మన జీవన అలవాట్లు:
నేను ఇప్పుడు వ్రాస్తున్న అంశాలు అన్నీ కొత్తవేమీ కాదు. మనందరికీ తెలిసినవే. అయితే నా అనుభవంలో నేను తెలుసుకొన్న, అనుభవించిన విషయాలతో కొంచెం విభిన్నంగా వ్రాస్తున్నాను.
మనిషి దేహం ధారుడ్యంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ముఖ్యంగా కావలిసినవి పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజాలు, లవణాలు. వీటిని మన జీర్ణకోశ వ్యవస్థ కరిగించి మనకు శక్తిని అందిస్తుంది. ఈ నాలుగు పోషకాలను ఏ రూపంలోనైనా, ఏ పదార్ధం నుండైనా పొందవచ్చు. మనం పుట్టి పెరిగిన ప్రదేశం యొక్క భౌగోళిక, నైసర్గిక స్వరూపాల ఆధారంగా అక్కడ పండించే పంటల వల్ల లభించే పోషకాలకు అనుగుణంగా మన శరీరంలోని జీర్ణవ్యవస్థ రూపాంతరం చెందుతుంది.
ఆపిల్ ఒకటి బాగానే ఉంటుంది. మరి పది తింటే? ఉదాహరణకు ఒక బస్సులో 40 మందికి మాత్రమే సీట్లు ఉన్నాయి కానీ అందులో 60 మంది ప్రయాణిస్తే బస్సుకు ఒడిదుడుకులు ఏర్పడి ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి. అదే బస్సు నాలుగైదు స్టాపుల తరువాత మరల ఇంకెవరైనా ఎక్కకుంటే కొంతమంది దిగిపోతారు కనుక ప్రయాణం సాఫీగా హాయిగా సాగినట్లనిపిస్తుంది. మన శరీరం కూడా అంతే. ఒక వేళ ఎక్కువ తిన్నా (కారణాలు ఎన్నో) అందుకు తగినట్లుగా శారీరక శ్రమ చేస్తే అంతా సాఫీగా హాయిగా ఉంటుంది. అట్లాకాకుండా తినడం మాత్రమే ఉండి సరైన భౌతిక వ్యాయామం లేకుంటే శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు పదార్థాలు విడుదల చేసే చక్కర శాతం పెరుగుతుంది. తదనుగుణంగా మన కాలేయం ఇన్సులిన్ విడుదల చేసే సామర్థ్యం తగ్గి చక్కర వ్యాధి సంక్రమించడం, దానికోసం మందు బిళ్ళలను ఆశ్రయించడం.
చక్కర వ్యాధి అనేది వంశపారంపర్యంగా వస్తుంది. అందరం ఒప్పుకుంటాం. అయితే మన ప్రయత్నంలో కొంత కీలకమైన కృషి ఉంటే దానిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా రక్తనాళాల లో చక్కర నిల్వలు స్థిరంగా ఉండకూడదు. అందుకు మన కండరాల చలనం ఎంతో అవసరం. తినంగానే సోఫాలో కూర్చొని ఉంటే అంతా అక్కడే ఉంటుంది. ముఖ్యంగా పూర్వకాల మైండ్ సెట్ ను అలాగే కొనసాగిస్తూ పురుషులు వంట పని, ఇంటి పని చేయకూడదంటే అందుకు నేను ఒప్పుకోను. కారణం, నేటి సామాజిక పరిస్థితులు అన్ని వసతులు కల్పించి మన శరీరాన్ని కష్టపెట్టకుండా చేస్తున్నాయి. కనుక పనికి వెళ్ళడానికి నడక అవసరం తప్పింది. పనిలో కూడా ఎటువంటి శారీరక శ్రమ లేకుండా యంత్రాలు మనకు సుఖాన్ని ఇస్తున్నాయి. మరి మనం నేటి విధానాలకు అనుగుణంగా మన పద్దతులు కూడా మార్చుకోవాలిగా?
ఇంటిలో కూడా కుటుంబ సభ్యులందరూ ఇంటిపనులను పంచుకొంటే అందరికీ కలిసికట్టుగా సమయం గడిపే అవకాశం కలుగుతుంది. సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది. ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకూ వారి చేతిలోని ఒక చిన్న దీర్ఘ చతురస్రాకారపు యంత్ర సాధనం నుండి కొద్దిపాటి సడలింపు ఉండి కళ్ళకు, మెదడుకు మంచి విశ్రాంతి కలుగుతుంది. మందితో మన ఆలోచనలను, విధానాలను సదా పంచుకొంటూ సమయం గడిపినందున మన ఆలోచనలలోని మూస ధోరణి తగ్గిపోయి, వినూత్నమైన విధానాలకు ఆస్కారం ఏర్పడి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని సీతారామ శాస్త్రి గారు అన్నట్లు, నేటి జీవన విధానంలో మనం అందరితో టచ్ లో ఉన్ననూ ఏకాకిగానే మన ఆలోచనల విధానాలను అమలుపరుస్తున్నాము. చంద్రయాన్ ఉపగ్రహాన్ని చంద్రుని మీద నిలిపి ఇక్కడినుండి కంట్రోల్ చేస్తున్నాం. కానీ సొంత ఇంటిలో ఉన్న మనుషుల మధ్యన ఏర్పడుతున్న బ్లాక్ (బ్లాంక్) హోల్స్ ని మాత్రం పూడ్చేందుకు ప్రయత్నించడం మరిచాము.
మధు గారు,చాలా బాగా చెప్పారు.నేను బాగా ప్రభావితం అయిన పదాలు.
—
ఇంటిలో కూడా కుటుంబ సభ్యులందరూ ఇంటిపనులను పంచుకొంటే అందరికీ కలిసికట్టుగా సమయం గడిపే అవకాశం కలుగుతుంది
—
మన ప్రయత్నంలో కొంత కీలకమైన కృషి ఉంటే దానిని నియంత్రించవచ్చు.