Menu Close

Adarshamoorthulu

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిమనిషి జన్మ ఎంతో మహత్తరమైనది. మరి అటువంటి జన్మ మనకు సిద్ధించినందుకు, మన పుట్టుకకు ఒక అర్థం పరమార్థం ఉండాలి. మిగిలిన జీవరాసుల వలె తినడం, నిద్రించడం, యాంత్రికంగా జీవించడం వలన మనకు స్వార్థపూరిత తృప్తి లభిస్తుందేమో కానీ జన్మ సార్థకత మాత్రం సిద్ధించదు.

కొంతమంది మహానుభావుల పుట్టుకకు ఒక నిర్దేశ సూచనలు ముందుగానే లిఖించబడి వారు ఈ భూమి మీద ప్రాణం పోసుకొనిన పిదప అవి కార్యాచరణ దాల్చడం మొదలుపెడతాయి. ఆ కారణజన్ములు మన సమాజ సంస్కృతినీ, పద్ధతులను పదిమందికి పంచి మనిషి జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదపడతారు. అటువంటి మహానుభావుల వరుసలో నిలబడి, తన సాహిత్య ప్రతిభా పాటవాలతో మన ఇతిహాస గ్రంధాలను తెలుగులోకి అనువదించడం మొదలు ఎన్నో శతకాలు, పద్యకావ్యాలు, నాటకాలు వంటి అమూల్య సంపదను మనకు అందించి భావితరాలకు విలువకట్టలేని సాహిత్యాన్ని బహుమతిగా ఇచ్చి తనదైన రీతిలో సహాయ సహకారాలు అందించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు నేటి మన ఆదర్శమూర్తి.

1866 సంవత్సరంలో అక్టోబరు 29 వ తేదీనాడు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఎర్నగూడెం లో మన కృష్ణమూర్తి గారు జన్మించారు. వీరి తల్లి వెంకట సుబ్బమ్మ గారు, తండ్రి వెంకట సోమయాజులు గారు. బాల్యం నుండే వ్యవసాయం, ఆటలు, వేదాధ్యయనం ఇలా అన్ని కళలలో ప్రధముడిగా నిలుస్తూ, అందరి దృష్టిని ఆకర్షించేవారు. చిన్నప్పటినుండే సాహిత్యం మీద ఎంతో మక్కువ, ఆసక్తి చూపిన కృష్ణమూర్తి గారు తన యుక్తవయసులో పద్యరచన చేయడం మొదలుపెట్టి, స్వీయచరిత్రను శ్లోకాల రూపంలో వ్రాయడం మొదలుపెట్టారు.

కవిత్రయం రచించిన మహాభారతం లోని అన్ని పర్వాలను, పదిసంవత్సరాలలో వ్యాసుని మూలానికనుగుణంగా యథాతథంగా ‘శ్రీ కృష్ణ భారతం’గా తిరిగి సృష్టించిన ఘనత కృష్ణమూర్తి గారికే దక్కింది. అందుకే ఆయనను ‘ఆంధ్రవ్యాసులు’ అని సంబోధించేవారు. ఇక ఆయన రచించిన ప్రబంధాలు; నైషదీయ చరిత్రము, మరుత్తరాట్‌చరిత్ర, జగద్గురు చరిత్రము, విజయలక్ష్మి విలాసం, ఏకావళీ పరిణయం..ఇలా ఎన్నో విలువకట్టలేని జాతిసంపదలు. అంతేకాదు నాటి సామాజిక పరిస్థితులను, ఆధ్యాత్మిక విషయాలను  ప్రతిబింబిస్తూ ఆయన రచించిన అనేక స్థల పురాణాలు, నాటి ఆరోగ్య సూత్రాలను, ఆయుర్వేద మెళుకువలను వివరించిన వైద్య విజ్ఞాన దీపిక ‘ధన్వంతరి చరిత్ర’, నాడు జరుగుతున్న స్వాతంత్ర్య సంగ్రామంలో జనులు భాగస్వాములు అయ్యే విధంగా స్ఫూర్తిని నింపే ‘స్వరాజ్యోదయము’, తమ జీవితాలను పణంగా పెట్టి, నాటి ఉద్యమానికి నాయకత్వం వహించిన మహానేతల జీవిత చరిత్రలను చూపించే ‘గాంధీ విజయం’, ‘తిలక్‌ మహారాజు’, వీరోచిత పోరాటాలను, పరదేశీయుల ఆక్రమణను కట్టడిచేసే విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ‘బొబ్బిలి యుద్ధం’  వంటి ఎన్నో నాటకాలు రచించారు. ఈ రచనలు అన్నీ నాటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలలో చైతన్యం నింపేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఆయన రచించిన ‘బొబ్బిలి యుద్ధం’, ‘తిలక్‌ మహారాజు’ నాటకాల్ని నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది అంటే ఆయన కలం యొక్క శక్తి మరియు ఆయన ప్రజల మనసులో ఎటువంటి స్థానాన్ని సంపాదించారో అర్థమౌతుంది.

తన రచనలను ప్రజలలోకి తీసుకెళ్ళి వారిలో స్ఫూర్తిని రగిలించేందుకు ఒక మాధ్యమం అవసరమని తలచి తనే కళావతి, వజ్రాయుధం, వందేమాతరం, గౌతమి వంటి అనేక పత్రికలను కూడా నడిపారు. ద్విశతాధికములైన గ్రంథాలలో వచనాలు, అనువాదాలు, మూల రచనలు, విమర్శనాలు, ప్రహసనాలు తదితర సంస్కృత రచనలు కూడా చేశారు.

ఇంతటి సాహిత్య సంపదను తెలుగు వారికి అందించిన ఆ మహానుభావుని కృషిని గుర్తించకపోవడం అనేది హాస్యాస్పదం అవుతుంది.  1935లో నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి ‘మహామహోపాధ్యాయ’ బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ మొదటిసారిగా కళా ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేశారు. ఆనాడే ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జీవిత కాలపు ప్రభుత్వ ఆస్థాన కవిగా పదవిని పొందారు. తను 1960 డిసెంబర్‌ 29న మరణించేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఇలా ఒకటేమిటి ఎన్నో పురస్కారాలు, సన్మానాలు, బిరుదులూ ఆయన సొంతం. అల్లసాని పెద్దన గారి తరువాత సువర్ణ గండెపెండేరం బహుమతిగా పొందిన ఖ్యాతి మన కృష్ణమూర్తి గారికే సొంతం.

ప్రముఖ అంతర్జాల పత్రిక “ఈ-మాట” లో ‘నా గురువు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి’ అంటూ తన గురువుగారైన శ్రీపాద కృష్ణమూర్తి గారి గురించి శ్రీ వేదుల సత్యనారాయణ శర్మ పంచుకున్న సంగతులను ఆడియో రూపంలో శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు అందించారు. ఆ ఆడియో ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.

http://eemaata.com/em/issues/201411/5862.html

కృష్ణమూర్తి గారి గురించి ‘“సాహిత్య మరమరాలు – వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు” అనే గ్రంథాన్ని మనకు అందించిన శ్రీ మువ్వలు సుబ్బరామయ్య గారు, పుట 270 లో వ్రాసిన ఒక ఆశ్చర్యకరమైన విషయం నన్ను ఎంతగానో ఆకట్టుకొంది. అది యధాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను.

“౧౩. సాహిత్య ధీశాలి:1868 లో రాజమహేంద్ర వరంలో ఓ శిశువు విషజ్వరం వచ్చి చనిపోయిందని గోతిలో పాతిపెడుతుండగా ఆ శిశువుకు చలనం వచ్చింది. ఆ తరువాత ఆ శిశువే అతడుగా మారి 94 సంవత్సరాలు బతికి, తన సొంత చేతితోనే భారతం 18 పర్వాలు, రామాయణం ఏడు కాండలు, భాగవతం 12 స్కందాలు, 97 పద్యకావ్యాలు, 32 నాటకాలు, 5 శతకాలు, 35 వచన కావ్యాలు వ్రాసిన ధీశాలి గా పేరు గాంచాడు. ఆ శిశువే మన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు.”

పై వాక్యాలు చాలు ఆయన గొప్పతనం చాటుకోవడానికి. అటువంటి మహనీయుడు మన తెలుగు నాట పుట్టడం మన అదృష్టం అందుకు మనందరం గర్వించాలి. ఆయన భౌతికంగా మనలను వీడినను, ఆయన పంచి ఇచ్చిన తరతరాలకు తరగని సాహిత్య సంపద మనతో ఉన్నంతవరకు ఆ మహానుభావునికి మరణం లేదు. ఆయన అమరజీవి.

Posted in April 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!