Menu Close
manusmrithi page title
మొదటి అధ్యాయము (ఇ)

పశువులు, మృగాలు, వ్యాళములు, ఉభయతోదతములు, రాక్షసులు, పిశాచములు, మనుష్యులు - ఇవన్నీ / వీరంతా జరాయుజులు.

‘జరాయు’ అనే సంస్కృత పదానికి పాము విడిచే కుబుసము (Slough) అనే అర్థంతో పాటు మావి (The outer skin of the embryo) అనే అర్థమూ ఉంది. (జరాయు + జ) - ‘జరాయుజ’ అంటే యోని నుంచి పుట్టినవారు (Born from the Uterus or Womb). ఇలా యోని నుంచి పుట్టినవారిని శాస్త్రీయ పరిభాషలో యోనిజులు (Viviparous) అంటారు. పాములన్నీ సాధారణంగా గుడ్లు పెడితే, ఆ తరువాత ఆ గుడ్లు పగిలి పాము పిల్లలు బయటికొస్తాయి. అవి గుడ్లనుంచి పుట్టేవి కనుక, Ovum అంటే లాటిన్ భాషలో అండము(గుడ్డు) కనుక వాటిని శాస్త్రీయ పరిభాషలో అండజములు(Oviparous) అంటారు.  కాని, వ్యాళములు అనబడే కొన్ని జాతుల పెద్ద పాములు మాత్రం మిగిలిన అన్ని పాముల్లాగా గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కంటాయి. అయితే ఆ పెనుబాములు కూడా గుడ్లు పెట్టినా అవి వాటి శరీరంలోనే పగిలి వాటి పిల్లలు మాత్రమే బయటికి వస్తాయి. అందుకే వాటిని శాస్త్రీయంగా అండయోనిజములు (Ovoviviparous) అంటారు. కనుక మనువు పేర్కొన్నట్లు వ్యాళములు పూర్తిగా జరాయుజములు కావు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో కనిపించే Boa Constrictor, Green Anaconda వంటి పెద్ద పాములు వ్యాళములకు ఉదాహరణలు.

పక్షులు, సర్పములు, నక్రములు (మొసళ్ళు), మత్స్యములు (చేపలు), కచ్ఛపములు (తాబేళ్లు) - ఇవన్నీ అండజములు అంటే గుడ్డునుంచి పుట్టినవి (Oviparous). వీటిలో కొన్ని నేల మీద, మరికొన్ని నీటిలోనూ ఉంటాయి.

దంశ మశకములు (దోమల వంటి కుట్టే కీటకాలు), యూకా (పేలు), మక్షికములు (ఈగలు), మత్కుణములు (నల్లులు) - ఇవన్నీ ఊష్మణము (ఆవిరి లేక ఉక్కపోత)నకు పుడతాయి. స్వేదము (చెమట) కు పుడతాయి కనుక వాటిని  స్వేదజములు అంటారు.

విపరీతమైన వేసవితాపంలో జంతువులన్నీ ఆవిర్లు కక్కుతూ చెమట ఓడుస్తూ ఉంటాయి. శాస్త్ర పరిజ్ఞానం అంతగా అభివృద్ధిచెందని రోజులలో దోమలు, పేలు, ఈగలు, నల్లులు మానవులు లేక జంతువుల చెమటనుంచి పుట్టుకొస్తాయనే  నమ్మకం ఉండేది. అయితే  శాస్త్ర విజ్ఞానం ఆ యా కీటక జాతులన్నీ గుడ్ల నుంచి ఉద్భవించే అండజాలేననీ, వాటిలో చెమట నుంచి పుట్టేవేవీ లేవనీ నిర్ధారణ చేసింది. దోమలు మురికి నిలువ నీటిపైన, ఈగలు కుళ్ళిన వ్యర్థ పదార్థాల మీద పెట్టే గుడ్ల నుంచి పుడతాయి. పేలు వెంట్రుకలలో చేరి పెట్టే గుడ్ల నుంచి ముందుగా ఈర్లు(nits), ఆ తరువాత పేలు(lice) పుడతాయి. నల్లులు (Bed bugs) మనం పడుకునే మంచాలు, కూర్చునే కుర్చీల కూసాలలో చేరి పెట్టే గుడ్లనుంచి ఉద్భవిస్తాయి. వాటి బాధ పడలేక నవ్వారు, నులక మంచాలను ఒకప్పుడు ఎండలో వేసి కర్రలతో బాదుతూ నల్లుల్ని రాల్పి చంపేవారు. మంచాలు, కుర్చీల చెక్క కూసాలలోకి సలసలకాగే వేడి నీటిని పోసి కూడా నల్లుల్ని చంపేవారు. సినిమా హాళ్ళలోని సీట్లలోనూ ఒకప్పుడు నల్లుల బాధ తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం నల్లులు దూరి గుడ్లు పెట్టేందుకు వీల్లేని విధంగా మనం వాడుతున్న మంచాలు, కుర్చీలు, కుషన్ సీట్లు రూపొందిస్తున్న కారణంగా నల్లుల బాధ చాలామేరకు తొలగిపోయింది.

ఉద్భిజ్జముల(మొలిచే మొక్కల) లో స్థావరములు (వృక్షములు) అన్నీ విత్తనాలను చీల్చుకుని మొలకెత్తిగానీ, కాండం(కొమ్మ) పాతిపెడితే గానీ పెరిగి వృక్షాలవుతాయి. ఓషధులు (వార్షిక మొక్కలు) పుష్పించి, ఫలించి, వాటి పంట పక్వానికి రాగానే నశిస్తాయి. వరి మొదలైన తృణ ధాన్యపు మొక్కలన్నీ ఇలాగే  పంట పండడంతో నశిస్తాయి.

అపుష్పాః ఫలవంతో యే తే వనస్పతయః స్మృతాః |
పుష్పిణః ఫలినశ్చైవ వృక్షాస్తూభయతః స్మృతాః || (1 - 47)

కొన్ని వృక్షాలు ముఖ్యంగా అటవీ వృక్షాలు పుష్పించకుండా ఫలిస్తాయి. అలాంటి వృక్షాలను వనస్పతులు (అడవికి రాజులు) అంటారు. అయితే మిగిలిన వృక్షాలన్నీ పుష్పిస్తాయి ; ఫలిస్తాయి. వాటిని వృక్షాలు అంటాం.

ఇక్కడ వనస్పతుల గురించి కొంత చెప్పుకోవాలి. అడవులలో పెరిగే కొన్ని మహా వృక్షాలు భారీగా కాపు కాసినా అవి అసలు ఎక్కడా పుష్పించినట్లే కనిపించవు. అయితే ఆ వృక్షాలు కూడా పుష్పిస్తాయి. ప్రకృతిలో పుష్పం లేకుండా ఎక్కడా ఫలం అనేది ఏర్పడదు. అయితే ఈ మహావృక్షాలు కనిపించీ కనిపించనంత  చిన్నపూలు (Inconspicuous flowers) పూయడానికి ఒక కారణముంది. అంత ఎత్తైన చిటారు కొమ్మలమీద పూసే ఈ మహావృక్షాల పూలు పరపరాగ సంపర్కం (Cross Pollination) కోసం గాలి మీదనే ఆధారపడతాయి. ఆ వృక్షాలు పరపరాగ సంపర్కం కొరకు  కీటకాలను ఆకర్షించాల్సి రావడం, అందుకోసం స్పష్టంగా కనిపించే ఆకర్షణీయమైన పూలు పూయడం వంటివి అవసరమే లేదు. ఆ వృక్షాలు  పూతపూసే ముందు ఆకులన్నీ రాల్చేసి దాదాపు బోడిగా తయారౌతాయి. ఆ కారణంగా ఒక పుష్పం యొక్క పురుష బీజకోశం (Stamen) నుంచి పుప్పొడి రేణువులు మరొక పుష్పం యొక్క స్త్రీ అండకోశం (Pistil) చేరుకోడానికి ఆ ఉన్నత ప్రదేశాలలో ధారాళంగా వీచే గాలే చక్కగా తోడ్పడుతుంది. పై పెచ్చు ఈ మహా వృక్షాలలో చాలా వాటిలో మగ, ఆడ పుష్పాలు ఒకే వృక్షం మీద పూసే (Monoecious) కారణంగా కూడా ఈ వృక్షాలలో పరపరాగ సంపర్కం, ఫలదీకరణం సులువౌతుంది. American Beech, Birch, Sugar Maple వంటివి ఈ తరహా వృక్షాలకు ఉదాహరణలు. మన ప్రాంతంలో రావి, మర్రి, ఏనుగు బాదం (Sterculia foetida) వంటి మహా వృక్షాలు ఇలా కనిపించీ కనిపించని అతి చిన్న పూలు పూస్తాయి. అయితే ప్రత్యేకంగా కనిపించే వీటి కాయలు మాత్రం అందరికీ తెలుసు. నేలమీది చిన్న వృక్షాలేమో  పరపరాగ సంపర్కం కోసం తప్పనిసరిగా కీటకాలమీద ఆధారపడతాయి. అందుకోసమే అవి కీటకాలను ఆకట్టుకునేందుకు పలువన్నెల ఆకర్షణీయమైన, పరిమళ భరితమైన పూలు పూస్తాయి. వనస్పతులు అనే భారీ అటవీ వృక్షాల పూలు కనపడీ కనపడనంత చిన్నవిగా ఉండే కారణంగా మన ప్రాచీనులు వనస్పతులను పూలుపూయని, కాయలుకాసే మహావృక్షాలుగానే భావించారు. మనువు కూడా అందుకే ఈ విషయమై అదే వివరణ ఇచ్చాడు. వనస్పతి అనే సంస్కృత శబ్దానికి చాలాఅర్థాలున్నాపుష్పించకుండా ఫలించే వృక్షమనే అర్థమే ప్రధానమైనది. వనస్పతి అంటే సామాన్యార్థంలో వృక్షం అని స్థిరపడింది. వృక్ష ప్రపంచాన్ని(Plant Kingdom) సంస్కృత భాషలో ‘వనస్పతి కాయః‘ అంటారు. మనం వంట నూనెగా వాడుకునే డాల్డానూ వనస్పతి అంటాం. సాధారణంగా వంటనూనెలలో జంతువుల కొవ్వు (Tallow) ను కల్తీ చేస్తారు. అందుకని జంతువుల కొవ్వు కల్తీ చేయకుండా వృక్షాల నుండి ఉత్పత్తి చేసిన శుద్ధమైన Vegetable Oil అనడానికి వనస్పతి అనడం వాడుక అయింది.

రకరకాల గుల్మములు (పొదమొక్కలు), ఒకే ప్రధాన వేరు లేక పలు వేళ్ళ వ్యవస్థ కలిగిన (Plants with Tap or Adventitious Root Systems) మొక్కలు, పలు రకాల గడ్డిజాతి మొక్కలు, ఏదైనా ఆధారంతో ఎగబాకే మొక్కలు (Climbers), అల్లుకునే మొక్కలు లేక లతలు (Creepers) ఇవన్నీ విత్తనం నుంచి మొలిచే లేక కొమ్మలు నాటితే పెరిగే మొక్కలు. ఈ స్థావరములైన మొక్కలు, వృక్షములన్నీ పలు రూపములైన కర్మ గుణములతో కూడిన తమస్సు (చీకటి) చేత ఆవరించబడి ఉంటాయి. అయితే వీటికి అంతర్గత చైతన్యం ఉంది కనుక వీటికి సుఖ దుఃఖముల జ్ఞానం ఉంటుంది.

ఈ ఘోరమైన, ఎల్లప్పుడు నశించేదైనట్టి జనన మరణ చక్రంతో కూడిన ఈ భూత సంసారంలో బ్రహ్మ మొదలు ఇప్పుడు చెప్పిన స్థావరములన్నీ నిర్దేశిత నియమాలకు లోబడి ఉండవలసిందే. ఈ స్థావర, జంగమ రూపమైన సకల వస్తువులనే కాక, నన్ను కూడా సృష్టించిన బ్రహ్మ, సృష్టి కాలాన్ని ప్రళయకాలంతో చేరుస్తూ మరల మరల అంతర్థానం అవుతూ ఉంటాడు. ఆ బ్రహ్మ మేల్కొన్నప్పుడు ఈ జగత్తంతా చురుగ్గా తన కార్యకలాపాలలో నిమగ్నమౌతుంది. ఎప్పుడా బ్రహ్మ నిద్రిస్తాడో అప్పుడాయన సృష్టించిన ఈ జగత్తు కూడా నిద్రిస్తుంది. కర్మ స్వరూపములైన ఈ జీవులన్నీ నిద్రాణమైపోతాయి. వారి మనస్సు సర్వేంద్రియ సహితంగా అలసట తీర్చుకుంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే తిరిగి బ్రహ్మ యొక్క విశ్వాత్మలో లీనమై పోతాయో, అప్పుడా బ్రహ్మ గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఇంద్రియాదులతో సహా ఈ జీవుడు ఎప్పుడైతే తమస్సు (జ్ఞానలేమి) లో మునిగి ఉంటాడో, ఎప్పుడు ఉచ్చ్వాస నిశ్శ్వాసలతో కూడిన జీవన క్రియను వదిలేస్తాడో, అప్పుడు ఆ జీవుడు దేహమునుంచి తొలగిపోతాడు.

తిరిగి ఎప్పుడైతే ఆ జీవుడు సూక్ష్మ శరీరంతో సహా వృక్షాలకు కారణమైన స్థిర బీజంలో ప్రవేశిస్తాడో అప్పుడు వృక్షం యొక్క స్థూల శరీరాన్ని, మనుష్యులకు కారణమైన జంగమ బీజంలో ప్రవేశించినప్పుడు  మనుష్యుడి స్థూల శరీరాన్ని పొందుతాడు. నాశరహితుడైన ఆ బ్రహ్మ ఈ విధంగా జాగ్రత్స్వప్నావస్థల చేత స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ, నాశనం చేస్తూ ఉంటాడు.

మొక్కల విత్తనాలలో ఉండేది స్థిరబీజము. మనుష్యుడు, జంతువుల వీర్యంలో ఉండేది జంగమ బీజము. దీనినే మనువు చరిష్ణు బీజము అన్నాడు. స్థావరములైన వృక్షముల బీజాన్ని స్థాన్నుబీజము (స్థిర బీజము) అనీ జంగమములైన జంతువులు, మనుష్యుల బీజాన్ని చరిష్ణు (జంగమ) బీజమనీ మనువు పేర్కొన్నాడు. స్థావర, స్థాన్ను శబ్దాలు కదలకుండా ఒకే చోట ఉండడాన్ని సూచిస్తే చరిష్ణు, జంగమ శబ్దాలు తిరుగాడడాన్నిసూచిస్తాయి. జంతువులు, మానవుడు తిరుగాడే జీవులు కనుక వాటి బీజమును చరిష్ణు (జంగమ) బీజము అన్నాడు మనువు.

“ఈ ధర్మశాస్త్రాన్ని తొలుత బ్రహ్మ రచించి, తానే దీనిని నాకు విధి ప్రకారముగా ఉపదేశించాడు. నేను దీనిని మరీచి మొదలైన పదిమంది ప్రజాపతులకు వివరించాను,” అంటూ ఆ ఋషులలో ఒకడైన భృగు మహర్షిని చూపుతూ, “ఈ భృగు మహర్షి నా దగ్గర ఈ శాస్త్రాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు. అతడు దీనిని మీకందరికీ విపులంగా వివరిస్తాడు” అని ముగించాడు మనువు.

ఆ మహర్షులకు మనువు ఆనతి మేరకు భృగు మహర్షి ఏమేమి వివరించాడో తరువాయి భాగంలో చెప్పుకుందాం.

***సశేషం***

Posted in November 2019, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!