Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

ప్రొద్దు తిరుగుడు పువ్వు

Sunflower

ప్రొద్దు తిరుగుడు పువ్వు నే సూర్యకాంతం పువ్వు, సన్ ఫ్లవర్ అని అంటారు.

పొద్దునుబట్టి అంటే సూర్యుని గమనాన్ని బట్టి ఈ పూవు తన ముఖాన్ని త్రిప్పుతుంటుంది. అందుకే దీనికి పొద్దుతిరుగుడు పువ్వు అనీ, సూర్య కాంతి నిబట్టి ముఖాన్ని మార్చుతుందటాన సూర్యకాంతం పూవు అనీ పేరుగాంచింది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయీ తన రాజ్యానికి చిహ్నంగా ప్రొద్దుతిరుగుడు పువ్వును పెట్టుకున్నాడు. అందుచేతే ఆయన ‘సన్ కింగ్‘ అని పిలువబడేవాడు. ప్రముఖ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గోఘ్ సూర్యకాంతి పువ్వుల చిత్రకారునిగా ప్రసిధ్ధి పొందాడు.

పొద్దుతిరుగుడు పూలను హిందీ, ఒరియాల్లో సూరజ్‌ముఖి అనీ, తమిళం, కన్నడ, మళయాళాల్లో సూర్యకాంతి అనీ, గుజరాతి, పంజాబీల్లో సూరజ్ మీఖి అనీ అంటారు. పొద్దుతిరుగుడు పువ్వుని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఎప్పుడూ సూర్యుని వైపే తలతిప్పి ఉన్నట్లు తెలుస్తుంది. సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం వరకూ సూర్యుని చూస్తూ ఉంటుంది.

‘పొద్దుతిరుగుడు పూవు లా రోజంతా తిరుగుతూనే ఉంటావు’ అంటారు రోజంతా శ్రమచేసే వారిని చూసి.

నిజానికి పొద్దుతిరుగుడు పూవు ఎంతో అందంగా అరచేయంత ఉండి తన నిండు పసుపు పచ్చని రంగుతో కళ్ళకూ, మనస్సుకూ సంతోషాన్నిస్తుంది కదా! గాలికి తల ఊపే ఆ పూవు మనస్సుకు ఊరటనిచ్చి ఆనందంకలిగిస్తుంది.

పొద్దుతిరుగుడు పూవు మీద మనసు పారేసుకున్న సూర్యుని ప్రేమకధ:

గ్రీకులు సూర్యుడిని ‘అపోలో’ అని పిలుస్తారు. సూర్యుడు వెలిగి పోయే కాంతితో, మెరిసిపోతుంటాడుకదా! ఆయన అందానికి  'కైట్లీ' అనే వనదేవత ఆయన్ని ప్రేమించిందట!. ఆ విషయాన్ని ఆమె చెప్పగా, సూర్యుడు ఆమె ప్రేమను అంగీకరించలేదట. అందుకు కారణం ఆయన మరో వైపు మనసు పారేసుకోడమే! సూర్యుడు జలదేవుని కుమార్తె ఐన 'డఫ్నే' ను ప్రేమించడమేనట! తన ప్రేమ విషయం ఆయన 'డఫ్నే’ కు తెలుపగా, ఆమె ఆయన ప్రేమను అంగీకరించలేదుట. ఒన్ వే లవ్ లా ఉందీ కధ. పదేపదే తన ప్రేమ విషయమై సూర్యుడు - డఫ్నేను అడుగుతుండగా, ఆమె ఉత్తమ కుమార్తె కనుక తన తండ్రి జలదేవునితో మొర పెట్టుకుందిట! జలదేవుడు తన కూతుర్ని సూర్యుని నుండి రక్షించుకోను ఆమెను ఒక మొక్కగా చేశాడుట!. దీంతో సూర్యుని మనసు చాలా బాధ పడిందిట. ఐతే సూర్యునే ప్రేమిస్తున్న కైట్లీ, సూర్యుడి కోసం 9 రోజులపాటు అన్న పానీయాలు మానేసి నిరాహారదీక్ష వహించి, ఒకచోట స్థిరంగా కూర్చుని సూర్యుడు ఉదయించి మరలా సాయంకాలం అస్తమించేవరకూ  ఆయన్ని చూస్తూ ఉండేదట. అలా కైట్లీ పువ్వుగా మారిపోయింది. పువ్వుగా మారిన కైట్లీ ప్రతిరోజు తాను ప్రేమించిన సూర్యుడిని చూస్తూ ఉంటుందట .అందుకే  ఆ పువ్వునే మనం సన్ ఫ్లవర్ , సూర్యకాంతి పూవు అని పిలుస్తున్నాం.

సరే ఇది కధ. మరి అసలు సూర్యకాంతం పూవు ఇలా సూర్యకాంతివైపే తిరగను సైన్స్ ఆధారంగా ఒక సమాచారముంది.

సూర్యకాంతం పూవు అదే పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపే తిరగడానికి కారణం ఆ మొక్కలలో ఉండే 'ఫోటోట్రాఫిజమే' కారణం. సాధారణంగా మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి అవసరం. మొక్కల పెరుగుదలతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించే చర్యను ఫోటోట్రాఫిజమ్ అంటారు.

సన్ ఫ్లవర్ మొక్కలో ఉన్న అమినో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు విచ్చిన్నమై  ఆక్సిన్ అనే హార్మోన్ గా ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకు సహాయ పడుతుంది. ఈ ఆక్సిన్ హార్మోన్  కారణంగా పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది. సూర్యరశ్మి పడని భాగంలో ఆక్సిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి ఔతుంది. పువ్వు ఎప్పుడైతే సూర్యుడి వైపు తిరుగుతుందో దాని వెనుక భాగంలోని నీడలో ఆక్సిన్ ఉత్పత్తి ఔతుంది. దానివలన ఆ భాగం త్వరగా పెరిగి, పువ్వు కదులుతుంది. నీడ ఉన్నవైపు పువ్వు వెనుక భాగం కదిలితే, పువ్వు ముందుభాగంసూర్యు డి వైపుకు కదులుతుంది. ఈ కారణంగానే పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూసూర్యుడి పొద్దు వైపుకు తిరుగుతూ సూర్యాభి ముఖంగా ఉంటుంది. అదన్న మాట.

Sunflower Seeds

ఇది ఒక్క సంవత్సరం మాత్రమే జీవించే మొక్క. ఒకమారు పూలుపూసి గింజలు రాగానే ఇది తిరిగి పుష్పించనందున దీన్ని తీసేస్తారు. మరుసటి  సంవత్సరం మరలా నాటుకోవాలి.

సోయా బీన్స్, వేరుశనగ లాగానే ఈ గింజల నుండి తీసిన నూనెను వంటకు వాడుతారు. దీన్లో పుష్కలంగా ప్రోటీన్లతోపాటు కాల్షియం కూడా లభిస్తుంది. విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని కొలిమిలోనూ, బాయిలర్లలోనూ ఇంధనంగా వాడతారు. దీని పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన పశువులకు బలమైన ఆహారం గా వినియోగపడుతుంది. ఈ ప్రొద్దుతిరుగుడు ఔషధాల తయారీలోనూ, రంగులు వేయడానికీ కూడా ఉపయోగిస్తారు.

1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలను స్పెయిన్కు తీసుకుపోయారు. అక్కడి నుంచి ఈ విత్తనం మిగిలిన ఐరోపా, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు పయనించింది.

Posted in November 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!