ కాలేనివాణ్ణి.
***
నేను
ఏ బరువులు మోయనివాణ్ణి
ఏదీ భారం కానివాణ్ణి
ఏ చింతనకు కట్టుబడనివాణ్ణి
ఏ చింతా లేనివాణ్ణి.
***
నేను
ధ్యానాన్ని
కాలనిబద్ధత లేని ధ్యానాన్ని.
నేను
ధ్యానస్థితిని
సర్వతంత్ర ధ్యానస్థితిని.
నేను
సంస్థాగత అవస్థలు లేని ధ్యానాన్ని
వ్యక్తిపర తాకిడులు లేని ధ్యానాన్ని
ఇహవాసనలు లేని ధ్యానాన్ని
పరధ్యాసలు లేని ధ్యానాన్ని.
నేను
సత్యం వాకిటి ధ్యానసత్త్వాన్ని
ధ్యానసత్త్వ అస్తిత్వాన్ని.

ఒక్కమాట -- అరుణ నారదభట్ల

ఆ. వె.
----------------------
ఒక్కమాటరాయ నొప్పదే యీమదీ
ఒదిగెనణువణువున నోర్పునిండి
అమ్మప్రేమయంత అమృతపుకలశమ్ము
అమ్మెయాత్మ వోలె చెమ్మ మనకు!!

కళ్ళుదెరచుముందె కనిపెట్టి మదినిండ
కలల భవితనంత గలిపికుట్టి
కడుపునింపిమనకు కావలసినవిచ్చు
కరిగిపోనికరుణ, కాంతి అమ్మ!!

విరుల తావివోలె వికసించిహృదయమ్ము
తలపునిండనుండు తల్లి ప్రేమ
ప్రకృతి దెల్పుభాష పరవశంబునుజూపి
తరులునిండునధిక విరులుపండి!!

తనను తాను మరచి తనువంత విరబూసి
త్యాగమూర్తి యగును తల్లియెపుడు
తత్వమంతదెలిసి తగినసాధనజేసి
తనివితీరబెంచు మనలనమ్మ!!

తీపి ఇల్లు -- రాజేశ్వరి దివాకర్ల

నేను కట్టిన ఇల్లు
నన్ను కట్టి పడేస్తుంది.
ఆచోటుకు, ఈచోటుకు
పయనించానంటే చాలు,
నీళ్ళు పోసి పెంచిన తోట
కన్నీళ్ళు పెడుతుంది.
గడ్డి బంతుల బొంత కప్పు కుంటుంది.
చెట్టు వాలిన చిలక,
ఉలుకు అలికిడి లేక
పలుకు మరచిపోతుంది
పచ్చి దొండ పండి
నేల జిగటకు అంటి రాలిపోతుంది.
నాశ్వాస వాసన లేక
గడప అంచున దీనమైన శ్వానం
దీక్ష విశ్వాసం వీడక
కరకు మంత్రం పఠిస్తుంటుంది

గూడు కావాలని పేర్చుకున్న ఇల్లు
నాజోడు సహవాసం
పట్టి నిలిపిన ఇల్లు
నా కూడు ,గుడ్డకు
ఆశ్రయ ధామమైన ఇల్లు,
నా జీవన నైర్మల్యానికి
ధారణ సహన మైన ఇల్లు,
అభ్యుదయ పరంపరకు
నవ పుష్పక మైన ఇల్లు,
నన్ను చిదిమి దీపం పెట్టిన
అద్భుత శాంతి రూపం ఇల్లు,

నా కార్య మగ్నతల నిరంతర ప్రయాసకు
ఆట పట్టుగ నిలిచిన అందమైన ఇల్లు
నాస్నేహ ,పరిచయాపేక్షల
హృదయ సంగమమైన ఇల్లు,
నేను చిరకుశలమై ఎల్లవేళల
తిరిగి రావాలని కోరిన "తీపి ఇల్లు"
కట్టకడకు పోకడ తప్పని సరి అయినా
నా గుట్టు మట్టులను
చెక్కు చెదరక నిలిపే గుప్తధనం ఇల్లు.

పరితాపం -- అత్తలూరి విజయలక్ష్మి

అద్దాల మేడలో మెత్తటి సోఫాలో విలాసంగా కూర్చుని
ఖరీదైన విస్కీ తాగుతూ, మగువల పొందుతో మత్తిల్లినపుడు
నాకు గుర్తు రాలేదు

పదవిని, పార్టీని నిలబెట్టుకోడానికి, కరడుగట్టిన కసాయిలను
పోషించి హత్యలు, మానభంగాలు చేయించినప్పుడు
గుర్తు రాలేదు

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోడానికి
వ్యాపారస్తులను, పారిశ్రామిక వేత్తలను
పావులుగా వాడుకున్నప్పుడు
గుర్తు రాలేదు

పేదల జీవితాలతో చెలగాటం ఆడుకోడానికి
ప్రభుత్వ సారాయి దుకాణాలను
పెంచి పోషించేటప్పుడు
గుర్తు రాలేదు

దేశంలో నేనూ ఒకడినని మర్చిపోయి
నా దేశమంతా నాదేనని  దోచుకుని దాచుకొన్నప్పుడూ
గుర్తు రాలేదు

స్వార్ధం కోసం మతోన్మాదులను, తీవ్రవాదులను
ఉగ్రవాదులను తెల్లబట్టల చాటున కప్పి పెట్టినప్పుడు
గుర్తు రాలేదు

తమ్ముడూ !
నా జీవితం స్వర్గం చేసి నరకంలో బతికావు
నువ్వు ముళ్ళ మీద నడుస్తూ
నాకు ఎర్రతివాచీ పరిచావు
మెడలో మరణశాసనం కట్టుకుని
నాకు గజమాలలు వేయించావు
తీసుకోడమే కాని ఇవ్వడం ఎరుగని స్వార్ధపరుడిని
నీ శవం మీద నడచి వచ్చి నీ రక్తంతోటే
నీకు వీరతిలకం దిద్డుతుంటే గుర్తొచ్చింది
నాకుటుంబం కోసం బతికే నా బతుకుకన్నా
వసుధైక కుటుంబం కోసం బతికిన
నీ బతుకు విలువైందని
చేయని నేరానికి ముష్కరుల దాడిలో
ముక్కలైన నీ దేహాన్ని చూసాక
గుర్తొచ్చింది
అవినీతితో అడ్డంగా పెరిగిన ఈ దేహం కన్నా
అమూల్యమైనది నీ దేహం అని
అందుకే ఆ దైవాన్ని ప్రార్దిస్తున్నా
మరుజన్మ అంటూ ఉంటే నీ ఋణం తీర్చుకోవడానికి
నన్ను నీ కొడుకుగా పుట్టించమని

Posted in December 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!