Menu Close

page title

చాతక పక్షి

Jacobin Cuckoo

ఎవరైన దేనికోసమైనా, ఎవరికోసమైనా ఎదురుచూస్తుంటే, వారిని 'చాతకపక్షి' లా ఎదురుచూస్తున్నారు, అని అంటుంటారు. అంటే దీక్షకు వేచి ఉండే ఓర్పుకు ఈ చాతక పక్షి ని ఉదాహరణగా చెప్తారు. అంటే ఈ చాతకపక్షి  వర్షపు చినుకుల కోసం ఎలా ఎదురు చూస్తుందో అలాగన్నమాట. చాతకపక్షి లేదా చాతకం అంటే నీటి కోకిల జాతికి చెందిన ఒక పక్షి. చాతక పక్షి నేల మీద ఉండే నీరు తాగనే త్రాగదు. వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని నోరుతెరచి పట్టుకుని మింగుతుంటుంది. ఈ పక్షి మన సాంప్రదాయం ప్రకారం కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది. ఒక తొలకరి అయ్యాక మరలా తొలకరి వరకూ వేరే నీరు ముట్టదు. అందుకే అది తక్కిన ఋతువుల్లో దాహంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది. ఇది క్యూకులైడ్ [Cuculidae] కుటుంబానికి చెందిన, క్లామటర్ [Clamator] జాతికి చెందిన, జాకబీన్ [jacobinus] ప్రజాతి పక్షి.

భారతదేశంలో కొల్లేరు సరస్సుసమీపంలో ఈ చాతక పక్షి సంచరిస్తూ ఉంటుంది. ఈ చాతక పక్షి గురించిన ఒక కథో, కల్పనో ఏమో తెలీదు కానీ ఇలా ఉంది. ఒక ఊళ్లో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు కూతురు, కోడలు ఉన్నారు. వారికి కొంత పొలం ఉంది. నాలుగు గేదెలున్నాయి. కూతురు రెండు గేదెలు కోడలు రెండు గేదెల్ని తీసుకుని నాగలికి కట్టి పొలం దున్ని పంట పండించేవారు. తల్లి ఇంటి పని చూసేది. ఒక రోజు కూతురు, కోడలు గేదెల్ని తీసుకుని పొలానికి వెళ్లారు.  నాగలికి కట్టి పొలం దున్నడం మొదలు పెట్టారు. మధ్యాహ్నమైంది. ఎండ మండి పోతోంది. సూర్యుని తాపానికి కూతురు, కోడలు అలసిపోయారు. గేదెలూ అలసిపోయాయి. కొంచెం పొలం పని కూడా ఆరోజు కాలేదు. ఇంతలో డప్పుల మోత వినిపించింది.  ఒక గుంపు కొండపైకి పోతున్నది. కొండ మీద పెద్ద ఉత్సవం జరుగుతున్నదనీ, కూతురికి ఆ ఉత్సవానికి వెళ్లాలనీ అనిపించింది. గేదెల్ని పొలంలోనే వదిలేసి ఇంటికి పరిగెత్తుకొచ్చి తల్లితో ‘అమ్మా! కొండ మీద ఉత్సవం జరుగుతోంది. నేను వెళతాను’ అంది. తల్లి మొదట ‘పొలంపని వదిలేసి ఎలావెళతావు’, అనగా 'చూసి వెంటనే వచ్చేసి పొలం పని చేస్తాననడంతో తల్లి ఒప్పుకుంది. ఐతే  ‘నువ్వుగేదెల్ని చెరువు కు తీసుకెళ్లి వాటి దాహం తీర్చి తెచ్చి  కొట్టంలో కట్టేసి వెళ్లు’ అంది. కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి తాను కొండపైకి ఉత్సవానికి వెళుతున్నట్లు వదినతో చెప్పింది. గేదెల్ని చెరువుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. కానీ, అవి అలసిపోయి ఉండటాన త్వరగా నడవలేకపోయాయి. మెల్లగా నడిచాయి. వాటిని చెరువు దాకా తీసుకెళ్ళి, నీళ్ళు తాపిస్తే  ఆలస్యమవుతుందని, చెరువుకు  వెళ్ళకుండానే  ఇంటికి తీసుకెళ్లి వాటి దాహం తీర్చకపోయినా 'నీళ్ళు తాపించా’ నని అసత్యం చెప్పి కొట్టంలో కట్టేసి కూతురు కొండ పైకి వెళ్లింది.  కోడలు మెల్లగా గేదెల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటి దాహం పూర్తిగా తీర్చి ఇంటికి తెచ్చింది. “ఎందుకు ఇంత ఆలస్యమైందని" అత్త అడిగింది. "గేదెలు అలసిఉండటం వల్ల త్వరగా చెరువుకు నడవ లేక ఆలస్యమైందని" చెప్పింది.

కూతురు కొండపైకి వెళ్లి ఎంతో సంతోషంతో ఉత్సవంచూసింది.

ఇక్కడ కొట్టంలోని కూతురి గేదెలు దాహంతో అల్లాడిపోయాయి. ఎండ వేడికి, దాహానికి తాళలేక,  అవి దాహంతోనే చనిపోయాయి. చనిపోయే ముందు తమను దాహంతో కన్నుమూసేలా చేసిన కూతురు తను కూడా బతుకంతా దాహంతో అల్లాడుతూ ఉండాలని శపించాయి.

అప్పుడు కొండ మీద ఉత్సవంలో ఉన్న కూతురు 'చాతక పక్షి'గా మారిపోయింది. కూతురు తిరిగి రాకపోవడంతో తల్లి ఎంతో సేపు ఎదురుచూసింది. చాతక పక్షిగా మారిన కూతురు ఇంటికి వచ్చి ఇంటి ముందు వాలి ఎంత అరచినా తల్లి తరిమేసింది. ఆపక్షే తన కూతురని తెలుసుకోలేకపోయింది.

అందుకనే చాతక పక్షులు దాహంతో అరుస్తూ ఉంటాయి అనేది ఒక కథ. ఇది కల్పనో యదార్ధమో  తెలీకపోయినను ఎవ్వరినీ అలా దాహంతో ఉంచరాదనీ, అసత్యాలు చెప్పరాదనీ, తను చేస్తున్న పనిని వదిలేసి ఆకర్షణకు లొంగరాదని మనకు నీతులు చెప్తున్నది. మంచైనామ చెడైనా ఏది చేస్తే అదే మనకు ప్రాప్తిస్తుందనీ దీనివలన తెలుస్తున్నది.

Jacobin Cuckooఇండోనేషియా ప్రభుత్వం ఈ పక్షిబొమ్మతో ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. వర్షాలు వచ్చేముందుగా భవిష్య సూచకంగా చాతక పక్షి అరుస్తుంటుందిట. చాతక పక్షి వలస వచ్చినపుడు రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు సమీపించినట్లేనని పక్షి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఋతుపవనాల పక్షి, వానకోయిలగా కూడా పిలిచే ఈ పక్షి దక్షిణాఫ్రికా నుంచి ఏటా నైరుతి ఋతుపవనాలకు సుమారుగా ఐదు నుంచి ఏడు రోజుల ముందుగా వస్తుందని నమ్మకం. చాతక పక్షికి, వానలకు సంబంధం ఉన్నట్లు మహా భారతంలో, కాళిదాసు మేఘసందేశంలో కూడా ఉంది.

Posted in April 2019, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!