అద్భుతమైన ఈ లోకంలో ఎన్ని అందాలో
ఆ అందాలకు అంతులేని భావాల తోరణాలు
పూవులతో సరాగాలాడుతు మత్తెక్కిన భ్రమరాలు
పలకమారిన జామపళ్ళ రుచిమరిగిన చిలుకమ్మల సందడులు
తూరుపున ఉదయించే సూర్యుడు,
కిరణాల మధ్య వజ్రమై మెరిశాడు.
నదీ తరంగాలపై తన బంగారు ఉత్తరీయాన్ని ఆరబోసుకుంటే
కల హంసలు సిగ్గుతో చెదిరిపోయాయి.
ఆ కమ్మని దృశ్యం కాంచిన వారికి ఎనలేని ఆనందం
నదీ తరంగాలు నిశ్చలంగా లోక బాంధవునికి వీడుకోలు చెబుతున్నాయి
అలసిన భానుడు తన కవచాన్ని తొలగించి సాగరంలో దాచుకున్నాడు
ఆ తళ తళలు దాచలేని సాగరుడు కలవర పడ్డాడు
సాయంకాలపు సూర్యునికి నారింజరంగు కుంచె అద్దిన అందం
సంధ్యాకాంత దిగులుతో మేలి ముసుగు ధరించింది
చీకటితో చేరి తన మోము చాటు చేసుకుంది
గలగలపారే సెలఏళ్ళు వొయ్యారాలు వొలక బోయు జలపాతాలు
ఎవరికోసమో ఈ అందాలు అణువణువునా బృందావనాలు
ఎప్పుడూ చిలిపిగా వర్షించే మేఘాలు
నిలువెత్తు వృక్షాలకు ప్రాణదాతలు
కొండలపై పేరుకున్న తెల్లని మంచు దుప్పట్లు
ఎన్నటికీ కరుగక నిలిచిపోయిన ఆనవాళ్లు
ప్రకృతి ప్రేమికుల స్వర్గ ధామం చిత్ర కారులకు, కవులకు నెలవు
తనివితీరని వాషింగ్టన్ అందాలు పచ్చదనానికి దర్పణాలు
ఇంత అందమైన ప్రకృతికి మెరుగులు దిద్దే చిత్రకారునికి అభినందనలు.
(అమెరికా లోని వాషింగ్టన్ అందాలకు నా మది నిండిన భావాలు మీతో పంచుకున్నా...)
తనివి తీరని అందాలు
Posted in October 2022, కవితలు