Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

చెప్పులున్న వాడి వెనుక, అప్పులున్న వాడి వెనుక తిరగొద్దు

రాజీపేట గ్రామంలో శివయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు.

శివయ్య కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు.

అతడికి రాజయ్య అనే స్నేహితుడు ఉండేవాడు. రాజయ్య అందరి దగ్గర అప్పులు చేసి జల్సాగా బ్రతికేవాడు.

ఒక రోజు రాజయ్య పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. శివయ్యను తోడుగా రమ్మనమని అడిగాడు. స్నేహితుడి మాట కాదనలేక రాజయ్యకు తోడుగా శివయ్య వెళ్ళాడు.

ఆ దారి మొత్తం గులకరాళ్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. “శివయ్యా! ఏమీ భయపడకు. నేను ముందుకు నడుస్తాను, నా వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ రా!” అని రాజయ్య చెప్పాడు.

రాజయ్య కాలికి చెప్పులు ఉన్నాయి కాబట్టి, దారిలో పెద్ద ముళ్లు, మొనదేలిన రాళ్లు ఉన్నా పట్టించుకోకుండా, నేరుగా నడుచుకుంటూ వెళ్లగలిగాడు.

శివయ్య గుడ్డిగా అతడి అడుగులో అడుగు వేస్తూ పోయాడు. శివయ్య కాళ్ళకి చెప్పులు లేకపోవడం వల్ల రాళ్లు, ముళ్లు గుచ్చుకుపోయాయి. ‘అయ్యో!’ అంటూ ఒక్కసారిగా కేక పెట్టాడు.

“నీకు చెప్పులు లేవని నేను ఆలోచించలేదు. నీ దారిని నువ్వే చూసుకోవాలి!” అని రాజయ్య తేలికగా అన్నాడు.

గాయంతో బాధపడుతూ రాజయ్యతో నడక కొనసాగించాడు శివయ్య. దారి మధ్యలో రాజయ్యకు అప్పు ఇచ్చిన సుబ్బయ్య ఎదురయ్యాడు.

“రాజయ్య! నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఆరు నెలలు అయ్యింది, పదిసార్లు అడిగాను!” అంటూ సుబ్బయ్య రోడ్డు మీద నిలదీశాడు.

రాజయ్య పరిస్థితిని చూసిన శివయ్యకు జాలి అనిపించింది. వెంటనే సుబ్బయ్యతో, “సుబ్బయ్యా! చూడు ఎంత బాధపడుతున్నాడో, ఆ మాత్రం దానికి ఇంత రచ్చ చేస్తావా? తీరుస్తాడులేవయ్యా! ఆ మాత్రం మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోరా?” అని అన్నాడు.

అంతే, సుబ్బయ్య ఒక్కసారిగా శివయ్య వైపు తిరిగి, “మీకంత జాలిగా ఉంటే, ఆ మాత్రం సాయం మీరు చేయగలరు కదా? రాజయ్య అప్పును తీరుస్తానని మీరు హామీపత్రం మీద సంతకం చేయండి!” అని గట్టిగా అడిగాడు.

శివయ్యకు నోట మాట రాలేదు. రాజయ్య కూడా ఆశగా శివయ్య వైపు చూశాడు. చేసేదేమీ లేక హామీపత్రం మీద సంతకం చేశాడు శివయ్య.

ఇంటికి చేరుకున్నాక జరిగినదంతా భార్యకు చెప్పాడు.

అయ్యో! ఎంతపని చేశావు. అప్పులున్నవాడి వెనక, చెప్పులున్నవాడి వెనక తిరగొద్దని పెద్దలు ఊరికినే చెప్పలేదు” అని చెప్పి భర్త తెలివితక్కువతనానికి బాధపడింది.

రాజయ్య అప్పు తీర్చకపోవడంతో, సుబ్బయ్య కోర్టును ఆశ్రయించాడు. కోర్టువారు శివయ్య ఇల్లును జప్తు చేశారు.

అప్పుడు శివయ్యకు భార్య చెప్పిన మాటలోని నీతి అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి.

కాశీ విశ్వనాథం.

Posted in January 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *