Menu Close

Science Page title

టోమోగ్రఫీ

కొన్ని ఏకస్థానులు వికీర్ణ ఉత్తేజితం (radioactivity) ప్రదర్శిస్తాయి కనుక వీటిని వికీర్ణ ఏకస్థానులు (radioisotopes) అంటారు.  వీటి కేంద్రకాలలో అసాధారణమైన నూట్రానులు ఉంటాయి కనుక వీటికి స్థిరత్వం ఉండదు. స్థిరత్వం లేక గర్భం విచ్ఛిన్నం అవుతుంది. ఆ విచ్ఛిత్తిలో పోసిట్రానులు (positrons) అనే కణాలని విడుదల చేస్తాయి. ఈ పోసిట్రానులు ఎలక్‌ట్రానులని పోలిన పరమాణు రేణువులు (subatomic particles); ఎలక్‌ట్రానుకి ఋణ విద్యుదావేశం ఉంటే ఈ పోజిట్రానుకి ధన విద్యుదావేశం ఉంటుంది, వాటి గరిమలు మాత్రం సమానం. ఈ పోజిట్రాను ప్రతిపదార్థానికి (ఏంటీ మేటర్, antimatter) ఒక ఉదాహరణ.

ఇప్పుడు ఈ పోజిట్రానుకి “పోజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ” (Positron Emission Tomography or PET) అనే వైద్య పద్దతిలో కీలకమైన పాత్ర ఎలా వచ్చిందో చూద్దాం.

పోజిట్రానులని వికీర్ణం చేసే మూలకాలలో అయొడీన్-124 (I-124) ఒకటి. ఇది టింక్చర్ అయొడీన్ వంటి పదార్థాలలో వాడే అయొడీన్ వంటిదే; ఒకే చిన్న తేడా. అయొడీన్-124 అణుగర్భంలో ఉండవలసిన దానికంటె తక్కువ నూట్రానులు ఉన్నాయి. కనుక దీనికి వికీర్ణ ఉత్తేజిత (“రేడియో ఏక్టివ్”) లక్షణాలు ఉన్నాయి.

ఒక ఉపతాపి (patient) చేత ఒక మోతాదు అయొడీన్-124 తినిపించినా, ఆ వ్యక్తి రక్తనాళాలలోకి ఎక్కించినా అది క్రమేపీ ఆ ఉపతాపి కాకళ గ్రంథి (థైరోయిడ్ గ్లేండ్) లో ప్రవేశించి అక్కడ పేరుకోవటం మొదలు పెడుతుంది. ఈ అయొడీన్-124 అర్ధాయుష్షు 4 రోజులే కనుక, త్వరలోనే పోజిట్రానులని కాకళ గ్రంథిలోకి విడుదల చేస్తుంది. ఈ పోజిట్రానులు “ప్రతిపదార్థం” (ఏంటీ మేటర్) అన్న మాట మరిచిపోకండి. ఇది కాకళ గ్రంధిలోని మామూలు ఎలక్‌ట్రానుని ఢీకొనగానే రెండూ ఏష్యం అయిపోయి వాటిలో నిక్షిప్తంగా ఉన్న శక్తిని గామా కిరణాల రూపంలో విడుదల  చేస్తాయి. ఈ గామా కిరణాలు శరీరం నుండి బయట పడ్డప్పుడు వాటిని పట్టుకుని అవి ఎక్కడనుండి ఉత్పన్నం అయేయో సాంకేతిక నిపుణులు చెప్పగలరు. ఇది పోజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లేదా “పెట్” (PET) పద్ధతిలో కీలకమైన అంశం. (బొమ్మ చూడండి.)

PET method
“పెట్” (PET) పద్ధతి పనిచేసే తీరు

కాకళ గ్రంథిలో ఏ భాగమైనా చచ్చిపోయిన ఎడల అక్కడకి అయొడీన్ వెళ్లి పేరుకోలేదు, కనుక ఆ భాగం నుండి గామా కిరణాలు రావు. ఏ భాగమైనా అతి చురుగ్గా పని చేస్తూ ఉంటే ఆ భాగం ఎక్కువ అయొడీన్ ని పీల్చుకుంటుంది కనుక అక్కడనుండి గామా కిరణాలు ఎక్కువ వస్తాయి. ఈ తేడాలని బట్టి రోగగ్రస్థమైన భాగాలని నిర్ణయిస్తారు. ఇదే విధంగా శరీరంలో ఏ భాగానికి  అయినా ఛాయాచిత్రం తీసి తనిఖీ చెయ్యవచ్చు.

Brain
మెదడులో రక్త ప్రసరణ సజావుగా ఉన్నప్పటి, లేనప్పటి పరిస్థితులలో తేడా

Posted in December 2019, Science

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!