Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ఈ రోజు ప్రొద్దున మా అమ్మాయి వాళ్ళ స్కూల్ లో చచ్చిపడి ఉన్న ఒక గబ్బిలం కనపడింది. ఎంతో హడావుడి చేసి చివరకు హెల్త్ ఇన్స్పెక్టర్లు కూడా వచ్చి ఆ గబ్బిలాన్ని అన్ని శవ పరీక్షలు కూడా జరిపి ఏమీ ఇబ్బంది లేదని తేల్చారు. ఎవ్వరూ ఆ గబ్బిలాన్ని చేతితో తాకలేదని కూడా రూఢీ చేసుకొన్నారు. మన పెరట్లో తేనెటీగలు ఉంటే ఎవ్వరం అటువైపు వెళ్ళం. ఎందుకంటే అవి కుడతాయి. తేనెటీగల బారినపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అవే గబ్బిలాలు పొలాలలో ముఖ్యంగా మొక్కజొన్న పంటల సమయంలో ఎంతో ఉన్నతమైన సేవను మనకు అందిస్తాయి. రాత్రిపూట సంచరించే క్రిమి కీటకాదులను ఈ గబ్బిలాలు తినేస్తున్నందున మొక్కజొన్న ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. అదే పనిని మనుషుల చేత చేయించాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. ఒకవిధంగా అది మనకు మిగిలినట్లే. అదేవిధంగా తేనెటీగలు పుప్పొడి రేణువులను తమతో తీసుకెళ్లి పరపరాగ సంపర్కానికి దోహదపడతాయి. ఆ విధంగా మంచి పండ్ల తోటలను పెంచి దిగుబడిని పొందవచ్చు. అయితే చైనాలో తేనెటీగలకు బదులు మనుషులతో ఆ పనిని చేయించే ప్రయోగాన్ని చేపడితే అది మంచి ఫలితాలనే అందించింది. కాకుంటే మానవ శ్రమకు వెచ్చించిన ఖర్చు కూడా ఎక్కువే అయ్యింది.

ప్రకృతిని సక్రమంగా వాడుకొని పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తూ స్వాభావిక సహజ ప్రక్రియల ద్వారా మనం సమాజానికి పనికివచ్చే ఎన్నో సిద్ధాంతాలను అలవర్చుకోవచ్చు. కృత్తిమ విధానాలు మంచి లాభాలను అందించవచ్చు కానీ వాటి వలన ఏర్పడే పర్యవసానాలు కూడా మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి.  ప్రకృతి లో ఉన్న ప్రతి జీవ కణం ఏదో సందర్భంలో ఉపయోగపడుతుంది. మన జీవన ప్రమాణాలను పెంచుతుంది. మన శరీరంలో కూడా కోట్ల సంఖ్యలో ఉన్న జీవ కణాలలో మంచివి, చెడువి మిళితమై ఉంటాయి. మన DNA లో 2 శాతం మాత్రమే మన శరీరం లోని కణాల వృద్ధికి, మన జీవన ప్రక్రియలకు ఉపయోగపడుతుంది. మిగిలినదంతా మన పూర్వీకుల నుండి మనకు సంక్రమిస్తూ వస్తుంది. అందులో ఎన్నో రకాల వ్యర్థ కణాలు, వైరస్ లు ఉంటాయి. అయితే అవి యాక్టివ్ గా, చైతన్యంతో  ఉండవు. వాటిని నియంత్రించే సామర్ధ్యం మన రోగనిరోధక శక్తికి ఉంటుంది. నేడు మనందరం క్రమంతప్పక తీసుకొంటున్న ఫ్లూ షాట్స్ కూడా ఆ ప్రక్రియలో భాగమే. కనుక మనలోని రోగనిరోధక సాంద్రతను స్థిరంగా నిలుపుకొంటే అదే మనలను కాపాడుతుంది. DNA సాంద్రత చెట్లలో మరియు జలచరాలలో మనిషి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది నిజంగా ఆశ్చర్యమే.

మన శరీరం ఒక మహత్తరమైన అద్భుత ప్రపంచం అని మన పూర్వీకులు చెప్పారు. ప్రమాదాలు సంభవించినప్పుడు, శారీరక రుగ్మతలు ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలో లేక రెస్పాండ్ అయ్యి స్థిరత్వాన్ని ఎలా సాధించాలో మన సిద్ధులు చెప్పినట్లే చేసి మనకు ఉపశమనం కలిగిస్తుంది. మనం చేయాల్సిందల్లా కొంచెం నొప్పిని భరించే ఓపిక, సామర్ధ్యం కలిగివుండటం. ప్రతి చిన్న ఇబ్బందికి మందులు ఉన్నాయని మింగుతూ వెళితే అదే పెద్ద ప్రమాదం. అట్లని పూర్తిగా మందులను మానకూడదు. అవసరమైనప్పుడు తప్పనిసరి అనిపించినపుడు వాడవచ్చు. అంతేకానీ చిన్న తలనొప్పికి లేక తలనొప్పి వస్తుందని ముందు జాగ్రత్తగా మందు బిళ్ళలు వాడటం మంచిది కాదని నా అభిప్రాయం. దీనికి ఒక చిన్న పోలిక చెప్పవచ్చు. ఏదైనా ప్రదేశంలో లేక ప్రాంతంలో ఒక చిన్న అసాంఘిక లేక అకృత్యాలు జరుగుతుంటే దానిని నియంత్రించుటకు ఆ ప్రాంత పోలీస్ ఫోర్సు చాలు. అట్లా కాదని మిలిటరీ ఫోర్సు ని దింపితే ఏమౌతుంది. నియంత్రణ సులభమౌతుంది. కానీ ఖర్చు ఆ పై ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. స్థానిక పోలీస్ ఫోర్సు లో కూడా ఒక విధమైన స్తబ్దత ఏర్పడుతుంది. అది మంచిది కాదు. ప్రతి చిన్న రుగ్మతకు లేక సాధారణ జలుబు, దగ్గు కు యాంటీబయాటిక్స్ వాడటం అంత మంచిది కాదు. డాక్టర్స్ కూడా అదే చెబుతున్నారు. మనమే వినకుండా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. తద్వారా మన శరీరంలోని రోగనిరోధక శక్తిని మనమే తగ్గించుకుంటున్నాం.  అయితే మనం ఒక్క విషయం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఒంట్లో నలత ఉన్నప్పుడే డాక్టర్ వద్దకు వెళ్ళాలి అనే ఆలోచన మాని, ఒక వయసుకు వచ్చిన తరువాత క్రమం తప్పక చెకప్ చేయించుకుంటే తరువాతి కాలంలో ఏర్పడే సడన్ సర్ప్రైజ్ లను తప్పించుకొనే అవకాశం మెండుగా ఉంటుంది. ఆరోగ్యశాస్త్రం లో నేడు చూస్తున్న అభివృద్ధిని, ఆధునికతను ఉపయోగించుకుంటూనే సంప్రదాయ సహజ పద్దతులను కూడా అవలంబిస్తే మన ఆరోగ్యం నిజంగా మహా భాగ్యమౌతుంది.

... సశేషం ...

Posted in November 2019, ఆరోగ్యం

3 Comments

  1. అనుపమ

    మధు గారు,ధన్యవాదములు.చాలా బాగా చెప్పారండి మన ఆరోగ్యంని ఎలా కాపాడుకోవాలో.

    ఆరోగ్యశాస్త్రం లో నేడు చూస్తున్న అభివృద్ధిని, ఆధునికతను ఉపయోగించుకుంటూనే సంప్రదాయ సహజ పద్దతులను కూడా అవలంబిస్తే మన ఆరోగ్యం నిజంగా మహా భాగ్యమౌతుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!