Menu Close
Galpika_title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

మీ టూ - రాజేశ్వరి దివాకర్ల

మధ్యాహ్నం పూట ఎండాకాలం, ఇంకా భోజనానికి శర్మ రాలేదు. వరండాలోనే ఉన్నాడు. రిటైర్ అయినప్పటి నుంచీ అంతే. తెల్లవారుఝామున పనిమనిషి వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతుండగానే ఎవరో వస్తారు. శర్మగారున్నారాండీ అంటూ..

పనిమనిషికి తెలుసు, అయ్యగారు ఇంకా దేవతార్చన చేసుకోలేదని, వచ్చిన ఆయన్ని ఏదో సాకు చెప్పి పంపిచేద్దామని అనుకుంటుంది. కాని అయ్యగారికి కోపం వస్తుందని తెలుసు. అందుకనే వరండాలో ఉన్న కుర్చీని చూపించి కూచోమంటుంది. శర్మగారికి ఎవ్వరినీ తనకోసం కాచుకొని ఉండమనడం ఇష్టం ఉండదు. తమ పనులకు ఎంత జాప్యమైనా సరే వచ్చిన వాళ్ళతో కూచుని వాళ్ళ సందేహాలన్నీ తీర్చి గాని లోపలికి వెళ్ళరు. శర్మగారి భార్య సునందమ్మ, భర్త దేవతార్చన చేసి నైవేద్యం పెట్టేవరకూ, అలాగే మడి కట్టుకుని కూచుంటుంది. మధ్యలో పిల్లలకని వేరుగా అత్తెసరు పెడుతుంది. శర్మగారు ఏ పన్నెండు గంటలకో ఇంట్లోకి వచ్చి దేవుని గదిలోకి వెళ్ల బోతుంటే, ఏమిటండీ వేళా పాళా లేకుండా ఈ దేవతార్చన? ఆ వచ్చిన వాళ్ళతో అంతంత సేపేమిటి? అని విసుక్కుంటే, అంతసేపు ఆవిడనలా అన్నం నీళ్ళు లేకుండా ఉంచడం ఇష్టం లేకపోయినా, ఆయనకు సాహిత్యం మీదా, సాహిత్య చర్చలమీదా ఉన్న ఆసక్తి, అలాంటిది. శర్మ గారిల్లు మడికీ, మర్యాదలకూ నిలయం.

శర్మ గారు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. ఆయన ఇప్పుడు అవిశ్రాంతంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఆయన విద్యార్థులందరికీ ఎంతో ఆత్మీయులు. ఎందరో పేద విద్యార్థులకు సాయంచేశారు. ఎంతో దయాగుణం కలిగినవారు. ఆయనను చూస్తే గౌరవభావం కలుగుతుంది. స్త్రీ విద్యను ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఆయన దగ్గర చదువుకొన్న స్త్రీలు, ఆయనప్రోత్సాహంతో సిద్ధాంత వ్యాసాలనురాసి డాక్టరేట్ పదవిని పొంది ప్రసిద్ధులయిన వాళ్ళెందరో ఉన్నారు. ఆయన ఉద్యోగ విరమణకు ముందు పి హెచ్ డి పరిశోధనా విద్యార్థినిగా చేరింది జ్యోత్స్న. కాబట్టి విశ్రాంతిని పొందినా ఆయన దగ్గరే కొనసాగుతోంది. ఇప్పుడు శర్మ గారికి కొంత తీరుబాటు కూడా దొరకడంతో జ్యోత్స్న కు ఆయన తో సిద్ధాంత విషయ చర్చ చేయడానికి ఎక్కువ సమయావకాశం లభించింది. అంతేకాక జ్యోత్స్నకు మరో విధంగా కూడా సంతోషం కలిగింది. జ్యోత్స్నకు తను విద్యార్థినిగా ఉన్నప్పటినుంచి శర్మగారంటే అభిమానం. ఆ అభిమానం ఆరాధనగామారింది. తన పరిశోధనాకాలంలో మార్గదర్శిగా శర్మగారు విషయ నిరూపణ లో చూపించిన శ్రద్ధ, చేయి పట్టుకొని దిద్దించేటట్లుగా చూపే ఆప్యాయతా ఆమెను ముగ్ధురాలిని కావించాయి. ఇక తన సిద్ధాంత వ్యాసం ముగింపు కొచ్చేటప్పటికి దాదాపు ప్రతి రోజు ఆయనను కలుసుకోడం జరిగింది. శర్మ గారు తమ ధోరణిలో మునిగి ఆమె పక్కనే కూర్చుని మార్గదర్శక సూచనలను చేస్తుంటే ఆమె ఆయననే కన్నార్పకుండా చూస్తూ తనకే తెలియని ఆకర్షణకు లోనయింది. రాను రాను ఆయనను చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చింది.

శర్మ గారు జ్యోత్న తెలివితేటలనెంతో మెచ్చుకుంటారు. ఆమె సిద్ధాంత వ్యాస రచన పట్ల చూపిన ఉత్సాహం ఆమె పట్ల ప్రత్యేకమయిన అభిమానాన్ని కలిగించాయి. ఆమె వాక్చాతుర్యం కూడా కలది. అందుకని తాను ఉపన్యసించే సభలలో ఆమెకు కూడా అవకాశం కల్పించారు. జ్యోత్స్నకూడా మంచి వాగ్ధాటితో ప్రసంగించి సభలనాకట్టుకొంది. శర్మగారితో సాటిగా సభలలో పాల్గొనడం జ్యోత్స్నకు గర్వకారణం అయింది. అమెకు ఆయనతో చనువు పెరిగింది. ఇక సభలలో గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆయనకదేం పొయ్యకాలం? అరవై ఏళ్ళు వచ్చినాయన, కూతురు వయస్సున్న పిల్లను వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. చూడ్డానికి పెద్దమనిషిలా ఉంటాడు. ..!

ఆ గుసగుసలు శర్మగారికి వినిపించాయి. ఆయన లోకం పోకడ అని నవ్వుకున్నారు. ఆనోట ఈనోటా ఆమాటలు శర్మగారి భార్య చెవిన పడ్డాయి. ఆ మాటలకు ఆమె నెవ్వెరపోయింది. మర్నాడు ఉదయమే వచ్చిన జ్యోత్స్నతో ఆమె "చూడమ్మా, నీ సిద్ధాంత వ్యాస రచన అయిపోయింది కదా! ఇక మాఇంటికి రావద్దు” అని ఖచ్చితంగా చెప్పింది.

ఆరోజు రాత్రి జ్యోత్స్నకు నిద్రరాలేదు. ఏడుపూ ఆగటం లేదు. నేను మాష్టరు గారు లేనిదే బ్రతకలేను అనుకొంది. ఆ సంగతి చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. అందుకనే ఎవ్వరితో చెప్పకుండా తన బట్టలు, కొన్ని అవసరమైన వస్తువులూ బాగ్ లో సద్దుకుని ఆ రాత్రికి రాత్రే శర్మగారింటికి బయలుదేరింది. తలుపు తీసిన ఆయన భార్య అర్ధరాత్రి వచ్చిన ఆమెను చూసి ప్రశ్నార్ధకంగా అలాగే నుంచుండి పోయింది. జ్యోత్స్న మాటలు పెగిలించుకుంటూ నేను ఇక ఇక్కడే ఉందామని వచ్చేశాను అంది. అలా ఎలా కుదురుతుంది? ఈ అప్రతిష్ట చాలు, ఇది గౌరవస్థుల కుటుంబం. తక్షణం వెళ్ళు, గర్జించింది ఆవిడ. ఠక్కున తలుపును మూసేసింది.

నిరాశతో, రోషంతో బయటకు వెళ్ళింది జ్యోత్స్న. మర్నాడు వార్తల్లో "మీ టూ" శీర్షికలో జ్యోత్స్న మాష్టారు తననెలా ప్రలోభ పరచారో, మంచిగా నటిస్తూ తనను లొంగదీసుకోవాలని ఎలా ప్రయత్నించారో, ఆయనకు అనుకూలంగా లేకపోతే తన డిగ్రీ విషయమై ఎలా బెదిరించారో తానెలా తప్పించుకొందో వివరించింది.

ఆవార్త చదివిన వాళ్ళందరూ ఉన్నదీ లేనిదీ చిలవలు, పలవలుగా ఊహించుకొని శర్మగారి మీద విరుచుకు పడ్డారు. ఛానల్స్ అన్నింటిలో ఆ వార్త జ్యోత్స్న వివరణతో ప్రసారం అవుతోంది. జ్యోత్స్న పేరిప్పుడు అందరికీ తెలిసింది. స్త్రీ సంఘాలన్నీ జ్యోత్స్నకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఘోషించాయి. ఇలాంటి పెద్ద మనుషులకు తగిన బుద్ధి చెప్పాలని విద్యార్థినులు నిరసన తెలిపారు.

జ్యోత్స్నకు మొదట ఏదో ప్రతీకారం తీర్చుకొంటున్న ఆనందం కలిగినా తాను తప్పు చేస్తున్నాననే భావం కలిగింది. “మాష్టారూ నన్ను క్షమించండి, క్షమించండి” అంటూ పెద్దగా అరుస్తున్న మాటలను పక్కనే మంచం మీద పడుక్కొన్న జ్యోత్స్న తల్లి విని ఏమయిందే నీకు? ఈ కలవరింతలేమిటి, అంటూ జ్యోత్స్నను కుదుపుతూ లేపింది.

జ్యోత్స్న ఈ మధ్య పత్రికల్లో పదే పదేచదువుతున్న "మీ టూ" ప్రభావం నుంచి కోలుకుంది.

అమ్మచేతుల్ని పట్టుకొని, “అమ్మా నువ్వు పొద్దున్న చెప్పావే, అరవింద్ ను చేసుకోమని, అరవింద్ నాకు తెలిసిన వాడే కదమ్మా" నాకు ఇష్టమే అంది. సమయం సందర్భం లేకుండా కూతురు అంటున్న మాటలకు విస్తుపోయినా ఆమె జ్యోత్స్నకు ఏదో పీడ కల వచ్చి ఉంటుందని అనుకుంది. కూతురు నిర్ణయానికామె సంతోషించింది.

ఈవార్తను మొట్టమొదట శర్మ గారికి చెప్పి ఆయన ఆశీస్సులను తీసుకోమని తల నిమురుతూ జ్యోత్స్నకు చెప్పింది.

రోడ్డు శంకుస్థాపన -- లలితాభాస్కర్ దేవ్

వెంటవెంటనే మూడో మారు మోగడంతో, అద్దం ముందు నుంచి పరుగున వచ్చి ఫోనందుకొంది అరుణ. అవతల వైపునుండి కాలనీ సెక్రెటరీ, సుబ్బారావు.

"ఏమిటి మేడం గారూ, మీరింకా రాలేదు... వైస్ ప్రెసిడెంట్ గారే ఆలస్యమైతే ఎలాగండీ... అందులోనూ మీరొక్కరే మహిళా ప్రతినిధి... ఎమ్మెల్యే గారొచ్చేటప్పటికి ముందుండి రిసీవ్ చేసుకోకపోతే ఎలాగండీ?" హడావిడిగా చెప్పేస్తున్నాడు....

"ఆలస్యమేం లేదండీ, తయారైపోయా... వచ్చేస్తున్నా..మా  వారి కోసం చూస్తున్నా, అంతే!" సర్దుకొంటూ బదులు చెప్పింది....

"ఫర్వాలేదు, మీరొచ్చేయండి. ఆయనకు ఇటే రమ్మని ఫోన్ చేస్తాను" అంటూనే సు.రా. పెట్టేశారు.

ఎంతో కాలం నుంచి అందరం కలిసి తంటాలు పడగా శాంక్షనయిన రోడ్డు.. అదీ ఎలెక్షన్లు దగ్గరపడ్డంతో, మేమందరం ఎమ్మెల్యే వెంట పడ్డంతో, ఆయన ప్రభుత్వాధికారుల వెంట పడ్డంతో శాంక్షనయిన రోడ్డు.. సమయం ఎక్కువగా లేదని కేవలం రెండు రోజులముందే ఈ శంకు స్థాపన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు... ఇవ్వాళే మరో నాలుగు కార్యక్రమాలట... కేవలం ఓ పదిహేను నిమిషాలు మాత్రమే సభాకార్యక్రమానికి కేటాయించారు.

"అమ్మా, మీరు లాయరు గారు.... వ్యాపారాల్లో ఉన్న మాకు ఈ స్పీచులు, గీచులు రావు...  సుబ్బారావు స్వాగతం చెప్తాడు, ఆ తర్వాత మాటల పని అంతా మీరే చూసుకోండి" అన్నాడు పర్వతాలరావు.."ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు గట్టిగా చెప్పండి, ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో కాస్త నొక్కి చెప్పండి" అని వాటి వివరాలు కూడా ఇచ్చాడు. వాటి ఆధారంగా ఓ అయిదు నిమిషాల స్పీచు కూడా తన భాషా పాటవమంతా చూపుతూ తయారు చేసుకొని తయారై ఉంది అరుణ.

కార్యక్రమం జరిగే రోడ్డుకు మొదట్లో అట్టహాసంగా కనిపిస్తోంది ఒక పెద్ద బ్యానర్. అందులో ప్రధాన అతిథుల ఫోటోలతో పాటు, కార్యవర్గం సభ్యుల ఫోటోలు కూడా. అందులో మధ్యగా తన ఫోటో అగుపడగానే ఆనందమేసింది... కనకాంబరం రంగు కంచి పట్టుచీర బాగానే కనబడుతోంది...

ఆపక్కనే ఎమ్మెల్యే  ఫోటోతో అటూ, ఇటూ రెండు పెద్ద ఫ్లెక్సీలు, వేస్తున్న రోడ్డుకే నిండుదనం తెస్తున్నట్లున్నాయి...  ప్రజల సొమ్ముగా, ఎలెక్షన్లముందు ప్రభువులకు కీర్తిప్రతిష్టల కోసం ఖర్చు పెట్టక పోతే ఎందుకు?

ఈ రెండు రోజుల్లో రోడ్డుని నాలుగు అంగుళాల మేరకు తవ్వి కంకరతో నింపారు. త్వరగా పని పూర్తి కాకపోతే ఆ కంకరరోడ్డుపై  నడిచేవారి పని గోవిందా! రోడ్డొస్తోందని సంబరమే తప్ప, రోడ్డు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాణ్యత ప్రమాణాల మీద ఎవరి దృష్టీ లేదు.. తమ లాభం గూర్చి పట్టించుకొన్నంతగా, కంట్రాక్టరు, కడకు అధికారులు ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టారు.... "ఈ మాటని నా చిన్న స్పీచిలో గట్టిగా చెప్పాలి" మనసులో గుర్తేసుకొన్నా...

గంటయి పోయింది. ఎమ్మెల్యే గారు ఇంకా రాలేదు... మా వారి విసుగు కళ్ళల్లో కనబడుతూనే ఉంది... జనం మాత్రం ఇంతకాలానికి సి.సి. రోడ్డు వస్తోందనే ఆనందంలో విసువును బయటకు చూపడం లేదు.

ఇంతలో ఎమ్మెల్యే గారు విచ్చేశారు... రాగానే, ఆలస్యమై పోతోందని ఒకటే హడావిడి. పొలోమని జనం మూగడమేమిటి, వారి మధ్యలో అధికార బృందాలు దారి చేయడమేమిటి, శిలా ఫలకం వేసిన చోటుకి చేరడమేమిటి, మేమంతా అటు వెళ్లే లోపే, ఇంజనీరు పురమాయింపుతో, పంతుళ్ళు మంత్రాలందు కోవడమేమిటీ, అవీ సరిగ్గా సాగకుండానే శిలాఫలకం పై ముసుగు లాగేసి, కొబ్బరికాయలు కొట్టేయడమేమిటి "పక్క సందులో మరో ఇనాగురేషన్ ఉంది, అక్కడే మీటింగు, అందరూ అక్కడికే వచ్చేయండీ" అంటూ, ఆయన వంది మాగధుడు మైకులో అనౌన్స్ చేయడమేమిటి, అంతా ఆ మహాకాలుడే తరుముకొస్తున్నట్లు చకచకా జరిగిపోతున్నాయి...

మధ్యలో మా సుబ్బారావు కామోసు, "అయ్యా, ఒక్క అయిదు నిమిషాలు చాలు" అంటూండడం వినిపించింది... ఆయన మాట సాంతం వినరానీకుండా, "ఎమ్మెల్యే గారి టరంలో ఇది ఇన్నో శంఖుస్థాపన కార్యక్రమం అంటూ ఆయన వమ్మాగధుడు అనౌన్స్ చేస్తున్నాడు.. అంతలో ఎమ్మెల్యే గారి వాహనసంచయం కదిలిన చప్పుడూ వినిపించింది....

ఉస్సూరనిపించింది.

"రండి, మేడం, మనమూ కొబ్బరి కాయలు కొట్టి బయలుదేరుదాం", ప్రెసిడెంట్ పర్వతాల రావు...

"ఇంకెక్కడికీ?" నీరసంగా అడిగాను...

"ఆ ఇనాగురేషన్ జరిగే చోటికి! అక్కడగుపించకపోతే ఇక్కడ పనులు జరగొద్దూ!!"... సుబ్బారావు ఉవాచ!!!

నోటాకర్షణ - అత్తలూరి విజయలక్ష్మి

గవర్నమెంట్ ఉద్యోగి అంటే లంచగొండి అనే ముద్ర చేరిపెయాలన్నది నా ఆశయం. అందుకోసం నేను మేనేజర్ గా ఛార్జ్ తీసుకున్న రోజే నా స్టాఫ్ కి చెప్పాను... ఎవరన్నా లంచాలు తీసుకుంటే ఊరుకోనని.. అందరూ ముందు నా వైపు అమాయకురాలిని చూసినట్టు చూసారు.. నా మొహం లో సీరియస్ నెస్ చూసి అటు, ఇటూ కాకుండా తలలూపారు. ఆ విషయం లో నేను సింహంలా ఉండాలని నిర్ణయించుకున్నాను. మా డైరెక్టర్ తో కూడా ఇండైరేక్ట్ గా చెప్పాను నాకు లంచాలు తీసుకోడం, ఇవ్వడం రెండూ నచ్చవని.. ఆయన వెరీ గుడ్ ... మంచి ఆశయం అని పొగడడం తో ఆయన మీద గౌరవం పెరిగిపోయింది. హమ్మయ్య నా అధికారి కూడా నాలాగా ఆదర్శాలు ఉన్నవాడే అనుకున్నాను సంతృప్తిగా.

అందుకే నా దగ్గర ఒక్క ఫైల్ కూడా పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ వెంట, వెంటనే సైన్ చేసి మా డైరెక్టర్ దగ్గరకు పంపించేస్తా. అటునుంచి అటే మళ్ళి సెక్షన్ కి వెళ్లి ఆ పని ప్రాసెస్ అవాలి. అది నా పాలసీ.

ఒకరోజు నా దగ్గరకు మా రెగ్యులర్ కాంట్రాక్టర్ రమేష్ వచ్చాడు.

“మేడం నా ఫైల్ సార్ సిగ్నేచర్ కోసం పంపాను... ఇంకా రాలేదు మేడం” నసుగుతూ అన్నాడు.

“ఏం ఫైల్” ఆశ్చర్యంగా అడిగాను. “అదే మేడం మేము చేస్తున్న వెంచర్ కి వాటర్ సప్లై కోసం అప్లై చేసాను కదా! సార్ ఇన్స్పెక్షన్ కూడా చేసారు. ఫైల్ వెంటనే ప్రాసెస్ చేయించమంటే కేసు వర్కర్ దగ్గర కూర్చుని చేయించాను” తను పడిన కష్టం అంత మొహంలో ప్రతిఫలింపచేస్తూ అన్నాడు.

“నా దగ్గర ఏ ఫైల్ లేదు అన్నీ డైరెక్టర్ గారికి పంపించేసాను” అంటూ నా కాబిన్ బయట ఉన్న జమాల్ని పిలిచాను. జమాల్ మా ఆఫీస్ లో ఒక ప్యూను ... నాకు మా డైరెక్టర్ కి ఫైల్స్ అందించడం, టీలు తేవడం మంచినీళ్ళు ఇవ్వడం అతని విధి. మా ఇద్దరి కాబిన్స్ మధ్య కారిడార్ లో స్టూల్ వేసుకుని కూర్చుని కునికిపాట్లు పడుతుంటాడు. రెండు, మూడు సార్లు పిలిస్తే కానీ పలకడు ...విచిత్రం ఇప్పుడు పిలవగానే వచ్చాడు. “ఈ సార్ ఫైల్ ఏదో వచ్చిందిట చూడు ఎక్కడ ఉందో” అని చెప్పి, రమేష్ తో అన్నాను “అతనితో వెళ్ళండి చూస్తాడు”. రమేష్ థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.

మరో పదినిమిషాలకి జమాల్ నా కాబిన్ కి వచ్చాడు. “ఏమైంది కనిపించిందా ఫైల్” అడిగాను.

“ఏడకి పోతది మేడం ... నాల్గు దినాలైంది .... కలవకుంటే పనైతదా ...గిప్పుడొచ్చిండు” అన్నాడు.

నాకు అర్ధమైంది కలవడం అంటే ఏమిటో ... “ఎంత తీసుకున్నావు” అడిగాను.

జేబులోంచి వంద రూపాయల నోటు తీసి చూపించాడు. కోపంగా అన్నాను “నీకు చాలాసార్లు చెప్పాను ఇల్లాంటి పనులు చేయొద్దని.. ఆఖరిసారి చెప్తున్నా..నువ్వు చేసే పనులతో డైరెక్టర్ కి నాకు కూడా చెడ్డపేరు వస్తుంది” అన్నాను.

“ఊకో మేడం ... నీ లెక్క నీతులు చెప్పుకుంట కూసుంటే చాయ్ పైసలు కూడా రావు... చాయ్ తాగల్నంటే జేబులోకేల్లి తీయాలె ... పైలి తారీకు నాడే అయిపోతయి జీతం పైసలు.. గిసొంటివి లేకుంటే ఎట్ల బతకాలె... గా కాంట్రాక్టర్ మస్తు తింటడు.. నువ్వు కూడ కొంచెం ఉషారుండాలె” అన్నాడు హితబోధ చేస్తూ.

“నీకు రేపటి నుంచీ చాయ్ నేను తెప్పిస్తా.. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు ... ఇదిగో వంద రూపాయలు.. ఆ వంద రేపు అతనికి ఇచ్చేసేయ్” అన్నాను పర్స్ లోనుంచి వంద రూపాయలు తీసిస్తూ.. కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకుని మంచిది అనుకుంటూ వెళ్ళిపోయాడు.

హమ్మయ్య ఈ మూర్ఖుడిని కూడా మార్చగలిగాను .. లంచగొండి తనం మానిపించాను అని గర్వంగా నా భుజం నేనే చరుచుకున్నాను.

అప్పటినుంచి నాతో పాటు ఉదయం, సాయంత్రం కూడా చాయ్ అతనికి కూడా తెప్పించసాగాను. మూడు నెలలు గడిచాయి. నా దగ్గరకు మళ్ళి ఎవరూ వాళ్ళ పెండింగ్ ఫైల్ కోసం రాలేదు. చాలా ఆనందంగా అనిపించింది. మా డైరెక్టర్ నాకు తెలిసి ఎప్పుడూ లంచాలు తీసుకున్నది నేను చూడలేదు. ప్రభుత్వ కార్యాలయాలు అంటే లంచగొండి తనానికి నిలయాలు అనే పేరు ఎప్పటికైనా పోతుందా అని నా అనుమానం, పొతే బాగుండు అని నా ఆశ ... అందుకోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నాను.. నలుగురం ఆఫీసర్స్ కూడితే లంచగొండితనం మీద ఉపన్యాసాలు ఇవ్వసాగాను. నెమ్మదిగా ఆ నలుగురు నన్ను అవాయిడ్ చేయసాగారు. అయినా పట్టు వదలక నా కాబిన్ వైపు వచ్చిన వాళ్ళని పట్టుకుని నా ఉపన్యాసాలు దంచడం మొదలుపెట్టాను. కనీసం నా ఆఫీస్ అయినా లంచగొండి రహితంగా చేయాలని నా కోరిక ... అందరి సంగతి ఏమో తెలీదు కానీ, నా మాటల మీద గౌరవం ఉంచి జమాల్ టిప్పులు అడగడం మానేశాడని చాలా సంతోషించాను.

ఆరోజు జమాల్ కొత్త బట్టలు వేసుకుని వచ్చాడు..”ఏంటి విశేషం” అడిగాను.

“ఇయాల నా పుట్టిన దినం మేడం ... జిందగీల ఫస్ట్ టైం నేను నా పుట్టిన దినం నాడు కొత్త బట్టలేసుకున్న... ఎప్పుడూ రంజాన్ కి కొంట ... మల్ల బక్రీద్ కి కొంట ... సమత్సరానికి రెండే జతలు.. నీ హాత్ ఏం హాత్ మేడం ... ఆ దినం నువ్వు నాకు ఈ నోటు ఇచ్చినవ్ కదా “ జేబులోనుంచి పర్స్ తీసి అతి జాగ్రత్తగా వంద రూపాయల నోటు తీసి చూపిస్తూ అన్నాడు “ఇది నువ్వు ఇచ్చిన దగ్గర నుండి మస్తు పైసలోస్తున్నాయి. ఇది జిందగీల కర్చు చేయ.. లక్ష్మి మేడం ... లక్ష్మి ఇది ...” కళ్ళకద్దుకుని ఆ నోటు తిరిగి పర్స్ లో పెట్టుకుని పర్స్ జేబులో పెట్టుకుని బయటకు వెళ్తున్న జమాల్ వైపు నోటమాట రానిదానిలా చూస్తూ ఉండిపోయాను.

భూమ్యాకర్షణ లాగా నోటాకర్షణ సూత్రం ఏదన్నా ఉందేమో అని గూగుల్ ఓపెన్ చేసాను.

పునరపి జననం -- స్వాతి శ్రీపాద

కొ౦చ౦ కొంచం చలి కరిగి వెచ్చదనం సంతరించుకు అక్కడా ఇక్కడా పచ్చదనం కనిపిస్తో౦ది. ఉదయాలూ, సాయంత్రాలూ ఎముకలు కొరికే చలి వదిలి ఆహ్లాదంగా ఉంటున్నాయి.

ఉదయమే మెలుకువ వచ్చి పక్కనే ఉన్న సెల్ ఫోన్ లో టై౦ చూసుకుంది మహతి. ఇంకా అయిదున్నర దాట లేదు. అయినా వెలుగు ఇంటి చుట్టూ కమ్ముకుని కిటికీ అద్దాల్లోంచి గదిలోకి చొరబడింది. తాజా గాలికోసం కొంచం తెరిచిన కిటికీ మెష్ లోంచి తియ్యటి పక్షిస్వరం. నైటింగేల్ కావచ్చు.

కాస్సేపు అటూ ఇటూ దొర్లి లేచి బెడ్ సెట్ చేసింది. ఇల్లంతా నిశ్శబ్దం. రాజేష్ ఈ వారం వచ్చాడో లేదో తెలియదు.రవీష్ ఆలస్యంగా వచ్చి మంచి నిద్రలో ఉండి ఉంటాడు. బ్రష్ చేసుకుని కిందకు దిగుతూ వద్దన్నా మూసిన రెండు బెడ్ రూమ్ ల వైపు చూపు కదిలింది.

ఒకటి సుజా గది. అది పెళ్లి చేసుకుని వెళ్ళినా ఎప్పటిలా తన గది తనదే నంటూ....దాన్నిండా దాని వస్తువులే. ఆర్నెల్లకోసారి వస్తే గొప్ప.

మరోగది .. మరోగది .. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

చప్పున తుడుచుకు గబగబా కిందకు దిగింది.

వేన్నీళ్ళకి కెటిల్ ఆన్ చేసి బాక్ యార్డ్ కి వెళ్ళే కిచెన్ గ్లాస్ డోర్ తెరిచి౦ది.

దాదాపు నాలుగేళ్ల తరువాత ... అవును ఎప్పుడూ బ్లై౦డ్స్ కూడా పక్కకు కదపలేదు.

దుమ్ముకొట్టుకుపోయిన గార్డెన్ టేబుల్ చేయిర్స్, ఎప్పుడు గ్రాస్ కట్ చేసి వెళ్తున్నాడో కూడా పెద్దగా గమనించలేదు. వెలవెల బోతూ ఉ౦ది బాక్ యార్డ్, వెనకాల ఉన్న గుబుర్లలో౦చి చటుక్కున ముందుకు దూకి పరుగెత్తాయి రెండు తెల్లని కుందేళ్ళు. ఆ వెనకే అయిదారు పిల్లలు.

తేజూ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇల్లు ఇలా లేదు. అవును, ఆ పిల్లకు చిన్నప్పటి నుండే ఇల్లంటే గొప్ప శ్రద్ధ. ఎప్పటికప్పుడు ఇంటీరియర్ డెకోరేషన్ అంటూ కొత్త వస్తువులు తేడం పాతవి సాల్వేషన్ ఆర్మీకి డొనేట్ చెయ్యడం, ఏ వారాంతానికి ఇల్లు ఎలా మారిపోతు౦దో ఎవరికీ తెలిసేది కాదు.

కాని ఎవరు ఇంటికి వచ్చినా కళ్ళు తిప్పుకోలేక పోయేవారు.

బాక్ యార్డ్ కూడా అంతే సమ్మర్ వచ్చీరాక ము౦దే రకరకాల మొక్కలు ఇంటికి తరలి వచ్చేవి. ఎక్కడ చూసినా రంగులమయమే.

పచ్చికలో కూడా ఎన్ని అందాలో ... రకరకాల ఆకారాల్లో తీర్చి దిద్ది ఎంత అందంగా కనిపించేది.

ఎంత వద్దనుకున్నా రాధేష్ గుర్తుకు వచ్చేవాడు.

ఆ కళాత్మక హృదయానికే కదా దాసోహమవుత.

కులాలు వేరు అయినా పెద్ద పట్టి౦పు లేకపోయింది. నిప్పులు కడుక్కునే ఇంట్లో పుట్టి అట్టడుగు వర్గానికి చెందిన అతన్ని కావాలనుకు౦ది. జీవితంలో ప్రేమకన్నా ఏదీ ముఖ్యం కాదనుకు౦ది. కాని చెరిగిపోని సత్యం ఒకటి ఇప్పటికీ ముల్లులా గుచ్చుకు౦టూనే ఉంటుంది.

నిజానికి ప్రపంచమంతా ఏదో కొ౦పలు మునిగిపోయినట్టు అగ్రవర్ణాల దౌర్జన్యం అంటూ దుమ్మెత్తి పోస్తు౦ది కాని ఎంత సరిపెట్టుకున్నా జలగల్లా పీడించే ఈ కుల రాక్షసుల గురించి ఎవరికి  చెప్పాలి. కులం ముందు కన్నప్రేమ, తోడ బుట్టిన బంధాలూ బలాదూరని ఎవరికీ చెప్పాలి?

కులం ముందు కొడుకు శత్రువవుతాడు.నిలబెట్టి పెంచిన బాకీ వసూలు చేసుకునే క్రౌర్యం ఇస్తుంది. తోసిరాజని పగ్గాలు పట్టే బలం తోడబుట్టిన వారికి ఇస్తు౦ది.

పొట్ట చేత బట్టుకుని కాని దేశాలకు తరలి పోయేలా చేస్తు౦ది.

అయినా రాధేష్ కు౦చె కదిలితే స్వర్గ లోకం కళ్ళముందు వాలుతుంది. గళం విప్పితే పంచామృతం జడి వాన అవుతుంది.

ఆ కళల స్వప్నంలో కాలం ఎంత వేగంగా కరిగిపోయింది.

“మనకు కనీసం నలుగురు పిల్లలైనా కావాలి మహీ, ఇల్లు ఎప్పుడూ గలగలలతో ఉండాలి, నిండుగా కళ కళలాడాలి” అనేవాడు.

పదేళ్ళకాల౦ ఎంత కనురెప్పపాటులో కరిగిపోయి౦దో ...

పదేళ్ళు ... అవును ఇంతకన్నా ఏ౦కావాలి అనిపించేలోగానే ...

ఇంకా పిల్లలకు ఊహ రానేలేదు, పెద్దపిల్ల తేజూ మిడిల్ స్కూల్ కి వచ్చి౦ది, రెండోది ప్రీ స్కూల్, రాజేష్ కి రెండేళ్ళు , రవీష్ కి నెలన్నర ...

ఆ సాయంత్రం వెన్నెల కరిగి చీకట్లవుతాయని తెలిసిన సాయంత్రం .....

ఎప్పటిలా ఇంటికి వస్తున్న రాధేష్ , మరెవరికో వచ్చిన హార్ట్ ఎటాక్ కి జరిగిన ప్రమాద బీభత్సంలో బలి అయిపోతాడని ఎవరికీ తెలుసు ...

ఒక్క నిమిషం గు౦డె ఆగిపోయి౦ది.

ఈ విశాల విశ్వంలో పిల్లలు తనేనా అనిపి౦చి౦ది.

ఎంతసేపు అలా ఉ౦డిపోయి౦దో చంటి వాడు ఆకలికి కేరుమనడం తనకర్తవ్యాన్ని గుర్తు చెసి౦ది.

నలుగురు పిల్లలే జీవితం అనుకుంది. ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు ఎదిరించి ఒక ఒడ్డుకు చేరామనుకున్నారు.

పిల్లలు ఒకరొకరూ అంది వచ్చారు. నాలుగేళ్ల క్రితం, ఎప్పటిలా వేసవి ఆరంభంలో ఫ్లవర్ బెడ్స్ ఏర్పాటు చేస్తో౦ది తేజూ.

ఆరోజు శనివారం అందరూ ఇంట్లో ఉండటం వల్ల అందరికీ ఇష్టమని బయట స్టౌ వెలిగించి ఆలూ బో౦డా చేస్తో౦ది. రాధేష్ కి కూడా ఎంత ఇష్టమో -చేసినప్పుడల్లా అతన్ని తల్చుకోకు౦డా ఉండలేదు.

సుజా స్వింగ్ పై కూచుని స్టైల్ పత్రిక తిరగేస్తో౦ది. రాజేష్, రవీష్ అక్కకు సాయపడుతున్నారు.

ఆ సమయాన ఒక పెద్ద దగ్గుతెర వచ్చి భళ్ళున వాంతి చేసుకు౦ది తేజూ ... ఎటు చూసినా రక్తమే ... కాళ్ళూ చేతులూ ఆడలేదు , ఎమర్జెన్సీకి కాల్ చేసిన రెండు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి౦ది.

ఆ వెళ్ళటం వెళ్ళడం మరి ఇంటికి రాలేదు.

అవును అక్యూట్ స్టేజిలో ఉన్న లుకీమియా ...

ఇంట్లో ఉన్న ప్రతివాళ్ళూ జీవచ్ఛవాలైపోయారు. కళ్ళముందు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న తేజూ వెళ్ళిపోతూ ఇ౦టి కళనూ వెంట పట్టుకుపోయి౦ది.

కన్నీళ్లు తుడుచుకు వెనక్కు తిరగబోయి౦ది మహిత.

మళ్ళీ వినిపించిన నైటింగేల్ పాటలో చెప్పలేని విషాదం. తలతిప్పి ఆ వైపు చూసిన మహి నిశ్చేష్టురాలయి౦ది బార్డర్ లా ఎత్తుగా పెరిగిన చెట్టు కొమ్మపై వేళ్ళాడుతూ గూడు ... దానికింద ఇంకా రెక్కలు రాని పక్షిపిల్ల. దాని పక్కన మూగవోయినట్టున్న తల్లి పక్షి. గూటి చివర నిలిచి పాడుతున్న నైటింగేల్, పక్కకు ఒత్తిగిలి లోపల ఇంకా పొదుగుతున్న గాజుముక్కల్లాటి పిల్లలను రెక్కలకి౦దకు లాక్కు౦టూ.

అయిదారు నిమిషాల తరువాత చుట్టూ వున్న పుల్లపుడకా ఆ పగిలిన పసిగుడ్డుపై పేర్చి గూటివైపు సాగింది తల్లి పక్షి.

వారం తిరిగేసరికి ఇల్లు ఇంటితో పాటు ము౦గిలి , పెరడు కూడా కొత్త రూపు స౦తరి౦చుకున్నాయి. పచ్చిక లో స్ప్రి౦క్లెర్ల నీళ్ళు పైకెగజల్లుతున్నాయి. వారాంతాలు తల్లీ పిల్లలు తోటపనిలో తలమునగా నిమగ్నమైపోయారు.

ఆ రోజున సుజా కాల్ మరింత బలాన్నిచ్చింది.

“అమ్మా మంచి వార్త చెప్పనా, అక్క మళ్ళీ మనింటికి వస్తుంది ... నా బేబీగా...”

“చాలా సంతోషం సుజా అందుకే ఇంటిని తయారు చేస్తున్నాం. అవును సుజా కాలం ఎక్కడా ఆగిపోదు, మరణం ఒక అంతం కాదు. మళ్ళీ మళ్ళీ  పుడుతూనే ఉంటాం” తనలో తను అనుకున్నట్టుగా అంది మహి. 

Posted in September 2019, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *