పోతన భాగవతం తెనిగించడానికి పూనుకునే నాటికి మహాభారతం కవిత్రయం చేతిలో ఉంది. రామాయణం కూడా అనేక మంది రాసి ఉంచారు తెలుగులో. అయితే పోతనకి రామభద్రుడు ధ్యానంలో కనిపించి భాగవతాన్ని తెనిగించమని చెప్పేసరికి వ్యాస భాగవతానికి అనువాదం మొదలు పెడుతూ తన దగ్గిరకి వచ్చేసరికి భాగవతం ఇంకా ఎవరూ తెలుగులోకి తర్జుమా చేయనందువల్ల అది తన అదృష్టం, భగవత్కృప అనీ చెప్పుకున్నాడు. అయితే రాముడి కధ భాగవతంలో ఒక అవతారంగా వస్తుంది కనక రామాయణం కొన్ని పద్యాలలో మాత్రం రాశాడు. ఈ రామాయణం ఎంతో వేగంగా దాదాపు వంద, నూట యాభై పద్యాలలో చెప్పేస్తాడు పోతన మరీ పొడిగించకుండా, కట్టె, కొట్టే, తెచ్చె అన్నట్టు కాకుండా. ఈ నెల పద్యం పోతన రామాయణంలోనిదే. రామ రావణ యుద్ధం అయ్యాక విభీషణుడికి రాజ్యాభిషేకం ఎలా చేస్తున్నాడో చెప్తున్నాడు. ఈ ఉత్పలమాల పద్యం లో ప్రతి పాదంలో మొదటి రెండు అక్షరాలు, “ణ” అనే తెలుగు అక్షరం ఎలా వాడాడో గమనించండి.
ఉ.
శేషవిభూతిఁ గల్పసమజీవివి గమ్మని నిల్పె నర్థి సం
తోషణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా
భాషణు నార్యపోషణుఁ గృపాగుణభూషణు నవ్విభీషణున్. [పోతన భాగవతం 9-314]
మొదట ఎవరు విభీషణుడికి రాజ్యాధికారం కట్టబెట్టాడో చెప్తున్నాడు – రాజులలో కెల్లా చంద్రుడివంటివాడు (నృపసోముఁడు); రాక్షసులని అంతమొందించినవాడు (శోషితదానవుండు); ఇంకెవరు, రామచంద్రుడే కదా? ఇటువంటి రాముడు విభీషణుడికి పట్టం కట్టాడు. ఆ విభీషణుడు ఎటువంటివాడు? అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సంతోష పెట్టేవాడు (అర్ధి సంతోషణుడు), పాప రహితుడు, లేదా పాపాలు లేనివాడు (పాపశోషణుడు), నిందించడం అనేది తెలియనివాడు (అదూషణుడు), కోపం తెలియనివాడు (శశ్వద – శాశ్వతంగా, అరోషణుడు – రోషం లేనివాడు), మితంగా మాట్లాడేవాడు (మితబాషణుడు), పెద్దలని గౌరవించి పోషించేవాడు (ఆర్యపోషణుడు), దయాగుణం కలవాడు (కృపాగుణ భూషణుడు).
ఇన్ని మంచి గుణాలు ఉన్న విభీషణుడికి రాముడు రాజ్యాధికారం ఇచ్చేటప్పుడు ఏమని దీవించాడో కూడా చెప్తున్నాడు పద్యంలో – అశేషమైన వైభవంతో చక్కగా కల్పాంతం వరకూ జీవించు అన్నాట్ట (అశేష విభూతి కల్ప సమ జీవి). ఇలా ఎందుకన్నడనేది చూద్దాం. మొదటగా తాను ఇచ్చేది రాక్షస రాజ్యం (రాక్షసేంద్రత్), రావణుడు రాజ్యం చేసినట్టు విభీషణుడు ఇతరులని నాశనం చేయకుండా ఉండాలి. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆశీర్వాదం ఇమ్మంటే ఏమంటారు? మన తల మీద అక్షింతలు చల్లి ‘దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, నూరేళ్ళు జీవించు’ అంటారు కదా. అదైనా ఎలా జీవించాలి? మంచి వారిలా. ఈ పద్యం విషయంలో కూడా అదే అంటున్నాడు రాముడు – విభీషణుడు ధర్మం తెల్సినవాడు కనక అటువంటి రాజు కల్పాంతం వరకూ ఉండాలి. అది అందరికీ మంచిది. అదీకాక విభీషణుడు ముందే తాను ఏనాడూ ధర్మం తప్పకూడదని అడిగినప్పుడు బ్రహ్మ వరం ఇచ్చాడు – చిరంజీవిగా ఉండూ అంటూ. అందువల్లే రాముడు కూడా ‘అశేషమైన వైభవంతో చక్కగా కల్పాంతం వరకూ జీవించు’ అంటున్నాడు.
మనం రోజూ వాడే మంత్రాలలో కూడా చతుస్సాగర పర్యంతం (మానవ పరిభ్రమణానికి నలువైపులా ఉన్న మహాసముద్రాల అంచుల వరకు, అంటే భూమండలం అంతటా) గో (గోవులు, పశు సంపద), బ్రాహ్మణేభ్య (బ్రాహ్మణులను, విద్యావంతులు, సంఘహితాన్ని కోరేవారు), వీరందరికీ శుభం భవతు (శుభం కలుగుగాక), అంతా మంచే జరగాలని కోరుకోవడం. ఎందుకంటే లోకం సుఖంగా ఉన్నప్పుడే మనకి కూడా సుఖం కదా? శ్రీనివాస గద్యం చివర్లో కూడా ఏమంటున్నారో చూడండి. "….ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోzనుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోస్తు, దేశోయం నిరుపద్రవోస్తు, సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకళ్యాణ సమృద్ధిరస్తు.
గమనించారా? సకలకళ్యాణ సమృద్ధిరస్తు – చదువుకున్నవారు, బ్రాహ్మలూ రాజు ధర్మాత్ముడై ఉండాలి (బ్రహ్మణ్యో రాజా ధార్మికోస్తు) అందరికీ అన్నీ బాగుండాలి (నిత్య కళ్యాణ), దేశోయం నిరుపద్రవోస్తు (దేశాలకి ఎటువంటి ఉపద్రవాలూ రాకూడదు), పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాది (రోజువారీ శుభం కలుగుతూ ఉత్తరోత్తరా వృద్ది) కూడా ఉండాలి. ఇవన్నీ ఏ ఒక్కరికీ కాదు సుమా, అందరికీను. అందుకే మనం చేసే పూజలలో – అవి ఇంట్లో చేసినా గుడిలో చేసినా, మంత్రాలలో చివర్లో మనం ‘లోకాన్ సమస్తా సుఖినోభవంతు’ అనడం కూడా చూస్తాం. దీన్నే ఈ మధ్య తెలుగులో ‘అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి’ అని తర్జుమా చేసి వదుల్తున్నారు.
పద్యం విషయానికి వస్తే పోతన “ణ” అనే అక్షరాన్ని ఎంత సులభంగా వాడాడో చూసారా? ఇటువంటి అక్షరాలు (ఉదా: క్ష, ళ) వాడుతూ కొంచెం మాత్రమే తెలుగు వచ్చిన వారిక్కూడా అర్ధమయ్యేలా అతి సులభమైన ద్రాక్షాపాకం రాయడంలో పోతన అక్షతూణీరుడు. అందుకే విశ్వనాధ వారు అన్నట్టూ ఆయన తెలుగు పుణ్యపేటి.