Menu Close

Alayasiri-pagetitle -- డా. మధు బుడమగుంట

ఫినాం బేక్హెంగ్ ఆలయం కంబోడియా

Phnom Bakheng

‘విహంగ వీక్షణం’ అనేది నేడు మనకు ఎంతో సుపరిచితమైన పదం. ఎందుకంటే ఏదైనా పెద్ద కట్టడం లేక అద్భుతమైన ఆవిష్కరణ జరిగితే విమానాలలో మనలను తీసుకువెళ్ళి దానిని పై నుండి వీక్షించేటట్లు చేయడం సర్వసాధారణ అంశమైనది. అయితే ఆ ఆలోచన నేడు వచ్చినది కాదు. ఇటువంటి ఆలోచన మనం మన పూర్వీకులనుండే తెలుసుకొన్నాము. మనం చేస్తున్నదల్లా ఆ ఆలోచనకు, ఆధునికతను జోడించి అనుభవిస్తున్నాం.

కంబోడియా దేశంలోని ఆంగ్కోర్ వాట్  (Angkor Wat) గురించి తెలియని ప్రపంచ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, విదేశీ పర్యాటకులు, ప్రకృతి సౌందర్య పిపాసకులు ఉండరంటే ఆశ్చర్యమేమీ లేదు. మరి అటువంటి చారిత్రాత్మక కట్టడానికి నేడు మనం అనుభవిస్తున్న విహంగ వీక్షణం వీలౌతుందా అంటే, సహజ సిద్ధంగానే అవుతుందనే భరోసాతో ఆంగ్కోర్ ప్రాంగణం నిర్మించడానికి వందల సంవత్సారాల మునుపే ఒక కొండ మీద పిరమిడ్ ఆకారంలో నిర్మించిన మహాశివుని ఆలయం, ఫినాం బేక్హెంగ్ ఆలయం నేటి మన ఆలయసిరి.

తొమ్మిదవ శతాబ్దం చివరలో మొదలుపెట్టి పదవ శతాబ్దం మొదట్లో పూర్తిచేసిన ఈ శివాలయాన్ని మహారాజు యశోవర్మన్ నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఆంగ్కోర్ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన పర్వతం పైన నిర్మించిన ఈ ఆలయం నాటి క్రొత్త రాజధాని యశోధరపురం యొక్క ముఖ్య ఆకర్షణగా నిలిచింది. నేడు ప్రపంచలోనే అత్యంత ఆకర్షణీయమైన పురాతత్వ సంపదగా ప్రాముఖ్యతను సంతరించుకొంది.

మన హిందూ పురాణాలలో వివరించిన మేరు పర్వతంను తలపిస్తూ కొండమీద పిరమిడ్ నమూనాతో ఐదు అంతస్తులతో నిర్మించిన ఈ ప్రముఖ కట్టడం మన హిందూ దేవుళ్ళకు నిలయమైంది. చివరి అంతస్తులో నిర్మించిన ఐదు దేవాలయాలు మేరు పర్వత ఐదు శిఖరాలను పోలినట్లు నిర్మించడం యాధృచ్చికమే అయిననూ ఆ కళా నైపుణ్యాన్ని హర్షించకుండా ఉండలేము. అది కూడా కొండపైకి పెద్ద పెద్ద శిలలను తీసుకువెళ్ళి వాటిని కళాకృతులుగా మలచడం అంటే నిజంగా అత్యంత గొప్ప విషయం. ఇంకొక విషయం ఏంటంటే అన్ని హిందూ ఆలయలాలో ఉన్నట్లే ఇక్కడ కూడా మృగరాజుల ప్రతిమలు నేటికీ కనిపిస్తాయి. బహుశా అక్కడి ఆలయాలను పరిరక్షించే కాపలాదారులేమో! ఆ కాలంలోనే మన హిందూ తత్వాన్ని ప్రతిబింబించే విధంగా 109 పవిత్ర మంటపాలను నిర్మించి వాటి మీద వివిధ దేవతామూర్తుల ఆకృతులను, నాగ దేవతలను, యుద్ధ వీరుల ప్రతిమలను చెక్కడం నిజంగా అద్భుతమైన పనితనమే. పదహారవ శతాబ్దంలో బౌద్ధమత ప్రాభవంతో ఈ ఆలయ ప్రాంగణంలోనే బుద్ధుని విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది.

Phnom Bakheng

ఇక్కడి కట్టడాలు అన్నీ శిధిలావస్థకు చేరుకొన్ననూ, ఆంగ్కోర్ వాట్ ఆలయ ప్రాంగణాన్ని విహంగ వీక్షణం చేయాలంటే ఇక్కడినుండి చూడవచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో వీక్షించడం ఒక మరిచిపోలేని మధురానుభూతి. కనుకనే ఈ ఫినాం బేక్హెంగ్ ఆలయం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.

Posted in September 2019, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!