Menu Close

Science Page title

ఐసోటోపులు

శాస్త్రంలో “ఐసోటోపు” అనే మాట ఉంది. ముందు దీని అర్థం ఏమిటో చూద్దాం. ఉదాహరణకి కర్బనం (కార్బన్) అనే రసాయన మూలకం (element) ఉంది. ఈ కర్బనం అణువుని పరిశీలిస్తే ఆ అణువు గర్భంలో (నూక్లియస్‌లో, కేంద్రకంలో) 6 ప్రోటానులు, 6 నూట్రానులు ఉంటాయనిన్నీ, అణువు కేంద్రకం చుట్టూ 6 ఎలక్‌ట్రానులు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయని ఒక నమూనా ఉందని మనకి ఉన్నత పాఠశాలలోనే చెప్పేరు.

అణుగర్భంలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో దానిని అణు సంఖ్య (atomic number) అంటారు. కనుక కర్బనం అణు సంఖ్య 6. ఇదే విధంగా అణుగర్భంలో ఉన్న ప్రోటానులు, నూట్రానులు కలిపి ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పేదానిని గరిమ సంఖ్య (mass number) అంటారు. కనుక కర్బనం గరిమ సంఖ్య 12. ఇది సర్వసాధారణమైన కర్బనం కథ. ఈ సాధారణ కర్బనాన్ని సి-12 (C-12) అని కూడ పిలుస్తారు.

అప్పుడప్పుడు ప్రకృతిలోని కొన్ని అసాధారణమైన అణువులు తారస పడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక అసాధారణమైన కర్బనం అణువు గర్భంలో 6 ప్రోటానులు, 8 నూట్రానులు ఉంటాయి. ప్రోటానులు 6 ఉన్నాయి కనుక ఇది ఖచ్చితంగా కర్బనమే. నూట్రానులు రెండు ఎక్కువ ఉన్నాయి కనుక ఇది మామూలు కర్బనం కాదు. ఈ కొత్త రకం కర్బనం గరిమ సంఖ్య 14. కనుక దీనిని క్లుప్తంగా సి-14 (C-14) అంటారు.

కేవలం గర్భంలో ఉన్న నూట్రానుల సంఖ్య మారినంత మాత్రాన మూలకం పేరు మారిపోదు, స్థూలంగా రసాయన లక్షణాలు మారిపోవు; కాని కొన్ని అసాధారణమైన లక్షణాలు కనిపిస్తాయి అంతే. (మనలో కొంతమందికి ఆరు వేళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళు మనుష్యులు కాకపోతారా? అలాగన్నమాట!) ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే సి-12 కి, సి-14 కి మధ్య చాల పోలికలు ఉన్నాయి; గర్భంలో ఉన్న నూట్రానుల సంఖ్యలో తేడా ఉంది కనుక కొన్ని కొత్త లక్షణాలు ఉన్నాయి. అందుకని ఈ రెండింటిని ఇంగ్లీషులో ఐసోటోపులు అంటారు. గ్రీకు భాషలో “ఐసో” అంటే ఒకే అనిన్నీ, “టోప్” అంటే ప్రదేశం అని కానీ, స్థానం అని కానీ అర్థం. (టొపోగ్రఫీ అన్న మాటలో “టోపో” అన్న ‘స్థానం’ అనే అర్థం.) వీటిని తెలుగులో ఏకస్థానులు అనొచ్చు. ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్) లో ఈ రెండింటిని ఒకే స్థానంలో (గదిలో) ఉంచాలి కనుక వీటికి ఆ పేరు పెట్టేరు.

నిత్యజీవితంలో ఈ ఏకస్థానుల వాడుక మనకి ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంటుంది. వైద్యంలో, రోగ నిర్ణయంలో, మందుల తయారీలో, పొగ పత్తాసులలో, విద్యుత్ ఘటాలలో, అణుశక్తి ఉత్పాదక కేంద్రాలలో, ఇలా ఎన్నో చోట్ల వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రకృతిలో సహజసిద్ధమైన మూలకాలు 92. వీటికి ఉరమరగా 250  సాధారణ (స్థిరత్వం ఉన్న) ఏకస్థానులు, 3200 (స్థిరత్వం లేని) వికీర్ణ ఉత్తేజిత ఏకస్థానులు ఉన్నాయి. వీటికి ఉన్న వివిధమైన లక్షణాలని వివిధ రంగాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

Posted in November 2019, Science

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!