Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి --

భాగవతం చెప్తున్నప్పుడు శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్తాడు భగవంతుడెక్కడుంటాడనే దానికి సమాధానం ఇస్తూ – “హరి మయము విశ్వమంతయు హరివిశ్వమయుండు సంశయము పనిలేదా…” అని. “అబ్బే ఇప్పుడే నాకు ఇలా భగవంతుణ్ణి చూపిస్తే నేను నమ్ముతా లేకపోతే నమ్మను” అనేవారికి సరదా ప్రశ్న వేస్తారు స్వామి సత్యానందగారు. మీరు పాఠశాలలో లెక్కలు నేర్చుకుంటున్నారనుకోండి. ఫలానా లెక్క ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడు మీకు ఉపాథ్యాయుడు ఏం చెప్పాడంటే, “మొత్తం ఒకటి అనుకో ముందు. చివరిలో సులభంగా సమాధానం వస్తుంది.” మీరు ఆయనని నమ్మి సరే మొత్తం ఒకటి అనుకుని చివరకి సమాధానం రాబడుతున్నారు. అంటే చిన్న లెక్క విషయంలో మీరు ఉపాధ్యాయులు చెప్పినది నమ్మి మొత్తం ఒకటి అనుకుని చివరకి అసలు విషయం తెలుసుకుంటున్నారు కదా? అలాగే సముద్రంలో పెద్ద అగ్ని పర్వతాలు ఉన్నాయనీ అంతరిక్షంలో కృష్ణబిలాలు ఉన్నాయనీ ఎవరో ఎక్కడో చూసి చెప్తే, వాటిని మనం చూడ(లే)కపోయినా, నమ్మడానికి సిధ్ధంగా ఉన్నాం. కొన్నాళ్ళకి “అబ్బే నేను ఫలానా రోజున చెప్పినది తప్పు” అంటే ఆ తప్పుని కూడా ఒప్పుకోవడానికి మనం ఎప్పుడూ సిధ్ధమే.

మరి రామకృష్ణులూ, రమణులూ చెప్పినట్టు భగవంతుడు ఉన్నాడు అనుకుని ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటే వాళ్లని ఎందుకు నమ్మలేకపోతున్నాం? చిన్న లెక్క విషయంలో ఉపాధ్యాయులు చెప్పినది నమ్మే మనం ఈ మహర్షులు చెప్పినది, “నేను తెలుసుకున్నాను. నీకు కూడా సాధ్యమే” అంటే – అదీ ఈ సృష్టి అంతా చేసిన, ఏదైనా చేయగలిగిన భగవంతుణ్ణి - ఎందుకు నమ్మలేకపోతున్నాం? అదీ మన పరిస్థితి. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఆయన్ని చేరడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరకి భగవంతుడు ఎక్కడో లేడనీ, సర్వత్రా ఉన్నది ఆయనేననీ శుకమహర్షి చెప్పినట్టూ ‘హరిమయము విశ్వమంతయు’ అనీ మనకి తెలుసి వస్తుంది. ఇలా తెలియడానికి బుధ్ధుడూ, వివేకానందులూ చేసినట్టు సర్వసంగ పరిత్యాగం చేయడానికి, దేనినైనా వదులుకోవడానికి సిధ్ధంగా ఉండాలి. అప్పుడు, అన్నీ వదులుకున్న మనని ఆదుకోవడానికి భగవంతుడు ఎల్లవేళలా, అంబరీషోపాఖ్యానంలో చెప్పినట్టూ – కాసుకుని కూర్చుంటాడు. నాకు మంచి జరిగితే భవగంతుడున్నాడు, చెడు జరిగితే ‘ఆ పోవయ్యా దేవుడుంటే ఇలా జరుగుతుందా?’ అనుకునేవాడికి భగవంతుడు ఎందుకు కనిపించాలి? మొత్తం ఒకటి అనుకుని లెక్క చేయడానికి మొదలుపెట్టాక సరైన సమాధానం రాకపోతే తప్పు మనదా, ఉపాధ్యాయుడిదా?

స్థూలంగా ఇదే విషయం చెప్పే ఈ నెల పద్యం మళ్ళీ మహాభాగవతంలోనిదే. “నేను ముల్లోకాలూ వెతికాను ఎక్కడా లేడు, నువ్వు ఉన్నాడనే శ్రీహరి ఎక్కడున్నాడురా, చూపించు” అని హిరణ్యకశిపుడు గర్జించి అడుగుతూ ఉంటే, ప్రహ్లాదుడు ‘ఇందుగలడందులేడని సందేహము వలదు..’ అని ఖఛ్ఛితంగా చెప్తున్నప్పుడు ఆ విషయం నిరూపించడానికి ప్రతీ అణువులోనూ శ్రీహరి కాచుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు పోతన. ఎలా కాసుకుని ఉన్నాడు శ్రీహరి? నరసింహాకృతిలో అచ్యుతుడిగా. చ్యుతి అంటే పతనము, నాశనం లేనివాడు. నరసింహాకృతి ఎందుకంటే, హిరణ్యకశిపుడు తాను ఎలా చావాలో బ్రహ్మ ఇచ్చిన కోరిక ద్వారా తానే కోరుకున్నాడు కదా?

మ.
"హరి సర్వాకృతులం గలం" డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై "యెందును లేఁడు లేఁ" డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. (ప్రహ్లాదోపాఖ్యానం 7.277)

ఈ పద్యంలో ఉన్న విశేషం ఏమంటే, “శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్” అనేది. నరసింహాకృతి ఎందుకో చెప్పుకున్నాం. “నానా జంగమస్థావరోత్కర” అనడం ఎందుకంటే తన భక్తుడు హామీ ఇచ్చేసాడు కదా, “ఇందుగలడందులేడని సందేహము వలదు..” అంటూ? ఏమో ఈ గడ్డిలో చూపించు, ఈ ఖఢ్గంలో చూపించు, ఈ సింహాసనంలో చూపించు, ఈ స్థంభంలో చూపించు అంటే, అక్కడనుంచి బయటకొచ్చి భక్తుడు అన్నది నిజమే అని నిరూపించడానికి ఒకటైతే రెండోది శుకమహర్షి చెప్పినట్టూ “హరిమయము విశ్వమంతయు..” ప్రపంచంలో ఈ భగవంతుడు తప్ప మరొకటి ఏమీ లేదనే విషయం మరోసారి నిర్థారించడానికి.

భగవద్గీతలో కృష్ణుడు విశ్వరూపసందర్శనం చూపించడానికి ముందు విభూతియోగంలో చెప్తాడు, “అర్జునా ఈ సృష్టి మొత్తంలో, స్థావర జంగమాలలో నా అంశ లేకుండా నిలబడగలిగేది ఏ ఒక్కటీ లేదు” అని. ఇదే మరోసారి ఈ పద్యంలో చెప్తున్నాడు పోతన – నానా జంగమస్థావరోత్కర గర్భంబుల నన్ని దేశముల – అంటూ. చివరిగా చెప్పేదేమంటే అడగ్గానే బయటకి రావడానికి శ్రీహరి ఉధ్ధండ ప్రభావం తో కాసుకుని ఉన్నాడు. ఆ ప్రభావం ఎందుకంటే, హిరణ్యకశిపుడు మామూలు వాడా? ఎవరిచేతా ఎటువంటి ఆయుథాల చేతా సంహరింపబడకూడదని వరం సంపాదించుకున్నాడు కదా?

హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల గురించి మరో విషయం ఏమిటంటే రాక్షసులైనా వీళ్ళిద్దరూ తన కావలి భటులు కనక మహావిష్ణువుకి వీరంటే అత్యంత ఇష్టం. హిరణ్యకశిపుడంటే మరింత ఇష్టం కనక తన వళ్ళో కూర్చోబెట్టుకుని మరీ ఏ ఆయుథాలూ వాడకుండా అతను ఎలా కోరుకున్నాడో అలాగే సంహరించాడు కదా? ఇదే విషయం నారదుడు ధర్మరాజుతో చెప్తూ అంటాడు భాగవతంలో మరోచోట – “అసలు భగవంతుణ్ణి చేరడానికి ఆయనకి విరోధిగా జన్మించడమే మంచిదని నాకు తోస్తుంది ఒక్కొక్కప్పుడు ఎందుకంటే విరోధంతో అయితే ఒకటి రెండు జన్మలలో ఆయన కనిపిస్తున్నాడు ఈ హిరణ్యకశిపుడికీ, కంసుడికీ కనిపించినట్టు. కానీ భక్తుడు అయితే మాత్రం అనేకానేక జన్మలు ఎత్తినా భగవద్దర్శనం చాలా కష్టంగా ఉంది” అని.

****సశేషం****

Posted in September 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!