పిచ్చాపాటీ కబుర్లు -- కీర్తిశేషులు గంగిశెట్టి ల.నా.
*కావ్యత్వం అంటే ఏమిటి!?*
మా మిత్రుడడిగారు,అదోలా చూస్తూ... ఆ చూపుకు అర్థం నాకెప్పటికీ బోధపడదు...అదే చెప్పాను,"నీ చూపు లాటిది" అని..
"ఆ చమత్కారం కట్టి పెట్టి సూటిగా చెప్పు!"
"చమత్కారం కట్టి పెడితే కావ్యత్వమే లేదు... సూటిగా చెప్పినా కావ్యత్వం రాదు.. నువ్విలా పరస్పరం అసంబద్ధంగా మాట్లాడితే ఏం చెప్పను??"
నా ప్రశ్నలకు ఏం చెప్పాలో తోచలేదు కామోసు, అదోలా చూసి, మౌనం వహించాడు..
“ ఓ రహస్యం చెబుతున్నా, విను! ...
.... పరస్పరం అసంబద్ధమైన విషయాలు తలెత్తినప్పుడు ఆవరించే మౌనాన్ని మాట్లాడింప చేస్తే , అదీ కావ్యత్వం!.." పరమ రహస్యం చెబుతున్నట్లుగా గొంతు తగ్గించి మంద్ర స్వరంలో మెల్లగా చెప్పాను..
ఈ మారూ అలానే చూశాడు కానీ, పళ్ళు బిగించటం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది..
"నువ్వలా పళ్ళు బిగించి కొరకొరా చూస్తే నేనేం చెప్పను!?... నేను చెప్పిన ప్రతి మాటా అక్షరశః సత్యమే!...కావాలంటే ఏ మహాకవినైనా అడిగిచూడు.."
"ఈ డొంకతిరుగుడు మాని సూటిగా అడిగినదానికి చెప్పవయ్యా బాబూ!".. ఆ చూపులో వాడి పెరగటమే కాదు, విసుగూ ప్రవేశించింది..
"విసుక్కోకు.. కాస్త తాపీగా ఆలోచించు...నువ్వు డొంకతిరుగుడు అన్నావు, మహామహుడు కుంతకుడు దాన్నే 'వక్రత' అన్నాడు.. వక్రోక్తి కవిత్వానికి ప్రాణమన్నాడు... సాయంకాలం అయింది... గూళ్ళను చేరటానికి 'యాంతి పక్షిణః' , పక్షులు పరుగెడుతున్నాయి –అంటే కవిత్వం ఏముంది? దాన్నే మరికాస్త మార్చి, మలిచి, మరో అందమైన భావం పరోక్షంలో స్ఫురించేలా వర్ణించు, అది కవిత్వమౌతుంది అన్నాడు ఆ మహాశాస్త్రకారుడు.. నువ్వేమో 'డొంకతిరుగుడు' అని కొట్టి పడేస్తున్నావు"
కుంతకుడి పేరు స్మరించిన ప్రభావమేమో , అనుకోకుండా నా గొంతులోనూ కాస్త గాంభీర్యం ప్రవేశించినట్లుంది..
"ఇంతకీ వర్ణిస్తే కవిత్వమౌతుందంటావ్.. వర్ణన ఉంటే చాలు కావ్యత్వం వస్తుందంటావు..." అతని గొంతులోనే కాదు, ఆ చూపులోనూ నిస్సహాయతే!
"అక్షరాలా!...
అయితే దేని వర్ణన!?
ఒక పరిచయమైన దానితో అపరిచయమైన దాన్ని... తెలిసిన దానితో తెలియని దాన్ని... వ్యక్తమైన దానితో అవ్యక్తాన్ని... అన్నిటి కంటే అవ్యక్తమైంది ఏమిటో తెలుసా?.. నేను దేవుడు అనను.. 'దేవుడు' నీ విశ్వాసం.. విశ్వాసానికి బాకాలూదితే కావ్యత్వం రాదు.. ఆ బాకాలు నీ అవ్యక్త భయాలకు, ఆశలకు గుర్తులు.. వాటిని వదిలెయ్... ఆ దేవుణ్ణి నువ్వు నమ్మినా నమ్మకున్నా, ఆయన ఇచ్చాడనుకొన్నా ఇవ్వలేదనుకొన్నా, ఈ జీవితం నువ్వనుభవించే వాస్తవం.. ఇవ్వాళ్టి జీవితమే నీకు తెలుసు. రేపటిది తెలియదు... ఇవ్వాళ్టి జీవితానికి వెనుక ఎందరి, ఎంతటి సమష్టి కృషి ఉందో, ఎంత సంకీర్ణత ఉందో కూడా నీకు తెలియదు... *జీవితానికంటే మించిన 'అవ్యక్తం' మరొకటి లేదు...* ఎక్కడికక్కడ తెలిసినట్లే ఉంటుంది, తెలియకుండా సాగుతుంటుంది... *వ్యక్తజీవనానుభవంతో, అవ్యక్త జీవితాన్ని వర్ణించటం లోనే ఉంది అసలు కావ్యత్వం*.. నీ జీవితంలో నీకే సంపూర్ణంగా తెలియని 'నువ్వు' ఉన్నావ్, నీ చుట్టూ సమాజం ఉంది, నీకు తెలియనిది ఇంకా ఏదో ఉంది... ఈ తెలిసిన దానితో ఆ తెలియని దాన్ని వర్ణించగలిగితే- అంటే సహజమైన రంగులతో చిత్రించ గలిగితే- అది కావ్యత్వం... అది ఒక్క వాక్యమైనా కావచ్చు, మహాభారతమంతైనా పెరగొచ్చు.. ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉండవచ్చు.. ఉండి తీరాలి, అప్పుడే అది కావ్యత్వ స్థాయికి వస్తుంది.. "
ఊపిరి తిప్పుకోటానికి ఆగాను...
అతను అదోలా చూశాడు.. ఈ మారు అతి సహజమైన నీలిమతో మెరిసిపోయే ఆకాశంలా చూశాడు.. ప్రశాంతంగా చూశాడు..
ఆ చూపులో చూపు కలిపి, గంభీరంగా, నిదానంగా, నొక్కి చెప్పాను," ఈ - 'చూపు'లోనే కావ్యత్వం! *కావ్యత్వం అంటే ఓ 'చూపు' -లోతుగా చూసే 'మన' చూపు!"*
― గంగిశెట్టి లనా ,12/5/24
ఓటుకుండలు – ఓటికుండలు -- విట్టుబాబు
అన్ని పార్టీలు - ఆ తానులో ముక్కలు
ఎన్ని పార్టీలైన - ఏమంట గొప్పలు
ఓట్ల పండుగ వేళ - కోట్లంట ఖర్చులు
ఆ పైన మననుండె - ఆ పైకము వసూలు
గెలిచింది ఒకచోట - నిలుచును మరొకచోట
మలుపెందు కంటె ఆ -కల పండునంతే!
పదవులాశలు చూసి - పచ్చనోట్లను చూసి
పార్టీలు మార్చాలి - పవరులను కూల్చాలి
పెట్రోలు ధరలంటె - ప్రీతి పార్టీలకి
ప్రతిపక్షమందుంటె - ప్రతిరోజు గొడవకి
అధికారమందితే - ఆ కతలు కంచికి
'ఆడ' కూలిన గాని - 'ఈడ' పైపైకి
ధర్మపన్నాలేమొ - తగునంటు చెప్తారు
తమదాక రాగానె - తల తిప్పి పోతారు
తమవారు చేసినవి - తగుగొప్పలంటారు
పెరవారు చేసినవి - పెనుతప్పులంటారు
మాటలేవైన మన(౦) -మో(ఓ)టుకుండలము
వారి దాహాలకు - బలిజంతువులము
మీట నీ చేతిలో - కోట తలుపులకు
ఓటేసి గెలిపించు – ఓటికుండలకు
నిన్నెవరు వింటారు -- దేవనపల్లి వీణావాణి
నిన్నెవరు వింటారు
ఉక్కపోతలో ఉన్నవాళ్ళకి
మాత్రం తెలిసే కుంపటి సెగ
జాలి గుండె మీద కరిగిపోయే
వెన్న పూసలాగా
రాత రాసి నిన్ను నువ్వు చూసుకోగలవు గానీ
ఉరికొయ్య చేసే పనికి వేలాడే దూరం ఒక్కటే లెక్క తప్ప
వేదనల బరువు కాదు
జారిపోయిన నిన్నలు, పగుళ్లు బారిన రేపటిల మధ్య నీరుగారి పోయే చిన్నమ్మా
వినడానికి గాలికి కూడా తీరిక లేదు
ఆకాశపు తరంగాల తీగల మీద అందరూ
తడిసి ముద్దయి చివికిన మనసులను
అంతర్జాలంలో ఆరబోసుకుంటున్న వారే
మనకు మనం కరువైన చోట
బతుకు మునగలేని నీళ్ళు లేని బావి,
మొదలు నీ లోపల ఉన్న నీకు నీ కథ చెప్పు
ఈద లేకపోయినా ఇసుమంత కన్నీరు
కారుస్తది కుప్ప పోసుకున్న గతం దిబ్బ మీద మొగలి రేకుల
రేపు కోసం కొత్త బాటల ఎరువేస్తది
ఉందిలే ఒక కొత్త రోజు
ఉంటుందిలే ఒక మంచి తావు
కన్నెప్పుడు ఎనక్కు చూడదు
ఉన్నదెప్పుడు ఎతుకందే ఎదురుపడదు
ఉగ్గబట్టుకున్న ఊపిరి
ప్రాణం పొయ్యకుండా మర్లిపోదు
ఎదురు చూస్తూ .... -- స్వాతి శ్రీపాద
మసక వెలుతుర్లోనే కంటిపాపలు విప్పార్చుకుని
ఉదయ రాగాలు స్వరంలోకి వంపుకుందామనుకుంటాను
కాని చుట్టూ దట్టంగా అలుముకున్న కంటిపొరలను తాకలేక
పెదవులను బిగబట్టి ముని వేళ్ళ మీద వెనక్కు జారుకుంటాయి.
ఎన్ని ట్యూబ్లైట్లు వెలిగించుకున్నా చిటికెడు వెలుతురు కూడా సోకదు
కిటికీ పక్కనే వాలి ఒకదాన్నొకటి అదుముకున్న తెల్లపావురాల
ముక్కు కొసల నుండి జారిపడే మాట ముత్యాలు ఏరుకుందామనుకుంటానా
రెక్కల మెరుపుల్తో తిప్పికొట్టే జలతారు వెలుతురుకు
కంటికొసల్లో మంకెన పూలు వికసిస్తాయి.
నిన్నమొన్నటిదాకా వీర విహారం చేసిన మహమ్మారి
శకలాలు శకలాలుగా విస్తరించి
ఇల్లంతా అక్షరాల గుంపులై పరచుకున్న ఆక్రోశాలు
వాడి పోయి, రాలిపోయి ఎండి ఒరుగులై
గలగలలు కురుస్తున్నాయి.
విశ్రాంతికి అలవాటు పడిన మనశ్శరీరాలు
మాటిమాటికీ
మెత్తని ఊహల మీద తలనానించి
కనిపించని చుక్కల లెక్కలో మునిగి తేలాలని
పలవరిస్తున్నాయి
అర్ధం పర్ధం లేని పదాలను పుక్కిలించి
పనీ పాటా లేని దివారాత్రాల మీద ఉమ్మేసిన క్షణాలు
ఒక్కొక్కటిగా నడిచి వెళ్ళి ఉండచుట్టుకు
డస్ట్ బిన్ లో దూకి తనువు చాలిస్తున్నాయి.
మళ్ళీ వెనక్కు వెళ్దామని ఒళ్ళువిరుచుకున్న ఊహలకు
ప్రాణవాయువు అందక
ఆవులింతల్లోనే అలిసిసొలసి
బీడు వారిన గరిక పొలాలవుతున్నాయి
వేడి వేడిగా పొగలు విసిరే కాఫీ కప్పులూ
జారిపోతున్న కాశ్మీరీ శాలువాల మధ్య
చలికాచుకుంటున్న పడమటి వయసు
ఎన్నేళ్ళుగా ఎదురుచూపు
ఓ చక్కటి భావాన్ని బావుటాలా వెలిగించాలని.
ఎవరిది గెలుపో ఎవరి కెరుక? -- డా. రమణ యశస్వి
ఎవరిది గెలుపో ఎవరి కెరుక?
చిలుక జోస్యం జోలికెళ్లకు
ఇసుక రేణువు కినుక దేనికో
తెలుసుకుంటే చాలునంటా
ఎవరిది గెలుపో ఎవరి కెరుక?
నాడీ జోస్యం కాడికెళ్లకు
కాడిపట్టిన మేటి రైతు
నడిగిచూస్తే చాలునంటా
ఎవరిది గెలుపో ఎవరి కెరుక?
గ్రహస్థితులు అనుగ్రహం చూడకు
గృహస్త్రీల స్థితి గతుల
ఆహాకారాలు చూస్తే చాలునంటా
ఎవరిది గెలుపో ఎవరి కెరుక?
యూ ట్యూబుల ఊసులు నమ్మకు
ఊరు విడిచిన వీర వలస
బతుకులు చూస్తే చాలునంటా
ఎవరిది గెలుపో ఎవరి కెరుక?
సర్వేల అంకెల రంకెలు చూడకు
సర్వేజనా సుఖినోభవంతు
భరోసా నిలబెట్టుకుంటే చాలునంటా
ఎవరిది గెలుపో ఎవరి కెరుక?
పాపికొండల అంద(ల)o చూడకు
పాపము తలవని అనకొండలు
పాపపు పనులను పరికిస్తే చాలునంటా