Menu Close
గ్రంథ గంధ పరిమళాలు

ప్రపంచ సాహిత్యంలో యాత్రా చరిత్రలు-వాటి ప్రాముఖ్యత

ప్రత్యేకించి – తెలుగులో యాత్రా చరిత్రలు

౧. ఈ వ్యాసానికి ప్రధాన ఆధారం:

డా. మచ్చ హరిదాసు; తెలుగులో యాత్రా చరిత్రలు

పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం; ఉస్మానియా విశ్వవిద్యాలయము

౨. డా. మచ్చ హరిదాసు గారి జీవిత వివరాలు:

జననం: 22.8.1950, జన్మస్థలం: గునుగుల కొండాపురం, కరీంనగర్ జిల్లా, ప్రస్తుత తెలంగాణా రాష్ట్రం.

ఉద్యోగం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్

రచనలు: ‘తధ్యము సుమతీ; సుమతి శతకంపై మొట్టమొదటి పరిశోధక వ్యాసం.

౪. కృతఙ్ఞతలు :

1. డా. మచ్చ హరిదాసు గారికి, 2. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ‘కాశీయాత్ర’

---------

“సైర్ కర్ దునియాకి గాఫిల్ జిందగానీ ఫిర్ కహాఁ, జిందగీ అగర్ కుచ్ రహీ తో నౌ జవానీ ఫిర్ కహాఁ”

“ఓయీ మూర్ఖుడా! జీవతం దుర్లభం. కాబట్టి ప్రపంచం చూచిరా. జీవితం ఎల్లకాలం ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా యౌవనం మళ్ళీ రాదు.” అని పై కవితకు అర్థం. ఈ వాక్యాలు ప్రముఖ యాత్రా చరిత్ర కారుడు రాహుల్ సాంకృత్యాయన్ తన గురువు ద్వారా తెలుసుకొన్నవి. – మచ్చ హరిదాసు “తెలుగులో యాత్రా చరిత్రలు (తె.యా.చ) పుట;68.

‘యాత్రా చరిత్ర’ అంటే ఒక వ్యక్తీ తాను ఉన్న చోటునుండి మరొక చోటికి ప్రయాణం చేసినపుడు ఆ ప్రదేశంలో ఉన్న వివిధ విషయాలను గూర్చి శ్రద్ధగా కని, విని. వీలైనంత వరకు వాటిని సేకరించి గ్రంథస్తం చేయడం.

సాహిత్య చరిత్రకారులైన ఎం. కులశేఖర రావు, నిడుదవోలు వేంకటరావు, యాత్రా చరిత్రల వచన వాఙ్మయ వికాసానికి తోడ్పడిన తొలినాటి వచన ప్రక్రియల్లో ఒకటిగా పేర్కొన్నారు. యాత్రా చరిత్రలు చాలా వరకు ఆర్ధంగా, ఆసక్తిదాయకంగా ఉంటాయి. కాబట్టి యాత్రా చరిత్రను సాహిత్య ప్రక్రియగా భావించడంలో ఔచిత్యం కనపడుతుంది (తె.యా.చ పుట 100).

మన భారతదేశ ప్రాచీన వాఙ్మయంలో యాత్రల ప్రసక్తి ఉంది. ఉదా|| అర్జునుని యాత్ర, బలరాముని యాత్ర మొ||వి. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు వారి ‘మహారాష్ట్ర యాత్రా చరిత్ర’ అనే గ్రంధంలో వ్యాసుడు ధర్మ ప్రచార యాత్రకై పర్షియా సీమ (నేటి ఇరాన్) కు వెళ్ళినట్లు ఆధారముందని తెలిపారు. (తె.యా.చ పుట 28).

భారతదేశాన్ని దర్శించిన విదేశీ యాత్రికులు, వారి రచనలు

౧. మార్కోపోలో :  ఇతడు ఇటలీ లోని ప్రసిద్ధ వర్తకుల వంశంలో జన్మించాడు. చైనా యాత్రకై వచ్చి 17 సంవత్సరాలు చైనాలో ఉన్నాడు. ఇతను వ్రాసిన యాత్రికుల గ్రంధం నాలుగు ఖండాలుగా ఉంది. ఒక యుద్ధ సమయంలో ఇతను జైలులో ఖైదీగా ఉంది ‘రస్టికియానో’ అనే తోటి ఖైదీ చేత లాటిన్ భాషలో ఒక గ్రంధాన్ని వ్రాయించాడు. అది తర్వాత ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేయబడింది. మార్కోపోలో కాకతీయ రుద్రమదేవి (1260-98) ఆంధ్రదేశాన్ని దర్శించాడు. తన ఆంధ్రదేశ యాత్ర గురించి ఆయన తన గ్రంధంలో వివరించారు.

౨. నికోలో కాంటి : ఇతను కూడా ఇటలీ దేశానికి చెందినవాడే. క్రీ.శ. 1420 లో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. మొదట గుజరాత్ వెళ్ళాడు. అక్కడ Cambaya నివాసులు మాత్రమే కాగితం వాడే వారని తెల్పాడు. ఇతను వ్రాసిన గ్రంధం దొరకలేదు. కానీ ఇతని యాత్రా వివరాల అనువాద గ్రంథం దొరికింది. (తె.యా.చ పుట 8).

౩. అబ్దుల్ రజాక్ : ఇతడు మధ్య ఆసియాలోని సమరఖండ్ వాసి. ఇతడు పార్శీ భాషలో రచించిన తన యాత్రాగ్రంధం ‘రేహ్లా’ మొదటి భాగంలో పర్షియా చక్రవర్తి తైమూర్ చరిత్ర సమస్తం వివరించాడు. రెండవభాగంలో అతని భారత దేశ యాత్రా చరిత్ర విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథం ఆంగ్లంలోకి కూడా అనువదింపబడింది. సర్ యం. హెన్రీ ఇలియట్ “The history of India untold by its historians” అనే గ్రంధంలో ఎన్నో విషయాలను సంస్కరించాడు.

15వ శతాబ్దంలో పోర్చుగీసువారు అలాగే  16వ శతాబ్దంలో ఆంగ్లేయులు మొదటగా మన దేశాన్ని దర్శించి వారి అనుభవాలను గ్రంథస్తం చేశారు. కనుకనే వారి రచనలన్నీ కూడా యాత్రా చరిత్రలనే చెప్పాలి. ఈ గ్రంథాల వలన నాటి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు, అలవాట్లు అన్నీ తెలుస్తాయి కనుక ఈ గ్రంథాలను యాత్రా చరిత్రలు అవే దేశ ప్రజలకు చరిత్ర జ్ఞానదాయకాలు అని చెప్పవచ్చు. అందువలన సాహిత్యకారులు, ప్రభుత్వాలు, పరిశోధకులు నూతనోత్సాహంతో యాత్రా చరిత్ర రచనా ప్రక్రియకు కొత్త ఊపిరి పోసి, జ్ఞాన, విజ్ఞానదాయకమైన విషయాలను రచించి భావితరాలకు అందించాలి.

అలాగే భారతీయలు కొందరు, అందునా ప్రత్యేకించి మన తెలుగువారు రచించిన యాత్రా చరిత్రలను కొన్నింటిని తె.యా.చ ఆధారంగా ఈ క్రింద పరిశీలిస్తాం.

... సశేషం ...

Posted in April 2019, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *