మనిషి జీవితంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ప్రవర్తనలు గోచరిస్తాయి. ముఖ్యంగా బంధ అనుబంధ బాంధవ్య బంధాలకు బందీలై మనలో చాలామంది కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా మన మనసుకు బాగా నచ్చి దగ్గరైన వారి స్నేహాన్ని పొందాలనే తపన మెండుగా కలిగి వారి దృష్టిలో మనపట్ల మంచి భావం కలగాలని కొంచెం అత్యుత్సాహంతో ప్రవర్తించడం జరుగుతుంది. అలాగే మనపట్ల మరికొంతమందికి కూడా అదే భావన ఉండి వారి ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కొన్నిసార్లు విసుగు కూడా కలుగవచ్చు. కానీ కొంచెం ఓపికతో మనసుపెట్టి ఆలోచిస్తే అందులోని నిజాయితీ మనకు గోచరిస్తుంది. నిజం చెప్పాలంటే అటువంటి వారి సాంగత్యంలో మనకు కలిగే అభద్రతా భావం తొలగిపోయే సరికొత్త శక్తి వచ్చినట్లుంటుంది. ఇటువంటి సంబంధాల మధ్యన ఆస్తి, అంతస్తు, సామాజిక హోదా ఇవేవి కనపడవు. కనపడకూడదు అప్పుడే పారదర్శకంగా ఆ అనుబంధం స్థిరపడుతుంది.
ఇక స్నేహం అనే పదానికి అర్థాన్ని పరిశీలిస్తే, నిజాయితీతో కూడి స్థిరత్వాన్ని కలిగిన మైత్రి బంధం కలకాలం నిలుస్తుంది. అది రూపుమాసిపోయే ఆస్కారం ఉండదు. ఆ స్నేహబంధం స్వార్థ చింతనతో, అవకాశవాదం తో ముడిపడి నిర్మాణం జరిగితే అది ఖచ్చితంగా ఎక్కువ కాలం నిలబడదు. ఈ మధ్యనే నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు నాతో ఒక చిన్న అవసరం వచ్చి నన్ను పలకరించడం జరిగింది. ఒక్క క్షణం కోపం వచ్చి ఇన్ని సంవత్సరాలకు గుర్తుకు వచ్చానా? అనే ఆలోచన వచ్చింది. వెంటనే చిన్నప్పుడు తనతో నేను గడిపిన సమయాన్ని అంతా గుర్తుకు తెచ్చుకుంటూ వెళుతుంటే నా జీవితంలో నాకు ఎన్ని మధురక్షణాలను వాడు అందించాడనే విషయం అప్పుడు అర్థమైంది. నాతో ఉన్న ఆ చనువుతోనే వాడు నన్ను సంప్రదించాడు. అంతేకాదు ఆ తరువాత మేమిద్దరం మాట్లాడుకుంటూ, మేము గడిపిన పాతరోజుల అనుభూతులను గుర్తుకు తెచ్చుకొని ఎంతగానే సంతృప్తిని చెందాము. ఇట్లాంటి సన్నివేశాలు మనందరి జీవితాలలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. నేను ఇంతకు మునుపు కూడా చెప్పినట్లు మనిషి జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదటి స్టేషన్ నుండి చివరి వరకు ఎంతో మంది మధ్యలో మనకు తారసపడుతుంటారు. కానీ అందరితో అంత మైత్రి బంధం ఏర్పడదు. కొంతమందితో అతి తక్కువ కాలం గడిపిననూ ఆ అనుభూతులు మనతో కలకాలం పయనిస్తాయి. వాటికి కాలపరిమితి ఉండదు. ఎప్పుడు వారిని మరల కలిసిననూ అదో విధమైన మానసిక సంతృప్తి మాటలలో వర్ణించలేని అనుభూతి.
మన ఆలోచనల విధానం అనుకున్న దారిలో పయనించనప్పుడు అందుకు దోహదపడిన కారణాలను విశ్లేషించుకుని తదనుగుణంగా మన ప్రవర్తన కొంచెం మార్చుకొనిన రోజు మనలో కలిగే ఆనందం, తద్వారా లభించిన ఫలితం, అవే మన ఆరోగ్యానికి హేతువులవుతాయి.
‘సర్వే జనః సుఖినోభవంతు’