"డ్రా కో నుండి ఉద్భవించిన రెప్టీలియన్స్ మేము. మీ భారతీయులు, గ్రీకులు, చైనీయులు మమ్మల్ని వింగ్ దేవతలు అని పిలుస్తారు" గర్వంగా చెప్పాడు డ్రాగన్.
"మీరు దేవతలు ఏంటి? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావ్." అంది శార్వాణి.
"నిజమే చెప్తున్నా. మేము భూమి మీద నివసించే ఏలియన్స్ మి. మమ్మల్ని రెప్టేలియన్స్ అని కూడా అంటారు. మీ పూర్వీకులు మమ్మల్ని దేవతలుగా చూసేవారు. చైనాను ఒకప్పుడు మేము మానవరూపంలో పరిపాలించాము. మాకు వారు గుడులు కట్టి కూడా పూజించారు. అంతేకాదు గ్రీకు దేశంలో ఏథెన్స్ యొక్క మొదటి రాజు సెక్రోప్స్ -1 మా జాతివాడే. పిర్గమ్ ఆలయంలో మా చిత్రాలు మిక్కుటంగా ఉన్నాయి తెలుసా??. గ్రీకుల దేవుడు బోరియాస్అచ్చం మాలానే ఉన్నాడు. అంతెందుకు మీ భారతదేశంలో మమ్మల్ని 'పైగా' అని 'సర్పా'అని పూజిస్తారు.
అమెరికా వాళ్ళు మానవాళికి జ్ఞానోదయం చేశాడని గుక్వాట్జను దిటోల్టే మాయన్ దేవుడు ....వివేకం యొక్క సర్పం అని వర్ణించారు తెలుసా.
యుకాటాన్లో .....కుకుల్కాన్ అని పిలుస్తారు హోపి భూగర్భం లో నివసించే షెట్టి లేదా స్నేక్ బ్రదర్స్ అని పిలవబడే రెపోయిడ్స్ జాతి మాదే.
కొలంబియాలో బచూ (ఆదిమస్ర్తీ) అని పిలిచే ఖగోళపాము అదే సర్పెంటిన్ ఖగోళ మాజాతిదే.
మేము మీకు రక్షకులం మాత్రమే." అంది గర్వంగా ఆ డ్రాగన్.
"మరి మంచి వారు అయితే నన్నెందుకు ఎత్తుకొచ్చారు?” అంది శార్వాణి ధైర్యాన్ని కూడగట్టుకుని.
"అదా నీ డౌటు. మేము ఎంత ప్రయత్నించినా మా దేహాలు సగం మాత్రమే మానవ రూపంలో ఉంటున్నాయి. మిగిలిన సగం తోకతో పాము లాగా ఉంటున్నాము. మేము మీ దేశాన్ని పాలించాలంటే మీలా శరీరాకృతి ఉంటే బాగుంటుందని మానవదేహాలపై రకరకాలపరీక్షలు జరిపి మాకుకావలసినవి తీసుకొని వాటిని మావారిలో ప్రవేశపెట్టి కొత్త జీవులను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం." అన్నాడు ఆ డ్రాగన్.
"మీరు దేవతలమని చెప్పారు కదా! ప్రయోగాలు ఎందుకు మీ శక్తులు ఉపయోగించుకుని మారిపోవచ్చు కదా! మళ్లీ గొప్పగా మాకే దేవతలమని చెప్తున్నారు!" అంది కోపంగా శర్వాణి.
"భలేదానివే .... శక్తులు ఉన్నంత మాత్రాన కామరూపం లో మారిపోయి ఎంత కాలం ఉండగలం.
మా ఈ రూపం శాశ్వతంగా పోవాలి. మమ్మల్ని చూసి అందరూ భయపడుతున్నారు. మీలా మా శరీరాకృతి కూడా అందంగా ఉంటే సామ్రాజ్యాన్ని ఏలేస్తాం. మా తరతరాలు ఆనందంగా బ్రతుకుతారు." చెప్పాడు డ్రాగన్.
"ఛీ...ఛీ....మీరు దేముళ్ళమని అదని..ఇదని ఏవేవో గొప్పలు చెప్పారు. మానవులకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. చిన్న పిల్లననన్నా చూడకుండా నా మీద ప్రయోగాలు కూడా చేసారు. అంటే మీ భావనలో గొప్పవారు ఇలాంటి పనులు చేస్తారా!?!" అడిగింది శార్వాణి.
"దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావ్ నీ దృష్టిలో". అడిగాడు డ్రాగన్.
"కోరిన కోర్కెలు తీర్చేవాడు. మంచి వాళ్లకు మంచి చేసే వాడే దేముడు." అంది శార్వాణి.
"ఆ కోరికలు తీర్చేటప్పుడు ఎవరికన్నా కనిపిస్తున్నాడా? మీ దేముడు?” ప్రశ్నించాడు డ్రాగన్.
"నాకు తెలిసీ ఎవరూ చెప్పలేదు." అంది శార్వాణి.
నేనే ఈ పని చేశాను అని ఏమైనా చెప్తున్నాడా?" అడిగాడు డ్రాగన్.
"లేదు". అంది శార్వాణి.
"మరైతే దేవుడు ఈ పనులు చేశాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు?" అడిగాడు డ్రాగన్.
శార్వాణి కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
"శార్వాణి కిటికీ లోనుంచి బయటకు చూపిస్తూ....ఆ చెట్లు ఎందుకు ఊగుతున్నాయి?" ప్రశ్నించింది శర్వాణి.
"చెట్లు ఎందుకు ఊగుతున్నాయో నీకు తెలియదా? తెలిసి తెలియనట్లు అడుగుతున్నావా?" అడిగింది ఆ డ్రాగన్.
"నాకు తెలియక అడుగుతున్నాను అనుకో నువ్వు చెప్పు." అంది శార్వాణి.
"గాలి వల్ల" చెప్పింది ఆ డ్రాగన్.
"మరి ఆ గాలిని నువ్వు చూసావా?"
"లేదు." చెప్పింది డ్రాగన్.
"మరి ఎలా చెప్పగలిగావు?" అడిగింది శార్వాణి.
"స్పర్శ ద్వారా" చెప్పాడు డ్రాగన్.
"మరి అలాగే దేవుని లీలలు కూడా! అనుభూతిని బట్టి చెబుతాం" అంది శార్వాణి.
డ్రాగన్ ఏమి మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు.
మళ్ళీ కాసేపు ఆలోచించి "మీకు తోకలున్నాయి కదా! ఆ తోకలు మీకు చెప్పాయా కాళ్ల గా మార్చమని?" అడిగింది శార్వాణి.
"వాటికి మాటలు రావుగా చెప్పటానికి." అన్నాడు ఆ డ్రాగన్.
"మాటలు రావని దాన్ని నీ ఇష్టమొచ్చినట్లు మార్చేస్తావా?" అంది శార్వాణి.
"నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకొనే హక్కు నాకు ఉంది" అన్నాడు డ్రాగన్.
"నీ శరీరం సరే మా శరీరాలపై నీ అధికారమేంటి?" ధైర్యం కూడదీసుకుని అడిగింది శార్వాణి.
"మీరే కాదు మిమ్మల్ని వెంటేసుకొచ్చిన ఆ బూడిద రంగు ఏలియన్స్ కూడా మా బానిసలు." అన్నాడు డ్రాగన్.
అంతా విన్న శార్వాణి మనస్సు వారిని దేవతలుగా అంగీకరించలేకపోయింది.
"మీరు దేవతలు కాదు, దెయ్యాలు. మీకు మీరే దేవతలుగా ప్రకటించుకున్నారు. మీ భయానికి ఆ రోజుల్లో మీకు గుడులు కట్టి పూజించేవారేమో! గానీ మీ ఆలోచనలు మీ నడవడికలలో దైవత్వ లక్షణాలు లేవు. ఆధిపత్యపోరులు అమాయకుల హింసలు. ఇదేగా మీ రూటు. స్వార్థం రెక్కలు కట్టుకు ఎగురుతున్నారు మీరు.
మా దేవతలు త్యాగనిరతి కలవారు. పితృవాక్య పాలకులు. ఆపన్నులకు ఆసరాగా నిలిచే వాళ్ళు. అమాయకులకు అండా దండా వారే.
మేము సర్పాలను పూజిస్తాం. నాగులచవితికి పుట్టలో పాలు పోస్తాము. అవి దేవతా పాములు. ఎవరి జోలికి రావు. కొన్ని దుష్ట సర్పాలు చేసిన పనులవల్ల మేము భయంతో పాములను కనిపిస్తే చంపేస్తున్నాము.
మీరు నిజంగా మంచి వాళ్ళు అయితే మంచితనంతో మమ్మల్ని జయించాలి. అంతేగాని ఇలా ఎత్తుకొచ్చి మంచి వాళ్ళం అని చెప్పడం కాదు." పూనకం వచ్చినట్లుగా మాట్లాడుతున్నశార్వాణి టక్కున ఆగిపోయింది.