Menu Close
గ్రంథ గంధ పరిమళాలు
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘విశ్వాసము-పరిచయం’

రైలులో ఉన్న బ్రాహ్మణ యువకుడు అల్లుడు. అతని భార్య, అత్తగారు స్టేషన్ కు వచ్చారు. దానికి కారణం, అల్లుడు ఆయన ఇంటి తాళం చెవులు మరిచి పోవడమే. కొత్త దంపతుల మధ్య ఉన్న అనురాగాన్ని ముఖ్యంగా కనుల భాష, దాని ప్రభావం వీటిని గూర్చి తెల్పారు శాస్త్రిగారు.

“చుఱుకు చుఱుకుగా జవరాలు సూచెఁ జూచె
మరల నాతడు జవరాలు మరలఁ జూచె
చూపు చూపు పరస్పర సూక్ష్మ భాషి
తముల వివరించె వైద్యుత తంత్రులట్లు”

పరస్పర ఆకర్షణకు కన్నులు ముఖ్యసాధనాలు. ఆలుమగలు కంటి చూపులతో హృదయానందాన్ని పొందడం; ఆ ఆనందం విద్యుత్ స్పర్శ వలె ఒక అనుభూతిని కలిగిస్తుందని శాస్త్రి గారు ఈ పద్యంలో చెప్పి పాఠకునికి ఒక మధురానుభూతిని గుర్తుచేశారు. దుఃఖాంతమయిన ఈ కథలో పాఠకునికి ఈ కథ ద్వారా ఒక మంచి సంఘటనను చెప్పి కథను నడిపించడం వల్ల పాఠకుడు పూర్తిగా శోకంలో మునిగిపోకుండా ఉండగలడు. ఆ విషయాన్ని తర్వాత పద్యంలో చెప్పి,

“వాచ్యమునకంటెఁ జాతురి వ్యంగ్యమునకు
బ్రబలమను మాట నాకప్డు స్పష్టమయ్యె
వావిడిచి చేయు మోఱఁ జెవివైచి కొనక
కన్నుసన్నలే యెల్లరుఁ గాంచుకతన”

రైల్లో అందరి దృష్టి ఆ దంపతుల కన్నులలోని ప్రేమ జల్లులనే ఆకర్షించాయి. అంతేగాని ఆ ఉప్పరి వాని కుక్క కథ అతని బాధ అందరూ మరిచిపోయారు. భాష కన్నా మౌనంగా భావాలతో మాట్లాడుకోవడంలో ఎంతో విద్యుత్ చర్య ఉందని చెప్తూ వాచ్యమున కంటే వ్యంగానికి చాతుర్యం ఎక్కువని తెలియ చెప్పారు శాస్త్రి గారు.

రైలు కదిలింది. ఆ నూతన దంపతుల కళ్ళలో కన్నీరు ఉబికాయి. అలాగే కుక్క అరుపులు ఎక్కువగాజొచ్చాయి. బ్రాహ్మణ యువకుడు తన భార్య వెళ్ళిపోతున్న వంకకు, ఉప్పరి తన కుక్క తట్టు, రైలులో నుండి తలలు బయట పెట్టి చూస్తూ ఆవేదన చెందుతున్నారు.

రైలు కదలగానే, కుక్క కూడా పరుగెత్తసాగింది.  అయితే ఇంటివైపుకు కాదు. ఊపందుకొంటున్న రైలుతో పాటు పరుగెత్తసాగింది. అది చూచినా రైల్లో ఉన్నవారికి ఆశ్చర్యం వేసింది.

రోఁజు చిట్లు కుక్క నూజెండ్ల స్టేషను
దాఁక రైలు వెంట దూఁకి వచ్చె
ఎదిరి రైలు నప్పుడే బందరున నుండి
చేరుకొని యె బ్లాటుఫారమునకు”

ఇక్కడ గనుక రైల్లో వాళ్ళు, ఉప్పరి రైలు దిగి వెళ్లి ఉన్నట్లయితే కథ సుఖాంతం అయి ఉండేది. కుక్క దక్కేది. అలా జరుగలేదు. కుక్కను రైల్వే వారు ఉప్పరి ఉన్న రైలు దగ్గరకు రానీక తరిమేశారు. అది కొంత సేద తీర్చుకొని కదిలిన రైలుతో తిరిగి తన దీర్ఘ ప్రయాణం సాగించింది. ఇక్కడ కవి బాధపడుతూ “నాకు నంత పూన్కి లేకపోయె” అనుకొంటాడు. అవసరానికి రాని ఆలోచనలు వృధానేగదా!

శాస్త్రి గారు, ఉప్పరివాడు ఎక్కిన రైలు కదిలింది. దానితో పాటు కుక్క కూడా కదిలింది. కుక్క రైలుతో గూడా పరుగెత్తి వస్తున్నదా? లేక పరుగెత్తలేక ఎక్కడైనా ఆగిపోయిందా? ఏమైపోయిందో అని కుక్కను గూర్చి ఆలోచిస్తూనే ఉప్పరివాడు చౌదరిగారికి, మిగతా వారికి తన కథ చెప్పడం ప్రారంభించాడు.

“యుప్పరుల నుండి! లేదండి యుప్పుగంజి.”
“ఇల్లులేదండి; పదిమంది పిల్లలండి;..”
“వడిగ వచ్చిపడిన బుడమేటి వెల్లువ; జల్లిపోయె నండి
పిల్ల తల్లి; అప్పుడండి, చావు తప్పించెనండి, ఈ
దొడ్డ కుక్క నాకు బిడ్డలకును”
“మనిషి బుద్దికంటె మా దొడ్డ బుద్ధండి; మసలదండి మెపుడు మమ్ము విడిచి..”
“...చివ్వుమంచు లేచి చెర్లాడి చంపును బందినైనఁ ద్రాచుఁ బామునైన.” అని తన కుక్క యొక్క సుగుణాలు తన అవస్థ వివరించిన ఉప్పరి, తర్వాత అతను కుక్కకు తనకు, తనవారికి, అందరికీ ఉన్న అనుబంధాన్ని ఒక గీత పద్యంలో ఉప్పరి నోట వెంట చెప్పించిన ప్రభాకర శాస్త్రి గారి కావ్య నిర్మాణ శక్తి అద్భుతం.

“దాని గంజి ముందు, తర్వాత నా గంజి ;
నేను దాని వీడ లేను, నన్ను
నదియు వీడలేద యిదివఱ; కాకుక్క
ప్రాణమండి నాకు బాబులారా!”

ప్రేమాభిమానాలు పంచుకోవడానికి, మమతానురాగాలు పెంచుకోవడానికి పంచభక్ష్యపరమాన్నాలు అక్కరలేదు. గంజి నీరు చాలుగదా! ‘మన’ అనుకొన్నవారు తింటే మనకది మన కడుపు నిండినంత తృప్తినిస్తుంది. అంతేగాక ఇప్పటి వరకు ఎన్నడూ వీడని ఆ కుక్కను ఇంత ఘోరంగా దూరం చేసుకోవడం ఆ ఉప్పరి అతనికి భరించరాని శిక్షయింది. కుక్కకు ఉప్పరి అతనికి మధ్య ఉన్న అనుబంధాన్ని, దాన్ని విడిచి అతను ఎంత బాధ అనుభవిస్తున్నాడో శాస్త్రి గారు మన హృదయాలను కదిలించేలా వ్రాశారు.

మానవుల మధ్య స్వచ్ఛమయిన ప్రేమాభిమానాలు ఎలా ఉండాలో, ఎలా ఉంటాయో ఉప్పరి మాటల ద్వారా మనకు తెలియజేస్తూ శాస్త్రి గారు వ్రాసిన మరికొన్ని పద్యాలలోని భాగాలు వచ్చే సంచికలో మీ కోసం....

**** సశేషం ****

Posted in December 2019, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!