Menu Close

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు -

ప్రౌత్రోత్సాహం

అమ్మకు తెలియకుండా-
అలమరలో దాచిపెట్టిన
పాలకుండలోంచి పట్టేసిన మీగడలాగా
మనవడంటే ఇష్టం...

నాన్నకు తెలియకుండా-
ఎద్దులకోసం పొయ్యిమీద ఉడకేసిన
మట్టికుండలోంచి లాగేసిన ఉలవగుగ్గిళ్ళలాగా
మనవడంటే ఇష్టం...

అక్కయ్యకు తెలియకుండా-
స్కూలుఫీజు లోంచి మిగుల్చుకున్న
పావలాతో చూసేసిన ఎన్టీయార్ జానపదచిత్రంలా
మనవడంటే ఇష్టం...

అన్నయ్యకు తెలియకుండా-
నాతోపాటు స్కూలుకొచ్చే అందమైన అమ్మాయికి
పెడతా మనుకున్నా పెట్టలేని ముద్దులాగా
మనవడంటే ఇష్టం...

పెద్దవాళ్ళ నంతా మరిపిస్తూ
నా మానసప్రాణమూర్తిగా మురిపిస్తూ ...
నన్ను బాల్యంలోకి లాక్కెళుతూ
నన్నూ ఓ బాలుణ్ణి చేస్తున్న
నా మనవ డంటే నా కెంతో ఇష్టం...

Posted in April 2019, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *