Menu Close
Alapari Saavu Katha

హే ప్రభు యేసూ ........హే ప్రభు యేసూ ......సిల్వధరా ....పాపహరా ....శాంతిపరా ....చర్చి మైకులోంచి పెద్దగా వినిపిస్తున్నది పాస్టర్ గారు పెట్టిన పాట. నులకమంచం లో బద్ధకంగా ముసుగు పెట్టి పడుకున్న రూతు "అబ్బో అప్పుడే తెల్లారి పొయిందా"అని ముసుగు తీసి, కళ్ళునులుముకుంటూ ఆకాశం కేసి చూసింది. ఏడెనిమిదేళ్ళ రూతుకు ఎప్పుడూ ఆశ్చర్యమే. రాత్రిపూట ఆకాశంలో నిండుగా మెరుస్తున్న చుక్కలన్నీ తెల్లారేసరికి ఎక్కడికి వెళ్ళి పోతాయో అని. అవ్వ నడిగితే నెత్తిమీదో దెబ్బవేసి "అన్నీ కావాలీ పిల్ల ముండకి ....యాడికెల్తే నీకెందుకే. పో.. పొయ్యి ముకం గడుగు" అని నెడుతుంది. మళ్ళీ తనే ..."కుంటిముండ ...."అని దగ్గరికి పొదువుకోని,"వాటికి సెంద్రుడు మావైతే సూరీడు అత్త ...అత్తంటే వాటికి భయం ....అందుకే సూరీడుని జూడంగనే పారిపోతై ..."అని కట్టుకథేదో చెబుతుంది. అయ్యనడిగితే ....."నిన్ను బళ్ళో జేర్పిచ్చింది ఎందుకూ?పో.. పొయ్యి పొంతుల్నడుగు" అని అన్నింటికీ పంతులుగారి మీదకే నెడతాడు. "ఇయ్యాల ఆదివారం బడిలేదు రేపు టీచర్ గారిని అడగాల ...."అని గట్టిగా మనసులో నిర్ణయం తీసుకుంది  రూతు.

అట్టే పోషణలేని ఉంగరాల జుట్టూ ...నేరేడు పళ్ళలా మెరిసే కళ్ళు .....చిన్నప్పుడు పోలియో వల్ల ...సన్నగా చిన్నదైపోయిన కాలూ ...ఇది స్థూలం గా రూతు రూపం. కానీ సహజం గా చిన్న పిల్లల్లో ఉండే కుతూహలం. చక్కని గొంతుకా ..ఎగసిపడే ఉత్సాహం ...మొహమ్మీది కల్మషం లేని నవ్వూ ఆ పిల్లని నలుగుర్లో ప్రత్యే కంగా నిలబెడతాయి. చదువులో గూడా టీచర్ చెప్పేది వినటం బాగా చదువుకోవటం వల్ల మంచిపేరే ఉంది బళ్ళో రూతుకు. కానీ "కుంటిదానా "అని అందరూ పిలవటం ఆ పిల్లకు చాలా బాధ కలిగించేది. "నన్ను ఆస్పత్రికి తీసుకుపో నానా .....నా కాలు బాగవుతుందీ"అని ఈమధ్య కాస్త ఊహవచ్చిన దగ్గరినుంచీ వాళ్ళ నాన్న ప్రాణంతీస్తోంది. తెల్లారి రూతు నిద్దర లేచేసరికి అమ్మ ఎప్పుడూ కనబడదు రూతుకి. పొద్దునే లేచి పాచి పనులకు వెళుతుంది రూతు తల్లి. మూడేళ్ళ తమ్ముడిని బడిగంట కొట్టేదాకా ఆడించుకొని అవ్వచేత జడేయించుకొని బడికి పరుగెడుతుంది. బడి దగ్గర్లోనేగనక పదిగంటలకు రూతుకు బళ్ళో ఒంటేలు బెల్లు కొట్టగానే పడుతూ లేస్తూ ఇంటికొస్తుంది ....అప్పుడు అమ్మ పాచిళ్ళనుంచి తెచ్చిన అన్నమో రొట్టెలో ఆవురావురు మంటూ తిని బళ్ళోకి పోతుంది. గవర్నమెంటు వారి మధ్యాహ్న భోజనపధకం లో అన్నం తిని సాయంత్రానికి ఇల్లుచేరుతుంది. పొద్దుగూకాక బువ్వతిని నానమ్మతో పాటు నులకమంచంలో పడుకుని నానమ్మ చెప్పే కధలు నిద్రలోకి జారటం రూతు దినచర్య.

ఆరోజు ఆదివారం. లేచి చర్చికి పరుగెత్తింది రూతు. చర్చిలో పాటలు బాగా పాడుతుంది గనుక ఫాస్టరుగారెప్పుడూ రూతుని ప్రత్యేకంగానే చుస్తారు. మధ్యాన్నం దాక చర్చి లోనే గడిపి అక్కడే అన్నంతిని ఇంటికొచ్చి ఆటల్లో మునిగిపోయింది రూతు. నాన్న ఇంటికి రాగానే నాన్న పక్కనచేరి "నానా! డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెల్తావ్!" గొడవ పెట్టుకుంది. తల్లికూడా "డాక్టర్కి సూపిద్దాం ...ఆడపిల్ల కాలు లేకపోతే పెళ్ళికాదు దీనికి సూపించుదూ ..." అని వత్తాసు పలికింది. అంతటితో వూరుకోకుండా ..."రాత్రయ్యే సరికి సంపాయించింది మొత్తం తాగకపొతే ఎంతమంది డాక్టర్లకైనా చూపించొచ్చు ..." అని నాలుగు పుల్లవిరుపు మాటలు కూడా మాట్లాడేసింది. దానికోసమే ఎదురుచూస్తున్నట్లు ...తినే పళ్ళెం విసిరికొట్టి పెళ్ళాన్ని జుట్టుపట్టి నాలుగు దెబ్బలేసి, అడ్డొచ్చిన తల్లిని గోడకేసి నెట్టి బుతులు తిడుతూ బజార్న పడ్డాడు. అత్తా కోడళ్ళకి అర్ధమై పోయింది. ఇంక రాత్రికి వాడు తాగొస్తాడు. వచ్చాక తమకి బుతులూ, తన్నులూ తప్పవని. అలవాటయిన భాగోతమే గనక నిట్టుర్చి వాళ్ళ పనుల్లో పడిపోయారు. రూతు తండ్రి అంజయ్య. చెక్కరిక్షా తోల్తాడు. రాత్రికి సంపాయించిన దాంట్లో పదో, పాతికో పెళ్ళానికి పారేసి తాగి పడుకుంటాడు. కానీ అదుపులొనే వుంటాడు. ఇట్లా తిక్కరేగిన రోజు ఎంత తాగుతాడో ఏం చేస్తాడో వాడికే తెలీదు.

ఇంట్లోనించి రోడ్డుమీదకి వచ్చాక వాడికి నాగయ్య  కనిపించాడు. నాగయ్య లోకల్ ఎమ్మెల్యే దగ్గర అనుచరుల్లో ఉంటాడు. ఎమ్మెల్యే అంటే చాలా ఇష్టం వాడికి. నమ్మకంగా ఉంటాడు గనక కాస్త పనులు అప్పజెపుతుంటాడు ఆయన కూడా వీడికి. అసలేఎన్నికలు దగ్గర పడుతున్న రోజులు. వూళ్ళో వాతావరణం వేడిగా ఉంది.నాగయ్య దగ్గర కూడా డబ్బులు బాగానే ఆడుతున్నట్లున్నాయి. "రా పోదాం."అంటూ దారితీశాడు మందు షాపుకి. ఫ్రీ గా వచ్చే మందు ...అంతకంటే ఇంకేం కావాలి. పండగే అంజయ్యకి. తాగినంత తాగి రోడ్డున పడ్డాడు. రాత్రికి ఇల్లు చేరనే లేదు. రోడ్డుమీద ఎక్కడోపడిపోయి తెల్లారి ఎప్పటికో ఇల్లు చేరాడు. ఆ రోజుకి గండం గడిచింది తల్లికీ పెళ్ళానికీ. రోజులు గడుస్తున్నాయ్. రూతు అపపుడప్పుడూ అడుగుతూనే ఉంది. "నాన్నోయ్ నా కాలు డాక్టర్కి చుపించవా" అని. ఒకరోజు గవర్నమెంటు ఆస్పత్రికి వెళ్ళొచ్చారు. ఇక్కడ ఆపరేషన్ కుదరదనీ ...తన ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తాను. ఒక యాభై వేలు ఖర్చు అవుతుందనీ చెప్పాడు ఆ డాక్టర్. అంజయ్య ‘యాబై వేలా!!’ అని నోరు వెళ్ళబెట్టాడు. తను ఎక్కడినుంచి తేగలడు అంత డబ్బు ...నాగయ్య  అప్పుడప్పుడూ మందు పోయిస్తూనే ఉన్నాడు అంజయ్యకి. ఒకరోజు అడిగేడు అంజయ్య ....."అన్నా! నాకూతురికి కాలు ఆపరేసన్ జెయ్యాల ఎమ్మెల్యే గారు ఏమన్నా సాయం జేత్తాడేమో"అంటూ. అయితే రేప్పొద్దున్నే రా నేను అక్కడే ఉంటా హామీ ఇచ్చాడునాగయ్య.

మర్నాడు భయంగానే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు అంజయ్య. ఎమ్మెల్యే కి పరిచయం చేశాడు నాగయ్య. చేతులు కట్టుకుని కూతురి సమస్య వివరించాడు అంజయ్య "సరే చూద్దాం ..."అని తలూపాడు ఎమ్మెల్యే. సంతోషంగా ఇల్లు చేరాడు అంజయ్య. రూతుని వళ్ళో కూచోబెట్టుకుని "నీకాలింక బాగవుతుంది బిడ్డా !!"అన్నాడు ఆనందంగా. రూతు ఆనందానికి అవధుల్లేవు. "నా కాలింక బాగవుతుందోచ్ ...."అంటూ అందరితో చెప్పుకుంటోంది. అంజయ్య అడుగుతూనే ఉన్నాడు నాగయ్యని. చూద్దాం ....చూద్దాం ...అంటున్నాడు నాగయ్య. ఇంతలోనే రూలింగ్ పార్టీ సీట్ల పందారం మొదలు పెట్టింది. ఆ ఊళ్ళో పార్టీకి ఎంతో సేవజేసిన పాత నాయకుడికీ,  కొత్తగా పోటీ చేస్తున్న కొత్తనాయకుడికీ పోటీ తీవ్రంగా ఉంది. ఊరంతా సీటు ఎవరికి దొరుకుతుందో అన్న ఉత్కంఠత నెలకొంది. నాగయ్య అస్సలు దొరకటం లేదు అంజయ్యకి. విజయవాడలోనే ఎమ్మెల్యేతో మకాం. ఎన్నిసార్లు ఇంటిచుట్టూ తిరిగినా నాగయ్య లేడంటున్నారు. రూతు గొడవ ఎక్కువయింది ."నానోయ్ నాకాలు అంటూ ....."ఇంతలో ఒకరోజు నాగయ్య  కనిపించాడు. మళ్ళీ మందు షాపుకి వెళ్ళారు ఇద్దరూ ......నెమ్మదిగా అడిగాడు అంజయ్య ..."అన్నా ..నాకూతురి కాలు"అంటూ. నాగయ్య "సరే సరే ..కానీ ఎమ్మెల్యే గారు చాలా టెన్షన్ గా ఉన్నారు. ఈసారి సీటు వస్తుందో రాదో అని అయినా నేను చెబుతాను రేపు పొద్దున ఎమ్మెల్యే గారింటిరా"అని వెళ్ళి పోయాడు.

తెల్లారి అంజయ్య ఎమ్మెల్యే ఇంటికి ....వెళ్ళాడు. నాగయ్య  కనిపించాడు. ఎమ్మెల్లే దగ్గరికి తీసుకెళ్ళాడు. "అన్నా! ఈడూ నాతోబాటే నీ అభిమాని పరిచయం చేశాడు "ఇంతకీ పనేందన్నా? అడిగాడు అంజయ్య "తరవాత చెబుతాలే. నువ్వు పద" అన్నాడు నాగయ్య . "అదికాదన్న ...అసలుపనేమిటో ....చెబుతే "గొణిగాడు అంజయ్య. "నేను చెబుతాగా నువ్వెళ్ళు ...సాయంత్రం కలుద్దాం ..." అన్నాడు నాగయ్య. సాయంత్రం కలవడం అంటే ..తెలుసు గనక నేరుగా మందు షాపుకే వెళ్ళాడు అంజయ్య. ఇద్దరూ సరిపడా తాగారు. మాట్లాడాల్సిన మాటలయిపోయాయి. కాని, అంత తాగినా అంజయ్య భయం పోలేదు."అన్నా ఇందులో రిస్కేమీ లేదుగా. ...." దీనంగా అడిగేడు నాగయ్యని. ...నాగయ్య తేలిగ్గ తీసేస్తూ ....."ఎహే ..ఇందులో భయపడేది  ఏముంది? నువ్వొక్కడివే కాదు ...నీతో పాటు నేనూ ...ఇంకోడూ కూడా అదేపని చేస్తున్నాం. రిస్కేముందీ .....కాసేపు టెన్షన్ భరించాలి అంతే ...." అన్నాడు నాగయ్య. "ఇది మాత్రం రహస్యంగా జరగాల ...ఇంట్లో కూడా సెప్పమాక. శ్రమలేకుండా మూడ్రోజుల్లో యాభైవేలు. నువ్వువల్ల కాదంటే చెప్పు ఇంకోళ్ళకి చెబుతా ..." అని విదిలించాడు నాగయ్య. "సరే అన్నా సేత్తాలే ..నువ్వు కూడా వుంటానన్నావుగా ...సరేలే "అంటూ వొప్పుకున్నాడు అంజయ్య. "నానోయ్ ...నాకాలు ...అంటా వెంటబడే రూతు మొహమే కళ్ళలో కనిపిస్తోంటే ....."

ఆరోజు ఊరంతా చాలా సందడిగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ ఊరికొస్తున్నారు. ఇద్దరు నాయకులూ ఒకరిని మించి ఒకరు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్ షెల్టర్ల దగ్గరినుంచీ, పబ్లిక్ టాయిలెట్ల దాకా ఎన్నో ప్రారంభోత్సవాలూ ఉన్నాయ్. పొద్దుటి నుంచీ ఒకరిని మించి ఇంకొకరు జన సమీకరణ చేస్తున్నారు. అందరినీ తెల్లారిన దగ్గరినించీ వీధి నాయకులు ఇంటికి వచ్చి మరీ పిలుచుకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి గారి సభకోసం. ఎవరి ఇంట్లోని పిల్లినీ పొయ్యిలోనించి లేవనివ్వటం లేదు. కాఫీ టిఫిన్ ల తో సహా మేమే ఇస్తాం రమ్మంటున్నారు. ముసలీ ముతకా అందరినీ ఆటోల్లో తరలిస్తున్నారు. రాత్రినించీ నిద్రలేదు అంజయ్యకు. కాస్తో కూస్తో  తాగినా అది ఎక్కటం లేదు. భార్య ఏందయ్యా వంట్లో బాగోలేదా ...అని పలకరించ బోయినా విసుక్కున్నాడు. ఆరాత్రికి తల్లి పళ్ళెంలో పెట్టిచ్చిన వేడి వేడి మెతుకులు తిన్నాననిపించి లేచాడు .ఎవరితోనూ పలక్కుండా ముసుగేసి పడుకున్నాడు.

తెల్లారి లేచీ లేవకుండానే ....నాగయ్య మనిషిని పంపించాడు తొందరగా రమ్మని ...ఎమ్మెల్యే ఇంట్లోనే అందరూ కలిశారు. తిన్నంత చికెనూ ...ఖరీదైన మద్యం. "జాగ్రత్త రోయ్ మరీ తాగమాక " హెచ్చరించాడు నాగయ్య. మధ్యాహ్నం పార్టీ ఆఫీసుకువచ్చారు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అందరూ. ఇంతలో గుంపులోనించి నాగయ్యా, అంజయ్యా, ఇంకో వ్యక్తీ చేతిలో పెట్రోల్ క్యాన్లతో వచ్చారు. “ఎమ్మెల్యే జిందాబాద్! మళ్ళీ సీటు మా ఎమ్మెల్యే గారికే ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే అన్నకే సీటు ఇస్తానని హామీ ఇవ్వాలి. లేకపోతే మా ప్రాణాలు తీసుకుంటాం” అని ఆవేశం గా పెట్రోల్ వంటిమీద గుమ్మరించుకున్నారు. టీవీలూ, పేపర్ల విలేఖరుల కెమేరాలన్నీ అటువైపు తిరిగాయ్. ఒక రెండు నిముషాల పాటు డ్రామా నడిచింది. ఇంతలో నాగయ్య ఎవరికో సైగ చేయటం, అతను అంజయ్య వెనకనుండి లైటర్ లాంటిదేదో వెలిగించటం క్షణాల్లో జరిగి పోయింది. నాగయ్యా, ముడోవ్యక్తి ఇద్దరూ తప్పుకోవటం వారిని పోలీసులు పక్కకి లాగెయ్యటం జరిగి పోయాయి. నిలువెల్లా అగ్నిశిఖలా మండిపోతూ, అక్కడక్కడే గిరగిరా తిరుగుతూ కేకలు పెడుతున్న అంజయ్యని చిత్రీకరించటంలో కెమెరాలు పోటీ పడుతున్నాయి. ఎవ్వరూ అతనిని రక్షించే ప్రయత్నం చెయ్యటం లేదు. జనం కేకలుపెడుతూ కకావికలమై తప్పుకున్నారు. ముఖ్యమంత్రినీ ,నాయకులనీ పొలీసులూ, సెక్యూరిటీ క్షేమంగా తరలించారు. హృదయవిదారకంగా అరుస్తూ కాలిపోతూ అంజయ్య కుప్పకూలాడు. అబులెన్స్ లో స్థానిక  అసుపత్రికి తరలించారు అంజయ్యని.

సాయంత్రానికి పోస్ట్ మార్టం చేసి నల్లగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేని మాసం ముద్దని తెచ్చి ఇచ్చారు అంజయ్య భార్యకి. ఈలోగా టీవీల్లో పదే పదే నిలువెల్లా కాలిపోతున్న అంజయ్యని చూపిస్తూ ....రేటింగులు పెంచుకున్నారు టీవీ వాళ్ళు. అసలు మీటింగ్ కి ఎందుకు వెళ్ళాడో ..ఎందుకలా సజీవ దహనమయ్యాడో తెలియని అంజయ్య భార్య ఆ షాక్ నుండి కోలుకోలేదు. కన్నకొడుకుని మాంసం ముద్దగా చూస్తున్న ఆ తల్లి రోదనకు అంతులేదు. మరుసటిరోజు ఎమ్మెల్యే మంది మార్బలం తో వచ్చి పలకరించి సంతాపం తెలిపి వెళ్ళి పోయాడు. రూతుకి తండ్రి మరణం అంటే ఏమిటో తెలియలేదు. ఆ కాలిపోయిన మాంసపు ముద్ద తండ్రి అని గుర్తించే ఊహ రాని వయసాపిల్లది. కులపెద్దలకి ఎమ్మెల్యే కొంత డబ్బు ముట్టచెప్పాడు. అందరి తాగుడికీ, దినం ఖర్చులకీ ఆ డబ్బులు సరిపోయాయి. పిల్లల ఆకలీ, ముసలిదాని ఆకలీ తీర్చడానికి అంజయ్య భార్యకి పనికి పోక తప్పలేదు. టీవీల్లో ఓ నాల్రోజులు ...చుక్కల్లో కెక్కినాడు చక్కనోడూ ...పాటవేస్తూ అంజయ్యని చూపించారు. ఆ తరువాత జనం మర్చిపోయారు. ఎమ్మెల్యేకి కూడా మళ్ళీ పార్టీ సీటు దక్కింది. నాగయ్య కూడా ఎమ్మెల్యే కి ముఖ్య అనుచరుడయ్యాడు. కాలం గడుస్తూనే ఉంది.

అప్పుడప్పుడూ రూతు వాళ్ళ అమ్మనో, నానమ్మనో అడుగుతూనే ఉంది "అమ్మా అయ్యేడీ" అంటూ ....వాళ్ళ నానమ్మ కూడా విసుక్కోవట్లేదు ."నానమ్మా అయ్యెప్పుడొస్తాడూ? యాడికెళ్ళాడూ? నా కాలెప్పుడు బాగుచేయిస్తాడూ ?.." అని ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నా నెమ్మదిగా మరపిస్తోంది ."మా నాన్న చనిపోయాడంటగా ...మా క్లాసులో ఏసోబు అన్నాడు. చనిపోవటం అంటే ఏంటి నానమ్మా" ...అని అమాయకంగా అడుగుతుంటే ,"మీ నాన్న ప్రభువు కాడికి యెల్లాడమ్మా" అని చెబుతోంది . "తెల్లారేసరికి చుక్కలన్నీ ఏడకి పోతాయి నానమ్మా" అని అడిగితే, “అవి చనిపోయిన నాన్నలు. రాత్రిపూట వాళ్ళ పిల్లలని చూసుకోవటానికి వస్తారు. తెల్లారగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు” అని గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకొంటూ చెబుతోంది ఆ పిచ్చి తల్లి.

 

0 0 0 0 0 0 0 0 0 0

Posted in April 2019, కథలు

2 Comments

  1. Sundari Nagamani

    పెద్దవారి స్వార్థానికి బడుగుజీవులు బలియైపోవటం పరిపాటిగా కొనసాగుతోంది. చాలా బాధాకరంగా ముగిసింది. పాపం రూతు! ఆకాశంలోని చుక్కలు తెల్లారగానే కనిపించకపోవటానికి భాష్యం చాలా బాగా చెప్పారు చివరిలో. అభినందనలు పద్మజ కుందుర్తి గారూ.

  2. Moorthy

    చాలా బాగుంది కద , కథ కాదు వాస్తవం. పాట చూసి కథ చదివేను. 1980 s లో రేడియో సీలోన్ లో వినే పాట. సిల్వధర పాప హర శాంతి కరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *