Menu Close
Galpika_title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

ఘరానా దోపిడీ -- స్వాతి శ్రీపాద

నెమ్మదిగా ఎనిమిదింటికి చేరాను -ఎలాగూ మన హైదరాబాదీలవి నవాబు పద్ధతులే కదా..

రాత్రి తొమ్మిది దాటితే కాని ఏ కార్యక్రమం మొదలే అవదు.

అయినా అప్పుడే ఒక్కొక్కరూ దిగుతున్నారు కార్లో, ఊబర్లో, ఓలాలో. హాలింకా సందడి పుంజుకోలేదు. వచ్చిన వాళ్ళు ఒకరినొకరు పలకరించుకోడం సరిపోతోంది.

వేదిక మీద హడావిడిగా వుంది. పూల అలంకరణ, కనీసం ఒక లారీ పూలు వాడి ఉంటారు.

మింగమెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అనీ ...

ఉండే కొంపలు గదిన్నర బాపతుఅయినా, ఫంక్షను హాళ్ళూ, పూల అలంకరణ అర్భాటాలు జీవన విధానంలో ఒక భాగమైపోయాయి.

నా వయసే ఉన్న మా అత్త గారి చెల్లెలూ, అదే వయసున్న ఆడబడుచూ మాట్లాడుకుంటున్నారు.

"కోడలు వచ్చిందా?"

"ఉహు రాలే, అదెక్కడ వస్తుంది? "

"ఏడాది దాటిపోయింది కదా?"

"అవును, కాని దాని అమ్మ రానిస్తుందా?"

నవ్వుకున్నాను.

ఒక్కగానొక్క కొడుకు ప్రేమించి పెళ్ళి చేసుకున్న పంజాబీ అమ్మాయి. పెళ్ళైన మర్నాటి నుండీ అత్తగారు గీసిన గీత దాట వద్దంటే, జీతం అణాపైసలతో తన చేతిలో పెట్టి ప్రతి రూపాయీ లెక్క చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు.

ఇటు ఒంటరి తల్లిని వదిలెయ్యలేక అటు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక వాడెంత సతమతం అవుతున్నాడో...

ఈ లోగా ఎవరో వచ్చి పలకరించారు.

అవును ఈ పిల్ల తోటికోడలు కూడా పెళ్ళైన మూడురోజులకే మొగుడిని వదిలేసి వెళ్ళిపోయింది.

"మీ తోటి కోడలు రాలేదా?" అడిగాను.

"రాలే"

"రాదటనా?"

"రాదట..."

"అయ్యో అదేం పాపం, మీరంతా నచ్చలేదటనా?"

"మేమంతా నచ్చాము ఆంటీ "

"మరి అత్తగారూ మొగుడూ నచ్చలేదేమో "

"అత్తగారు నచ్చింది, మొగుడే?"

"అదేం ఇద్దరూ ఒకరినొకరు ఏరి కోరి చేసుకున్నారుగా."

"మొగుడూ ఒక్కోసారి నచ్చుతాడు ఒక్కోసారి నచ్చడు.

పోనీ వేరే ఉండమన్నా ఉండరట షాపింగ్ చేసినా, ఇల్లరికం తీసుకెళ్ళు అన్నా వద్దట. ఆ మొగుడూ షాపింగ్ తీసుకెళ్ళినా  సినిమాకు వెళ్ళినా నచ్చుతాడు. ఇంట్లో ఏ మాత్రం నచ్చడట"

ఓరినాయనో ఇలా నచ్చడాలు కూడానా?

వెర్రి చూపు చూశాను.

"ఇప్పుడు నగా నట్రా పట్టుకెళ్ళిపోయింది అది చాలట"

అప్పటికే ఒక పిల్లను వదిలి ఈమెను చేసుకున్న వాడికి చెప్పు దెబ్బ. మరెవరూ మరో పిల్లను ఇవ్వరు కదా...

గల్పికావని - శుక్రవారధుని 17- థాంక్స్ ఫర్ సారీ -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ఓ ముప్ఫై యేళ్ళ మహిళ తనవైపే తేరిపార చూస్తోంది. అంటే ఖచ్చితంగా తన పాత విద్యార్థినే అయివుంటుందనుకున్నాడు శ్రీధర్. కానీ ఎవరనేది మాత్రం గుర్తు రావడంలేదు. ఆమె ఎవరో ఊహించే ప్రయత్నం చేస్తూండగానే త్వరత్వరగా అడుగులేస్తూ తనవైపే  రావడం మొదలుపెట్టింది. ఆమె తనని చేరేలోపే ఆమె ఎవరో గుర్తొచ్చేసింది.

అంతే..,

ఒక్కసారిగా గుండెలు అదిరిపోయాయి. తను ఎవరో కాదు, వైష్ణవి. పదిహేనేళ్ళక్రితం ముష్టూరులో టీచరుగా ఉన్నప్పటి ఏడవ తరగతి విద్యార్థిని. ఆమె చేతికి దొరకడం అంటే పులి నోట్లో తలపెట్టినట్లే. అందుకే తప్పించుకునే తరుణోపాయం కోసం వెతుకుతూండగా ఆపద్బాంధవిలా వచ్చింది సిటీ బస్సు. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా చూడకుండా కళ్ళుమూసుకుని ఎక్కేశాడు. అతని అదృష్టం కొద్దీ ఎక్కినవెంటనే కదిలింది బస్సు.

వైష్ణవి ఆ బస్సుని అందుకునే ప్రయత్నంలో విఫలమై బస్సుని తిట్టుకుంటూ బస్టాపులోనే నిలబడిపోవడం శ్రీధర్ కి కనిపిస్తూనే ఉంది. ఆమె తననింక పట్టుకోలేదనే ధైర్యం కలిగాకగానీ అతని గుండెలు కుదుటపడలేదు.

వైష్ణవి అంటే తను ముష్టూరులో ఉన్నప్పుడు ఏడవ తరగతి విద్యార్థిని. ఏపుగా పెరుగుతున్న లేత కొమ్మ కావడంతో చూపరుల్ని ఇట్టే ఆకర్షించేది. ఆ అందానికీ ఆకర్షణకీ లోనై ఒళ్ళు మరిచి ప్రవర్తించినవాళ్ళల్లో తను కూడా ఒకడు. అందుకే శ్రీధర్ కి ఆమెని చూడగానే గుండె దడ పట్టుకుంది.

ఏ సంఘటన జరిగినా అది ఒక బలహీన క్షణంలోనే జరుగుతుంది. అలాంటి బలహీన క్షణంలో జరిగిన దుస్వప్నంలాంటి ఘటన ఆధారంగా ఆయా వ్యక్తుల్ని అంచనా వెయ్యకూడదు. అయినా అదేంటోగానీ అందరూ అక్కడినించే ఆ వ్యక్తిని కొలవడం ప్రారంభిస్తారు. ఆ ఒక్క తప్పు తనని ఎన్నేళ్ళుగా ఎంతగా వేధిస్తోందో ఎంతగా బాధిస్తోందో కంటిక్కనిపించే పై పై కొలమాల్తో అడ్డదిడ్డంగా కొలిచి పారేసే ఆ కొలతల రాయుళ్ళకేం తెలుసు?

నిజమే, తను ఆ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం తప్పే.

ఆ తప్పు జరగడానికి కారణం కేవలం ఆమె అందం, తన బలహీనతలు మాత్రమే కాదు. ఆ రోజు వానరావడం, వైష్ణవి ఇంటికి వెళ్ళే అవకాశం లేకపోవడం, అదే సమయంలో కరెంటు పోవడం, ఆమె భయంతో తనకి దగ్గరగా రావడం. తన మనసు చలించడం మొదలైన సవాలక్ష కారణాలున్నాయి. అవేవీ వీళ్ళకక్కర్లేదు. ఎంతసేపూ ఎందుకు ముద్దెట్టుకున్నావు? ఎందుక్కౌగలించుకున్నావు? అంటూ తల తినెయ్యడమే తప్ప మరో పనిలేదు. శ్రీధర్ కర్మ కాలి, వాళ్ళ నాన్న సరిగ్గా అదే సమయానికి వచ్చాడు. ముందూ వెనకా చూసుకోకుండా తనమీద చెయ్యి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా నానా యాగీ చేశాడు. చివరికి ఆ ఊళ్ళో తలెత్తుకు తిరగలేక శలవుమీద ఊరెళ్ళి అటునించటే ట్రాన్స్ ఫర్ చేయించుకుని ఈ ఊరికి రావలసొచ్చింది. ఇక్కడికి వచ్చాక బుద్ధి తెచ్చుకుని ట్యూషన్లు చెప్పడం మానేసి, పెద్దలు చూసిన సంబంధం చేసుకుని, పిల్లా పాపల్తో మంచి పేరు తెచ్చుకుని బుద్ధిమంతుడిలా బతుకుతున్నాడు.

తను సుఖపడ్డం ఆ దేవుడికి ఇష్టం లేదు కాబోలు. అందుకే ఆ వైష్ణవిని తన ప్రాణాలమీదకి తోలినట్టున్నాడనుకుంటూ భయం భయంగా దిక్కులు చూస్తూ బస్సు దిగాడు శ్రీధర్. బస్టాపు దాటివెళ్ళిపోతున్నా ఆ వైష్ణవి తనని వెంబడిస్తోందేమోనన్న అనుమానం మాత్రం తరుముకొస్తూనే ఉంది.

మరో నాలుగడుగులు వేసేలోపే అతని అనుమానాన్ని నిజం చేస్తూ పక్కనే ఆగింది ఆటో. అందులోంచి దిగి డబ్బులిచ్చేసి ఆటోవాడిని పంపించేసింది వైష్ఠవి. తరువాత శ్రీధర్ కళ్ళల్లోకి చిరునవ్వుతో చూస్తూ అంది,"నన్ను గుర్తు పట్టండి చూద్దాం"

గుండెలు చిక్కబట్టుకుంటూ చెప్పాడు శ్రీధర్," నిన్నెలా మర్చిపోతాను వైష్ణవీ" ఆ మాటలు అంటున్నప్పుడు అతని పెదాలు అదురుతూండటం వైష్ణవి దృష్టిని దాటిపోలేదు.

అతని తడబాటుని గమనించిన వైష్ణవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే బిగ్గరగా నవ్వేసింది.

శ్రీధర్ మంచి విద్యార్థి పాఠం అప్పజెబుతున్నట్లుగా గబగబా అన్నాడు,"అయాం సారీ వైష్ణవీ, నేనప్పట్లో అలా చేసుండకూడదు"

"మ్మైగ్గాడ్ అదింకా మీకు గుర్తుందా? అఫ్ కోర్స్ కొన్ని గుణపాఠాల్ని మర్చిపోకుండా ఉండటమే మంచిదేలెండ్సార్. నేనిప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కూడా అందుకే"

"ఎందుకు?" బిక్కచచ్చిపొతూ అడిగాడు శ్రీధర్.

"మీకు సారీ చెప్పడానికి"

"సారీనా..?"

"అవును. ఆ రోజు నేను తొలిస్పర్శ మైకంలోనూ అధరచుంబన మాధుర్యానుభూతిలోనూ పడిపోకుండా మిమ్మల్ని మొదట్లోనే అడ్డుకుని ఉండాల్సింది. అలా చెయ్యకపోవడం వల్లే మీరెన్నో అవమానాల్ని ఎదుర్కొని చివరికి ఊరు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. సారీ సార్. అయాం వెరీ సారీ. అంతే కాదు, నేను మీకు థాంక్స్ కూడా చెప్పాలి."

"థాంక్సా ఎందుకమ్మా?"కాస్త ధైర్యం తెచ్చుకుని విస్మయంగా అడిగాడు శ్రీధర్.

"ఈ రోజు నేనీ స్థాయికి వచ్చానంటే అందుకు కారణం ఆ సంఘటన నాలో ఆలోచనలనే అగ్గిని రగిల్చింది. ఆనాటి గుణపాఠంలో పాఠం మీకూ. గుణం నాకూ లభించాయి" అంటూ అతని ఫోన్ నెంబర్ తీసుకుని తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టి "సాయంత్రం ఫోన్ చేస్తాను, నాకు కొంచెం టైం కేటాయించండ్సార్" అని అభ్యర్ధించి ఆటోలో వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయిన తరవాత చేతిలో మిగిలిన విజిటింగ్ కార్డుని చూశాడు.

వైష్ణవి, సైకో ఎనలిస్ట్ ఎండ్ కౌన్సిలర్ అని వుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఐదారు సంవత్సరాలుగా మారుమోగుతున్న సైకాలజిస్ట్ విజిటింగ్ కార్డది.

మారిన మనసు -- లలితా కుమారి

“మమ్మీ మమ్మీ” అంటూ కుదుపుతున్న ఎనిమిదేళ్ల  స్వీటీ మాటలకు ఏదో ఆలోచన లో వున్న జ్యోతి ఉలిక్కిపడి చూసింది.

“ఐ వాంట్ నూడిల్స్, ఐ వాంట్ నూడిల్స్” అంటోంది స్వీటి.

విసుగ్గా మొహం పెట్టి “తెలుగు లో చెప్పు ఆ మాట నువ్వు ఇక నుంచి నాతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడాలి.”

"యూ సెడ్ టు టాక్" అంటూ బుంగమూతి పెట్టి గారాలు పోతూ మళ్లీ “నువ్వే కదా మమ్మీ ఇంగ్లీషులో మాట్లాడమన్నావు” అంది.

బుద్ధి తక్కువఅయి అన్నాను అని మనసులో అనుకొని పైకి

“సరే ఇకనుంచి నువ్వు ఇంట్లో తెలుగు లోనే మాట్లాడాలి తెలిసిందా” కొంచెము గట్టిగా అంది.

ఓకే మమ్మీ అంటూ రివ్వున పరుగుతీసింది.

నిజమే మరి చిన్నప్పటినుండి దాంతో ఇంగ్లీషు ఇంగ్లీషు అంటూ ఇంగ్లీషులోనే మాట్లాడుతూ తెలుగు రాకుండా  చేసేను అయినా నా బుద్ధి మాత్రం ఏమయింది.

ఈ రోజు కదా గరికపాటి గారి ఉపన్యాసం వింటూ నిన్న నుంచి తెలుగు భాషా దినోత్సవం అంటూ టీవీలో వార్తల్లో హోరెత్తి విషయాలను చదువుతుంటే ఒక్క క్షణం మనసు మూగబోయింది.

నేను పుట్టి పెరిగింది పల్లెటూర్లో. అందులోనూ తెలుగు మాస్టారు గారి అమ్మాయిని.  చక్కగా ప్రభుత్వ పాఠశాల్లో పదో క్లాస్ వరకు చదివాను. చక్కటి తెలుగు ఎన్ని విషయాలు నేర్చుకున్నాను.  జీవితం ఎంత క్రమశిక్షణతో గడిచింది. అందరము ఎంత ఆప్యాయంగా ఉండేవారం.

అక్క, అన్న, వదిన, అత్త అంటూ వరసలతో  పక్కింటి వాళ్ళ ను కూడా పిలుచుకుంటూ అందరూ ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళం. ఆ చక్కటి పిలుపులో ఎంత ఆప్యాయత నిండి వుండేది.

సాయంత్రం అయ్యేటప్పటికీ స్కూల్ నించి రాగానే అమ్మ పెట్టిన అట్టు ముక్క తినేసి హాయిగా పెరట్లోకి వెళ్ళి పూలన్నీ కోసుకొచ్చి దండ కట్టుకుంటూ స్నేహితులతో ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం.

సంక్రాంతి పండుగొచ్చిందంటే మూడు రోజులు ముగ్గులతో ముంగిళ్ళు వెలిగిపోతూ ఉండేవి. మధ్యలో గొబ్బెమ్మలు బంతి పూలతో మెరిసిపోతూ ఉండేవి. పట్టు పరికిణీలు, పూల జడలు, గోరింటాకు పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, అలవాట్లుగా ఉండేవి. టి.వి. లేదు కేవలం  ప్రేమ క్రమశిక్షణ మాత్రమే.

రేడియోలో విని పాట నేర్చుకుంటూ వారం వారం వచ్చే బాలానందం వింటూ... ఆ రోజులే  రోజులు అవన్నీ ఎక్కడ వీళ్ళకి.

నాన్నకి ఆ వూరు నుంచి ట్రాన్స్ ఫర్ అవడం మూలంగా మేము పట్నం వచ్చేశాం. కాలేజీ చదువులు కాంపిటేషన్లో పోటీ పరీక్షలు అలా అలా డిగ్రీ వరకూ చదవగానే నాన్న పెళ్లి చేశారు.

సతీష్ మంచివాడే. కాలం హాయిగానే గడిచిపోతోంది  కానీ వచ్చిన చిక్కల్లా ఆ రోజులను మర్చిపోవడం. ఇంగ్లీషు మోజులో పడిపోవడం. మేమేం పోగొట్టుకున్నామని ఇంగ్లీష్ మీడియం లో చదవక  పోవడం వల్ల, కానీ మా పిల్లలు మాలా కాకూడదని  గొప్పగా పెంచాలని చెప్పుకోవడానికి తెలుగు లో మాట్లాడకుండా ఇంగ్లీషే నేర్పిస్తూ కొత్త అలవాట్లు నేర్పుతూ అసలైన అందమైన అనుభూతులని పంచలేదు. సరికదా పైపై మెరుగులను పిల్లలకి అలవాటు చేయడం అయింది. నాన్న చేసిన పనే మంచిది.  పోటీ ప్రపంచం ఉన్నా అందరిని ఆప్యాయంగా పెంచారు. మేము ఎనిమిది మంది ఎంత ప్రేమగా పెరిగాం ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టుకున్న తిట్టుకున్న ప్రేమే మిగిలింది.

ఇలా ఆలోచనల్లో మునిగి పోయింది  జ్యోతి.

“జ్యోతి కాస్త  కాఫీ ఇస్తావా” అంటూ వచ్చాడు సతీష్.

ఒక్క క్షణం అంటూ లోపలికి వెళ్ళి కాఫీ తో వచ్చింది. సతీష్ కి ఎలాచెప్పాలి అనుకుంటూ.

సతీష్ కాఫీ  త్రాగుతూ “జ్యోతి రేపు కదా కొత్త  స్కూలుకి వెళ్లాలి. పేరెంట్స్ మీటింగ్ కూడ ఉంది అన్నావు, ఆఫీసుకి సెలవు పెట్టాను.”

జ్యోతి కొంచెం నెమ్మదిగా “ప్లీజ్ సతీష్ ఇప్పుడు ఉన్న స్కూల్ బానే ఉంది. ఇప్పుడు స్కూలు మార్చడం ఎందుకు అనవసరంగా చాలా ఖర్చు. అంతేకాదు నాలుగు అడుగుల్లో దగ్గరగా ఉంది. సిలబస్ కూడా బానేవుంది ఈ స్కూల్లోనే  వుంచుదాం. పదో క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంటుంది. తర్వాత కాలేజికి వచ్చాక దాని ఇష్టం.” అంటూ తన మనసులో కలిగిన భావాలను చెప్పింది.

సతీష్ కి ఒక భారం దిగినట్లు అనిపించింది. ఏది వచ్చినా నా మేలుకే అని మనసులో అనుకొని, పైకి నవ్వుకుంటూ అలాగే నీ ఇష్టం అన్నాడు.

హమ్మయ్య ఎలా చెప్పాలా అనుకున్నను చాలా తేలిక గా ఒప్పేసుకున్నాడు సతీష్.

ఆనందంతో మనస్సు తేలిగ్గా అనిపించింది. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని పాడుకుంటూ ఏదో సాధించాను అనే ఉత్సాహంతో వంటింట్లోకి నడిచింది జ్యోతి.

బొద్దింక -- రాజేశ్వరి దివాకర్ల

సుబ్బు వంట ముగించింది. పదార్థాలన్నింటిపై మూతలను సవరించింది. సాంబారు ఘుమ ఘుమ లాడుతోంది. సుబ్బు పెట్టిన సాంబారు ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం. అజయ్ కైతే మరీను. అజయ్ సుబ్బును ను "దీదీ" అని పిలుస్తాడు. వాళ్ళుండేది, గుజరాత్ లో. ఆదివారం మాత్రమే అందరూ కలసి భోంచేస్తారు. అందుకనే సుబ్బు ఆ రోజు వంట మరింత శ్రద్ధగా చేస్తుంది. అందులోనూ ఈ రోజు రాము, సుశీల, అజయ్ కి పదవ తరగతి పరీక్షలు ముగిసాయని, ఆనందంగా అందరితో కలసి గడపడానికి స్నేహితులు కొందరిని భోజనానికి పిలిచారు. అందరూ పొద్దున్నే వచ్చారు. ఉదయం పూట ఫలహారానికి ధోక్లా, చట్నీ చేసింది. అందరూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ  తమ పిల్లలకిక పై చదువులకు ఏకాలేజికి పంపాలని చర్చించుకుంటూ సమయం గడిపారు .పిల్లలందరూ ఆటలాడుకుంటూ, కిందికీ పైకీ తిరుగుతూ హడావుడి చేస్తున్నారు.

అజయ్ కి, సుబ్బు దగ్గర చాలా చనువు. సుబ్బు కు 15 ఏళ్ళు ఉన్నప్పుడు రాము సుశీల తమకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చారు. అప్పటినుంచి సుబ్బు ఆ ఇంట్లోఒకతిగా కలసిపోయింది .అప్పటికి నెలల పిల్లాడుగాఉన్న అజయ్ ని అమ్మా, నాన్నా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు చిట్టి తమ్ముణ్ణి లాలించినట్లు గా సుబ్బు పెంచింది. ఇక సుశీల దగ్గర తెలుగు వంటలన్నీ నేర్చుకుని ఇప్పుడు ఆమె కంటే బాగా చేయగలదనిపించుకుంది. అమ్మా నాన్నలిద్దరూ ఎప్పుడూ తమఉద్యోగాలలో, తమ పనులలో హడావుడిగా ఉంటారు గనక, అజయ్ తన ఇష్టాఇష్టాలనన్నింటినీ సుబ్బు తో చెప్ప్తుంటాడు. సుబ్బును అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడు. సుబ్బు అజయ్ చేసే కొంటె పనులన్నింటినీ నవ్వుతూ భరిస్తూనే, అజయ్, నువ్విలా చేస్తే అమ్మ రాగానే చెప్తాను. అంటూ మందలిస్తుంది. చదువుకో అంటూ హెచ్చరిస్తుంది. ఏది ఏమైనా సుబ్బు ఉండడం వల్ల రాముకు సుశీలకు కొండంత అండ.

సుబ్బూ, ఇక భోజనాల సమయం అయింది. ప్లేట్లన్నీ టేబల్ మీద పెట్టు. పదార్థాలన్నీ సర్వింగ్ బౌల్స్ లో సద్దు. వాళ్ళను చేతులు కడుక్కుని రమ్మను.  నేను నీకు సహాయం చేస్తాను, అని చెప్పి సుశీల హాల్ లోకి వెళ్ళింది. అంతలో గబుక్కున అజయ్ వంటింట్లోకి వచ్చాడు. దీదీ ఏమైనా సహాయం చేయనా అంటూ. నువ్వు అడ్డు రాకుండా వుంటే అంతే చాలు అంటూ ప్లేట్లు సర్దే పనిలో పడింది. అజయ్ తనకిష్టమయిన వంటలన్నింటినీ చేసిన అక్కవైపు మెచ్చుకోలుగా చూసి అక్కడనుంచి బయటకు వెళ్ళాడు. సుబ్బు కూరలన్నింటినీ వెడల్పుగాఉన్న పింగాణీ పాత్రలలో సర్దింది. చివరకు సాంబారును తీసి వడ్డనకు వీలుగా మరొక పాత్రలో పోద్దామని మూత తీసేసరికి, ఉలిక్కి పడింది. ఆమె గుండె దడదడ లాడింది. ఒక్కసారిగా దుఖం పొంగుకొచ్చింది. ఆమె నుంచున్న చోటఅలాగే ఉండిపోయి కన్నీళ్ళు తుడుచుకుంటోంది. ఏడుపు ఆగటంలేదు. ఏంచేయాలో తోచటం లేదు, అంతలో సుశీల అక్కడకు వచ్చింది. సుబ్బు తలవంచుకుని కళ్ళు తుడుచుకోవడం చూసి దగ్గరకు వచ్చింది. అక్కడ సుబ్బు ముందున్న సాంబారు గిన్నెను చూసి నిర్ఘాంత పోయింది. ఇదేమిటి? ఎలాజరిగింది.? మనింట్లో ఇలా జరగడం ఏమిటి? ఇవి ఎక్కడనుంచి వచ్చాయి? సుబ్బూ, కిచెన్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటావుగా. అందుకే కిటికీలు తెరవద్దని చెప్తాను. అయినా ఇప్పుడేమిటి చేయడం? అందరూ లోపలికి వచ్చేస్తున్నారు? ఎలాగే? కంగారు పడుతోంది సుశీల. లోపల నుంచి పిలుపు ఇంకా రాకపోవడంతో రాము వచ్చి అక్కడి ఘట్టం చూసి కొద్ది సేపు అవాక్కయిపోయాడు. ఈ విషయం వచ్చిన వాళ్ళకు తెలిస్తే బాగుండదు. సుబ్బు ఏడుపు ఆపటం లేదు. ఇప్పుడు సుబ్బును ఏమని ప్రయోజనం లేదు. తన గుజరాతీ స్నేహితులందరూ ముఖ్యంగా వడలు సాంబారు కోసమే వచ్చారు. ఇంతలో అతిథులందరూ లోపల ఏం జరుగుతోందో నని అక్కడకు వచ్చారు. అక్కడున్న ముగ్గురి ముందున్న సాంబారు గిన్నెను చూసి రాము, ఆఫీసులో సుబ్బును గురించి ఎంతో గొప్పగా చెప్తావు ,ఇలాచేస్తుందా అంటూ ,ఆకలి మీద ఉన్నారేమో చిరాకు గా, కొందరు చీదరింపుగా. మరికొందరు, మాకిక ఆకలి పోయింది. ఏమీ తినాలనిలేదు అంటూ ముఖంచిట్లించారు.

అంతలో అజయ్ తో పాటు పిల్లలు లోపలికొచ్చారు. సుబ్బు ఏడుపును, అక్కడి వ్యవహారం శృతి మించుతోందని గ్రహించి ,అజయ్ స్నేహితుల చెవిలో గుస గుసగా ఏదో చెప్పాడు. పిల్లలందరూ గట్టిగా "ఏప్రిల్ ఫూల్స్ “ అని అరిచారు. పెద్దలందరూ అటు తిరిగారు. అజయ్ చెప్పాడు, అంకుల్స్ ఆంటీస్ అందరూ క్షమించండి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా అందుకనే నేను షాప్ లో త్రీ డి మాజిక్ తో చేసిన గాజు బొద్దింకలను తెచ్చి సాంబారులో వేసాను. పాపం సుబ్బు దీదీ చాలా క్లీన్ గా వంట చేస్తుంది. తప్పంతా నాదే. సరదాకి చేసాను, మీరంతా ఇలా రియాక్ట్ అవుతారని తెలుసు.  అందుకనే నాతప్పును చెప్తున్నాను అన్నాడు. అందరూ తేలికగా నిట్టూర్చారు. రాము గరిటెను తీసుకుని వెంటనే గాజు బొద్దింకలను బయటకు తీసేసాడు. అందరూ నిజంగా తాము ఏప్రిల్ ఫూల్స్ అయ్యాముకదా అని అనుకునేంతలో, అంతవరకూ వంచిన తల ఎత్తకుండా కళ్ళు తుడుచుకుంటున్న సుబ్బు నవ్వుతూ తలపైకెత్తి, నేను కూడా అజయ్ ని ఫూల్ చేసానక్కా, అజయ్ ఇందాకా వంటింట్లోకి వచ్చినప్పుడే ఏదో చేయడానికి వచ్చాడని అనుకున్నా .. సాంబారు గిన్నె మూత తీసిన వెంటనే ముందు నిజంగానే ఏడుపు వచ్చినా తరువాత ఇది అజయ్ చేసిన పనే అని తెలుసుకున్నా. వాడిని కూడా కొంచం కంగారు పెట్టాలని ఏడుస్తున్నట్లుగా నటించా అంది నవ్వుతూ. అందరికి ఇప్పుడు మనసు తేలికయింది. మళ్ళీ ఆకలి రవరవలాడింది. ప్లేట్లు గబ గబా అందుకుని తినడానికి ఉద్యమించారు. అజయ్, దీదీ నువ్వు కూడా బెదరగొట్టావు అని అన్నాడు.

Posted in December 2019, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!