Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 86
- అనిల్ కుమార్ కాసావార్
Vikshanam 86

వీక్షణం 86 వ సమావేశం కాలిఫోర్నియా బే ఏరియాలోని మిల్పిటాస్ స్వాగత్ మినీ హాల్లో అక్టోబరు 5 వ తారీఖున జరిగింది.  ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో  శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి గారు అధ్యక్షత వహిస్తూ  తన పద్యగానామృతంతో ప్రహ్లాద చరిత్రను వినిపించి అందరినీ అలరించారు.

ఆ తర్వాత డా||కె.గీత, తిరుమల రామచంద్ర గారు రచించిన "హంపీ నుండి హరప్పా" దాకా ను పరిచయం చెయ్యమని “తిరుమల రామచంద్ర జీవితం-సాహిత్యం" గ్రంథకర్త శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారిని ఆహ్వానిస్తూ తిరుమల రామచంద్ర గారి గురించి శ్రీ ఆప్కారి సూర్యప్రకాష్ రాసిన సూక్ష్మ పరిచయాన్ని వివరించారు. "వివిధ ప్రాంతాలను దర్శించి, అక్కడి విశేషాలను సూక్ష్మంగా పరిశీలించి, పరిశోధించడం ఒక యజ్ఞం. రామచంద్ర సారస్వత కృషి ఒక తపస్సు. సృజనశీల భావుకులు, చురుకైన బుద్ధికుశలత, ఉదారమైన హృదయం, సమగ్రమైన వ్యక్తిత్వం, స్వావలంబన కాంక్ష కలిగినవారు. ఎన్నడూ రేపటి గురించి ఆలోచించనివారు, బహు ఉత్సాహశీలి తిరుమల రామచంద్ర" అన్నారు.  ఆయనకు, తనకు దగ్గర పోలికగా, విశేషంగా చెప్పదగిన విషయం ఏవిటంటే రామచంద్ర గారు చెప్పినట్లు తనకూ "పని నుండి పనికి మారడమే విశ్రాంతి" అని గీత అన్నారు.

అక్కిరాజు రమాపతిరావు గారు తిరుమల రామచంద్ర గురించి మాట్లాడుతూ, ఆయన గురించి  తాను రెండు గ్రంథాలు రాశానని అన్నారు. ఆయన గొప్ప సాహితీవేత్త అనీ, అనేక పరిశోధనాత్మక గ్రంథాలు రాశారనీ, భారతీయ పరిశోధనలో రాహుల్ సాంకృత్యాయన్ తో పోల్చదగిన గొప్ప పరిశోధకులనీ, స్వాతంత్ర్య సమర యోధులనీ, ఆయన గడిపినంతటి వైవిధ్యమైన జీవితాన్ని గడిపిన మరొక తెలుగు రచయిత లేరని కొనియాడారు. అంతటి మహానుభావుడితో తనకు దగ్గిర పరిచయం ఉండడం తన అదృష్టమనీ, ఆయనతో ప్రయాణం చేస్తూ ఎన్నో విషయాలు తాను నేర్చుకున్నాననీ అన్నారు.

తరువాత శ్రీ బత్తుల అప్పారావు "మిర్చీలు" అంటూ తన ప్రయోగాత్మక మినీ కవితలు వినిపించారు.

"అడవుల్ని పెంచుదాం
పులుల్లాగా బతుకుదాం
లేదంటే కుక్కల్లాగా చస్తాం"

అంటూ కొన్ని కవితల్ని వినిపించి సభను అలరించారు.

తరువాత స్వీయ పరిచయంలో భాగంగా శ్రీ అనిల్ కుమార్ కాసావార్ జర్నలిజంలో తన  ప్రస్థానాన్ని వివరించారు.

ఆ తర్వాత శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ ప్రాశస్థ్యాన్ని జానపద గేయాలాపనతో వివరించారు. చివరగా కార్గిల్ గురించిన స్వీయ గేయమైన

"యుగం మనదిరా
ఈ జగం మనదిరా
యువత మనదిరా
భవిత మనదిరా"

అంటూ ఉత్సాహపూరితమైన గేయంతో ముగించారు.

చివరగా సభకు విచ్చేసిన విశిష్ట అతిథి శ్రీ సురేశ్ కొలిచాల గారు "గణపతి ఏ కాలం నుంచి దేవుడు?" అనే అంశమ్మీద మాట్లాడుతూ ప్రధానంగా అందరూ పొరబాటు పడే "శుక్లాంబరధరం విష్ణుం" శ్లోకం గణపతి స్తోత్రం కాదనీ విష్ణువుని ఉద్దేశించినదనీ అన్నారు. నన్నయ భారతంలో గణపతి ప్రస్తావన ఉండదనీ, స్థానిక దేవతా మూర్తులలో ఒకరైన గణపతిని కాలక్రమేణా  ప్రాచీన కథలకు జోడించారనీ అన్నారు.

తరువాత జరిగిన చర్చాకార్యక్రమంలో భాషా శాస్త్ర సంబంధ ప్రశ్నలకు  సమాధానాలిచ్చారు. తెలుగు భాష అంతరించిపోయే అవకాశమున్నదా అనే ప్రశ్నకు, "భాష నిలబడాలంటే బడి, గుడి, ఏలుబడి, రాబడి అనే నాలుగు అంశాలలో భాషోపయోగం జరిగితేనే భాష ఎల్లకాలం నిలుస్తుందనీ, ఇక మూడు తరాలకు మించి భాషను ఒక కుటుంబంలో ఎవరూ మాట్లాడకపోతే ఆ భాష లుప్తమయిపోయే ప్రమాదం ఉందని" అన్నారు.

ఇంకా ఈ సభలో శ్రీమతి శారద, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి తాయారు, శ్రీమతి స్రవంతి, శ్రీ సుభాష్, శ్రీ లెనిన్, శ్రీ  రావు తల్లాప్రగడ మున్నగు వారు పాల్గొన్నారు.

Posted in November 2019, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *