హైదరాబాద్ నగరంలో పేరుమోసిన ‘నోమా’ కళ్యాణ వేదిక అది. సుందరరావుగారి అమ్మాయి అవంతిక పెళ్ళి మరికొన్ని గంటలలో జరగబోతోంది.
ఈ వేదికపై ఇలలో వైకుంఠాన్ని ఆవిష్కరించాలి!. ఆ “మణిద్వీపాన్ని” మించిపోయేలా అలంకరణ జరగాలి. నా బేటీ కోసం నేను ఆమాత్రం చేయలేకపోతే ఎలాగా?
ఆ చిట్టితల్లి నా ఈ చేతులలో పెరిగి పెద్దదయ్యింది. వాళ్ళనాన్నకు దోస్తునైనా, తండ్రికన్నా నాకు ఎక్కువగా ప్రేమను పంచింది. మతాలు వేరైనా నన్ను ‘చాచా’ అంటూ పిలిచింది. తన పెళ్ళిలో పెళ్ళిబుట్టను నేనే ఎత్తుకుని, పెళ్ళిపీటలపైకి తనను తీసుకెళ్ళాలని ముందుగానే నాతో వాగ్దానం తీసుకుంది.
“అయితే నా బంగారుతల్లికి కాబోయే వరుడు, అతని తల్లిదండ్రులకు కాస్త ఆచారాలు, పట్టింపులు ఎక్కువేనట. అందుకే మేము అసలు తన పెళ్ళికి వస్తామో? రామో? అని అవంతిక భయపడుతోంది”. అంతగా మా రాక మగపెళ్ళివారికి ఇష్టంలేకపోతే పెళ్ళికి రామని ముందేచెప్పి, పెళ్ళికూతురి ముఖంలో తొణికిసలాడే దిగులు చూడలేక, “తప్పకుండా వస్తాం” అని చెప్పాను.
“నా చిన్నారితల్లి మోము ఎంతగా కళకళలాడి పోయిందో నేనొస్తానన్నందుకు! అమ్మో! ఇంకా ఐదారు గంటల సమయమే ఉంది. పెళ్ళివారు మండపానికి వచ్చేందుకు. ఈలోగా అలంకరణ అంతా పూర్తిచేసెయ్యాలి” అనుకుంటున్నాడు అక్బర్ తన మనసులో. “ఒరే బేటా! జల్ది, జల్ది కరోనా” అంటూ తన మనుషులకు పనులు పురమాయిస్తున్నాడు.
ఇంతలో సుందరరావు వచ్చి “ఏరా అక్బర్! ఎంతదాకా వచ్చింది నీ బేటీ పెళ్ళిమండపం?” అని అడిగాడు.
“సుందరం! చూడరా ఓసారి” అంటూ వివిధ వర్ణాలతో సుశోభితమైన కళ్యాణ మండపాన్ని చూపించాడు అక్బర్.
“తొమ్మిది అవతారాలతో విరాజిల్లే అమ్మవారి రూపాలను రంగురంగుల పూలతో ఆవిష్కరించాడు అక్బర్. అచ్చుగుద్దినట్లుగా ఆ అమ్మవారే వచ్చి ఈ పూల ప్రతిమలలో నిక్షిప్తమై, నూతన వధూవరులకు ఆశీర్వాదమందిస్తున్నట్లుగా ప్రాణ ప్రతిష్ట జరిగిందా మూర్తులకు.
సుందరరావు అక్బర్‌ను కౌగలించుకుని “నీ కళా నైపుణ్యాన్ని ఎలా పొగడాలిరా? వేదికంతా ఓ ‘కైలాసమో’ లేక ’వైకుంఠమో’ అన్నట్లుగా తీర్చిదిద్దావు. అన్ని రకాల పూలను సేకరించటానికి ఎంత డబ్బును ఖర్చు పెట్టావు? వేదికను ఇంత సర్వాంగ సుందరంగా అలంకరించటానికి ఎంతగా శ్రమపడ్డావో? అంత డబ్బును అవంతిక కోసం ఖర్చు పెట్టావు కదరా!” విస్మయంతో అన్నాడు.
“మన బేటీ దేవీనవరాత్రులలో ‘అమ్మవారి’ని రోజుకో ‘అవతారమూర్తి’గా అలంకరించి పూజించుకునేది. మీ ఇంటికి వచ్చిన నాకు అమ్మవారిని చూపించి తీర్ధప్రసాదాలను ఇచ్చేది. ఆ మాతృమూర్తుల రూపాలను నా మనస్సులో ముద్రించుకున్నాను. మన బేటీకు పెళ్ళికానుకగా ఇలా మండపాన్ని అలంకరించాలని ఎప్పటినుండో కలలు కంటున్నాను. అందుకే ఉదయంనుండి ‘రంజాన్’ దీక్షలాగా ఉపవాసమున్నాను. నీవు ఈ మండప అలంకరణను చూసి సంతృప్తిని చెందేవరకు నా దీక్ష కొనసాగించాలి అనుకున్నాను” అన్నాడు అక్బర్.
“ఏమిట్రా నీ పిచ్చి. తిండికూడా తినకుండా కష్టపడుతున్నావు కదరా! పని పూర్తయ్యిందిగా! పదపద. నా చేత్తో నాలుగు ముద్దలు తినిపిస్తాను” గొంతుకలో దుఃఖం అడ్డుపడగా మాటలురాక అక్బర్ చెయ్యి పట్టుకుని డైనింగ్‌హాల్ దిశగా నడిచాడు సుందరరావు.
సాయంత్రం ఆరుగంటలకు మగపెళ్ళివారొచ్చారు. సుందరరావు, భార్య రత్నప్రభతోను, మిగిలిన బంధువులతోను కలసి వారికి ఎదురెళ్ళి ఎదురుకోలు సన్నాహాలకు తీసుకొచ్చి పానకాలనందించారు. వేడుకలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా సరదాగా జరిగిపోతున్నాయి.
పెళ్ళికొడుకు కిరణ్ తండ్రి మేఘనాథ్‌గారు సుందరరావుగారితో మాట్లాడుతూ, “బావగారు! నేను పక్కా సంప్రదాయవాదిని. నా కొడుకు అమెరికాకు వెడతానన్నా, వాడికెన్ని అవకాశాలొచ్చినా అక్కడకు పంపలేదు. తరగని ఆచారాలున్నాయి మాకు. లగ్నపత్రికను రాసుకున్ననాడే, కేవలం మీ బంధువులను మాత్రమే పెళ్ళికి పిలవమని, మిగిలిన స్నేహితులకు వివాహమైన తరువాత రిసెప్షన్ ఏర్పాటు చేసుకోమని మీకు చెప్పాను. మా అమ్మాయి పెళ్ళిని అలా సాంప్రదాయబధ్ధంగానే చేసాను. ఇది అబ్బాయి పెళ్ళి. మీ చేతుల్లో ఉంది. మీకు అర్ధమైదనుకుంటాను” అన్నారు.
అతని మాటలను విన్న సుందరరావు “అలాగే బావగారు! మీ మాటను ఆచరణలో చూపిస్తాను” అన్నాడు, కానీ మనసు దిగులుతో నిండిపోయింది.
పెళ్ళిమండపం ఇంకా తెరలలో కప్పబడే ఉంది. బైటవారెవరికి లోపల ఉన్నదేమిటో తెలియటంలేదు. అమ్మవారి ప్రతిమలకు నగిషీలనద్దుతున్న అక్బర్‌కు వియ్యంకుల సంభాషణలన్నీ వినబడుతున్నాయి. తన పని పూర్తిచేసుకుని మిగిలిన పనివారిని తీసుకుని వెనుక ద్వారంగుండా వెళ్ళిపోయాడు అక్బర్.
ఇంక కొద్దిసేపటిలో పెళ్ళితంతు మొదలవ్వబోతోంది. ముందుగా అక్బర్‌తో అనుకున్న విధంగా పెళ్ళికొడుకును మండపానికి స్వాగతించారు. ఒక్కొక్కతెరను తీస్తున్న కిరణ్, “నాన్నగారూ, అమ్మా ఒక్కసారి ఇటు రండి. ఈ మండపంలోని అమ్మవారి ప్రతిమలు ఎంత జీవకళతో ఉన్నాయో చూడండి” అంటూ ఆనందాశ్చర్యాలతో మైమరచిపోతూ ఒక్కొక్క అమ్మవారికి నమస్కరిస్తూ, పద్యాలతో అంజలి ఘటించాడు.
“ఇదేమిటి? భూలోకంలో ఉన్న ఇంద్రసభా? లేక మణిద్వీపమా?” అనుకుంటూ కిరణ్ తరుఫు బంధువులందరు ఆనందహేలలో మునిగిపోయారు. ఒకరి తరువాత ఒకరుగా సుందరరావుగారిని, ఆయన అభిరుచిని అభినందిస్తూ ఫొటోలను, వీడియోలను తీసుకుంటున్నారు.
సుందరరావు వచ్చి “బాబూ! మండపం నీకు నచ్చిందా?” అని కిరణ్‌ను అడిగాడు.
“మామయ్యగారూ! దీనిని మండపం అనకూడదు. అమ్మవారు కొలువుదీరిన మణిద్వీపమే! ఒక్కో పూలప్రతిమలో ఒక్కో అమ్మవారి రూపం సాక్షాత్కరిస్తోంది” అంటున్న కిరణ్ మాటలకు అడ్డువస్తూ, మేఘనాథ్‌గారు “బావగారూ! ఈప్రతిమల రూపకర్త ఎవరోగానీ, తన కళానైపుణ్యంతో దేవతామూర్తులు మనలను దీవిస్తున్నట్లుగా మలచాడు. మీరు పెళ్ళి చూపులలోనే చెప్పారు. అవంతికకు దేవీనవరాత్రులంటే చాలా ఇష్టమని, భక్తితో పూజలను చేస్తుందని. అందుకే అమ్మాయికి నచ్చే విధంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దుంటారు. ఇదొక పరమాద్భుతమండి” అన్నారు.
సుందరరావుగారు ఒక్కసారిగా అక్బర్ కోసం ప్రాంగణమంతా కలియచూసారు. అక్బర్ ఎక్కడా కానరాలేదు.
ఇంతలో పురోహితులవారు వచ్చి “అయ్యా! అమ్మాయిని గౌరిపూజకు తయారు చేయండి. అలాగే పెళ్ళికొడుకును స్నానాదికాలను ముగించి గణపతిపూజకు, అంకురార్పణకు సిధ్ధం కమ్మని చెప్పండి” అని పురమాయించారు. మరి రెండువైపులా పురోహితులు వారేగా! ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు.
సుందరరావుగారు మాత్రం “ఒరే అక్బర్! నీవు వెళ్ళిపోయుంటావు కదా! నీ చేతలను, కళానైపుణ్యాన్ని ఎంతగా మెచ్చుకుంటున్నారో నీకెలా తెలుస్తుందిరా? ఈ మండపానికి దిష్టి తీయించమంటున్నారురా” అంటూ తన అసహాయతకు బాధపడుతున్నాడు. ఎంతగా శ్రమపడి ఈ మండపానికి ఈరూపు తీసుకొచ్చావు. నిద్రాహారాలు మాని మరీ దీనిని తీర్చిదిద్దావు. అలాంటి నీకు, కులమతాలు అడ్డం వచ్చి ఈ మండపంలో ఒకటవుతున్న వధూవరులపై అక్షింతలు వేసే అర్హత లేదంటున్నారురా” అనుకుంటూ కుమిలిపోతున్నాడు.
“నా వేదనను ముందుగానే తెలుసుకున్నావట్రా! అందుకే కనబడకుండా వెళ్ళిపొయావు. కానీ నాకు అవంతిక పుట్టినప్పుడు, నా భార్య దగ్గర పసిపిల్లకు పాలులేకపోతే, బాబీ తన స్తన్యం ఇచ్చి పెంచింది. మనది సోదరబంధంకాదురా. ‘రక్త సంబంధా’నికన్నా మించిన ‘స్నేహబంధంరా’. అంతకన్నా గొప్పవిరా ఈ మతాచారాలు, సాంప్రదాయాలు?” అనుకుంటూ వియ్యంకుడి మాటలను భార్యతో చెపుతూ తన మనసులోని అశాంతిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుందరరావు.
అవంతికచేత గౌరిపూజను మొదలు పెట్టించారు పంతులుగారు. చాచా బుట్టను ఎత్తటానికి కాదుకదా ఈపెళ్ళి సంబరానికంతా దూరమయ్యాడని మదనపడుతోంది అవంతిక.
మండపంలో వరపూజ మొదలయ్యింది. అవంతికను పద్మం ఆకారంలో ఉన్న పూలబుట్టలో మోసుకొస్తున్న వారికి ఓ అపరిచిత వ్యక్తి, తానూ పెళ్ళిబుట్టను మోస్తూ సహాయమందిస్తున్నాడు. సిగ్గుతో తలవంచుకోవటంతో ‘చాచా’ వచ్చాడో రాలేదో చూడలేకపోతోంది అవంతిక.
మగపెళ్ళివారికి మర్యాదలను చూడటంలో తిరుగుతున్న సుందరరావును పిలిచిన మేఘనాథ్‌గారు, “బావగారు! ఈ వివాహం పూర్తి అయిన తరువాత ఈ మండపాని నిర్మించిన కళాశిల్పిని నూతన వధూవరులచేత పట్టుబట్టలను పెట్టించి సన్మానించాలనుకుంటున్నాను. ఆ ఏర్పాట్లను చేయించండి” అన్నారు.
సుందరరావు “ఔను, కాదు” అన్నట్లుగా తలను ఊపాడు. పక్కకెళ్ళి అక్బర్‌కు ఫోను చేసాడు. “అర్జంట్‌గా నువ్వు పెళ్ళిమండపానికి రా” అంటూ ఫోను పెట్టేసాడు.
వధూవరులు జీలకర్ర బెల్లం తలలపై ధరించారు. బంధువుల సందడిలో మంగళసూత్రధారణ జరిగింది. పెద్దలంతా అక్షంతలను చల్లారు. వివాహ వేడుకలన్నీ ముగిసాయి.
భార్యతో ఓపళ్ళెంలో పట్టుబట్టలను, పళ్ళను సర్దించారు మేఘనాథ్‌గారు. ఓ పెద్ద కుర్చీను మండపం మధ్యలో వేసి సన్మానగ్రహీత రాకకై ఎదురుచూడసాగారు.
“బావగారూ ఏమిటి ఆలస్యం? మీరు ఆశిల్పికి సమాచారం అందించారా? లేదా? నేను అతనిని సన్మానించాలని ఎంతో ఆతృతతో ఉంటే, మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు. అతను మీ బంధువో, దగ్గరి స్నేహితుడో అయివుంటాడు. మన శాఖ అయినా కాకున్నా, మన బ్రాహ్మణ కులస్థుడై వుంటాడు కదా! అన్నారు మేఘనాథ్‌గారు.
సుందరరావు “బావగారూ! మరి.. మరి..” అంటూ నసుగుతూ “అతను నా స్నేహితుడే, కానీ మన మతం కాదతనిది. అందుకే ఇంత అందమైన మండపాన్ని మనకందించి, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు” అని చెప్పాడు.
వియ్యంకుని మాటలకు తెల్లబోయిన మేఘనాథ్‌గారు, “ఇది నిజమా! నిత్యం ఆ తల్లిని కొలిచే నిష్టాగరిష్టులమైన మేమే చేయలేని ఈ పని, మన మతం, కులంగాని వ్యక్తి చేత సాధ్యపడిందా? ఇంత భక్తితత్పరతలతో అమ్మవారి నవరూపాలను సజీవ మూర్తులుగా మలచటమా? నమ్మలేకుండా ఉన్నాను. ఇప్పటికి నాకు జ్ఞానోదయమయ్యింది. విష్ణుసహస్రనామాలలోని మొదటి నామం అదే “విశ్వం విష్ణుః..” నాకు బోధపడింది. ఇక నుండి నేను సర్వమానవులలో ఆ పరమాత్ముణ్ణి చూస్తాను. బావగారూ మీరు అతనిని వెంటనే పిలిపించండి” అన్నారు.
“ఇది నిజం బావగారు!. ‘అక్బర్’ అని నా స్నేహితునిచేత నిర్మించబడి, అవంతికకు పెళ్ళికానుకగా ఇచ్చిన అద్భుతమైన మండపమిది. మీ మాటకు కట్టుబడి అతనిని ఈ పెళ్ళికి ఆహ్వానించలేదు. ఇప్పుడైనా మీరు ఒప్పుకుంటే అతనికి కబురు పెడతాను” అంటూ తన కుటుంబానికి, అక్బర్ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని వివరించి చెప్పాడు సుందరరావు.
“ఇంతకాలం మత అచారాలు, కుల సంప్రదాయాలు అంటూ చెరలోనలిగి పోయాను. నాకు అత్యంత ఆప్తులైనవారిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు మంచికి, మానవత్వానికి కులమతాలు అడ్డుగోడలుకావని మీద్వారా తెలుసుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మీ స్నేహితుని ఇక్కడకు పిలవండి” అన్నారు మేఘనాథ్‌గారు.
అప్పటిదాకా కళ్ళకు నల్లని అద్దాలు పెట్టుకుని, కరోనా మాస్క్ ధరించి పెళ్ళి పనులలో పాల్గొన్న ఆ అపరిచితవ్యక్తి మేఘనాథ్‌గారి దగ్గరకు వచ్చి, “మీరు నన్ను క్షమించాలి. మా సుందరం నన్ను పెళ్ళికి పిలవక పోయినా, నా బేటీ పెళ్ళికి రాకుండా ఉండలేకపోయాను. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టటానికై ఈ సాహసం చేసాను. పెళ్ళిబుట్టలో అవంతికను పెళ్ళిమండపానికి తీసుకువచ్చి ఆమె కోరికను నెరవేర్చాను. నేనే ఈ మండపాని రూపొందించిన అక్బర్‌ను” అంటూ తన మాస్క్‌ను, కళ్ళద్దాలను తొలగించాడు.
మేఘనాథ్‌గారు అక్బర్ చేతులు పట్టుకుని, “నేను మిమ్మల్ని సరిగా గౌరవించలేకపోవచ్చు. కానీ ఈ చిన్న సన్మానాన్ని అందుకోండి” అంటూ అక్బర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి మేళతాళాలమధ్య పట్టుబట్టలతో సత్కరించారు.
స్నేహితులిరువురి కన్నులలో ఆనంద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది.