Menu Close

Adarshamoorthulu -- డా. మధు బుడమగుంట

సంగీత బ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి
Thyagaraja Swami

బంటు రీతి కొలువీయ వయ్య రామ…..

సామజవరగమనా.. సాధుహృత్..సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత....

సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి....

నగుమోము గనలేని నా జాలి తెలిసి....

మనలోని మానసిక రుగ్మతలను, వత్తిడులను రూపుమాపేందుకు సంగీతం ఒక దివ్యౌషధం గా పనిచేస్తుందని మహాయోగుల మొదలు నేటి సద్గురువుల వరకూ అందరూ నిరూపించారు. సంగీతం అంటే ఇష్టపడని వారు బహుశా ఎవ్వరూ ఉండరు. ఈ సంగీతానికి రాగాలు కట్టి, ఎంతో శ్రావ్యంగా, ఖచ్ఛితమైన  శ్రుతిలో వినడానికి కృషి సల్పిన ఎంతో మంది వాగ్గేయకారులు ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు మనం ఇప్పుడు వింటున్నాం, మన తరువాతి తరానికి కూడా నేర్పిస్తున్నాం. కాని వాటి వెనుక తమ జీవితాలను ధారాదత్తం చేసిన త్యాగయ్య, పురందరదాసు, ముత్తుస్వామి, ఇలా ఎందఱో మహానుభావులు వున్నారు. ఈ సంగీత ప్రియులందరూ, చాలవరకు కీర్తనలన్నీ తెలుగులో రచించారు. అదే మన తెలుగు గొప్పదనం. 15వ శతాబ్దంలోనే మన పద కవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య, ఏడుకొండల వేంకటేశ్వరుని స్తుతిస్తూ జానపద రీతిలో వేల కీర్తనలు రచించారు. ఆ కీర్తనలే తరువాతి తరంలో వచ్చిన వాగ్గేయకారులందరికీ మార్గ దర్శకంగా నిలిచాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

అన్ని సంగీత కళలలో శాస్త్రీయ సంగీతం ఎంతో ప్రాముఖ్యమైనది. శాస్త్రీయ సంగీతాన్ని ఒక కళగా మానవ సమాజానికి పరిచయం చేసి, ఎన్నో వేల కృతులను సృష్టించి, ఎంతో మంది సంగీత కళాకారులకి జీవనాధారం గా కూడా మలిచి కర్ణాటక సంగీతానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు, శాస్త్రీయ సంగీత పితామహుడు శ్రీ త్యాగరాజ స్వామి నేటి మన ఆదర్శమూర్తి.

చరిత్రను పరికిస్తే, ఏ రాజుకైననూ కళల పట్ల ఎంతో మక్కువ కలిగిఉండి మిక్కిలిగా ఆదరించేవారు. వారికి మాతృభాష, పరభాష అనే బేధం లేదు. ఏ భాషా పండితుణ్ణి అయినా ఎంతో గౌరవంతో ఆదరించి రచనలు చేసేందుకు ప్రోత్సహించేవారు. మన త్యాగరాజ స్వామి కుటుంబ విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు వారైనప్పటికీ నాటి తంజావూరు మహారాజుల ఆశ్రయంలో త్యాగరాజ స్వామి కుటుంబం ఎంతో ఆదరణతో జీవించడం జరిగింది. ఆ సమయంలో అంటే  1767వ సంవత్సరం మే 4వ తేదీన త్యాగరాజస్వామి జన్మించారు. పుట్టినప్పటి నుండే సంగీతం పట్ల ఎంతో ఆసక్తిని పెంచుకొని దానిని అభిరుచిగా మార్చుకొని ఎన్నో వందల కీర్తనలు సృష్టించి కర్ణాటక సంగీతానికి అపూర్వ వైభవాన్ని కలిగించడానికి కారణభూతుడైనవాడు మన త్యాగరాజు. సంస్కృత పాఠశాలలో చేరి ఆ భాష మీద పట్టు సాధించినందున ఆయనకు తన అభిమాన దేవుడైన శ్రీరామ చంద్రుని మీద అన్ని వందల కీర్తనలు అవలీలగా రచించాడు.

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః

వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం

బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః

యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే

పై ఒక్క శ్లోకంతో త్యాగరాజ స్వామి గురించి ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పూర్తిగా వివరించి చెప్పారు. ఆయన వేదములను వివరించడంలో వ్యాసుని వంటివారు, మధుర వాక్యములతో వాల్మీకిని మరిపిస్తారు. సంగీతంలో నారదుడు, ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులైన గొప్పవారి అంశంతో జన్మించిన మహానుభావుడని నుతించారు. తన కీర్తనల పరంపరలతో కర్ణాటక సంగీతం యొక్క ఉనికిని అన్ని తరాలవారికి పరిచయం చేసిన ఘనత త్యాగరాజు గారిదే.

త్యాగరాజ స్వామి రచనా సాహిత్యం మొత్తం (కొన్ని సంస్కృత కీర్తనలు తప్ప) అచ్చ తెలుగులోనే ఉండటం నిజంగా ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ఆత్యద్భుతమైన సాహితీ రససిద్ధికి తెలుగు భాష పరిపూర్ణంగా తోడైంది. నాటి సామాజిక పరిస్థితులను త్యాగయ్య తన రచనలలో ఎంతో చక్కగా ప్రతిబింబింప చేశారు. ఆయన సాహితీ జీవన ప్రవాహంలో చాలావరకు రామనామామృత మయం చేశారు. తీర్థయాత్రలు చేస్తూ తాను దర్శించిన క్షేత్రాల మీద అనేక కృతులను రచించారు. ఆయన పేరిట ప్రతి దక్షిణ భారత పట్టణంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆరాధనోత్సవాలలో ఆ కృతులను నేటికీ మనం వినవచ్చు.

రామభక్తుడు గా ఎన్నో సంకీర్తనలు ఆ శ్రీరామునికి అంకితం చేసిన  త్యాగయ్య జీవితకథ ఆధారంగా ‘శ్రీ త్యాగరాజు’ అనే సినిమాను కూడా నిర్మించడం జరిగింది. 1847 సంవత్సరం జనవరి 6 వ తేదీ త్యాగరాజస్వామి భగవంతునిలో ఐక్యమయ్యారు. కానీ, కర్ణాటక సంగీతమున్నంత కాలమూ ఆ ఆదర్శమూర్తి అమరజీవిగా విలసిల్లుతూనే ఉంటాడు.

Posted in November 2019, వ్యాసాలు

1 Comment

 1. Hymavathy.Aduri.

  అచ్చతెలుగు బుడమగుంట
  అచ్చంగా కవియంట
  సంగీతము సాహిత్యం
  రెండూ తన సొత్తంట.
  అదిరింది మధూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *