Menu Close
Page Title

2. కూచిపూడి- నృత్య సంగీత కళారూపకము

నేను విజయవాడలో ఉంటున్న రోజుల్లో మా మామ ‘అల్ ఇండియా రేడియో' లో పని చేస్తుండే వాడు. ఒక రోజున పిలిచి ఆ రోజు సాయంత్రం AIR ఆధ్వర్యంలో శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి 'భామాకలాపం' యక్షగానము ప్రోగ్రాం పోలీస్ గ్రౌండ్స్ లో ఉంది, చాలా బాగుంటుంది, రమ్మని పిలిచాడు. నాకు పెళ్ళైన కొత్తలో డబ్బు ఖర్చులేని ప్రోగ్రాం ఏదైనా ఉంటే వదలకుండా వెళ్ళేవాళ్ళము. ఆరోజున కూడా వెళ్లి చాలా ఆ అద్భుత ప్రదర్శన చూసి చాలా ఆనందించాము. శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ గారు సత్యభామగా అద్భుతంగా నటించి మెప్పించారు. అప్పటినుంచి కూచిపూడిని గురించి, దాని అంకురానికి  కారణమైన యక్షగానాన్ని గురించి తెలుసుకోవాలని ఉత్సాహం పుట్టింది.

Parijathapaharanamనాట్యం గురించి ఏమాత్రం పరిచయమున్నా, భారత దేశంలో ‘కూచిపూడి’ గురించి వినని వారుండరు. పదవశతాబ్దంలోని భరతుని నాట్యశాస్త్రములో పునాదులు వేసుకుని, అంచలు అంచలుగా ఎదుగుతూ, శ్రీ నారాయణ తీర్థులవారి తరంగాలతో జీవంపోసుకుని, యక్షగానంగా రూపాంతరంచెంది, వారి శిష్యులు శ్రీ సిద్ధేంద్ర యోగుల ప్రాపకంలో పద్నాల్గవ శతాబ్దంలో కూచిపూడి లో ‘కూచిపూడి నాట్యం’ గా అవతరించి దాదాపు పూర్ణ రూపాన్ని 'పారిజాతాపహరణం' ద్వారా పొందింది. భారత దేశంలో ప్రాముఖ్యత పొందిన వివిధ నాట్యరీతులలో ఈ కూచిపూడి నృత్య సంగీత భావ కళారూపకము ఆంధ్రదేశంలోని కుచేలపురం లో 'కూచిపూడి'  నాట్య కళగా పేరు పొందింది. స్త్రీలు నాటకాలలో పాత్రలు వేయడాన్ని అప్పటి సమాజం హర్షించని పరిస్థితులలో మగవారే స్త్రీ పాత్రలు కూడా ధరిస్తూ నాట్యంలోను, హావభావ ప్రదర్శనలోను నైపుణ్యం ప్రదర్శిస్తూ రక్తికట్టించేవారు. మొదట శ్రీ సిద్ధేంద్ర యోగి 'పారిజాతాపహరణం' అనే పౌరాణిక కథని గేయరూపంలో ‘భామాకలాపం’ గా తీర్చిదిద్ది అందులో  'భామనే, సత్యభామనే' అనే వాచకం మళ్ళీ మళ్ళీ చెప్పడం, వివిధ హావభావాలతో ప్రదర్శించడం ద్వారా సత్యభామ ప్రకృతిని, మనోవృత్తిని, వివిధ రీతులలో చాలా అందంగానూ, విపులం గాను చిత్రీకరించి జనరంజకంగాను,  ప్రేక్షకుల దృష్టిలో శాశ్వతంగా నిలిచిపోయేటట్లు చేసారు.

కూచిపూడి నాట్యపద్ధతిలో ప్రార్ధనతో మొదలై ప్రతి ఒక్క పాత్రని విలక్షణ రీతిలో (దరువు) సంగీత వాద్య బృందాలతో పరిచయంచేస్తూ, (నృత్తం) హస్త కదలికలతో సంక్షిప్తంగా అవగాహన కల్పించి, (నృత్యం) - అభినయం ద్వారా పాత్రోచిత హావభావ ప్రదర్శనలతో కథావివరణ గావించి జనరంజకంగా ముగుస్తుంది. వీటికి 'ఆహార్యం'- దుస్తులు, అలంకరణ, ఆయాపాత్రలకి శోభని తెచ్చిపెడతాయి. కూచిపూడి పద్ధతిలో నృత్యంతో పాటు పాడే భావగర్భితమైన గీతం లయబద్ధమైన సంగీతంతో సమన్వమై,  అనుభూతిని ఇనుమడింపజేసే వాద్య సహకారముతో సమ్మిళితమై రక్తి కట్టిస్తుంది. వాద్య సహకారాలలో మృదంగం, చిడతలు, తంబుర, వేణునాదం, వీణ, ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతవరకు వయోలిన్ కూడా వాడుతారు. గాయకులు వివిధ రాగాలలో శృతిశుద్ధంగా పాడి గేయభావాన్ని ప్రస్ఫుటీకరిస్తారు. ఆవిధంగా గేయానికి ఎంత ప్రాధాన్యత ఉందో, అదే  ప్రాధాన్యత సంగీతానికి, వాద్య సహకారానికి, నాట్యకారుల విన్యాసాలకు ఉండడంతో ప్రేక్షకులతో పాటు కళాకారులందరికి కూడా సంతృప్తినిచ్చి నాట్యరూపకం రక్తికడుతుంది. నటులు రాగయుక్తంగా ప్రతి గేయ పాదంలోని భావానికి అనుగుణంగా ముఖ కవళికలు, హావభావాలని మారుస్తూ ప్రేక్షకులలో భావ స్ఫూర్తిని పెంచుతూ నాట్యరూపకాన్ని రంజింపచేస్తారు. అదే గేయ పాదం తిరిగి మళ్ళీ వేరొక రాగం మార్చి పాడినప్పుడు, నాట్య కారులు కొంగ్రొత్త భావాలని ప్రదర్శిస్తూ కొత్త అర్ధాన్ని ప్రేక్షకులకు స్ఫురింప చేస్తారు. ఈ ప్రక్రియద్వారా ప్రేక్షకునికి ఆ పాత్ర యొక్క పూర్తి పరిచయం కలిగి ఆ పాత్రపై అవగాహనని పెంచుతుంది. ఇదంతా వాడుకలోఉన్న తెలుగు భాషలో జరగడంవల్ల ప్రేక్షకుల మనస్సులకు సూటిగా తగిలి వారిని అలరింపచేస్తుంది. కూచిపూడి నాట్య పద్దతి భరతనాట్యానికి భిన్నంగా జానపదానికి చేరువలో ఉండి, కధాంశం పురాణగాధల పై ఆధార పడడం తో జనాకర్షకమై బహుళ ప్రచారంలో కి వచ్చింది.

Kuchipudi

Vempati Chinasatyamబ్రిటిషువారి కాలంలో కుంగిపోతున్న కూచిపూడి నాట్యకళని శ్రీ వెంపటి వెంకట నారాయణ శాస్త్రి, శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీ చింతా వెంకటరామయ్య, చాలా శ్రమకోర్చి ఉద్దరించడానికి ప్రయత్నించారు. వీరు అంతవరకు పురుషులే ప్రాధాన్యంగా గల ఈ కూచిపూడి నాట్యరంగానికి స్త్రీలని కూడా పరిచయంచేశారు. ఆవిధంగా ఇంద్రాణి బాజ్పాయ్, యామిని కృష్ణమూర్తి, ఈ కళకి పరిచయమై, దానికే అంకితులై సుప్రసిద్ధులయ్యారు. తరువాతి కాలంలో శ్రీ వెంపటి చినసత్యం తన సృజనాత్మతకి భావుకత, కృషి జోడించి పరిశోధనల ద్వారా నాట్య రూపాన్ని సున్నితంగాను, సుందరంగాను మలచి, రసోత్పాదనని పెంచి, మధురభావాలు చిప్పిల్లే లాగ చేశారు. వారి కోరియోగ్రఫీ జాతీయంగాను, అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిగాంచి, ఆయనకు 'పద్మవిభూషణ్' బిరుదుని  తెచ్చిపెట్టింది.

Shobha Naidu
శ్రీమతి శోభానాయుడు

ఆయన కూచిపూడి నాట్య గురువుగా చాలా మంది శిష్యులకి శిక్షణ యిచ్చి వారిని ప్రముఖ కళాకారులుగా చేసారు. ఆ విధంగా శ్రీమతి శోభానాయుడు, వైజయంతిమాల, హేమమాలిని, మీనాక్షి శేషాద్రి, యామిని కృష్ణమూర్తి, స్వప్న సుందరి, సోనాల్ మాన్సింగ్ మొదలైన ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దారు. అయన స్టేజి మీదనే కాకుండా, సినిమా రంగంలో కూడా నృత్య దర్శకత్వం చేసి, ఆకళ కి గుర్తింపు కలిగించి, అక్కడకూడా రాణింపచేశారు. అయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందటమే కాకుండా, సంగీత నాటక అకాడమి వారి నుంచి రాష్ట్రపతి బహుమానాన్ని, మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రముఖ 'కాళిదాస్' సన్మానాన్ని, మొదలైన ఎన్నో గౌరవ పతకాలని సాధించి కూచిపూడి నాట్యానికి దేశ విదేశాలలో గొప్ప ఖ్యాతి నార్జించి పెట్టారు.

శ్రీ చినసత్యం గారు శ్రీ వెంపటి చలమయ్య, శ్రీమతి వరలక్ష్మమ్మ దంపతులకు కూచిపూడిలో 1929 లో అక్టోబర్ 15 న జన్మించారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులనధిగమించి అఖండ కీర్తి నార్జించి, అంతకుమించి అశేష కళాకారుల్ని దేశ వివిధ దేశాలలో ఆ కళకి ఆస్థి గా మిగిల్చి, 29 జూలై 2012 న కీర్తిశేషులయ్యారు. జీవిత గమనంలో చాలా ఎదురు దెబ్బలు తింటున్నా ఆయనకి కూచిపూడి నాట్యం మీద ఉన్న అభిమానాన్ని (ఈనాట్యం చేసి చేసి చివరకు నీ మగ బుద్ధులు  పోయి, ఆడదాని తీరు తెన్నులు మాత్రమే  మిగులుతాయి అంటూ) నీరుగారుస్తూ వచ్చిన సమాజాన్ని లెక్కచెయ్యకుండా, ఆర్ధికంగా తన స్థితిని పెంచలేని కళనే నమ్ముకుని, అంచలంచలుగా మనోస్తైర్యంతో, సృజనాత్మకతతో, నిలదొక్కుకుని ఎదిగారు. శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ గారి ప్రోద్బలంతో నాట్యతీరులలో అక్షరాభ్యాసం చేసుకుని పద్దెనిమిదోయేటనే నాట్యకళపైనున్న ఆకాంక్షతో,  డబ్బు లేని స్థితిలో కూచిపూడి నుంచి రైలు లోకూడా డబ్బులేక వెళ్లలేని పరిస్థితిలో 450 కిలోమీటర్లు నడచి  మద్రాసు చేరి, అక్కడ శ్రీ తాడేపల్లి పేరయ్య శాస్త్రిగారి వద్దా, అప్పటికే సినీరంగ నాట్యము లో ప్రసిద్దులైన శ్రీ వెంపటి పెదసత్యం (బాబాయి) గారి Vempati Familyవద్దా కొంతకాలం శిష్యరికం పొంది, తళుకు బెళుకుల సినిమా ప్రపంచం లో ఇమడలేక, నాట్యకళ పైగల తపన తీరక, 1963 లో 'కూచిపూడి ఆర్ట్ అకాడమి'  ని స్థాపించి,  గురువుగా నాట్యకళని తనకి తృప్తినిచ్చే పద్దతిని బోధిస్తూ, చాలామంది శిష్యులకి ఆ కళలో ప్రావీణ్యత సంపాదించి పెట్టి, ఆ సంస్థ కేకాకుండా ఆ కళకే పేరు తెచ్చి పెట్టారు. వారి సంతానం అయిన రవిశంకర్, కళ్యాణి, బాలాత్రిపురసుందరి, సావిత్రి, కామేశ్వరి, వెంకటాచలపతి లలో ఆడపిల్లలు పెండ్లిచేసుకుని సంసారాలలో స్థిరపడిపోగా, వెంకటాచలం సంస్థాగత నిర్వహణ పై ఉత్సుకత తో స్థిరపడితే, రవిశంకర్ అక్క బాలాత్రిపురసుందరి ప్రోద్బలంతో  తండ్రి ని పుణికిపుచ్చుకుని భావస్ఫూర్తితో, స్వయం ప్రతిభతో  'నవదుర్గ' 'అర్ధనారీశ్వరం' వంటి గొప్ప క్లిష్ట కళాఖండాలలో తనదైన శైలిలో దేశవిదేశాలలో ప్రజానీకాన్ని, తోటి కళాకారులని మెప్పించి, అంత సులభంగా మెచ్చుకోలేని తండ్రినికూడా మెప్పించిన కళాకారుడిగా కూచిపూడి నాట్య లోకంలో ప్రఖ్యాతి కాంచాడు. కానీ దురదృష్ట వశాత్తు, అతని నాట్య నైపుణ్యం సరిగ్గా శిఖర స్థాయి చేరుతున్న సమయంలో మూత్రపిండాల వ్యాధితో అకాల మరణంతో కీర్తిశేషుడై, తన వారందరికే కాకుండా కూచిపూడి కళాలోకానికే తీరనిలోటు మిగిల్చి పోయాడు.

కూచిపూడి గేయ నాట్య నాటకాలు దాదాపు 17 వాడుకలో ఉన్నాయి. అవి ప్రముఖ కవుల కలంలోనుంచి జాలువారి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయి.

1. భామాకలాపం - శ్రీ సిద్ధేంద్ర యోగి; 2. రుక్మిణి కళ్యాణం శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ; 3. శ్రీకృష్ణ పారిజాతం: శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ; 4. క్షీర సాగర మధనం - శ్రీ ద్వారం భావనారాయణ, శ్రీ బాలాంత్రపు రజనికాంత రావు; 5. విప్రనారాయణ కథ - శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి; 6. మేనకా విశ్వామిత్ర; 7. అభిజ్ఞాన శాకుంతలం: శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ; 8. శ్రీనివాస కళ్యాణం - తెలుగు: శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ, తమిళ్: శ్రీ పుట్టనేని సుబ్రహ్మణ్యం, కన్నడ: బి.కే.సుమిత్; 9. కుమారసంభవం: తమిళ్: శ్రీ పుట్టనేని సుబ్రహ్మణ్యం; 10. హరవిలాసం; 11. రామాయణం; 1. కిరాతార్జునీయం: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ; 13. గోపికాకృష్ణ: శ్రీ చిల్లర భావనారాయణ; 14. పద్మావతి శ్రీనివాసం: శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ; 15. శ్రీపాద పారిజాతం (అన్నమయ్య): శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ; 16. చండాలిక: శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ; 17. రాధేశ్వర. చాలా గేయ నాటికలకి సంగీతాన్ని శ్రీ పట్రాయని సంగీత రావు గారు సమకూర్చారు.

శ్రీ ఎస్వీ భుజంగరాయ శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి, మధుర కవి, అనేక ప్రజ్ఞ పాటవాలు కలిగిన విశేష రచనలు చేశారు. వివిధ రంగాలలో ఎం.ఏ; డ్.లిట్  ( శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) పొంది చెన్నైలోని పచ్చయప్ప కాలేజీలో అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, 'విశ్వోదయ' విద్యా సంస్థలో తెలుగు విభాగం అధిపతిగా, ఆ తరువాత ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. శ్రీ ఎస్వీ భుజంగరాయ శర్మ, శ్రీ పట్రాయని సంగీతరావు, శ్రీ వెంపటి చినసత్యం లతో కలిసి కూచిపూడి 'త్రయం'గా గేయనాటికలు రూపొందిస్తూ కూచిపూడి నాట్యరంగం యొక్క ఖ్యాతిని పెంచారు.

ఆ గేయ నాటకాలు దేశ విదేశాలలో ప్రదర్శించడానికి పెద్ద బలగం, దానిని సమర్ధవంతం గా నడపగలిగే శక్తి యుక్తులు కావలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలలో నెలల తరబడి జరిగే కార్యక్రమాలకి వచ్చే మానవ సంబంధమైన, సంస్థాగతమైన, వారి తాత్కాలిక నివాసాలకి సంబంధించిన వివిధ సమస్యల్ని పరిషరిస్తూ, నాటికలు రక్తి కట్టేటట్టు చూస్తూ ముందుకుసాగడానికి ఒక సమర్ధుడైన నాయకుడు అవసరం. ఆపాత్ర శ్రీ చినసత్యం గారి కుమారుడైన శ్రీ వెంపటి వెంకటాచలం (వెంకట్) ఎన్నోఏళ్లుగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. గేయరూపకానికి నాట్యం లో అవసరమైన శిక్షణ, కార్యక్రమాలు జరగాల్సిన క్రమం, పద్దతి, వాద్య సహకారం మొదలైన వాటికి, వెంపటి చినసత్యం గారి కోడలు శ్రీమయి చూసుకుంటారు. బెంగాలీ వనిత అయిన ఆమె 'కూచిపూడి ఆర్ట్ అకాడమి' లో చేరేంతవరుకు బెంగాలీ తప్ప మరో భాష తెలియదు, నేర్చుకోవడానికి కూడా ఇష్ట పడేదికాదట. కానీ అక్కడ చేరిన తరువాత కళ మీద అభిమానంతో తెలుగు నేర్చుకుని, ఆ భాషని స్వంతం చేసుకుని, వాచకంలోనూ, ఆంగికంలోనూ పట్టుసాధించి, నాట్యతీరు లో ఘనతని సాధించి గురువు గారి మెప్పును పొంది, వారిచేతనే ఈమె వారికి తమ కోడలు అయి, తన కళాకేత్రాన్ని నడిపితే బాగుండుననిపించిన ఆమె అసాధ్యురాలే. చినసత్యం గారే శ్రీమయి తల్లితండ్రులనొప్పించి, వారి కోడలుగా చేసుకున్నారు. అంతవరకు, ఒకేచోట ఉండి వెంకట్ తో నడుస్తున్న ప్రేమాయణం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ ఈమె చతురురాలనే చెప్పాలి.

Vempati Family

2019 అక్టోబరు మాసంలో అమెరికాలోని శాండియాగో నగరంలో  జరిగిన 'రుక్మిణి కళ్యాణం' గేయనాటిక ప్రదర్శనను మేము చూసి ఆనందించడం జరిగింది. అదొక అమూల్య అనుభవం. అమెరికా లో దాదాపు రెండునెలల కార్యక్రమాన్ని వేసుకుని, అమెరికా అంతటి పెద్ద దేశంలోవారికి కావసిన సామాగ్రి, 23 మంది కళాకారులతో బస్సులో తిరగడం శ్రమతో కూడిన ప్రయత్నమే (ఇంతకుముందు వీరంతా అమెరికాలో ప్రదర్శనకు ఆరు సార్లు రావడం జరిగిందట) అయినా అనేక విదేశాలలో శ్రీ వెంపటి చినసత్యం గారి భావాలకి, ఆదర్శాలకు అనుగుణంగా శ్రమతో కూడినదైనా ఇటువంటి వరుస ప్రదర్శనలకు ఉద్యమించడం అభినందనీయం.

kuchipudi-dance-sceneఆ సంగీత నృత్య నాటకానికి శ్రీ మహంకాళి శ్రీరామచంద్రమూర్తి నట్టువాంగం అందించారు. సంగీతాన్ని పాడి గేయరూపకాన్ని రక్తి కట్టించింది మృదురవళి, ముకుంద రవీణ్. వారి సంగీతం సందర్భానుసారంగా రాగాలని కురుస్తూ, మారుస్తూ అలరింపచేసిన విధం దృశ్య నాటికను చూడడానికి  విచ్చేసిన సంగీత విద్వాంసులని కూడా మెచ్చుకునేలా చేసింది, ఇక సామాన్యుల సంగతి వేరే చెప్పాలా? శ్రీమయి, వెంకట్ వారి కుటుంబాన్ని గురించి, చినసత్యం గారి గురించి, వారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గురించి, వాళ్ళహృదయ వైశాల్యం, సౌశీలత, కళాసేవలో వారి నిబద్ధత తెలియజెప్పి మాకు శ్రీ సత్యం గారు జీవించిన విధానాన్ని పరిచయం చేసారు. చినసత్యం గారిల్లు ఎప్పుడు విద్యార్థులతో నిండి నాట్య శిక్షణల తో కళకళ లాడుతో ఉండేదట; శ్రీమతి స్వరాజ్యలక్ష్మి ఎప్పుడూ విసుగు విరామం లేకుండా బిజీగా ఉండేవారట. చినసత్యంగారెప్పుడూ విద్యార్థుల శిక్షణలోనే చాలా నిశితంగా, నిబద్ధతతో ఉండేవారట. వారంతా మాతో ఉన్న సమయంలో జరిగిన సంభాషణల ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడం జరిగింది. శ్రీ వెంపటి వెంకట్ గారి పిల్లలు వారి భార్య శ్రీమతి శ్రీమయి శిక్షణలో- వారి అమ్మాయి లక్ష్మీకామేశ్వరి, అబ్బాయి అనీష్ కూడా -ఈ కళలో నిష్ణాతులవుతున్నారు.

కళపై అత్యంత శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేస్తున్న ఈ బృందం మంచి ప్రజాభిమానాన్ని, ఆదరణను, పొంది చిరకాలం వర్ధిల్లాలని ప్రార్ధిద్దాం.

Posted in December 2019, సాహిత్యం

2 Comments

  1. అనుపమ

    కృతజ్ఞతలు,గొప్ప కళాకారుల గురించి మాకు వివరించారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!