Menu Close

గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.

అంచనా - దివాకర్ల రాజేశ్వరి

అబ్బబ్బ! ఈ బస్సులెప్పుడూ సమయానికి రావే, అరగంట నుంచీ నుంచున్నాం. కాళ్ళు పీకుతున్నాయి, ...రజనీ, కారు కొనుక్కోలేకపోయావా? అయిదు నిముషాల్లో వచ్చి వెళ్లేదానివి. నన్ను కూడా తీసుకొని వెళ్లేదానివి! అంది లలిత. హాస్యం చెయ్యకు! చూడు రద్దీ కూడా ఎక్కువయింది. బస్సు వచ్చినా ఎక్క గలమో లేదో.

అవునే రజనీ. ఇక్కడ మన కంగారులో మనం ఉంటే అక్కడ చూడవే! కొందరు కుర్రాళ్లు చందాలకో ఏమో డబ్బాలు పట్టుకొని వస్తున్నారు విసుగ్గా అంది లలిత . అవునే లలితా ఈ మధ్య ఈ గోల ఎక్కువయి పోయింది. సులభంగా డబ్బు సంపాదించడానికిదో మార్గంలే. వాళ్ళల్లో ఓ కుర్రాడు మన వైపే వస్తున్నాడు. మనం ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు . ఇటు రానీ మంచి బుద్ధి చెప్తాను. అంది రజని.

ఆ కుర్రాడు వాళ్ళ దగ్గరికి రానే వచ్చాడు, మేడం ఏదో కొంత సాయం చేయండి, అంటూ, రజని చూడ్డానికి కాలేజీ లో చదివే వాళ్ళలా ఉన్నారు. ఈ డబ్బు వసూళ్ళేమిటి? అంది.

మేం డిగ్రీ చదువుతున్నాం మేడం. మాకు చదువుతో బాటు సంఘ సేవ చేయాలని ఉంది. అని అన్నాడు ఆ కుర్రాడు.

ఈమాటలకేం. ఇలాగే మంచి మాటలు చెప్పి డబ్బు లడుగుతారు. ఆ డబ్బులతో హాయిగా ఏ హోటలుకో, సినిమాకో వెళ్ళి ఉడాయిస్తారు అంది లలిత కటువుగా.

అలా అనుమానించకండి మేడం! మేము కొందరం కలసి "నేతాజీ యువకుల" సంఘం స్థాపించాం. సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను చేయాలనుకుంటున్నాం. మీలాంటి యువతుల సహాయ సహకారాలు కావాలి మేడం, అన్నాడు ఆ యువకుడు అభ్యర్థనగా. ఉపన్యాసాలు బాగా నేర్చావు అంది లలిత నిరసనగా. అలాగే మేడం, మీరు నమ్మక పోతే సరే, ఏ కొద్ది మందైనా నమ్మి సహకరించకపోరు, గూడ్ ఈవినింగ్ అంటూ ఆయువకుడు కదిలాడు. బస్సొచ్చింది. లలిత, రజని ఇద్దరూ ఎలాగోలా బస్సునెక్కగలిగారు.

మరుసటి రోజు రజనీ లలితతో ఆ సాయంత్రం స్నేహితురాలి పెళ్ళికెళ్ల వలసిన విషయాన్ని గురించి మాట్లాడుతూ, పెళ్ళి మండపం చాలా దూరంలో ఉంది కనుక రాత్రి తిరిగి రావడం ఇబ్బందవుతుందేమో అన్న అనుమానాన్ని వెలిబుచ్చింది. లలితకూడా కొంచం సందేహంగానే అవునే రజనీ, పెళ్ళి అంటే ఏదో ఒక్క నగ అయినా పెట్టుకొని వెళ్తాం కదా. ముహూర్తం రాత్రివేళ, మనం బయలుదేరి వచ్చేటప్పటికి చీకటి పడుతుంది. మాతమ్ముణ్ణి రమ్మందామంటే వాడికి రేపేదో ఇంటర్వ్యూ ఉందిట. ఏలా ? అంది. మనం మాత్రం తప్పని సరిగా వెళ్ళవలసిన పెళ్ళికదా ఇది. సాయంత్రం తయారుగా ఉండు, నేను నేరుగా ఆటో తీసుకుని మీ ఇంటికి వస్తాను. అంది రజని, లలిత అలాగేనంది.

పెళ్ళి బాగా జరిగింది, కాని లలిత, పెళ్ళి హడావుడిలో మనం టైం సంగతినే మరచిపోయామే, బాగా రాత్రయిపోయింది. జనసంచారం కూడా లేదు, దిగులుగా అంటున్నరజనితో లలిత, ఇప్పుడేం ఆలోచించకు పద పద, అంది. ఇద్దరూ భయం భయంగానే ఆటో ఎక్కడైనా దొరుకుతుందేమో నని నడుస్తున్నారు. ఏవో నీడలు వాళ్ళని అనుసరిస్తూ గబుక్కున ముందుకు వచ్చిన దృఢ కాయులిద్దరు, చేయిపట్టుకొని లాగబోయారు. కొంచం ధైర్యంగా లలిత "హెల్ప్, హెల్ప్" అంటూ అరిచింది . ఎక్కడనుంచి వచ్చార్రో నలుగురుయువకులు ఆ దృఢకాయుల్ని చేతులు విరిచి పట్టుకొన్నారు. వాళ్ళల్లో ఇద్దరు. మేం వీళ్ళ సంగతి చూస్తాం! రమేష్ నువ్వు ఈ అమ్మాయిలను ఇంటికి పంపించి రా, సురేష్ ఇక్కడ గస్తీ తిరుగుతాడు మేం వచ్చే వరకూ, అన్నారు.

లలితా, రజని ఊపిరి పీల్చుకున్నారు. తమని కాపాడిన ఆ యువకుడికి థేంక్స్ చెప్పబోతూ, ఒక్కసారిగా ఆ యువకుడిని గుర్తు పట్టి, నువ్వా! అన్నారు సంభ్రమంగా. తరువాత సిగ్గు పడుతూ, నీకు కృతజ్ఞతలెలా చెప్పాలో తెలియటం లేదు. మమ్మల్ని క్షమించండి. అన్నారు. అతనితో పాటు తమకు సహాయపడిన ఇతర కుర్రాళ్ళని ఉద్దేశిస్తూ. మేడం. మిమ్మల్ని ఇందాకే గుర్తు పట్టాను. మా నేతాజీ యువక సంఘం వేసుకున్న ప్రణాళికలలో, సేవా కార్యక్రమాలతో బాటు, రాత్రిళ్ళు జన సంచారం లేని వీధుల్లో గస్తీ తిరగడమొకటి. చదువును కొనసాగిస్తూనే ఒకళ్ళ తరువాత మరొకరం ఈ పనిని కొనసాగిస్తాం. అన్నాడు.

ఆటో కోసం అతనితో పాటు నడుస్తూ లలిత, రజని ఇద్దరూ మేం నిన్ను తప్పుగా అంచనా వేశాం. మీలాగే యువకులందరూ ఇలాంటి ఉన్నతాశయాలు కలిగి ఉంటే దేశాభ్యుదయానికి కొదవేముంది ? అన్నారు.

సరే కాని మేడం, ఇప్పుడైనా మా సంఘానికి ఎంతో కొంత చందా ఇస్తారా. ఈ చలికాలంలో ఆశ్రయం లేనివాళ్ళకు కనీసం దుప్పట్లైనా కొని ఇద్దామని అనుకుంటున్నాం, అన్నాడు.

తప్పకుండా. రేపు మేం పనిచేసే ఆఫీసుకు రండి. మా ఆఫీసు వాళ్ళందరికీ కూడా మీ ఆదర్శాలను చెప్పి సహకారాన్నందించమంటాం అన్నారు. అంతలో ఆ యువకుని స్నేహితుడు ఆటోను పిలుచుకొచ్చాడు . ఆటో నంబరు అదీ తీసుకొని అమ్మాయిలనిద్దరినీ భద్రంగా ఇంటి దగ్గర దింపమని డ్రైవర్ కు సూచించారు యువకులు. లలిత, రజని ఇద్దరూ మళ్ళీ కృతజ్ఞతలను చెబ్తూ ఇక తప్పుగా ఎవరినీ అంచనా వేయకూడదని నిశ్చయించు కొన్నారు.

గల్పికావని-శుక్రవారధుని – 8 - ఇంటర్వ్యూ - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

"నాకు మన కన్నడ ఛానెల్లో జాబ్ కావాల్సార్"

"జాబా? ఏం చేస్తారు?"

"మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను"

"ఉద్యోగం కోసం వచ్చినవాళ్ళకి ఏది పడితే అది చెప్పలేం కదా? మీకు ఏ ఉద్యోగం కావాలో స్పెసిఫిగ్గా చెప్పండి"

"ఎడ్మిన్లోగానీ ఎక్కౌంట్స్ లో గానీ..,"

"ఆ జాబ్స్ మీ టెన్త్ క్వాలిఫికేషన్ కి ఇవ్వరు"

"పోనీ ప్రొడక్షన్ డిపార్టుమెంట్లో"

"పోస్టులైతే ఉన్నాయిగానీ అది మీరు చెయ్యదగిన పని కాదు"

"ప్రోగ్రాం అసోసియేట్ గా?"

"నిజానికి ప్రోగ్రామ్ అసోసియేట్స్ కావాలిగానీ మీరు మాత్రం వద్దు"

"నాకు ఏం అడగాలో అర్థం కావట్లేద్సార్"

"జాబ్ కోసం వచ్చి ఏం అడగాలో అర్థం కాదనేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను"

"అక్కడక్కడా నాలాంటివాళ్ళు కూడా ఉంటార్సార్. వాళ్ళకి సాయపడ్డానికి మీలాంటివాళ్ళు కూడా ఉంటార్సార్"

"కొట్టారుగా దిమ్మతిరిగేలా"

"నాకు ఏదో ఒక జాబ్ కావాల్సార్"

"మీకు వేరే పనులు చెప్పలేనన్నానుగానీ రైటర్ గా చేర్చుకోనన్నానా. మీరు మంచి రైటర్. రైటర్ గానే జాయినవ్వండి"

"కన్నడ భాషలో కమ్యూనికేట్ చేసేంతవరకూ మేనేజ్ చెయ్యగలనుగానీ రాయడానికి అక్షరాలుకూడా రావు"

"లాంగ్వేజ్ ఉన్నదే కమ్యూనికేట్ చెయ్యడానికి. అదొస్తే అన్నీ వచ్చినట్టే. తెలుగక్షరాలూ కన్నడ అక్షరాలూ ఒకలాగే ఉంటాయి. గట్టిగా ప్రయత్నిస్తే వారం రోజుల్లో నేర్చేసుకోవచ్చు. కాబట్టీ అదేం సమస్య కాదు"

"కానీ గ్రామర్, నుడికారం వాక్య నిర్మాణం?"

"అవన్నీ క్లాసులో కన్నడ పాఠాలు చెప్పడానికి పనికొస్తాయి. మీకు తెలుగు ఛందస్సొచ్చా? పద్యం రాయగలరా?"

"రాయలేన్సార్"

"అయినా రైటర్ అయ్యారా లేదా? రచయిత అనేవాడికి రాయడమెలాగో తెలియాలి. భావాల్ని అర్థం చేసుకోవడం తెలియాలి. అర్థమైనదాన్ని అందంగా వ్యక్తంచెయ్యడం రావాలి. హ్యూమన్ ఎమోషన్స్ గురించి తెలియాలి. ఇంకా ఏమేం తెలియాలో అవన్నీ మీకు తెలుసు. అది తెలిసినవాళ్ళకి భాష పెద్ద సమస్యేం కాదు. కాబట్టీ మీరు రైటర్ గానే జాయినవ్వండి. అవసరం అనుకుంటే రాసిందాన్ని నాకో, గోపాల్ వాజపేయికో చూపించండి. చూద్దాం మీరు కన్నడంలో ఎందుకు రాయలేరో. మీరు రైటర్ కాకపోతే మీరడిగిన ఏ ఉద్యోగం అయినా ఇచ్చేవాడిని. అయినా క్రియేటివిటీతో పనిలేని ఉద్యోగాలు అడగాలని మీకెందుకనిపించింది?"

"నన్ను రైటర్ గా రిక్రూట్ చేసుకోవడానికి మేనేజ్ మెంట్ ఒప్పుకోదేమోననీ"

"మేనేజ్ మెంటుకి ఎవర్ని తీసుకోవాలో ఎందుకు తీసుకోవాలో తెలిసేట్లయితే ప్రోగ్రామింగ్ డిపార్టుమెంట్లో కూడా వాళ్ళే వచ్చి కూర్చునేవాళ్ళు. మీరు సంకోచించడానికి కారణం అదికాదుగానీ అసలు సంగతి చెప్పండి"

"వేరే సంగతేం లేద్సార్"

"అంటే మీరు రైటర్ కాదేమో అని మీకే అనుమానమా?"

"గుండె పగిలే జోక్ సార్. మన కన్నడిగులకి ఆత్మాభిమానం ఎంతుంటుందో స్వభాషాభిమానం కూడా అంతే ఉంటుందని నాక్కూడా తెలుసు. అలాంటివాళ్ళు పరభాషీయుల్ని రైటర్స్ గా..,"

"కరెక్ట్.., మాకు భాషాభిమానం ఎక్కువ. అందుకే ఏ భాషవాళ్ళనైనా గౌరవిస్తాం. వాళ్ళనీ మాతో కలుపుకుపోతాం"

"కానీ రాజ్యోత్సవం సందర్భంగా నవంబర్ నెలంతా గోడలమీదా సైన్ బోర్డులమీదా పరభాషల్లో అక్షరం కనిపిస్తే చాలు దానిమీద తారు పుయ్యడం చొక్కాలు చింపడంలాంటి పనులు చేస్తూంటారుగా?"

"అదా? మేం వ్యతిరేకించేది పరభాషీయుల్ని కాదు. వారి దాష్ణీకాన్ని. ఇంతేనా ఇంకా ఏమైనా ఉందా?"

"నిజానికి మనం ఏ భాషలో రాయాలనుకుంటున్నామో ఆ భాషలో ఆలోచించడం రావాలి. నాకు కన్నడంలో ఆలోచించగలిగినంత సాంస్కృతిక నేపథ్యం లేదు"

"మీరు కన్నడంలో ఆలోచించలేరని నాకూ తెలుసు. కానీ తెలుగులో ఆలోచించి రాస్తే అది కన్నడిగులకి కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనాన్ని పోగొట్టుకోకూడదనే మిమ్మల్ని రైటర్ గా జాయినవ్వమంటున్నాను. ఇంక సాంస్కృతిక నేపథ్యం అంటారా? అది చేరాక ఎలాగూ సమకూరుతుంది. ముందు మంచిరోజు చూసుకుని జాయినైపోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్"

(ఇది గల్పికేగానీ క’ల్పిక కాదు. ఈటీవీ కన్నడ వాహిని ప్రోగ్రామింగ్ హెడ్ ఎస్ సురేంద్రనాథ్ గారు చేసిన ఇంటర్వ్యూ. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది జరిగిన మర్నాడే నేను కన్నడ రచయితగా జాయినైపోయాను. రాయడం నేర్చుకుని రచయితగా కొన్ని వందల టీవీ కార్యక్రమాలకి పరికల్పన, నిరూపణా సాహిత్యం, మాటలు, పాటలు అందించాను. కానీ కథ, నవల మాత్రం రాయలేదు. ఎందుకంటే రచయితలోని కథకుడి భాష శాస్త్రీయంగానూ సూత్రబద్ధంగానూ ఉండాలి. ఇప్పుడిప్పుడే ప్రయత్నం మొదలుపెట్టాను)

పాల ఐస్క్రీమ్ - చుక్కా శ్రీనివాస్

విమానాశ్రయంలో తాత, నాన్నమ్మలను చూడగానే పరిగెత్తూకెళ్ళి, "తాత, తాత మనం ఇండియాకు పోగానే నీకు తాత వాళ్ళు మంచి, మంచి  పాల ఐస్క్రీమ్ కొనిపెడుతారు అని అమ్మ చెప్పింది..అది ఏంతా  బాగుంటుందో .. ఇప్పుడు తిందామా, ఇప్పుడు తిందామా?" అని గుక్క ఆపుకోకుండా, చిన్న చేతులు తిప్పుతూ నాలుగేళ్ళ రఘు ..... అమ్మ, నాన్నను వాళ్లతో మాట్లాడే అవకాశం ఏ మాత్రం ఇవ్వకుండా, తాత మీది ఎగురుతూనే ఉన్నాడు...

"ఇప్పుడే వద్దు నాన్నా! ఇంటికి పోయి, ఈ సామాను ఇంట్లో పెట్టి, స్నానం చేసి కొంచెంసేపు అయినాక తప్పకుండా పోదాం రా .. అసలే ఎండ, ఉడకపోత. కొంచెం తాత, నాన్నమ్మ లతో ఒక క్షణమైన మాట్లాడనీయిరా..  అత్తయ్య,  ఎప్పుడో ఒక్కసారి అంటే ఒక్కసారి తిన్నాం కాలిఫోర్నియాలో, వీడికి పాల ఐస్క్రీమ్ అంటే ఎంత ఇష్టమో, మా దగ్గరేమో   దొరికి చావదు ఎక్కడా అని అన్నా...చంపుకు తింటున్నావురా నాయనా" అంది సుమ విసుక్కుంటూ, సముదాయిస్తూ.

"వీడికి ఏం వచ్చిన అసలు ఆగదు, అనిపించింది అప్పుడే కావాల్సిందే అమ్మ" అని విసుక్కుంటూ,  "అమ్మ, నాన్న,  అసలు మీరెట్లా  ఉన్నారు" అన్నాడు కారు దగ్గరికి బాగ్స్ తోస్తూ ప్రభు.

"చిన్న పిల్లవాడురా, వాడు కాకపొతే, మనం సతాయిస్తామా? ఇది ఒక పెద్ద సమస్యనారా? మనింటికి దారిలోనే మల్లేశ్వరంలో ఉంది అమృత. అద్భుతమైన పాల ఐస్క్రీమ్ దొరుకుతుంది. రెండు క్షణాల్లో తిని పోదాంరా!!" అని అనకముందే

"Yeah, Yeah , తాత" అన్నాడు ఎగిరి తాతకు ముద్దులిస్తూ రఘు.

"అబ్బా!! అమృతలో ఐస్క్రీమ్ తిని ఎన్ని సంవత్సరాలయిందో” అంది సుమ చిన్నపిల్ల అయిపోతూ.

షాప్ దగ్గర ఆగగానే, ".. అందరికి మంచి వెనిల్లా ఐస్క్రీమ్ ఇయ్యి అమ్మ తొందరగా..ఆమెరికా నుంచి వస్తున్నారు పాల ఐస్ క్రీం కోసం ఇప్పుడే దిగుతున్నారు" అంది నానమ్మ  నవ్వుతూ.

అప్పుడే ఎక్కడి నుంచి వచ్చారో, మురికి బట్టలలో,  చెరిగిన జుట్టుతో  - ఒక తల్లి, వెంట ఐదేళ్ల బిడ్డ -

"అయ్యా, అయ్యా.. ధర్మం చేయి సామీ. అమ్మ, ఏమి తినలేదమ్మ, పొద్దటి నుంచి ఏమి తినలేదమ్మా అని తల్లి చేతులు చాస్తూ, అడుక్కొంటూ.

ఆ బిడ్డ గోడ మీద ఐస్క్రీమ్ బొమ్మను చుస్తూ, రఘు తో కళ్ళ లో కళ్ళు కలుపుతుంటే,...

"చిల్లర లేదమ్మ, పో అమ్మ, పో అమ్మ !!" అన్నాడు తాత జేబులు తుడుముకొంటూ....

"నా దగ్గర కూడా ఏం లేదు, పో పో అమ్మ!! ఎప్పుడు, ఎక్కడ చూడు ఇది ఒక న్యూసెన్స్, పాడు గోల" అని నిస్సహాయంగా, కోపంగా నాన్నమ్మ విసుక్కోవడం వినిపించి -

రఘు ఆ అమ్మాయి వైపు, తాత, నానమ్మ, అమ్మ, నాన్నను మార్చి మార్చి వింతగా, అయోమయంగా చూడసాగాడు.

రెండు, మూడు సార్లు అడిగి, ఇక లాభం లేదని ఆ తల్లి చేయి పట్టి గుంజుకు పోతుంటే, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రఘు కళ్ళలో అట్లా చూస్తూనే ముందుకు నడిచింది....

రఘు ఎందుకో..., "అమ్మ, అమ్మ, ఇంటికి పోదాం, ఇంటికి వెళ్ళిపోదాం... నాకు ఐస్క్రీమ్ వద్దు వద్దు" అని గొడవ చేస్తూ....

" ఇంతలో ఎమయిందిరా!!  ఐస్క్రీమ్ తిని పోదాం నాన్న" అని బ్రతిమిలాడినా వినకుండా ఏడుస్తూ...

" వాట్ నాన్సెన్స్" అని ప్రభు విసుక్కొంటుంటే,

"ఏం పిల్లవాడు రా నాయనా, నస బెట్టి, చంపుకు తింటున్నాడు!!" అని విసుక్కొంటూ ఐస్క్రీమ్ ప్యాక్ చేయించుకొని ఇంటికెళ్లారు తొందరతొందరగా..

రఘు మళ్ళీ ఐస్క్రీమ్ గురించి ఎప్పుడు అడగ లేదు, తినలేదు.

బఫే (లో) డిన్నర్ - అత్తలూరి విజయలక్ష్మి

“బిందూ గెట్ రెడీ మారేజ్ కి వెళ్ళాలి... త్వరగా రెడీ అవు” అన్నారు ఆయన ఆఫీస్ నుంచి వస్తూనే.

“ఎవరిదీ మారేజ్” అడిగాను.

“ఎవరిదేంటి? మర్చిపోయావా. మా బాస్ వాళ్ళ అమ్మాయి పెళ్లి కదా!” అవును కదా నా మతిమరుపుకి తిట్టుకుంటూ లోపలికి వెళ్లాను రెడి అవడానికి.

సరిగ్గా ఏడింటికి మా కారు నాచారం వైపు వెళ్ళింది.

“గిఫ్ట్ ఏమీ తీసుకోలేదు కదా.. వెండి షాపు దగ్గర ఆపండి ఏదన్నా తీసుకుందాం” అన్నాను.

“మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్లకి ఆనదులే... అవసరం లేదు.. వెళ్లి అక్షింతలు వేసి, వాళ్ళు పెట్టిందేదో తిని వద్దాం చాలు” అన్నారు.

“గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్తే ఏం బాగుంటుంది” అని నేను నసుగుతుంటే .. “ఆయన అడ్డంగా ఎడం చేయి, కుడి చేత్తో సంపాదించాడు. మనం వేయి రూపాయలు పెట్టి కొన్నదానికి విలువ ఉండదు..” అంటూ వాళ్ళ బాస్ అవినీతి  గురించి చెప్పసాగారు..

కారు వేన్యు చేరింది.. అదొక గార్డెన్ ... గేటు దగ్గరనుంచి డెకరేషన్ మొదలైంది మొత్తం ప్రాంగణం అంతా లైట్లతో దేదీప్యమానంగా ఉంది. విపరీతంగా జనం ...” మొత్తం ఆఫీస్ ని పిలిచాడు.. అందరూ ఫ్యామిలీస్ తో వచ్చేశారు” అన్నారు ఆయన.

ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ ఆ విశాలంగా ఉన్న గార్డెన్లో చాలా దూరం నడిస్తే కానీ కళ్యాణ వేదిక కనిపించలేదు. ఎటు చూసినా కళ్ళు చెదిరే అలంకరణ ... వేదిక కూడా చాలా పెద్దగా ఉంది. మగవాళ్ళంతా సూట్ లు ఆడవాళ్ళంతా పట్టుచీరలు, బంగారు నగలు, మెరిసిపోతున్నారు. వేదిక మీద ఉన్న వధువు తో సహా అటు, ఇటు బంధువులంతా డైమండ్స్, కెంపులు, పచ్చలు  తాపడం చేసిన ఆభరణాలతో మిరుమిట్లు గొలిపేలా ఉన్నారు. పెద్ద సింహాసనాల్లో కూర్చున్న వదూవరులను చూస్తూ “అదేంటి పెళ్లి ఇప్పుడు కాదా” అడిగాను.

“ఇది రిసెప్షన్.. పెళ్లి పదకొండు గంటలకి ...రా అక్షింతలు వేసేద్దాం” అంటూ పెద్ద క్యూ దగ్గరకి లాక్కెళ్ళారు నన్ను.  అందరూ ఇలా వచ్చి ఇప్పుడే అక్షంతలు వేయడం ఏంటో...తాళి కట్టకుండా అనిపించింది కానీ, ఈ మధ్య పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కదా.. తాళి సమయానికి అటు పక్క బంధువులు, ఇటు పక్క బంధువులే కదా ఉండేది అని సరిపెట్టుకుంటూ నిలబడ్డాను.

త్వరగానే కదిలింది క్యూ అంత మంది ఉన్నా. మేము ఎవరో, ఎందుకు పెళ్ళికి వచ్చామో అక్కడ ఉన్న వాళ్ళకీ ఎవరికీ  తెలియదు.. ఆఫీస్ వాళ్ళు అనుకోడం వినిపించింది.. పరస్పరం  అతికించుకున్న చిరునవ్వులు పంచేసుకుని అక్షింతలు వేసి, ఫోటోకి పోజు ఇచ్చి వేదిక దిగే సరికి ఊపిరాడనట్టు అయింది నాకు.

“హలో శ్రీధర్ వచ్చావా” ఎవరో కొలీగ్ ఆయన్ని పలకరించి,  నా మిసెస్ అంటూ పక్కనున్నావిడని కూడా పరిచయం చేశాడు. మా ఆయన కూడా నన్ను వాళ్లకి పరిచయం చేశాక, రండి డిన్నర్ స్టార్ట్ అయింది అంటూ డైనింగ్ హాల్ వైపు నడిచారు వాళ్ళు. మేము అనుసరించాం. అప్పటికే అక్కడ జనం క్రిక్కిరిసి ఉన్నారు. చాలా విశాలంగా ఉంది డైనింగ్ హాల్ ... ఆహారపదార్థాలు అన్నీ సెక్షన్స్ గా చేసి, పేర్లు రాసి పెట్టారు. మధ్యలో రక, రకాల కూరగాయలతో పక్షులుగా, కొంగలుగా అలంకరించారు.. పూలతో రాదా కృష్ణులను, ఇంకా ఏవో రక, రకాల బొమ్మలను చేశారు.. ఆ కళకి నిజంగా ఎంత ఇచ్చినా చాలదనిపించింది.

“నైన్టీ వెరైటీస్ పెట్టారంట ఫుడ్ ... స్వీట్స్ థర్టీ” అంట చెబుతూ రండి ప్లేట్స్ తీసుకుందాం అంటూ కూరగాయలతో చేసిన  ఉద్యానవనం లాంటి చోటికి నడిచారు వాళ్లిద్దరూ. ఆ జనం మధ్య ఎలా వెళ్ళాలో తెలియక మేమిద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం ... పద వాళ్ళతో వెళ్దాం  అన్నారాయన. నాకు అలా జనాలని తోసుకుంటూ వెళ్ళడం చాల సిగ్గుగా, మొహమాటంగా అనిపించింది.  ఇదిగో ప్లేటు అంటూ అక్కడ చిన్నపాటి యుద్ధం చేసి ప్లేట్స్ సంపాదించుకుని మాక్కూడా చేరోకటి ఇచ్చారు ..ప్లేట్స్ పట్టుకుని దిక్కులు చూస్తూ నిలబడ్డం ... వాళ్ళిద్దరూ ఆ పద్మవ్యూహం లోకి ఎలాగోలా చొరబడ్డారు.. మేము ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియక అటూ, ఇటూ తిరుగుతున్న వాళ్ళు చెరోవైపు తోస్తుంటే పడిపోకుండా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుని నిలబడ్డాం ... వెళ్ళే వాళ్ళు తోసుకుని వెళ్తున్నారు, ప్లేట్స్ నిండా ఏవేవో ఐటమ్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళు వస్తున్నారు.. మారు పెట్టుకోడానికి వెళ్లి చేతుల నుంచి ఎంగిలి మెతుకులు పడుతుంటే, ఎంగిలి పళ్ళాలు పదార్ధాల మీద పెట్టి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు ... అంతా గందరగోళంగా , అయోమయంగా ఉంది.

వెళ్ళిపోదామా ఇంటికెళ్ళి తిందాం అన్నాను ఆయనతో.

పద అంటూ పళ్ళాలు ఎలాగోలా చోటు చేసుకుని వెళ్లి అక్కడే  పెట్టి వచ్చారు.

ఇద్దరం కారులో కూర్చున్నాక ఊపిరి పీల్చుకుంటూ సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. పాతికేళ్ళ క్రితం రామాలయంలో కొబ్బరి మట్టల కళ్యాణ మంటపంలో మంచి గంధం, మరువం, మల్లెల గుబాళింపుల్లో,  జీలకర్ర, బెల్లం పెట్టగానే కురిసిన అక్షింతల వాన,  లేత అరిటాకుల్లో  కొసరి, కొసరి ఆప్యాయంగా వడ్డించిన పులిహోర, ఆవడ, పూర్ణం బూరెలు, వగైరా గుర్తొచ్చి నిజం చెప్పద్దూ... నోరూరింది... మళ్ళి ఎప్పుడొస్తుందో అలాంటి రోజు.

Posted in April 2019, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *