ధర్మరాజు తమ్ములతో అరణ్యవాసంలో ఉండగా వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు అటువైపు వచ్చిన దుర్యోధనుడి బావమరిది, దుస్సల మొగుడు అయిన జయద్రథుడు ద్రౌపదిని చూసి మనసు పారేసుకుని ఆవిడని బలవంతంగా రథం మీద ఎక్కించుకుని వెళ్తాడు. అక్కడే ఉన్న పాండవ పురోహితుడు థౌమ్యుడు ఎన్ని చెప్పినా వినిపించుకోడు కూడా. వేట అయ్యాక వెనక్కొచ్చిన పాండవులతో చెప్తాడు థౌమ్యుడు జరిగిన సంగతీ, జయద్రథుడు చేసిన నీచమైన పనీను. భీముడు తర్వాత యుథ్థంలో వాణ్ణి పట్టుకున్నాక ప్రాణం తీస్తానంటే, దుస్సల ని మనసులో పెట్టుకుని థర్మరాజు చెప్పిన మాట విని తల బోడి చేయించి వదిలేస్తారు. ఇంత చేసినా బుథ్థి రాదు.
ద్రౌపది ని పట్టుకుని పారిపోయినప్పుడూ, ఆవిడకి పెళ్ళై అయిదుగురు భర్తలున్నారని చెప్పినప్పుడూ, కామం తో కళ్ళుమూసుకుపోయినప్పుడూ లేని పౌరుషం అప్పుడొస్తుంది, తల బోడి చేసాక. ఇంత పరాభవం చేసిన ఈ పాండవులని ఎలాగో ఒకలాగ చంపాలి అనే పట్టుదలతో శివుడి గురించి తపస్సు చేస్తాడు జయథ్రథుడు. అయితే తాను చేసిన పని ఎటువంటిదనేది ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకున్నాడా? సరే, చేసిన తపస్సు వల్ల శివుడు కనిపించాడు. భగవంతుడు కనిపిస్తే ఏమిటి అడగడం? పథ్నాలుగు లోకాలనీ సృష్టించి లయం చేస్తున్నవాడికి మనకేం కావాలో తెలియదా? మనం పిచ్చి కోరికలు అడిగితే ఆయన నవ్వుకోడూ? శివుడు కనిపించాక ‘నేను -నాకు ఇంత పరాభవం చేసిన - పాండవులని జయించాలి’ అని అడిగాడు. ఇంత పరాభవం నాకెందుకు జరిగింది, నేనేం తప్పు చేసాను అని ఒక్కసారైనా ప్రశ్నించుకున్నాడా పోనీ? ఆ విషయం భగవంతుడికి తెలియదా?
ఇలా కోరుకున్న జయథ్రథుడికి శివుడు సమాథానంగా ఏమంటున్నాడో చెప్పే పద్యమే ఎర్రాప్రగ్గెడ ఆంథ్ర మహాభారతం అరణ్య పర్వంలో రాసిన పద్యం. మొత్తం పాండవులనందరినీ జయించడం దేవేంద్రుడికైనా సాథ్యం కాదు. అయితే,
చ.
నిజ మొకనాటి కయ్యమున నీవు జయింపుము; ఫల్గునుండు స
ర్వజగదజయ్య విక్రముడు; వాని నెదుర్కొని నాకు నైన బో
ర జితుని జేయు టెంతయు భరం బగు నిక్కము పల్కితిం జుమీ! (అ. ప. షష్టాశ్వాశం. 257)
విజయుడిని (అర్జునుణ్ణి) తప్ప మిగతా నలుగురి పాండవులనీ ఒక రోజు యుథ్థంలో జయిస్తావు. అర్జునుడికున్న పేర్లలో “విజయుడు” అనేది మొదట్లోనే వాడి చెప్తున్నాడు శివుడు, ఎందుకంటే అతనికి అపజయం అన్నదే లేదు. ఆ ఫల్గునుడెటివంటివాడు? సర్వజగదజయ్య విక్రముడు – అతన్ని ఎదుర్కోవడం నాకు కూడా బాగా కష్టం అవుతుంది (నాకు నైన బోర జితుని జేయు టెంతయు భరం బగు). నిజం చెప్తున్నాను సుమా, అంటున్నాడు. శివుడిలా ఎందుకు అంటున్నాడని చూస్తే మనకి తెలిసేది - అర్జునుడు సాక్షాత్తూ మహేశ్వరుణ్ణే నిలుచోబెట్టి యుథ్థం చేసి పాశుపతం సంపాదించుకున్న వీరాథివీరుడు. అటువంటివాడిని జయించడం అసాథ్యం కదా?
అయితే దీంట్లో మరో విశేషం ఉంది. పాండవులకి ఇంత చేటు చేసినవాడికి అసలు వరం అనేదే ఇవ్వడం దేనికీ? శివుడు భోళాశంకరుడు. ఆయన ఆశుతోషుడు – అంటే చాలా సులభంగా కనికరించేవాడు - కనక చిన్న అభిషేకం చేసి, ప్రసాదం పెట్టి ఏదైనా అడిగితే ఇవ్వనూ అనలేడు. కానీ ఇక్కడ జయథ్రథుడు అడిగినది అసాథ్యమైన కోరిక కనక కొంచెం తగ్గించి ‘సరే ఒక రోజు మాత్రం మిగతా నలుగుర్నీ జయిస్తావులే’ అని చెప్తున్నాడు. మరి అర్జునుణ్ణి ఎందుకు జయించలేవంటే నా అనుగ్రహం చేత అతనికి ఈ విశేషం కలిగింది (పాశుపతం ఇచ్చాడు కదా?). దీని గురించి మరింత చెప్తున్నాడు తర్వాతి పద్యంలో “నువ్వు కోరిక అడగడం బాగానే ఉన్నా, ఈ విషయం చూడు.”
క.
డఖిలేశ్వరుడతనికి బ్రియ సఖుడటె యవ్వీరు గెల్వ శక్యమె నీకున్? (259)
నిఖిల అస్త్రశస్త్ర విద్యాసఖుడై, అపరాజితుడూ, యశో విశాలుడైన అర్జునుడికి విష్ణువు – అఖిలేశ్వరుడైన భగవంతుడు - ప్రియమైన మిత్రుడు. అటువంటి నరనారాయణులని, గెలవడం మానవమాత్రుడవైన నీకేం సాథ్యం అవుతుంది?
మరోసారి క్రిందటి నెల వ్యాసాల్లో చదివినది గుర్తు తెచ్చుకుంటే కోరిక అనేదే మన నాశనానికి మూలం. హిరణ్యకశిపుడు ఎలా కోరుకున్నాడో అలాగే చావాల్సి వచ్చింది కదా? అదే విథంగా ఇక్కడ జయథ్రథుడు కూడా తన చావు ఎలా రావాలో తపస్సు చేసి మరీ సాథించుకున్నాడు. ఇదంతా దేనివల్ల? ద్రౌపదిని తన దాన్నిగా చేసుకుందామనే తుఛ్ఛమైన మరో కోరిక. ఈ మనసునీ, కోరికలనీ అదుపులో పెట్టుకున్న నాడు మనకి భగవంతుడు కనిపిస్తే ఏమడుగుతాం? కన్నప్ప రెండో కన్ను తీసి ఇవ్వడానికి సిథ్థపడుతుంటే శివుడు అడ్డుకుని అడుగుతాడు, “నన్ను దృష్టికోసం, కంటి చూపు కోసం అడగడానికి తపస్సు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నా గురించి కంటికి కన్ను ఇచ్చే భక్తుడవి నువ్వొక్కడవే, ఏం కావాలో కోరుకో,” అని. అప్పుడు కన్నప్ప అడిగినది చూస్తే వళ్ళు గగుర్పొడుస్తుంది, “నేనా, ఏం కావాలో అడిగేవాడిని? మీకు తోచినది, ఏమివ్వాలని ఉంటే అదే దయ చేయండి.”
మహావిష్ణువు కనిపించాక ధ్రువుడు కూడా అలాగే అడుగుతాడు, “అన్ని మాయా విశేషాలకీ కారణమైన మీ మనోహరమైన మోము అన్నివేళలా అలా చూస్తూ ఉండడం తప్ప మరో కోరికేం లేదు నాకు.” అలా అడిగితే భగవంతుడు ఏమిచ్చాడు వీళ్ళకి? శాశ్వతమైన కైలాస నివాసం, పథ్నాలుగు లోకాలూ నాశనమైనా ఎప్పటికీ నశించని థ్రువ పథం. అదే అసలు సిసలు భక్తితో కూడిన కోరికకీ, మామూలు కామంతో కోరిన కోరికలకీ వ్యత్యాసం.