Menu Close
మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్

Surya Allamraju

-- సూర్య అల్లంరాజు

ఆ రోజు ఎందుకో చాలా సరదాగా వుంది. శ్రీవారి గుండెల మీద తలపెట్టుకొని పడుకొని ఉన్నాను. మనస్సు  గతంలోకి పోయింది. ఆఫీసులో కూర్చోని మెయిల్ చూస్తుంటే నాపేరున ఒక ఉత్తరం చూసి ఎవరు రాశారబ్బా  అని ఓపెన్ చేశాను. అది నా ఆంటీ అమెరికానుండి రాసిన ఉత్తరం. తాను వంటరిగా ఉన్నానని, తన పిల్లలు  ఎవరు తనను చూడటం లేదని, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నానని, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానని,   తన దగ్గరకు వచ్చేయమని, తన తదనంతరం తన ఆస్తిపాస్తులన్నీ నాకే రాసేస్తానని, తనకు సాయంగా ఉండమని. నచ్చక పోతే వెళ్ళిపోదువుగాని అని రాసింది. ఆమెని నేను నా పదవ ఏట రైల్వే స్టేషన్ లో చూశాను. స్టూడెంట్ గా పై చదువులకి అమెరికా వెళ్ళి అక్కడే పెళ్లిచేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయిందని మా పేరెంట్స్ చెప్పగా వినడమే కాని తరువాత చూడలేదు. అప్పటికే తల్లిదండ్రులని  కోల్పోయి, తమ్ముళ్ళని చెల్లిళ్ళని పెంచి, పెద్దచేసి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి, పురుళ్లు పోసి ఉద్యోగంతో  విసిగి, జీవితంలో ఆశలు కోల్పోయి, నాలుగు పదులు దాటినా పెళ్లి లేక ఒంటరిగా ఉన్న నాకు ఆ లేఖ ఊరట  కలిగించింది. 25 సంవత్సరాలకే తల్లిదండ్రులను కోల్పోయి, బరువు బాధ్యతలు భుజాన వేసుకున్న నాకు ఉద్యోగం వదిలి హాయిగా దూరంగా ఆంటీకి సేవలుచేస్తూ అమెరికా వెళ్లడానికి అంగీకరించాను. అనకూడనిది ఏదేనా జరిగినట్లైతే, ఆమె నుండి వచ్చిన డబ్బుతో ఆమె పేరున అనాధాశ్రమం ఇండియాలో నిర్మించాలని  ఏవేవో ఊహించుకొని ఆరు నెలలు శలవు తీసుకుని అమెరికా వచ్చాను.

వచ్చిన మరునాడే ఆంటితో గొడవ జుట్టు కత్తిరించుకోమని. నేనెప్పుడు జుట్టు కత్తిరించుకోలేదు. ఆ మరునాడు  ఆమె ఒక డ్రస్ ఇచ్చింది వేసుకోమని. అది మినీ స్కర్ట్ అండ్ బ్లౌస్. ఇంత వయస్సులో ఆ బట్టలు వేసుకోవాలా? ఎప్పుడూ పంజాబీ డ్రస్ కూడా వేసుకోలేదు. అలాంటిది మినీ స్కర్ట్ బ్లౌస్ వేసుకోవడమా సిగ్గుతో చచ్చిపోయాను. దానికోసం మళ్ళీ గొడవ. ప్రతి విషయానికి గొడవే. ఆమె రెండు మోకాళ్ళ దగ్గర రాడ్స్ పెట్టారుట. మోకాళ్లు వంగవు. కర్ర పట్టుకొని నడుస్తుంది. అది నాకు వరం అయింది. ఆమె మాట వినకపోయినపుడు, ఆమెకి కోపం వచ్చి కర్ర ఎత్తేది కొట్టడానికి. నేను చిన్నపిల్లలాగా పరిగెత్తేదాన్ని. అప్పుడే అనుకున్నాను ఆమె నోటిదురుసుకి పిల్లలు ఆమెను వదిలేశారని. ఇలా గొడవ పడుతూ ఊరుకాని ఊరిలో ఎలా ఉండాలి. ఆమెకి సేవ చెయ్యడానికి వచ్చాను. ఇలా గొడవలు పెడుతూ, తిట్టుతూ, కొట్టుతూ వుంటే ఎవరు వుంటారు. ఇక లాభం లేదు ఇండియా వెళ్లిపోవాలి అని వచ్చిన మూడవ రోజే ఆంటీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేను పంపిచెయ్యమని. కాలితో తాపు తన్నింది ‘ముండకాన, ఇంతడబ్బుపెట్టి నిన్ను తెచ్చింది పంపడానికి కాదే. చెప్పినమాట విను, లేకపోతే చంపేస్తాను.’ అని బెదిరించింది. బందీనైపోయాను. ఒక రోజు నిజంగానే నా పీక నులిపింది. గట్టిగా రెండుచేతులతో తోసేశాను. గదిలోకి పరిగెత్తి తలుపువేసుకొని వెంటనే  911 కి కాల్ చేశాను. పోలీసులు వచ్చారు. ఆంటీ తో మాట్లాడేరు. నా గది తలుపు తట్టారు. భయంగా తలుపు తీశాను. నా మెడమీద ఎర్రని చేతి వేళ్ళ గుర్తులని చూశారు. ఆంటీ కి వార్నింగ్ ఇచ్చేరు, మళ్ళీ గొడవజరిగితే పిలవమని నాకు చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజంతా గదిలోనే గడియ పెట్టుకుని వున్నాను. భోజనం లేదు, నిద్రలేదు. ఏమి చెయ్యాలో తెలియలేదు. బాధతో కుమిలి పోయాను. ఉద్యోగంలో శలవు పెట్టుకొని వచ్చాను.  వెళ్లిపోదామంటే పంపనంటుంది. నా అంతట నేనే వెళ్లిపోవాలంటే అంత డబ్బు ఎక్కడనుండి తేవాలి. ఏడవని రోజు లేదు. భగవంతుడా నన్నెందుకు ఇక్కడకు తెచ్చావయ్యా. నేనేం పాపం చేశాను. ఎంత ఆశతో వచ్చేను.    ఆమె ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఇక లాభం లేదని ఆమె లేని సమయంలో ఉద్యోగం వెతకడం ఆరంభించేను. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. వెళ్లని చోటు లేదు. కొంతమంది జాబ్స్ లేవన్నారు, కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చేరు, కొంతమంది మళ్ళీ రమ్మన్నారు.

ఒకనాడు ఒక స్కూల్ కి వెళ్ళాను. ఏదైన ఉద్యోగం ఇమ్మని బ్రతిమాలేను. నా కష్టాలు చెప్పుకున్నాను.    కాస్త డబ్బు సంపాదిస్తే ఇండియా వెళ్లిపోతానని చెప్పాను. వాళ్ళు నా మీద దయతలచి, ఉద్యోగం ఇవ్వలేముగాని సహాయం చేస్తామని ఒక సంస్థ కి ఫోన్ చేసి నన్ను మాట్లాడమని, వాళ్ళు నాకు సాయం చేస్తారని చెప్పారు. వాళ్ళతో మాట్లాడేను. వాళ్ళు నా లగేజ్ తో రెడీగా వుండమని టాక్సీ పంపిస్తాము వచ్చేయ్యమని నా చిరునామా తీసుకున్నారు. ఒకసారి బయట అడుగుపెడితే మళ్ళీ వెనక్కి వెళ్లలేను.   నిజంగా మీరు సాయం చేస్తారా అని అడిగితే చేస్తామన్నారు. అంతే ఇంటికి వచ్చి నా సూట్కేసు తో రెడీగా వున్నాను. కేబ్ వచ్చింది. కిటికీలోనుంచి చూశాను. చేతులు వూపాను. డ్రైవర్  చూశాడు. వచ్చి నా సూట్కేసు తీసుకువెళ్లాడు. భయం భయం తో అటు ఇటు చూస్తూ గబుక్కున కేబ్ లో కూర్చున్నాను. ఏదో హోటల్ దగ్గర ఆపాడు. అక్కడ ఒకామె నాకోసం ఎదురు చూస్తూవుంది. ఆమె సోషల్ వర్కర్ అట. నన్ను లోపలికి తీసుకువెళ్లి ఒక రూమ్ లో వుంచింది. ఆకలి దంచేస్తుంది. ఆమె ఒక nutrition బార్ ఒక చిన్న ఆరెంజ్ జ్యూస్ బాటిల్ ఇచ్చి "don’t worry, we will take care of you. I will see you in the evening” అని చెప్పి వెళ్లిపోయింది. ఇల్లు వదిలేశానే కానీ ఎలావుంటానో ఎక్కడవుంటానో ఎన్నాళ్లు వుంటానో ఏమీ తెలియక చాలా భయపడిపోయాను. ఏడవడం తప్ప మరేమీ చేయలేక పోయాను. భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

ఆ మరునాడు ఆమె నన్ను ఒక ఇంటికి తీసుకువెళ్లింది. అది ఒక షెల్టర్ అట. ఆ ఇంటిలో చాలామంది నా లాంటి వారు ఉన్నారు. అయితే అందరూ 20 నుండి 30 సంవత్సరాల్లోపు వాళ్లే. నేనే పెద్ద దాన్ని. అది ఒక నరకం. నేను పూర్తిగా శాకాహారిని. అక్కడకి ఫుడ్ బట్టలు అన్నీ ఉచితంగా వస్తాయిట. దయామయులు డొనేషన్స్ ఇస్తారుట. షెల్టర్ లో ఎక్కడపడితే అక్కడ ఫుడ్, మీట్, పళ్ళు అన్నీ చిందర వందర గా పడేసివున్నాయి. తేరగా వచ్చిన ఆహారం, ఎవరికీ ఖాతరు లేదు. అక్కడ వున్నవారికి ఆహార పదార్ధాలు కొనుక్కునేందుకు ఫుడ్ స్టాంప్స్ మరియు బస్ లో వెళ్లడానికి టోకెన్స్ఇస్తారుట. కానీ నాకేమీ ఇవ్వలేదు.  అడిగితే నేను అమెరికన్ సిటిజెన్ కాదు కాబట్టి ఇవ్వరు అన్నారు. నాకు చాలా ఆశ్చర్య మేసింది. ఏడవడం తప్ప చేసేది ఏమి లేదు. పాపం వారిలో ఒకరు ఇద్దరు నాపై జాలి పడి వాళ్ళ ఫుడ్ స్టాంప్స్ తో అప్పుడప్పుడు ఏవైనా కొనుక్కోమని చెప్పారు. నేను పాలు అటుకులు కొనుక్కునేదాన్ని. అటుకులు నీళ్ళళ్లో నానపెట్టుకొని, పాలల్లో నానపెట్టుకొని తినేదాన్ని. అలా ఒక నెల అటుకులు, పాలు, నీళ్ళ తోనే బతికాను. అదీ రోజుకి ఒకసారే తినేదాన్ని. రోజుకి రెండు మూడు మైల్స్ నడకతోనే అన్నిచోట్లకి పని కోసం తిరిగేదాన్ని.    భగవంతుని దయవల్ల ఒక చిన్న జాబ్ దొరికింది. ఏదైనా వండుకుందామన్న స్టౌ క్లీన్ గా వుండేది కాదు. క్లీన్ చెయ్యమంటే నన్నే క్లీన్ చేసుకోమనేవారు. అందరు నాన్ వెజిటేరియన్స్. ఎక్కడపడితే అక్కడ మీట్ రసం (gravy)తో స్టౌ చెత్తగా వుండేది. నేను క్లీన్ చెయ్యలేక  సీరియల్స్, బ్రడ్, బాగేల్, మఫిన్స్ అలా డ్రై ఫుడ్ తినేదాన్ని. అలా మరో 3 నెలలు గడిచాయి. ఈ లోపల లైబ్రరి లో జాబ్ దొరికింది. గంటకి $5 చొప్పున వారానికి 12 గంటలు. అప్పుడు షెల్టర్ వాళ్ళు నాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చారు. దాన్ని ఎఫిషియెన్సీ అంటారుట. ఒక్క గదే. అందులోనే ఒక పక్క బాత్రూమ్, ఇంకోపక్క కిచెన్, లివింగ్ రూమ్, బెడ్రూం అన్నీ ఆ గది లోనే. దానికి నా జీతం లో 30% అద్దె ఇవ్వాలన్నారు. నాకు చాలా హేపి అనిపించింది. ఎందుకంటే ఆగది (ఆ ఇల్లు) నాకే సొంతం. అందులో వున్నవన్ని నావే. వంట చేసుకోవడం ఆరంభించేను. కడుపునిండా తినగలిగేను. కొన్ని నెలలు గడిచాయి. లైబ్రరీలో ఇంకో డిపార్ట్మెంట్ లో(processing section) మరి కొన్ని గంటల జాబ్ సంపాదించేను. పార్ట్ టైమ్ వల్ల మెడికల్ ఫెసిలిటీస్ లేవు. కానీ రెండు పూటలా తినగలుగు తున్నాను. మూడు సంవత్సరాలు పార్ట్ టైమ్ గానే పనిచేశాను. ఆ మూడు సంవత్సరాలు అక్కడే షెల్టర్  లోనే వున్నాను.

అంతవరకు ఇండియాలో నా జాబ్ తో correspondence లేక అక్కడ నుండి వచ్చిన లెటర్స్ మా ఆంటీ అడ్రస్ కే రావడం వల్ల నాకు ఏమి తెలియకపోవడం వల్ల, నా నుండి ఏమి జవాబు లేనందున వాళ్ళు నన్ను జాబ్ నుండి తీసేశారు. షెల్టర్ లో నా విషయాలు, నేను ఎక్కడవున్నది ఎవరికి చెప్పకూడదు అని చెప్పడంవల్ల నేను ఎవ్వరికీ నా విషయాలు చెప్పలేదు.

ఇండియాకి వెళ్లాలంటే, అక్కడ జాబ్ లేదు. నాకు తల్లి దండ్రులు లేరు. పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఎవరు చూస్తారు నన్ను. సిస్టర్స్ వున్నారు కానీ వాళ్లు వాళ్ళ వాళ్ళ సంసారాలతో బిజీ గా ఉంటారు. ఎవరు ఎన్నాళ్లు చూస్తారు. స్వంత పిల్లలే తల్లి దండ్రులను చూడని ఈరోజుల్లో సిస్టర్ ని నన్నెవరు చూస్తారు, ఎన్నాళ్లు చూస్తారు. అందుకే ఇక్కడే వుండదలచుకున్నాను.

ఈలోపు ఫుల్ టైమ్ జాబ్ దొరికింది. నా జీవితం మళ్ళీ కొత్త మలుపు తిరిగింది. నాకు ముందుగానే గ్రీన్ కార్డు ఉన్నందున కాథలిక్ ఛారిటీస్ ద్వారా అమెరికా పౌరసత్వానికి అప్లికేషను పెట్టుకొన్నాను. అది రావడానికి మరో సంవత్సరం పట్టవచ్చు.

నెమ్మదిగా షెల్టర్ ని వదిలి అద్దెకి సింగల్ బెడ్ రూమ్ ఇల్లు తీసుకున్నాను. నా జాబ్ చేసే సంస్థ లో ఒకాయనతో పరిచయమైంది. ఆయన ఒక రోజు ఎక్కడికో తీసుకువెళతానని నన్ను రమ్మన్నారు. ఛీ, నేనెందుకు మీతో వస్తాను అన్నాను. It’s ok it’s ok. Just I am asking, అని తనరూమ్ కి వెళ్ళిపోయారు.   ఆ విషయం నేను ఒక కొలీగ్ తో మాట్లాడితే, ఆమె that is called dating. Don’t refuse. Go…go he is a very nice man అని చెప్పింది. అప్పటినుండి నేను ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. పెళ్లి లేకుండా ఆయనతో ఎక్కడికి వెళ్లదలచుకోలేదు. ఆయన నన్ను ఇష్టపడ్డారు. ఇంత వయస్సులో పెళ్ళా?  ఆలోచించాను. నాకు ఒక తోడుకావలనిపించింది. నా సిస్టర్స్ తో మాట్లాడేను. వాళ్లందరు మంచివాడైతే పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చేరు. ఆయన గురించి ఆఫీసులో ఎంక్వయిరీ చేస్తే అందరూ ఆయన చాలా చాలా మంచివారని, ఎంతమందో ఆయనని కావాలనుకుంటున్నారని, కానీ ఆయన ఎవ్వరికీ లొంగడం లేదని చెప్పారు. సరే ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలని నిర్ణయించుకొన్నాను.

ఒక రోజు ఆయనతో నాగురించి వివరంగా చెప్పి, ఆయన గురించి వివరంగా తెలుసుకొని, నిజంగా మీకు నేనంటే ఇష్టముంటే, నన్నుపెళ్ళి చేసుకుంటారా అని అడిగేను. దానికి ఆయన అంగీకరించారు. అలా అయితే నాకు ఎంగేజిమెంట్ రింగ్ పెట్టండి అనగానే, వెంటనే ఆయన కార్ లో బంగారం షాప్ కి నన్ను తీసుకు వెళ్ళి రింగ్ కొని అక్కడే ఆ షాప్ లోనే అందరిముందు మోకాలిమీద కూర్చొని వాళ్ళ పద్దతిలో నువ్వంటే నాకు ఇష్టం, నిన్నుపెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటావా? అని అడిగేరు. నేను అవునని తలవూపాను. ఆయన నా వేలుకి ఉంగరం తొడిగారు. అక్కడ ఉన్నవాళ్ళంతా చప్పట్లు కొట్టారు.

ఈలోపున INS (Immigration and Naturalization service) నుండి ఉత్తరం వచ్చింది ఇంటర్వు కి రమ్మని.   అదే రోజు ఆయన నేను కలసి కోర్ట్ లో మేరేజ్ రిజిస్ట్రేషన్ కి అప్లై చేసి ఐ‌ఎన్‌ఎస్ ఆఫీసు కి ఇంటర్వు కి వెళ్ళేను. అదేరోజు ఈవినింగ్ ఓత్  తీసుకున్నాను. సిటిజెన్షిప్ సర్టిఫికేట్ తో ఇంటికి వచ్చేను. నెల రోజుల తరువాత పెళ్ళి చేసుకున్నాను.

అది Marriages are made in Heaven అంటే. భగవంతుడు నాకోసం మనిషిని ఇక్కడ (America లో) పుట్టించాడు. ఆయనకోసం నన్ను ఇక్కడికి రప్పించడానికి మా ఆంటీ ని ఉపయోగించాడు. లేకపోతే  ఎక్కడనుండి ఎక్కడికి వచ్చాను, ఎక్కడ వున్నాను, ఎలా వున్నాను, ఎంత కష్టపడ్డాను. ఎలా స్థిరపడ్డాను.  ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యం గా వుంది. ఇంతలో ఫోన్ మోగింది. ఉలిక్కి పడ్డాను. గతం నుండి వాస్తవం లోకి వచ్చేను. ఇప్పుడు నా శ్రీవారితో నా స్వంత ఇంట్లో మూడు పూటలా కడుపు నిండా తింటూ ఎంతో  హాయిగా ఆనందంగా ఉన్నాను.  GOD IS GREAT!!

Posted in November 2019, కథలు

4 Comments

  1. అనుపమ

    అమ్మ చాలా సంతోషంగా వుంది,మీ జీవితం ఇప్పుడు ఆనందంగా ఉన్నందుకు.

  2. Surya

    Hi Indira,

    Thanks for liking my story. I am so sorry to hear your story. If you won’t mind please give me your email address or phone number, so that I will talk to you personally. Thanks again.

  3. Indira Rentala

    Ur story is v.touching . i too came to U.S.A.marrying 2nd.time after i got divorced from an Alcoholic husband. But life was harsh with him.Some how i managed for 5and half yrs. I lived seperately from him for 6 months. He was in India that time. By then i got my American Citizenship. Suddendly he came to U.S and gave me divorce notice.( He has split personality) Alone i had to find an Attorney and fight back. As u said God is great. He gave justice to me and am back in India now staying alone close to my son’s office ( he is married).if u know any good person who can Respect a WOMAN treat as. Humanbeing ( not like a Maid & Cook), pl. Contact me & help me . i feel that i need a companion to live for the rest of my life. I too did what all u have done to ur sisters & brothers…
    I am 69yrs. But look like in late 50s.as i was a yoga tr.and still practicing yoga regularly.i am a retired Gurukul Principal, Have least ailments.Healthy and helping type.
    Thank u for listening to my story in brief.
    With regards
    Indira Rentala.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!