Menu Close
manusmrithi page title
మొదటి అధ్యాయము (ఈ)

ఎందఱో మునులున్నా ఇలా మనుస్మృతిని అందరికీ వివరించే బాధ్యతను మనువు తనకే అప్పగించడం పట్ల సంతృప్తి చెందిన భృగు మహర్షి ఇలా అన్నాడు -

స్వాయంభువ మనువు వంశీకులు, మహాత్ములు, మహా తేజస్సు కలవారయిన మరి ఆరుగురు మనువులు కూడా ఒకరి తరువాత మరొకరు ఇదే విధంగా సృష్టి కార్యంలో నియుక్తులై తమ తమ ప్రజలను సృష్టించారు. ఆ ఆరుగురు వీరే - స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, మహా తేజస్సు కలిగినవాడైన వైవస్వతుడు. స్వాయంభువునితో సహా మొత్తం ఈ ఏడుగురు మనువులలోని ప్రతివారు తమ తమ మన్వంతరాలలో చరాచర జగత్తును, ప్రజలను సృష్టించి, పాలించారు.

కాల విభజన

వాస్తవానికి కాలం అనాది. అనంతం. అయినా మానవులు తమ సౌకర్యం, అవగాహనల  కోసం కాలాన్ని విభజించుకోవడం జరిగింది. ఇక్కడ భృగు మహర్షి కొన్ని శ్లోకాలలో కాలవిభజనను గురించి అందరికీ స్పష్టంగా వివరిస్తాడు.

కన్ను మూసి తెరచే కాలం అంటే రెప్ప వేసేటంత కాలాన్ని నిమేషము (Twinkling of the eye) అంటారు. దీనినే నిమేషకము, నిముషము, నిమిషము, నిముసము అని కూడా అంటారు. అనిమిషులు అంటే దేవతలు. అనిమేషులు అన్నా దేవతలు అనే అర్థం. వారు మానవుల లాగా రెప్ప వేయరనే విశ్వాసం కారణంగా దేవతలను ఇలా పిలుస్తారు. ఈ నిమేషము పాశ్చాత్యుల C.G.S. లేక M.K.S.మరియు F.P.S. కొలమాన పద్ధతిలోని కాలమానమైనట్టి నిముషము (అరవై సెకండ్ల కాలం) కాదు. ఇది కేవలం కన్ను మూసి తెరచే కాలం.

పద్దెనిమిది రెప్పపాట్ల కాలాన్ని ఒక ‘కాష్ఠ’  అంటారు. 30 కాష్ఠలు ఒక ‘కళ’. 30 కళలు ఒక ‘ముహూర్తము’. 30 ముహూర్తాలు ఒక ‘అహో రాత్రము’.  ఒక పగలు, ఒక రాత్రి కాలాన్ని కలిపి ఒక అహోరాత్రము అంటారు. (1-64)

మన పౌరాణిక సాహిత్యం ఇదే కాల విభజనను కొంచెం తేడాగా పేర్కొంటున్నది. పలు పురాణాలలో ఇవ్వబడిన సమాచారం ఆధారంగా తెనాలి రామకృష్ణ కవి తన ‘ఘటికాచల మాహాత్మ్యము‘ కావ్యంలో కాల విభజనను ఇలా పేర్కొన్నాడు. పద్దెనిమిది నిమేషములు ఒక కాష్ఠ. ముప్పై కాష్ఠలు ఒక కళ. కళలు ముప్పై ఒక క్షణము. ఆరు క్షణాలు ఒక గడియ. రెండు గడియలు ఒక ముహూర్తం. ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రము. పదిహేను అహోరాత్రాలు ఒక పక్షము. రెండు పక్షములు ఒక మాసం. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనము. రెండు అయనములు ఒక హాయనము లేక వత్సరము. ఇలాంటి మానవ వత్సరాలు ఒక వెయ్యి కలిస్తే దేవతలకు ఒక దినము (అహోరాత్రము). పన్నెండు వేల దివ్య వర్షాలు ఒక చతుర్యుగము. రెండు వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రము. ఇలాంటి అహోరాత్రములు 360 బ్రహ్మకు ఒక సంవత్సరము. (ఘ.మా.3 - 11)

‘మనుస్మృతి’ లో పేర్కొన్న కాల విభజన ప్రకారం ఒక ముహూర్తంలో 30 కళలు ఉండగా, పురాణాలలోని లెక్కల ప్రకారం ఒక ముహూర్తంలో 360 కళలు. (ఒక ముహూర్తంలో రెండు గడియలు అంటే 12 క్షణాలు అంటే 360 కళలు) ఉంటాయి. ఇది కొంత పరస్పర విరుద్ధంగానూ, గందరగోళంగానూ ఉంది.

ఈ వైరుద్ధ్యాన్ని గురించి మనం మరింత లోతుగా పరిశీలిద్దాం. ప్రాచీనుల కాల గణన లోని నిమేషానికీ, 60 సెకండ్ల నిముషానికీ వ్యత్యాసం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. 30 ముహూర్తములు అంటే ఒక అహోరాత్రము (అంటే 24 గంటలు - అంటే 1440 నిముషములు) కనుక ఒక ముహూర్తము అంటే 1440/30 = 48 నిముషాలు. రెండు గడియలు ఒక ముహూర్తం కనుక గడియ అంటే 24 నిముషాలు. ఒక గడియ అంటే ఆరు క్షణాలు కనుక క్షణం అంటే 4 నిముషాలు.  క్షణం అంటే 240 సెకండ్లు (4x60) కనుక, క్షణంలో తిరిగి 30 కళలు ఉంటాయి కనుక ఒక కళ అంటే 240/30 = 8 సెకండ్లు. ఒక కళలో  30 కాష్ఠలు ఉంటాయి కనుక కాష్ఠ అంటే 8/30 సెకండ్లు.  కాష్ఠ లో తిరిగి 18 నిమేషములు ఉంటాయి కనుక 8/30 సెకండ్ల పరిమాణం కలిగిన ఒక కాష్ఠలో (8/30 x 1/18 = 8/540) 2/135   నిమేషములు ఉంటాయి. అంటే మనం 2/135 సెకండ్ల కాలంలో అంటే 0.015 సెకండ్ల కాలంలో రెప్ప వేస్తామన్నమాట. ఇది నిమేష కాలం. నిముషంలో 60 సెకండ్లు ఉంటే నిమేషము అంటే 0.015 సెకండ్లు. అంటే ఒక నిముషంలో (60 సెకండ్లలో) 4000 నిమేషములున్నట్లు. అంటే ఒక నిముషంలో మనం నాలుగువేల సార్లు రెప్పవేస్తామట. నేను టైం పెట్టుకుని వెంటవెంటనే వేగంగా రెప్ప వేస్తూ పోతే నిముషంలో 120 సార్లు రెప్ప వేయగలిగాను. ఎంత వేగంగా రెప్ప వేసినా దానికి రెట్టింపు వేగంతో వేసినా నిముషానికి 240 సార్లు రెప్ప వేయగలరేమో గానీ నిముషంలో నాలుగు వేల సార్లు రెప్ప వేయడం ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యమయ్యేది కాదు. కనుక ఈ కాల గణన చాలా లోప భూ యిష్ట మైనదిగా కనిపిస్తున్నది. అలా ‘మనుస్మృతి’ లో పేర్కొన్న కాలగణనకూ, పురాణాలలోని కాలగణనకూ పొంతనలేకపోవడమే కాక అసలీ కాలగణన మొత్తం అశాస్త్రీయంగా ఉంది. అయితే ప్రపంచంలో కాల గణనకు సుమేరియన్లు ఆద్యులుగా కనిపిస్తున్నారు.

క్రీ. పూ. 2000 సంవత్సరాల నాటికే కాల గణనలో వారు సెక్సాజెసిమల్ (Sexagesimal) పద్ధతి (గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకండ్ల పద్ధతి)ని వాడేవారు. 24 గంటల రోజును 12 గంటల చొప్పున పగలు, రాత్రిగా విభజించడం ఈజిప్షియన్లు మొదలెట్టారు. వారు స్తూపాల నీడలను కొలిచి, దాని ఆధారంతో కాలగమనాన్ని అంచనా కట్టేవారు. భారతీయులు కూడా ఎండలో ఒక కర్రనో, రోకలినో నిలబెట్టి, దాని నీడ ఆధారంగా కాలగణన చేసేవారు. అయితే ఈ పద్ధతి రాత్రి వేళలలోనూ, ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పుడు కాల నిర్ధారణకు ఆధారపడదగింది కాదు. ఒకప్పుడు సూర్యరశ్మి లో  ‘సన్ డయల్’ ఆధారంగానూ కాల నిర్ధారణ చేసేవారు. ఆ తరువాత చైనీయులు కాండిల్ క్లాక్ లు, వాటర్ క్లాక్ లు (నీటి గడియారాలు), పదో శతాబ్దానికి పాదరసం గడియారాలు వాడుకలోకి తెచ్చారు. 1656 లో లోలకం (Pendulum) గడియారం కనుక్కున్నాక కాలగణనలో కచ్చితత్వం వచ్చింది. ఈ ఆధునిక యుగంలో క్వార్ట్జ్ గడియారాలు (Quartz Clocks), అణు గడియారాల (Atomic Clocks) సాయంతో కాల గణన మరింత సులువుగా, కచ్చితంగా చేస్తున్నారు. క్రీ. శ. ఆరవ శతాబ్ది నాటి వరాహ మిహిరుడు కాల గణనలోని గందరగోళాన్ని తొలగించి, భారతీయులకు లోపరహితమైన, శాస్త్రీయమైన  కాలగణన పద్ధతిని అందించాడట. ఇక అది వేరే సంగతి.

సూర్యుడు ఈ అహోరాత్ర కాలాన్ని తిరిగి మానుష, దైవిక అహోరాత్రములుగా విభజించాడు. సాధారణంగా ఒక అహోరాత్రము లోని పగటి భాగంలో జీవులు తమ తమ కార్యకలాపాలు చేసుకొనడం, రాత్రి భాగంలో నిద్రించడం చేస్తాయి. (1 - 65)

మృతి చెందినవారిని పితరులు, పితృవర్గం వారు లేక పితృదేవతలు (Manes) అంటారు. మానవులు తమ పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. మన ప్రాచీనులు కాల పరిమాణం విషయంలో పితృదేవతలకు, దేవతలకు, మానవులకు వేర్వేరు ప్రమాణాలున్నట్లు భావించారు.

మానవులకు ఒక మాసం కాలం పితృదేవతలకు ఒక అహోరాత్రము లేక రేయుంబవలు. ఆ మాసం కాలంలోని కృష్ణపక్షంలో పితృదేవతలు కర్మానుష్ఠానం చేస్తారు. శుక్ల పక్షంలో నిద్రిస్తారు. (1 - 66 )

మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక అహోరాత్రము లేక రేయుంబవలు. మానవులకు ఉత్తరాయనము ఆరు నెలలు దేవతలకు పగలు, దక్షిణాయనము ఆరు నెలల కాలము దేవతలకు రాత్రి. (1 - 67)

యుగ పరిమాణం

ఇక యుగ పరిమాణం విషయానికొస్తే కృతయుగం పరిమాణం నాలుగు వేల దైవ సంవత్సరాలు. దానిలో పదవ వంతు అంటే 400 దైవ సంవత్సరాల కాలం యుగారంభానికి ముందరి సంధ్యా కాలం. సంధ్యాంశము అనబడే యుగానంతర కాలం కూడా అలాగే 400 దైవ సంవత్సరాలపాటు ఉంటుంది. అలా కృతయుగం మొత్తం 4,800 దైవ సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

త్రేతాయుగం పరిమాణం 3,000 దివ్య సంవత్సరాలు. సంధ్య - 300 ;  సంధ్యాంశం - 300 దివ్య సంవత్సరాలు. అంటే మొత్తం త్రేతాయుగం 3,600 దైవ సంవత్సరాలపాటు ఉంటుంది. ద్వాపర యుగం పరిమాణం 2,000 దివ్య సంవత్సరాలు. 200 దివ్య సంవత్సరాల సంధ్య, 200 దివ్య సంవత్సరాల సంధ్యాంశం కలుపుకుంటే ద్వాపరయుగం మొత్తం 2,400 దివ్య సంవత్సరాలు ఉంటుంది.

ఇక కలియుగం పరిమాణం 1,000 దివ్య సంవత్సరాలు. ఒక్కొక్కటి వందేళ్ళ చొప్పున సంధ్య, సంధ్యాంశాలను కలుపుకుంటే కలియుగం మొత్తం పరిమాణం 1, 200 దివ్య సంవత్సరాలు.

అలా ఈ నాలుగు యుగాల పరిమాణం - 4,800 + 3,600 + 2,400 + 1,200 అంటే మొత్తం 12,000 దివ్య సంవత్సరాలు. దీనిని మానుష చతుర్యుగము లేక ‘మహాయుగము’ అంటారు. ఇలాంటి 12 మానుష చతుర్యుగాలు దేవమానంలో 12 వేల సంవత్సరాలు. అలాంటి దివ్యయుగాలు రెండు వేలు అయితే బ్రహ్మకు ఒక అహోరాత్రము (ఒక పగలు, ఒక రాత్రి). వెయ్యి దివ్యయుగముల పరిమాణం కలిగిన బ్రహ్మ యొక్క పగటిని పుణ్య దినము అనీ, అంతే పరిమాణం కలిగిన బ్రహ్మ యొక్క రాత్రి కాలాన్ని స్వప్నకాలం అనీ అంటారు.

బ్రహ్మ ఒక అహోరాత్రము ముగిసిన తరువాత గాఢ నిద్రనుంచి మేల్కొని  సదసదాత్మకమైన మనస్సును సృష్టిస్తాడు. మనస్సు అనేది అస్తిత్వం ఉండి కూడా లేనట్టిదైన కారణంగా దానిని సదసదాత్మకమని (సత్ +అసత్ + ఆత్మకం) భావిస్తారు.

బ్రహ్మ యొక్క సృజనాకాంక్ష (సృష్టి చేయాలనే కోరిక) చేత ప్రేరేపించబడి మనస్సు తానే రూపం మార్చుకుని ఆకాశం (ether) గా ఏర్పడుతుంది. ఆకాశం శబ్దం యొక్క గుణమని చెపుతారు.

ఆ తరువాత ఆ ఆకాశాన్నుంచి దుర్గంధ, సుగంధాలను మోసుకుపోయే వాయువు (గాలి) ఉద్భవిస్తుంది. పరిశుద్ధమైనదీ, అమిత శక్తివంతమైనదీనైన  వాయువు స్పర్శ యొక్క గుణమని అంటారు. ఆ వాయువు నుంచి అంధకారాన్ని పోద్రోలే మిరుమిట్లుగొలిపే కాంతి (అగ్ని) ఉద్భవిస్తుంది. వర్ణం( రంగు) కాంతి యొక్క గుణంగా చెప్పబడుతుంది. కాంతి నుంచి ఆపము (జలము) పుట్టింది. ఆ నీటికి రసము (రుచి) అనే గుణం ఉంది. ఆ నీటి  నుంచి గంధ గుణం (వాసన) కలిగిన భూమి పుట్టింది. ఇది ప్రళయానంతరం చేయబడే మొదటి భూత సృష్టి. ఈ సందర్భంగా సృష్టించబడిన ఆకాశం, గాలి, కాంతి( అగ్ని), నీరు, భూమి - అనే పంచభూతాలే తదనంతరం జరిగిన ముల్లోకముల నిర్మాణానికి మొదటి మెట్టు.

యత్ ప్రాగ్ద్వాదశ సాహస్ర ముదితం దైవికం యుగమ్ |
తదేకసప్తతిగుణం మన్వంతర మిహోచ్యతే  ||           ( 1 - 79 )

ముందు చెప్పబడిన దివ్యయుగం లేక 12,000 దివ్య సంవత్సరాల కాలాన్ని ఏక సప్తతి (అనగా 71) చేత హెచ్చవేస్తే వచ్చే 8,52,000 దివ్య సంవత్సరాల కాలాన్ని ఒక మనువు పాలనాకాలమైన మన్వంతరం అంటారు.

సృష్టి, ప్రళయము అనంతంగా ఒక దాని  తరువాత మరొకటిగా సాగిపోతూనే ఉంటాయి. ఆ కారణంగా మన్వంతరాలు ఇన్నని మనం లెక్కించలేము. పరమేష్ఠి (బ్రహ్మ) ఒక క్రీడాకారునివలె పదేపదే ఈ సృష్టిని చేస్తూ ఉంటాడు.

కాలగణనలో ఉన్న గందరగోళం కారణంగా యుగ పరిమాణం విషయంలోనూ మనుస్మృతిలో ఒక స్పష్టత, పారదర్శకత లోపించాయి. అంతే కాదు. యుగాల పరిమాణం విషయంలో పురాణాలలో పేర్కొనబడిన విషయాలు కూడా ఏమాత్రం నమ్మశక్యాలు కావు. భారతీయ పంచాంగకర్తలు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామం క్రీ. పూ. 3,100 ప్రాంతంలో జరిగిందని అంచనా కడుతున్నారు. కలియుగం ప్రారంభం కావడానికి 38 సంవత్సరాలకు ముందు, అంటే ద్వాపర యుగాంతంలో ‘భగవద్గీత’ కృష్ణునిచే అర్జునునికి బోధించబడిందని వారి నిర్ధారణ. కలియుగం ప్రారంభమై నేటికి  5,120 ఏళ్ళయిందని వారి నమ్మకం. ద్వాపరయుగం 8 లక్షల 64 వేల ఏళ్లపాటు సాగిందట. అంతకు ముందరి త్రేతాయుగం 12 లక్షల 96 వేల ఏళ్లపాటు నడిచిందట. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ఆధారంగా అబనీష్ చంద్రబోస్ వంటి సువిఖ్యాత వేద పండితులు పలువురు చేసిన పరిశోధనలు తేల్చినదేమంటే ఋగ్వేద సంహిత రచించబడేటప్పటికి ఏరకంగా చూసినా మూడువేల ఐదు వందల సంవత్సరాలకు మించదని. క్రీ. పూ. 1500 ప్రాంతంలో ఋగ్వేద సంహిత సంకలనం అయిందనుకుంటే, ఆ తరువాత రామాయణ కాలం (త్రేతాయుగం), మహాభారతకాలం (ద్వాపరయుగం) కూడా ఈ కాలక్రమంలో ఇమడాలి కదా! మరి వాటినెక్కడ ఇముడుస్తాం? కనుక యుగాల గురించి మన విశ్వాసాలన్నీ అశాస్త్రీయమైనవేనని గ్రహించగలం. శాస్త్రజ్ఞులు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా చేసిన కాల నిర్ణయం  ప్రకారం ఋగ్వేదం క్రీ.పూ. 1500 కాలం నాటిదని తిరుగులేని విధంగా నిరూపణ అయింది. జన్యుపరమైన మరియు శిలాజ సంబంధమైన ఆధారాలతో మానవ జాతి లక్ష ఏళ్ళు - రెండు లక్షల ఏళ్ల మధ్య ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించిందని, 90 వేల సంవత్సరాల క్రితం వారిలో కొందరు ఆఫ్రికాను వదలి భూగోళంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించారని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. అలాంటప్పుడు ఒకే స్వారోచిష మన్వంతరం లోని కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపరయుగానికి, కలియుగానికి మధ్య లక్షల సంవత్సరాల ఎడం ఉండడం ఎలా సాధ్యమని విజ్ఞత కలిగినవారెవరికైనా సందేహం రాకపోదు.ఇదీ యుగాల పరిమాణం గురించి మనకున్న విశ్వాసంలోని అశాస్త్రీయత.

యుగ ధర్మాలు

చతుష్పాత్సకలో ధర్మః సత్యం చైవ కృతే యుగే |
నాధర్మేణాగమః కశ్చిన్ మనుష్యాన్ ప్రతివర్తతే ||    (1- 81)

కృతయుగంలో ధర్మం సర్వసమగ్రంగా ఉంటుంది. అది (ధర్మమనే గోవు) నాలుగు పాదాలు కలిగి ఉంటుంది. కృతయుగంలో సత్యమే అంతటా వ్యాపించి ఉంటుంది. ఎవరైనా మానవులు అసత్యం పలికినా, అధర్మంగా ప్రవర్తించినా కృతయుగంలో వారికి అలా చేయడం వల్ల ఇంచుక కూడా ప్రయోజనం కలగదు. మిగిలిన మూడు యుగాలలో కృతయుగంలో ప్రతిష్ఠాపితమైన ధర్మం క్రమంగా తగ్గుతూ పోతుంది. కృతయుగంలో నాలుగు పాదాలమీద నడిచిన ధర్మధేనువు క్రమంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం కోల్పోతుంది. మనుష్యులు అధర్మమైన ప్రయోజనాలు పొందే కారణంగా ఆ యా యుగాలలో ధర్మచ్యుతి జరుగుతుంది. చౌరిక లేక చౌర్యము (దొంగతనం), అనృతము (అసత్యము), మాయ (వంచన)లకు పాల్పడే కారణంగా సక్రమమైన మార్గాలలో ధనము, విద్యలను ఆర్జించడం ద్వారా గతంలో మనుష్యులు ఆర్జించుకున్న ధర్మం కూడా తరిగిపోతుంది.

అరోగాస్సర్వ సిద్ధార్థా శ్చతుర్వర్ష శతాయుషః |
కృత త్రేతాదిషు హ్యేషా మాయు స్త్రసతి పాదశః ||     ( 1 - 83 )

కృత యుగంలో మానవులు ధర్మిష్ఠులు అవడంచేత వారు రోగాలూ, రొష్టులూ లేనివారుగా ఉండేవారు. ఆ యుగంలో మనుష్యులు సిద్ధార్థులు (సిద్ధించిన అర్థములు కలవారు) గా, అంటే కోరికలు ఈడేరిన వారుగా ఉండేవారు. అందుకే వారు నాలుగు వందల సంవత్సరాలపాటు జీవించారు. త్రేతా, ద్వాపర, కలి యుగాలు మూడింటిలో మనుష్యుల ఆయుర్దాయం క్రమంగా పాదానికి వందేళ్ళ చొప్పున తగ్గుతూ వచ్చింది. శ్రుతులలో (వేదములలో) చెప్పబడిన ఆయుర్దాయాలు, ఆశీస్సులు, శాపాలకు ఉండే ప్రభావం, ఇష్టకామ్యార్థసిద్ధి కోసం చేసే కర్మలకు దక్కే ఫలాలు - ఇవన్నీ ఆ యా యుగధర్మాన్ని బట్టి ఉంటాయి.

కృతయుగంలోని ధర్మం వేరు; అలాగే త్రేతాయుగంలోని ధర్మం, ద్వాపరయుగ ధర్మం, కలియుగ ధర్మం - ఇలా వేటికవే వేర్వేరు ధర్మాలు. ఒక యుగం లోని ధర్మాలు ఆ యుగం యొక్క క్షీణదశను బట్టి వేరుగా ఉంటాయి. కృతయుగంలో తపస్సు పరమ ధర్మం. త్రేతాయుగంలో తపస్సు కంటే ఆత్మజ్ఞానం శ్రేష్ఠమైన ధర్మం. ద్వాపర యుగంలో యజ్ఞం శ్రేష్ఠమైన ధర్మం కాగా కలియుగంలో దానమే సర్వశ్రేష్ఠమైన ధర్మం. అమిత తేజస్సు కలిగిన బ్రహ్మ సకల జనులతో కూడిన ఈ విశ్వం యొక్క సంరక్షణ నిమిత్తం తన ముఖము, బాహువులు, తొడలు, పాదములనుంచి వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించి, వారు పాటించవలసిన వేర్వేరు ధర్మములను రూపొందించాడు.

పైన తెలిపిన యుగధర్మం ప్రకారం రాముడు 300 ఏళ్లు, కృష్ణుడు 200 ఏళ్లు జీవించవలసి ఉండగా వారు వేల ఏళ్లు జీవించినట్లు ఇతిహాసాలు, పురాణాలు పేర్కొనడం మనుస్మృతికీ, పురాణాలకూ పొసగని మరో అసమంజసమైన విషయం. వేద సాహిత్యం పరిశీలిస్తే నాటి మానవులు ‘జీవేమా శరదశ్శతం’ అంటూ మానవ జాతి నిండు ఆయుః ప్రమాణం మేరకు జీవించాలని కోరుకోగా, ఐతిహాసిక, పౌరాణిక సాహిత్యాలు ఆ యా యుగపురుషులు మాత్రమే కాదు రామాయణం లోని దశరథుడు, శబరి వంటివారు, ఇంకా భారతంలోని పలువురు వేల సంవత్సరాలు జీవించినట్లు, హనుమంతుడు, బలి చక్రవర్తి, వ్యాసుడు, అశ్వత్థామ వంటి కొందరు చిరంజీవులైనట్లు పుక్కిటి కథలు కల్పించాయి.

***సశేషం***

Posted in December 2019, సాహిత్యం

1 Comment

  1. Vidyardhi

    మనుస్మృతి వ్యాసం చాలా బాగుంది. రవీంద్రనాథ్ గారికి అభిననదనలు. వారికి తెలుపగలరు. ఇటువంటి విశ్లేషణతో కూడిన వ్యాసాలు ఇంకా ప్రచురించగలరు.

    ఒక సూచన – కాల విభజనను ఒక పట్టికలో పెడితే బాగుంటుందేమో! వరాహమిహురుడి కాల విభజన కూడా చేర్చితే ఇంకా సంపూర్ణత చేకూరుతుందేమో!

    విద్యార్థి

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!