ఒకే ప్రకృతి
మూడు కృతులు
ఒకే మూలం
మూడు ఆవృతులు
ఒకే లోకం
మూడుఆవరణలు
ఒకే మనిషి
మూడుఅంతరాలు
ఒకే అమ్మ మూడురూపాంతరాలు
ఒకే అయ్య
మూడు భావాంతరాలు
ఒకే మాట
మూడు అర్థాoతరాలు
ప్రపంచమంతా మూడు మూడుగా నిష్పన్నాలు
కూడి మారి మూడే విస్ఫోటనాలు
విశ్వలయ త్రయీ సూత్రాలు...
అటంచున – మారనిది
ఇటంచున – మారుతున్నది
నడుమ-మార్పును సూత్రీకరిస్తున్నది
అటంచున జ్ఞేయం, నీవు
ఇటంచున జ్ఞాత, నేను
నడుమ మనల్ని కలిపి నిలిపే సూత్రం , నువ్వే నేనన్నజ్ఞానం ...
నేస్తమా! నువ్వు అటా? ఇటా?
ఎటైనా నడుమ నెయ్యం మారకుంటే చాలుగా!!
నిశ్చలమైపోయిన
బ్రతుకులో యిప్పుడు జీవించిన క్షణాలు వెతుక్కుంటున్నారు
నిశ్శబ్దం యింత నిర్వీర్యం చేస్తుందా
అనుకుంటూ శబ్దరహిత సమాజాన్ని నిరసిస్తున్నారు
ఎడారిని తలపిస్తున్న నగర వీధులన్నీ
ఒకప్పుడు నదీప్రవాహాల్లా పారేవి
పచ్చని పొలం లాంటి పల్లెలు
భయం గుప్పిటలో నెర్రెలు బారిన నేలల్లా వున్నాయి
రేపటి వెలుగును ఆశిస్తూ జనం
కలత నిద్రలో కలవరపడుతున్నారు
కల్మషాలు లేని చిరునవ్వుల ప్రపంచం
యిప్పుడు తాడుని చూసినా పామనుకుంటుంది
గాయాలని ప్రేమించిన మనిషి
అనుమానంతో అసహనం కుమ్మరిస్తున్నారు
స్వార్ధ నదిని యీది యీది
అలసి నిర్బంధంలో నింపాది అయ్యాక
యిప్పుడు దానం, ధర్మం గుర్తుకొస్తున్నాయి
మనసులు విప్పారుకున్నాక మమతలు చిగురిస్తున్నాయి
క్రిమి భయమో, వ్యాధి భయమో
నేడు గది కుటుంబాన్ని రెక్కల్లో పొదుపుకుని
మూల కూర్చున్న దిగులుపక్షిలా వుంది
బలవంతులయిన మనుషులు యిప్పుడు
క్రిమిని బలహీన పరచడం ఎలాగో
మేధోమధనం చేస్తున్నారు..
ఎలాగోలా యుద్దం ముగిశాక
ఆకలి కేకలతో అర్రులు చాచని ఆకాశం కోసం
మార్గాలు అన్వేషించడంలో మునిగారు
కరోనా మనకిప్పుడు ఏ సమాధానాలు భోదించలేదు
మనిషి పునరుజ్జీవనం కావడానికి
అనేకానేక ప్రశ్నలు మాత్రమే రేపింది..!!
ఈ విశాల విశ్వంలో
ఎవరు ఎక్కువ?
ఎవరు తక్కువ?
ఒక ఇంటి నిర్మాణంలో
ఇటుక ... ఇనుము...ఇసుక... సిమెంటు...
కనబడకుండా వీటిలో కలిసి,
తాను ఇంకిపోయి వీటిని
ఇంటిగా నిలబెట్టిన నీరు....
వీటిలో ఏది గొప్ప?
వేటి గొప్పదనం వాటిది.
ఈ జగత్తులో?
ఎవరి గొప్పదనం వాళ్ళది.
కనుక..
నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.
నువ్వే గొప్పనీ భావించకు.
ఇంటికి ఇటుకవి కా.
ఆత్మవిశ్వాసానికి ఉచ్ఛ్వాసవు కా.
విశ్వానికి నిఃశ్వాసవు కా.
నీ గొప్పతనం ఎప్పుడూ నీదే.
అన్నీ కలిస్తేనే ఇల్లు.
అందరూ కలిస్తేనే విశ్వం.
1. కష్ట సుఖములన్ని కాలాని కెఱుకరా
ఎప్పు డైన వచ్చు నెదను తొలచు
ఓర్పు తోడ నీవు నేర్పు తోడ గెలువు
ఆలకించుమయ్య అమృత వాక్కు.
2. మనిషి నైజ మెంతొ మనకు తెలియ దయ్య
చూసి చూడ గానె చెప్ప లేము
సoద్ర మంత లోతు స గటు మనిషి మది!
ఆలకించు మయ్య అమృత వాక్కు.
3. కొవ్వు కరగ దయ్య కొంత గూడ నెపుడు
అహము తగ్గు చూడు మాత్మ లోన
ఉన్న నీవు నెపుడు ఉపవాస దీక్షలో
ఆలకించు మయ్య అమృత వాక్కు!
4. జపము తపము చేయ జనులకెoతొను మేలు
ధ్యాన మార్గ మేర దారి చూపు
భక్తి కలిగి యున్న శక్తి తప్పక వచ్చు
ఆల కించు మయ్య అమృత వాక్కు.
5. మంచి మాట విన్న మనసు కరిగి పోవు
కష్ట మైన మాట కష్ట పెట్టు
దైవ ధ్యాన మేర దైవాన్ని తలపించు
ఆలకిoచు మయ్య అమృత వాక్కు.