Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు
తిరువణ్ణామలై - అరుణాచలం

తంజావూరు నించి బయల్దేరి కొంత గ్రామీణ ప్రాంతాల్లోంచి కారులో అరుణాచలంవైపు ప్రయాణించాము. దారిలో నా చిన్నప్పటి (అంటే నేను 30 ఏళ్ల క్రితం భారత దేశంలో ఉండేటప్పుడన్నమాట) అనుభవం ఒకటి. బండి మీద చెరుకు రసం! ఒక కుగ్రామంలో ఒక చెరుకు రసం బండి చూసి కారాపి, తాజాగా చెరుకు రసం కావాలన్నాం. ఆ బండిని ఒక అమ్మాయి నడుపుతోంది. అసలు ఇది ఎందుకు చెపుతున్నానంటే కొంత మంది భారతదేశం  అభివృద్ధి చెందట్లేదని వాదిస్తారు. కానీ నా చిన్నప్పుడు ఈ చెరుకు మిషనుకి మామూలుగా ఒక పెద్ద చక్రం, దాన్ని గూడలూడిపోయేలా తిప్పడం, దాంతో చెరుకు గడ నలిగి రసం రావడం - ఇప్పుడలా కాదు. అంత మారుమూల గ్రామంలో కూడా ఈ చెరుకు మిషనుకి ఒక చిన్న ఇంజను అమర్చారు. ఆ ఇంజను నుండి ఒక ఆల్టర్నేటర్, దాన్నించి ఒక బాటరీ, దాన్నించి ఒక మోటారు ఆ మెషీనుని తిప్పడం. అంటే చాలా మంచి, చాలా రోజులు సరిగ్గా పని చేసే టెక్నాలజీ. ఇది నేను భారత దేశంలో ఉండగా చూడలేదు. సన్నని చెరుకు గడలు, పక్క పొలంలో అల్లాంటివి చూసాను - వాటిని నిమ్మకాయల్తో సహా పెట్టి మిషను స్టార్ట్ చేస్తే రెండు నిమిషాల్లో మంచి తాజా రసం తయారయింది; తాగాము. నేను మళ్ళీ వాటిల్లో నిమ్మ కాయ పెట్టించుకుని రసం తీయించి తాగాను. ప్రాణం లేచి వచ్చింది. అమెరికాలో ఈ సుఖమేదీ? ఇంతా చేస్తే గ్లాసు పది రూపాయలే!!! (అమెరికాలో వేరే పళ్ళ రసాలు దొరుకుతాయి లెండి!)

ఇక్కడ ఒక మాట చెప్పాలి. నాకు తెలియకుండా రెండు అనుభూతులు కలిగాయి తిరువణ్ణామలై లో. . చదువరులు ఆ అనుభూతులు సరియైనవో లేక భ్రాంతో నిర్ణయించగలరు. నేను ఇదివరలో అరుణాచలం గురించి విన్నాను కానీ, అక్కడి ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ చూడలేదు. కారు వెళుతుంటే మా ఆవిడ శాంత నిద్ర పోతోంది. నేను డ్రైవరుని ఇంకా ఎంత దూరం ఉన్నదని అడిగాను. ఇంకా 50 కి.మీ ఉన్నదని ఆతను చెప్పాడనుకున్నాను. ఇంతలో ఒక కొండ కనబడింది. అది చూడగానే నాకు ఒక విధమైన ఆనందం - ఆ భావాన్ని అభివ్యక్తీకరించడం నా వల్ల కాలేదు. కళ్ళు తిప్పుకోవడం నా వల్ల  కాలేదు. శాంతని నిద్ర లేపి, కొండని చూపించి ఎంత అందంగా ఉన్నదో చూడమన్నాను. తాను వెంటనే ఇదే అరుణాచలం - అన్నది. నేను ఆశ్చర్య పోయి, డ్రైవరు ఇంకా 50 కిలోమీటర్లు ఉన్నదన్నాడే? అని అంటుండగా కారు ఒక ఊరిలోకి ప్రవేశించింది. అడిగితె ఇదే అరుణాచలమన్నాడు డ్రైవరు. ఇదేంటి! అని మరింత ఆశ్చర్య పోవడం నా వంతయింది. నేను తప్పు వినడం ఒక ఎత్తయితే, ఇప్పటి దాకా ఎన్నో కొండలు చూస్తూ వస్తున్నాం. మరే కొండ కూడా నన్ను ప్రభావితం చెయ్యలేదు. అది అరుణాచలం అని తెలియకుండానే ఆ కొండని చూసి అంతగా ఆకర్షితుడనయ్యాను. ఆ కొండ చుట్టూతా మరే కొండలూ లేవు. అది ఒక్కటే గర్వంగా నిలుచుని ఉంటుంది. అలా చూడగానే దణ్ణం పెట్టేసాను అప్రయత్నంగా. శాంత కూడా ఇప్పటిదాకా అరుణాచలం రాలేదు. అయినా ఆవిడ వెంటనే గుర్తు పట్టేసింది. ఇదే అరుణాచలం! అన్నది. నేను వస్తుందని ఊహించట్లేదు కదా? అందుకని అరుణాచలామనుకోలేదు కానీ తెలియకుండానే ఒక గొప్ప అనుభూతి, గౌరవం కలిగాయి. అనుకోకుండా నమ్మకం కలగటం అంటే ఇంతేనేమో?

అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి కొండే అగ్నిలింగం. చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయు లింగం, జంబుకేశ్వరంలో జ్వలలింగం, కంచిలో పృథ్వీ లింగం ఉన్నాయి. ఇది చూడడం ఒక అదృష్టంగా మేము భావించాము. జన సామాన్యంలో ఉన్న ఒక కథ - మాకు మా హోటల్ లో భోజనం చేస్తుంటే పక్కన ఒకాయన కూర్చుని చెప్పినది - ఎవరికైనా అరుణాచలం వెళ్లే ముందు జీవితం అనీ, అరుణాచలం దర్శించాక జీవితం అనీ ఉంటాయట. ప్రతివాళ్ళూ జీవితంలో ఒకసారైనా దర్శించవలసిన ప్రదేశం అరుణాచలం అని చెప్పారు. ఇక్కడకి వచ్చిన తరువాత మీ జీవితం మారిపోతుందని ఆయన అన్నాడు. ఆయన నోట్లో నేను చక్కర పెట్టవలసింది. ఆ పని చెయ్యలేదు.

Arunachalam-01
Arunachalam-02
Arunachalam-03

మెల్లగా ఊర్లోకి వెళుతుంటే అర్థమయింది - ఇక్కడ ఊరు కొండ చుట్టూ అభివృద్ధి చెందిందని. అన్ని భారతీయ చిన్న నగరాల్లాగా దట్టంగా ఉన్నది. రోడ్లు ఓ మోస్తరు బాగానే ఉన్నాయి కానీ కొంత పాతకాలపు ఊరు కాబట్టి ఇరుకు సందులు, దాంట్లో ఎక్కడ పడితే అక్కడ ఆపిన టూరిస్టు బస్సులు, కార్లు, ఇతర వాహనాలు - రద్దీగా ఉన్నది. నెమ్మదిగా మేము ముందరే బుక్ చేసుకున్న హోటలు - అరుణాచలేశ్వరుడి ఆలయం పక్కనే - చేరాము. స్నానం చేసి కొద్దిగా ఊరు తిరిగి చూద్దామని వెళ్ళాము. ఎక్కడికెళ్లినా కొండ నించి పట్టుమని ఫర్లాంగైనా దూరం ఉండదు కాబట్టి ఎప్పుడూ ఆ ఈశ్వరుడి సన్నిధానంలో ఉన్నట్లే ఉంటుంది. ముందు శ్రీ రమణుల వారి ఆశ్రమం చూద్దామని వెళ్ళాము. కొంత చీకటి పడుతోంది. అందుకని ఎక్కువగా చూడలేక పోయాము కానీ, అక్కడ ప్రశాంతంగా ఉన్నదని మాత్రం గుర్తించాము.

నేను అమెరికాలో బేఏరియాలో ఉండగానే గిరి ప్రదక్షిణం గురించి మిత్రులు శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారిని సంప్రదించాను. తప్పకుండా చెయ్యాలని చెప్పారు. నాకు కొన్ని వైద్య పరంగా కష్టాలున్నాయి. ఒక ఏణ్ణర్ధం క్రితమే వెన్నెముకకి శస్త్ర చికిత్స చేయించుకున్నాను. ఈ గిరి ప్రదక్షిణం చేయగలనని నమ్మకం లేదు. ఇంకా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. పైగా ప్రస్తుతం రోహిణీ కార్తె. మండుటెండలు. చెప్పులు లేకుండా నడవాలన్నారు. నాకు పాదాల్లో నెప్పిగా ఉంటుంది. ఏదైనా చిన్నగా తగిలినా నెప్పి. ఎలా అంటే శ్రీచరణ్ గారు వెదురు చెప్పులు దొరుకుతాయి; అవి కొని వాటితో అయితే ప్రదక్షిణం చెయ్యచ్చు; చర్మం చెప్పులు వద్దన్నారు. పోనీ చర్మం లేని కాన్వాసు బూట్ల లాంటివి ఉపయోగిద్దామా అని అనుకున్నాను. ఇలాంటి ఆలోచనలతో సతమత మౌతూ ముందు దారి ఎలా ఉంటుందో చూద్దామని కారులో గిరి ప్రదక్షిణం అంతా చేసాము. మొత్తం ఏ ఊర్లోనైనా రోడ్లమీద నడిచినట్లే ఉన్నది. దాంతో కొంత ధైర్యం వచ్చింది. మర్నాడు పొద్దున్నే వెళదామని నిశ్చయించుకున్నాము.

Arunachalam-04పొద్దున్నే 4 గ.కి నిద్ర లేచి తయారయి, 4.15 కల్లా బయట పడ్డాము. పక్కనే కాబట్టి ఆలయ ప్రథమ ద్వారం ముందు 4.30 కి నీరాజనం వెలిగించి, దణ్ణం పెట్టుకున్నాము. 4.45 కి ప్రదక్షిణం మొదలు పెట్టాము. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో మళ్ళీ వస్తానో రానో తెలియదు. ఈశ్వరుడు పాద రక్షలు లేకుండా ప్రదక్షిణం చెయ్యమంటే నేను అలాగే చెయ్యాలి. ఇక్కడ చర్మంతో చేసినవా, కాదా అనేది ప్రసక్తి కాదు; అసలు పాదాలకి వేరే రక్ష ఉండకూడదు. అప్పుడు ఈశ్వరుడే రక్షణ కలిపిస్తాడు. ఇలా ఆలోచించి చెప్పులు లేకుండానే పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ బయలుదేరాము. ఈ ప్రదక్షిణం మొత్తం 14 కి.మీ. ఉంటుంది. నేను, మా ఆవిడ మామూలుగా గంటకి 4 కి.మీ వేగంతో నడుస్తాము. మొత్తం 14 కి.మీ దూరం 4 గంటల, 30 నిమిషాలలో పూర్తి చేసాము. ఎందుకంత సమయం పట్టిందో చూద్దురు గాని. కానీ అసలు నడవడం సాధ్యం కాదేమో అని అనుకున్న నేను మళ్ళీ ఆ ఆలోచనకూడా రాకుండా నడవగలిగానంటే నాకే ఆశ్చర్యం. నా పాదాల నెప్పులు నిజంగా తగ్గాయి; ఎక్కువ అవలేదు. నడుము నెప్పి కూడా రాలేదు.

పొద్దున్న 4. 45 కి ఊరంతా సద్దుమణిగి ఉన్నది. జన సంచారం ఇంకా పెద్దగా మొదలవలేదు. కానీ ఇక్కడే తమిళనాడుకి, మిగతా రాష్ట్రాలకి - ముఖ్యంగా ఆంధ్ర  దేశానికి - తేడా తెలుస్తుంది. అంత పొద్దున్నే ప్రతి చిన్న గుడి ముందు ఆ గుడిని చూసుకునేవాళ్ళు లేచేసి, నీళ్లతో కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, శుభ్రం చేస్తున్నారు. ముందుగా ఒక వినాయకుడి గుడి ముందు నిలబడి, స్వామిని బాగా గిరి ప్రదక్షిణం చేయించమని మొక్కుకుని, ముందుకి వెళ్లాం. ఈ గిరి ప్రదక్షిణం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక మాపు ఇచ్చాను. అది చూస్తే మొత్తం దారి, దానిలో ఉండే అష్టలింగాలు, ఇతర గుళ్ళు, అన్నీ మీకు సులభంగా తెలుస్తాయి. ప్రతి లింగాలయం ముందు ఒక సూచన బోర్డు ఉంటుంది. అక్కడ లోపలకి వెళ్లి, అర్చన చేయించుకుని, ప్రసాదం తీసుకుని, గుడికి వెళ్ళాము కాబట్టి, ప్రతి గుళ్లోనూ కొద్ధి సమయం కూర్చుని ముందుకి వెళ్ళాము, అందుకే మాకు అంత సమయం పట్టింది. మాతో పాటు అంత పొద్దున్నా కొంత మంది నడక మొదలు పెట్టారు. కొంత మంది పాశ్చాత్త్యులు కూడా ఉన్నారు. ఈ బోర్డులు ఎలా ఉంటాయో ఫొటోల్లో, వీడియోల్లో కింద చూడండి. ఇన్ని ఫోటోలు పెట్టాడేంట్రా అని తిట్టుకోవద్దు; ఇది చాలా సేఫు జరిగే కార్యక్రమం కాబట్టి ఫోటోలు కొన్ని పెట్టవలసి వచ్చింది. మాతో బయల్దేరిన కొంత మంది అన్ని లింగ ఆలయాల్లోనూ ఆగకుండా నడిచి వెళ్లిపోయారు. మేము ప్రతిచోటా ఆగి దర్శనం చేసుకున్నాము.

Arunachalam-05ఆలయం నించి బయల్దేరి ప్రదక్షిణంగా నడుస్తూ ముందు "అగ్నిలింగం " వద్దకి చేరుకున్నాము. ఇది రమణ మహర్షి ఆశ్రమం ముందు కుడివైపు ఒక సందులో ఉంటుంది. చిన్న గుడి, రెండు, రెండున్నర అడుగుల ఎత్తున్న శివలింగం. రోజూ పూజ జరిగే ఆలయం. ఇంకా గుడి మేము వెళ్ళేటప్పటికి తెరవలేదు. మేమే స్వామికి ప్రసాదం సమర్పించి, నమస్కారం చేసుకుని ముందుకి సాగాము. రమణ మహర్షి ఆశ్రమం ముందు ఒక గుడి ఉంటుంది. ఇది అమ్మవారి గుడి. ఇంకా ఐదు కాకుండానే గుడి తెరిచేసారు, అర్చకుడు తయారుగా ఉన్నారు పూజలు చేయించడానికి. ఇదీ ఆసక్తి కరమైన విషయం.

ఈ ప్రదక్షిణంలో మొత్తం 8 ప్రధాన లింగాలున్నాయి. ప్రతి లింగానికీ ఒక గుడి ఉంటుంది. చాలామటుకు గుళ్ళు చిన్నవి. భక్తుల సౌకర్యార్థం ఆ మొత్తం గుళ్ళు దానిలోకొచ్చేసేలాగా పెద్దగా ఒక కొత్త కట్టడం, దాంట్లో భక్తులు క్యూలో నిలబడగలిగేలా, కూర్చోడానికీ, ప్రదక్షిణం చేసుకోవడానికీ ఏర్పాటు చేశారు. దాంతో మనం ఆ గుడిలో కొంత సేపు గడిపి, అక్కడ సేద తీరడానికి అవకాశం ఉంటుంది. అసలు గుళ్ళు పురాతనమైనవి, చిన్నగా ఉంటాయి. మేము ఎండ ఎక్కక ముందే ప్రదక్షిణం పూర్తి చేద్దామనుకున్నాము కానీ, ఇలా ప్రతి గుడిలోనూ ఆగుతూ, వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేసరికి ఆఖరికి 9 దాటింది; ఆపాటికే కాళ్ళు మండిపోయేటంత ఎండా వచ్చేసింది.

అగ్ని లింగం దాటి, యమ లింగం దర్శించాము. మధ్యలో శేషాద్రి ఆశ్రమం, దక్షిణామూర్తి గుడి వగయిరా ప్రదేశాలు చూసుకుంటూ. అక్కడ నించి నైఋతి లింగం వద్దకి వెళ్ళాము. మధ్యలో పక్షులు రొద చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రోడ్డు మీద చాలా మంది సాధువులు కూర్చుని ఉంటారు. మనల్ని ఏమీ అడగరు కానీ, మనం ఏదైనా ఇస్తే పుచ్చుకుంటారు. కొంత దూరం రోడ్డు పక్కన నడవడానికి కాలినడక దారి కట్టారు. వీడియోలో చూడచ్చు. అక్కడ ఒకసారి నా చేతిలో అరటి పళ్ళు చూసి ఒక కోతి నా మీదకి వచ్చింది. నేను అదిలిస్తున్నా లెక్క చెయ్యకుండా, నేను దాటి పోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటూ, చాలా సీరియస్ గా నా మీదకి వచ్చింది. అప్పుడు నేను ఊహించినట్లు అక్కడ ఉన్న ఒక సాధువు నన్ను, శాంతని చూసి, ఆ కోతిని అదిలించాడు. అది తిరగబడే ప్రయత్నం చేసింది కానీ, అతని గంభీర స్వరం, చేతిలో ఒక చిన్న కర్ర, అవీ చూసి వెనక్కి తగ్గింది. ఆ చేతిలో ఉన్న అరటి పళ్ళని దానికిచ్చేసి మేం చేతులూపుకుంటూ నడిచాం. చాలా కోతులుంటాయి; మీరెవరైనా వెళ్తే జాగ్రత్తగా ఉండండి. చేతిలో సంచీలు అవీ వద్దు.

నైఋతి లింగం దాటి సూర్య లింగం వద్దకి చేరుకున్నాము. అంటే మూడోవంతు నడక అయినట్లే. ఈ గుడి (పై కట్టడం కాదు; అసలు గుడి) ద్వారం ఎత్తు చాలా తక్కువగా ఉన్నది. పూజారి లోపలకి వెళ్లాలన్నా వంగి కష్టంగానే వెళ్ళాలి. లింగం కూడా చిన్నగా ఒక అడుగు ఎత్తులోనే ఉన్నది. అక్కడ ఒక అమ్మాయి పూలమ్ముతుంటే కొని లోపలకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఎందుకు ఇంత తక్కువ ఎత్తు ద్వారం అని అడిగితే, సూర్యుడు ఏడాదికి 6 నెలలు ఈ గుడిలో లింగం  మీదకి నేరుగా ప్రసరిస్తాడుట. ఆ సూర్య రశ్మి సరిగ్గా లింగం పానుమట్టం మీద, అంటే పాదాల మీద పడుతుందట. ఆ ద్వారం లోంచి సరిగా అలా పడుతుంది కాబట్టి అది ఈ సూర్య లింగ విశేషం. ఈ సూర్య లింగం తరువాత వరుణ లింగం, ఆ తరువాత వాయు లింగం చూసాము. ఆ తరువాతనే నాకు ఇక్కడ ఇంకొక అనుకోని విశేషమైన అనుభూతి కలిగింది. మొత్తం 8 ప్రధాన లింగాలని చెప్పాను కదా? ఈ వాయు లింగం తరువాత ఎడమ చేతి పక్కన ఒక కట్టడం ఉన్నది కానీ, ప్రతి లింగ ఆలయం ముందు ఉన్నట్లు బోర్డు లేదు. మేమూ ఏమీ ఆలోచించకుండా ముందుకి వెళ్లబోయాము. ఇది ఇంకా 6, లేక 6.30 అయిందేమో. జన సంచారమేమీ లేదు. ఎదురుగా ఎవరూ లేరు కూడా. అయినా ఎవరో అకస్మాత్తుగా మా ముందరకి వచ్చాడు. అసలు అంత  దగ్గరగా నేను చూడకుండా వచ్చాడని నేననుకునే లోపల ఆయన, "మీరు చంద్ర లింగ దర్శనం చేసుకోకుండా ఎందుకు ముందుకు వెళుతున్నారు? అని ఎడమ చేతివైపున్న ఆ కట్టడం చూపించాడు. నేను అది చూసి, రెడీ గా ఉన్న ఫోనుతో ఒక ఫోటో తీసి ధన్యవాదాలు చెపుదామని ఆయన కోసం చూసాను. అక్కడ సందులేమీ లేవు, రోడ్డులో ఇంకొకరెవరూ లేరు. అయినా నాకు ఆయన కనిపించలేదు! నేను ఆశ్చర్యపోయాను. కలయ చూసి, ఈశ్వరుడే మమ్మల్ని ఆజ్ఞాపించాడని అనుకుని లోపలకి వెళ్లి చంద్ర లింగ దర్శనం చేసుకున్నాము.  ఇప్పటికి బాగా తెల్లవారింది, ఎండ వెంటనే తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టింది. అక్కడ నించి కుబేర లింగం చేరుకొని దర్శనం చేసుకున్నాము. ఆ మధ్యలో దాదాపు 4, 5 వేరే గుళ్ళు చూసాము. వరుణ లింగం నించి వాయులింగం దాకా ఉన్న ప్రాంతాన్ని ఆది అన్నామలై అంటారు. మలై అంటే తమిళంలో కొండ అని అర్థం. తిరు అంటే 'శ్రీ ' అన్నమాట.

ఆఖరి లింగం ఈశాన్య లింగం. ఇది మెయిన్ రోడ్డుకి ఎడమచేతి వైపున్న రోడ్డులో ఉంటుంది. పట్టించుకోకపోతే కనబడక పోయే ప్రమాదం ఉన్నది. ఈ లింగం భూమట్టానికి కొంచెం కిందకి ఉంటుంది. పెద్ద లింగం, ఆలయం కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ అరుణాచలేశ్వరుడి ఆలయానికి చేరుకున్నాము. రోడ్లు, ఆలయంలో బండలు అన్నీ మండిపోతున్నాయి. చెమటలే చెమటలు.

ఇది చాలా పెద్ద ఆలయం. ప్రధాన ఆలయం ముందర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎడమవైపు ఐమూలగా ఉంటుంది. అంటే ఇంకెక్కడా ఉండనట్లు ఒక కోణంలో ఉంటుంది. అది తమాషా అనిపించింది నాకు. ఒకవేళ ప్రధాన ఆలయం కట్టాక కొంత కాలానికి కట్టారేమో అనుకున్నాను. లోపలకి వెళితే మొత్తం - 3 ప్రాకారాలు - శివాలయం ముందు ఎడమవైపు పెద్ద విఘ్నేశ్వరాలయం ఉన్నది. వినాయకుడి విగ్రహం చాలా గొప్పగా, దాదాపు 8, లేక 9 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడ చాలా గొప్పగా పంచామృత అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. చాలా బాగా చేస్తున్నారు. అక్కడ కూర్చుని చూసి, తరువాత టికెట్టు తీసుకుని లోపలకి వెళ్ళాము. నమ్మండి, అంత నడిచి వచ్చి, కడుపు నక నక లాడుతున్నా, చెమటలు కారిపోతున్నా రద్దీవల్ల  అలా రెండున్నర గంటలు లైన్లో నిలుచున్నాము. అప్పుడు దర్శనం కలిగింది. ఈశ్వరుడు కనబడాలంటే మనం అంత మాత్రం వేచి ఉండాలని, దర్శనం చేసుకుని, పక్కనే ఉన్న అమ్మవారి కోవెల లో అమ్మవారి దర్శనం కూడా అలాగే తోసుకుంటూ చూసి, హోటలు చేరుకున్నాము. ఈ ఆలయం చాలా పెద్దది. దీని గురించి వచ్చే నెల  రాస్తాను.

చెప్పటానికి చాలా ఉన్నది ఇంకా. కాబట్టి ఈ అరుణాచలం దర్శనం రెండు మూడు సంచికలుగా రాయాలని అనుకుంటున్నాను.

### సశేషం ###

Posted in February 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!