పద్మనాయక – రెడ్డిరాజుల యుగం
మడికి అనంతయ్య, కొరవి సత్యనారన
‘విష్ణుమాయా విలాసం’ అనే కావ్యం కూడా దాని కృతికర్త నిర్ధారణగా చెప్పలేని కావ్యం. ఇది అయిదు ఆశ్వాసాల రసవత్తర కావ్యం.
పుండరీకుడనే సద్భ్రాహ్మణుడు ఒక బోయ కన్యను పెండ్లాడి పామరుడై చివరకు మోక్షాన్ని పొందుతాడు. ఈ విషయం గూర్చి చెబుతూ ఆరుద్ర, ఇలాంటి చరిత్రలు వ్రాయడమంటే మన కవులకు ఎంతో ఇష్టం అని చెప్పి అలాంటి కథలు గల గ్రంథాల పట్టిక ఇచ్చారు.
విష్ణుమాయా నాటకాన్ని తదనంతర కవులు అనుసరించారు. ఈ కావ్యపు ప్రతులు మూడు దొరికాయి. కాకినాడలో దొరికిన ప్రతిలో గల గద్యంలో “...రాధామాధవ ఎల్లనార్య ప్రణీతంబైన విష్ణుమాయా నాటకము..” అని ఉంది. అందువల్ల కృష్ణరాయల యుగంలో ఉన్న చింతలపూడి ఎర్రనార్యుడు ఈ నాటకాన్ని వ్రాయగా కృష్ణదేవరాయలు మెచ్చుకొని, ఎర్రనార్యునికి ‘రాధామాధవ కవి’ అనే బిరుదు ఇచ్చాడు అని అనిపించింది. అయినా సాహిత్య చరిత్రలో చర్చ సాగింది అని చెప్పారు ఆరుద్ర.
కోరాడ రామకృష్ణయ్య గారు అనంతయ్యను తరువాతి కాలపు సాహసికుడిగా భావించి అనంతయ్య సంపూర్ణ గ్రంథ చౌర్యానికి పాల్పడ్డాడని చెప్పడం జరిగింది. దీనిని కొన్ని సాక్ష్యాలతో చాగంటి శేషయ్య గారు ఖండించారు.
విష్ణుమాయా విలాసంలో గోదావరి నదీ తీర ప్రశంస, సర్పవర క్షేత్ర మహిమ వివరించబడ్డాయి. అనంతయ్య ఈ మండలం వాడు.
తారకబ్రహ్మరాజీయం ఎల్లనార్యుని కృతి. ఇందులో ఒక కథకు, విష్ణుమాయా నాటకంలోని కథకు పోలికలున్నాయి.
ఆరుద్ర విష్ణుమాయా నాటక కథను వివరించారు. అలాగే ఎల్లనార్యుని రచనను గూడా వివరించి కూలంకషంగా చర్చించారు. అలాగే వాసిష్ట రామాయణం లోని పద్యాన్ని విష్ణుమాయా నాటకంలోని పద్యాన్ని పోల్చి చూపాడు. రెండు ఇంచుమించు ఒక్కటే (వాసిష్ట – 2-227).
ఈ విధంగా చర్చించిన ఆరుద్ర ఇలా తీర్మానించారు. “మడికి అనంతయ్య విష్ణు మాయా నాటకాన్ని రచించి ఉంటాడని చాగంటి శేషయ్య గారు ఎంత గట్టిగా నమ్ముతున్నా, కర్తృత్వం విషయంలో సాక్షం లేదు. ప్రస్తుతానికి అతడు (అనంతయ్య) మడికి సింగన తమ్ముడు మాత్రమే”
కొరవి సత్యనారన
ఆంధ్ర కవి పితామహుడని బిరుదున్న పూర్వ కవులలో సత్యనారన ఒకరు. ఈయన రామాయణం వ్రాసినట్లు కొరవి గోపరాజు రచించిన ఒక పద్యం ద్వారా తెలుస్తున్నది. గోపరాజు తన రచన సింహాసన ద్వాత్రింశిక లో పై విషయాలు తెల్పాడు. సత్యనారన కు భీమన అనే మారు పేరు ఉన్నట్లు కూడా ఈ పద్యం ద్వారా తెలుస్తున్నది. కొరవి వారిది ప్రఖ్యాత కుటుంబం.
ప్రసిద్ధమైన ముప్పై రెండు మంది మంత్రులలో కొరవి అన్నయామాత్యుడు ఒకడు. ఇతడు సత్యనారాయకు పెదతండ్రి. సత్యసూరన తెలంగాణా వాడని చెప్పవచ్చు అన్నారు ఆరుద్ర. (నల్లగొండ లోని రాచకొండ కావచ్చు). దేవరకొండ రాజధానిగా ఏలిన పద్మనాయక యుగంలోని వాడన్నది సత్యం అని అన్నారు ఆరుద్ర. ఇంతగొప్ప వాడైనా ఇతని రామాయణం మాత్రం దక్కలేదు. పద్మనాయక రాజుల కాలంలో కూడా ఈనాటి వలె సత్యనారాయణుని పేరు పెట్టుకోవడం జరిగిందని తెలుస్తున్నది. అంతకుమించి సత్యనారయ రచన దొరకలేదు.
విన్నకోట పెద్దన
ఆంధ్రదేశంలో తొలిసారిగా దీర్ఘకాలం విశాల సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు చాళుక్యులు. విన్నకోట పెద్దన రచించిన గ్రంథం ‘కావ్యాలంకార ఛూడామణి’ దీని రచనాకాలం – క్రీ.శ. 1402-07. ఈ గ్రంథం చాళుక్య రాజైన విశ్వేశ్వర భూపతికి అంకితం. ఈ భూపతికి తెలియని విద్య లేదు. వీరి వంశవృక్షాన్ని ఆరుద్ర రచించారు. (స.ఆం.సా. 1వ.సం. పేజీ 668)
పెద్దన కావ్యక్రమ వేది. కళా కౌశలుండు. చతురుడు. అతనితో రాజు ఈ విధంగా అన్నాడు.
భావరస ప్రపంచమున బర్వునలంకృతి లక్షణంబు ఛం
దో విచితి ప్రచారము గుతూహల దస్ఫుర దంద్రదేశ భా
భా వివిధ ప్రసంగముల చందము నందముగా నొనర్చి వి
ద్యానిధి గానుపించుట గదా చతురత్వ మనంగ మేదినిన్.