Menu Close
prabharavi

మనుషులకే కాదు
దేవుళ్ళకూ పట్టిస్తారు,
వాళ్ళకు మాత్రం
చెమట పట్టదు.

“అండర్ గ్రౌండు”లో
గడ్డ కట్టింది చల్లదనం,
పగలగొట్టి పంచితే
ప్రపంచంలో వడగాలే ఉండదు.

ఎవరెవరికో
పురస్కారా లిచ్చారు
“ప్రభుత్వం”కు పాలు పట్టే
తాగుబోతుల్ని మరిచారు.

సంపదలు చేపలు
ప్రవాహంలో పరిమళిస్తాయి
లాకర్లలో పెడితే
కంపు గొడతాయి.

పాత్రలో అజ్ఞానం నింపుకొని
మూత పెట్టుకున్నావు
జ్ఞాన ప్రవాహంలో
మునిగి తేలుతున్నా వ్యర్ధమే.

అమెరికానుండి
కొడు కొచ్చేసరికి
సూర్యుడు
ఇంట్లో కొచ్చినట్లుంది.

తెలుగు తల్లి
“ప్రభుత్వం” ఆసుపత్రిలో శవం,
“తెలుగు దేశం’ కొడుకులు
వదిలేసారు.

పగలు రాత్రి
శత్రువులు కాదు,
ఒకరి నొకరు నెత్తిమీద
మోసుకొంటూ తిరుగుతారు.

వడగాలి అధికార పక్షం
సుడిగాలి ప్రతిపక్షం
మంచి గాలి కోసం
ప్రజా పక్షం.

చీకటి చేతిలో
సూర్యుడిని పెట్టా రేంటి!
చీకటిలో కూడా
వెలుతురు నింపాలని.

వర్తమానం
“వైర్ లెస్ “ కాల మట!
“శ్రమ” లేకుండానే
రమ కావా లట!

రసాయన లన్నీ
రహస్యంగా చేరాయి,
నది ఎప్పుడో
హథాత్తుగా మండిపోతుంది.

తాగితేనే
దుర్మార్గం నడిచేది,
తాగకపోతే
ప్రభుత్వం నడవ దట!

నన్నే ఎక్కించండని
ఒకటే కాకి గోల,
కుర్చీకి కడుపు మంట
దమ్ము మొగుడు లేక.

ఎన్నికలను ఎపుడైనా
ఆహ్వానిస్తూనే ఓటరు,
జన్మలో ఒకసారైనా
గెలిచి చూసుకోవాలని.

నట దర్శక నిర్మాతలు
మానవులో దానవులో,
కవులు ఋషులు
“క్యారక్టు” రుండాలి.

క్రూర మృగాలు పెరుగుతుంటే
తుపాకు లివ్వాలి
పువ్వులు ఆకులు
పంచుతున్నా రేంటి కవులు!

నా దేశంలో
అన్నం బిల్లుల కన్నా
“మందు” బిల్లులు,
మందుల బిల్లులు మిన్న

మేధావులంతా
గళం విప్పాలట,
ఇంకెక్క డున్నారు-
తొక్కేశారుగా.

మళ్ళీ పాల కుండ
నాదే అంటూ గోల,
ఇచ్చిన కుండ పాలు
ఎవరికీ పంచారో తెలియదు.

Posted in November 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!