Menu Close
Kadambam Page Title

ఉగాది ప్రత్యేక కవితలు చదవడానికి, ఆయా పేర్ల మీద క్లిక్ చేయండి!!

ఉగాది ప్రత్యేక కవితలు

ఉగాది పద్యాలు - రాఘవ మాస్టారు

వికారి ఉగాదమ్మ సాకారము కావుమా!

తేటగీతి: శ్రీ శుభకరమై తెలుగిళ్ళ సిరులు విచ్చి
చైత్రమాసపు అందాలు ధాత్రికిచ్చి
మా 'వికారి',వికారాలు మాడ్చి వేసి
తెలుగు యిండ్లకు రావమ్మ వెలుగులిచ్చి
తేటగీతి: చిరిగిన బతుకులందున చివురులిచ్చి
శిశిరఋతువు రాల్చినవన్ని చెట్లకిచ్చి
మనుషులందర్కి మమతయు మంచినిచ్చి
ద్రావిడాడ పడుచువమ్మ నీవురమ్ము
తేటగీతి: పరమ హిందు ధర్మములతో పరవశించి
పదము పదము ప్రగతివైపు పల్లవించ
భరతమాత నుదుటబొట్టు భాగ్యరేఖ
ముని మతపు గొప్ప వైభవమ్ము పులకించ
పూవు పూవులా అందాలు పుడమికివ్వు.
తేటగీతి: మనిషి కామ, అర్థములతో మునిగిపోయె
నాది నాదని అహమును ప్రోది చేసి
నీతినియమాలు జగతిన పాతరేసి
వస్తు సంపదకై తాను బానిసయ్యె
తేటగీతి: ఆరు రుచులతో మనిషికి ఆశపోక
స్వార్థమనెడి రుచిమరిగి చాలు అనక
డబ్బు డబ్బను జబ్బుతో గబ్బుగొట్టె
తానిచట శాశ్వతమనుచు తలచుచుండె
తేటగీతి: సత్వగుణము మనుషులకు సతము యిచ్చి
మా తమోరజో గుణములు మాడ్చివేసి
సతము సుఖ శాంతులిచ్చెడి మతమునేర్పి
వర ఉగాదమ్మ రావమ్మ వరములీయ

ఓం శాంతి శాంతి శాంతిః

నాకల(లం) నెరవేరేనా - డా. సి. వసుంధర

“రాయాలనిపించటం లేదు...”
రాతలకందని గత అనుభవాల గాయాలు చూచి
రాసి రాసి విసుగొచ్చి మదినొచ్చి"నే కదలనంటుంది నా రాతల మూలధనం,
ప్రతి వత్సరం ప్రజలను మోసం చేస్తూ
ఈ వత్సరం మనందరికీ మంచే జరుగుతుంది అని నేరాయనుపో” అంది విసుగ్గా విసురుగా నాకలం.
నిజమే మరి
కవి మనసు విఫల స్వప్నాన్ని రుచి చూస్తే దాని సారాన్ని/రూపాన్ని
కాగితంపై ఆవిష్కరించే చిత్రకారుడు కలమే కదా.
ఏటికేడు పెరిగే పెనుగాయాల
కాళ్ళ క్రింద పడి నలిగిపోతున్నాయి మానవ జీవన పెన్నిధులు
మానము, ప్రాణము, మానవునికి నేడు
విలువలేని విషయాలు
విషబీజాలతో ప్రాణం పోసుకొన్న నేటి సమాజం
విష ఫలాలతో నిండిన మహా వృక్షం  
యుద్ధం దాని ప్రతిఫలం
దేశ రక్షణ కొరకే గాదు, నిత్యజీవనంలో కూడా
పోరాట ఆరాటాలే
మనల్ని రక్షించడం కొఱకు అక్కడ పోరాటం
మనల్ని మనం కాపాడుకోలేక
ఇక్కడ ఆరాటం.
నిన్నటికి నిన్న సరిహద్దుల్లో సమర భేరి
భారీగా మన వారు రాలిన కుసుమాలే
గళం విప్పుదామంటే గరళం మింగినట్టుంది
కాగితం మీద పడ్డ ప్రతి అక్షరాన్ని
కన్నీరు కాల్వలై కడిగేస్తున్నాది
వారెవరో నాకు తెలియదు
కానీ మనల్ని కాపాడే సైనిక దేవుళ్ళు
దేవుడున్నాడా? అని నన్నడిగితే
నా మనసు, వేలూ సైనికుణ్ణే చూపిస్తుంది.

కదలలేని దేవుడు గుడిలో ఉంటే
పడి పడి పరుగులెత్తుతారు భక్తులు.
దేవుడే సైనికునిలా కదులుతూ కనిపిస్తుంటే
ఏడాదికొకసారైనా చెయ్యెత్తి సమస్కరించరు. 

ప్రతివానికి ఎదుటివాడు దేవుడిలా
కనిపిస్తే, జగమే బృందావనం గాదా
దేవుడి హుండీ నిండకపోయినా పరవాలేదు.
సైనికుని జీవితం బాగుంటే
భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు.
అతని కోసం మనం ఏమీ చేయలేమా
ఎవరికి చేతనైంది వారు చెయ్యడమే
అది కూడా చెయ్యకపోతే
మన బ్రతుకెందుకు వృధా!!

ఆది జాడ తెలియని యుగాది అనాదిగా
నే ‘ఉగాది’ నంటూ
ఉద్భవిస్తుంటే
కవి కలం ‘సర్వే జనాః సుఖినోభవంతు’
అంటూ ఉగాది నాడు దీవిస్తుంది.
కానీ ఏ ఉగాదికైనా కాని ఇక నా కలం
దేశం సుభిక్షంగా ఉంటే
ఆ ఉగాది చివరి రోజునే నిండుగా పలకరిస్తా
“కృతజ్ఞతలు తల్లి ఉగాది” అని
నా కల, నా కలం (ల) రూపం ఆవిష్కరించేనా?
సర్వే జనాః సుఖినోభవంతు !!!!

శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు - కొడుపుగంటి సుజాత

ఉగాది నీకిదే స్వాగత గీతి.

వసంత ఆగమనంతో ప్రకృతి పులకించే ఆది ఉగాది.
మన జీవితాలకు  జయభేరి మోగించి తరగని చెరగని
సిరిసంపదల ఆనందారోగ్యాల ఆశల హరివిల్లుల పరంపరలు
అందించే అపురూప ఆరంభం. విజయారంభం.

ముంగిట రంగవల్లుల మురిపాలు,
గుమ్మాలకు స్వాగతించే మామిడి తోరణాలు,
పిండివంటల ఘుమ ఘుమలు, నేతి బొబ్బట్ల విందులు,
తెలుగు తనం ఉట్టిపడేలా కొత్తబట్టల సింగారింపులు,
కొత్త అల్లుళ్ళ ఆశలు, కోడళ్ళ ఊసులు,
భవిష్యవాణికి బంగారు మార్గం మన పంచాంగ శ్రవణం.

లేలేత చిగురుమ్మలలో ప్రియునితో చిరుకోయిల గాన కచ్చేరీలు,
గ్రీష్మం గుమ్మంలో ఉందని కవ్వించే వేడిగాలులు,
చింత తోపుల్లోని పులుపు, చిరుచేదు వేపపూత,
లేత మామిడి వగరు, అనకాపల్లి పూ బెల్లం,
చెరకు గడల కమ్మదనం, సంద్రం తెచ్చిన ఉప్పు,
షడ్రుచులతో ఉవ్విళ్లూరించే ఉగాది పచ్చడి,
మమతానురాగాల కష్టసుఖాల జీవిత సారం.

ఈ ఉగాది తొలి ఉషస్సు లో,
బాలలకు కన్నీళ్లు లేని భవిత, యువతకు నిరంతర ఉపాధి,
ముదిమికి బోసినవ్వుల మనః శాంతి,
అరాచకాలకు, అన్యాయాలకు తావులేని సమాజం,
మంచి మానవత్వం రాజ్యమేలే బంగారు భవిష్యత్తు
అందిస్తుందని ఆశిద్దాం.

వికారి నామ 'ఉగాది' - ఆదూరి హైమావతి

Ugadi-Kavitha_AHymavathi

ఉగాది - భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

బంధువుల ఆగమనంతో
పంక్తిభోజనపు విందులతో
పాత లోగిళ్ళలో, కొత్తసందళ్ళు మొదలై,
మనసు ముంగిళ్ళలో సరదాలపందిళ్ళు మొలుస్తుంటే.

రకరకాల రంగులతో మురిపించే ముగ్గులను వేస్తూ,
అందించే ఆనందపు పొంగులతో వాకిళ్ళను నింపుతూ,
ఒకవైపు పాతసంవత్సరాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్న వయసు,
మరోవైపు కొత్తసంవత్సరానికై పరవశంతో ఎదురుచూస్తూన్న మనసు.

కనుకొలకుల కొలనులలో
ఎదురుచూపులతో కలువభామలు,
కొత్తసంవత్సరపు సూర్యునిసందిట్లో
మురిసిపోదామని ముచ్చట పడుతుంటే,
ఒక్కక్షణమైనా మూతపడని కనురెప్పలు
క్షణకాలమెప్పుడో ఒక్కసారి మూసి తెరిచేసరికి
ముంగిట్లో మెరసిపోతూ వికారి నామం
విరాజిల్లుతూ విచ్చేసింది,
తనమెత్తనైన ఆనందపు స్పర్శనిచ్చింది.

యుగాది మంచి గంధపు మాల - పిసుపాటి మాధవి

తూరుపున రవి ఉదయించు వేళ
సూర్య కాంతులు కళ్ళకు ప్రసరించు వేళ
ఆనందపు రెక్కలు విళంబమై విరియు వేళ
ప్రతి ఇంటా రావాలి యుగాది మంచి గంధపు మాలలా !!

షడృచుల జీవితం పునర్జీవనం పొందు వేళ
పంచాంగ శ్రవణ హోరు వీనులనందు వేళ
సిరులు పండే చిరునవ్వులు వెలుగొందు వేళ
ప్రతి ఇంటా రావాలి యుగాది మంచి గంధపు మాలలా!!

అనుక్షణం అస్తిత్వంకై అవని అలమటిస్తూ
నవజీవన ఆలోచనకై జీవితం నిన్ను పిలిచింది
సరికొత్త ఆశలకై బతుకు నిన్ను వెతికింది
సర్వజన సుఖసంతోషాలకై నిన్ను కలవరిస్తోంది
ప్రతి ఇంటా రావాలి యుగాది మంచి గంధపు మాలలా!!

మా లోని ఆశలు కల్పవృక్షాలై, మా రెండు కన్నులు మీనులై
మా లోని నడతలు మయూరములై, దారి చూపాలి నందన వనాలకై
ప్రతి ఇంటా రావాలి యుగాది మంచి గంధపు మాలలా!!

రావమ్మా! వికారి - ప్రతిభ కత్తిరిశెట్టి

రావమ్మా! రావమ్మా! వికారి నామ సంవత్సరమా!
ఈనాటి నుండి విరులు విరియ, మరులు కురియ!

రావమ్మా! కుహుకుహూ నాదాల కోకిలమ్మాలా!
రావమ్మా! హొయలు నడల రాజహంసలా!
రావమ్మా! చిలుక మెచ్చిన గోరింకలా!
రావమ్మా! ప్రశాంతతని పెంచే పావురంలా!

రావమ్మా!  అంధకారాన్ని ఛేదించే వెన్నెలలా!
రావమ్మా! అజ్ఞానాన్ని పారద్రోలే సరస్వతిలా!
రావమ్మా! నిశీధిని క్రమ్ముకొనే ఉషస్సులా !
రావమ్మా! మాకు సౌభాగ్యాలనిచ్చే సురభిలా!

రావమ్మా! రావమ్మా! వికారి నామ సంవత్సరమా!
ఈనాటి నుండి విరులు విరియ, మరులు కురియ!

"ఉగాది" శుభాకాంక్షలు - వి రావు పోతాప్రగడ

మీరందించే సాహిత్య అక్షర (సి)రి విశ్వమంతా నెలనెలా
వ్యాపించి అభిమానుల గుండెఝ(రి)గా వసంతమాసపు విరిసే
గుబాళింపు మరువంతో కూడిన (మ)ల్లెల చేసే పరిమళ
సుగంధాన్నివెదజల్లే మీ "సిరిమ(ల్లె)"కు శ్రీ వికారి నామ సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు.

Posted in April 2019, కవితలు

1 Comment

 1. Hymavathy.Aduri.

  అదిరింది -సిరిమల్లె
  ఆనంద -‘పురి’మల్లె
  ముఖపత్రమే ముద్దు
  ఆకాశమే – హద్దు
  కవిత్వదర్శనమె కమనీయమయ్యె,
  స్రవంతి స్రుతికాగ,
  సిరికోన సృతి అయ్యె,
  ఆలయంపు సిరి ఆవాసమాయెగా,
  గ్రంథ పరిమళాలు సౌరభము లీయగా,
  గల్పికలు కల్పికా సారంబు నీయగా
  చిత్రపద్యము మనః చిత్రమై తోచగా,
  కిరణాల కాంతులకు కన్నులే మెరవగా
  ఉగాది కవితలకు హృదయము రంజిల్లగా
  అదర్శమూర్తులే ఆదరముచూపగా
  కధలతో కధనాలు కమనీయమయెగా
  తేనెల పలుకులు తన్మయంచేయగా
  శాస్త్రీయ గాహన సారమ్మునీయగా
  సామెతల ఆమెతలు సంబరం సేయగా
  సాహితీ పూదోట సువాసన లీనగా
  మెదడుకు మేతలే మేలిమై తోచగా
  మనోల్లాస గేయంపు గనాల ఝరిలోన
  బాల్యంపు బాటలో
  వీక్షణమె వింతాయె
  అదిరింది సిరిమల్లె
  యుగాది సుర మల్లె
  మధుమల పూదోట
  అమెరికా పూబాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *