Menu Close
Kadambam Page Title
ఎంకి ఎద వేదన

(నండూరి వారి జ్ఞాపకాలతో )

-- సుజాత

సూరీడు యెల్లిపోక ముందే వస్తానని బాస చేసిన నామావా ఇంకా రాడేటి
ఎప్పుడనంగో సూరీడు పడమటికి పరుగులు దీసి ఎల్లిపోయిండు
సందమామ యెన్నెల్లు పంచంగ సల్లంగా వచ్చే

కళ్ళల్లో కళ్ళు కలిపి నామావ సూత్తుంటే నామనసులో ఏదో సెప్పలేని గుబులవుతది
నీలి మబ్బులవోలే
అల్లరి ఊసులతో నామనసు నిండ కమ్ముకుంటాడు
సిగ్గులెందుకే నీకు సిరిమల్లి
యంటు గుండెల్లోనా నను దాసుకొని
గుసగుస చెపుతాడు

వద్దురా నామావ అంటే
నాగుండెల్లోనే నీకు గుడి కట్టినానంటు
కోరమీసం దువ్వి కొంటె సైగలు సేత్తాడు
మంచే మీద ఎక్కి వడిసేలు రువ్వమంటాడు
పంట సేల్లే మన పొదరిల్లు అంటాడు

ఏటిగట్టు కాడ మఱ్ఱి సెట్టు కింద మనువాడుతానంటాడు
కాలి పాదాన్ని ముద్దాడుతాడు
కన్ను గీటీ నన్ను బులిపిస్తాడు
కూసుండానీడమ్మా కూసింత సేపు
పట్టుకొమ్మంటు పరుగు దీస్తాడు

పారేటి ఏరుల్లో జంట తానాలు సేద్దామంటాడు
కనురెప్ప మూయకే నాఎంకి లోకాలే సీకటైపోతాయి
నీ కన్నుల్లో ఎలిగేటి దీపాలు నావంటాడు
మందో మాకు వెట్టి మత్తు జల్లినాడు
వల్ల కుందామంటే పానమాగదు

ఎదురు సూపులతోనే
నాఎద బరువెక్కినిద్రమ్మ ఒడిలో సేద దీరుతుంటేను
కలలోనా సేరి కవ్విస్తుంటాడు
దొండపండ్లే ఎంకి నీపెదవులంటాడు
నిలువుటద్దలే పిల్ల నీసెక్కిల్లంటాడు
కునుకుదీయనీడమ్మ కూసింత సేపు

కల్ల కపటం తెలియని నామావ వచ్చే వరకు ఎల్లద్దని యెన్నెలమ్మను యేడుకుంటాను
సందమామను కదలొద్దని కాళ్ళట్టుకుంటాను
బేగి రారా నామావా ఏయి జన్మలదాక ఈ ఎంకి నీదేనురా

Posted in November 2019, కవితలు

2 Comments

  1. Sambhamurthy Landa

    నండూరి వారి శైలిలో నెమరేసుకున్న జ్ఞాపకాల కవిత అలరించింది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!