Menu Close
manusmrithi page title
మొదటి అధ్యాయము (అ)
[ముందుగా ఈ స్మృతికారుడైన మనువు ఎవరో మనం తెలుసుకోవాలి. ‘స్వయంభూ’ అంటే తన ఉనికి కొరకు వేరెవరిపైనా ఆధారపడనివాడు - అనగా భగవంతుడు. ఆయన కుమారుడు మొదటి మనువైన ‘స్వాయంభువ మనువు’. స్వయంభూ కుమారుడు కనుక ఆయనకాపేరు. మొత్తం మనువులు 14 మంది. మొదటి మనువు స్వాయంభువుడు కాగా మిగిలిన 13 మంది వరుసగా వీరు : 2) స్వారోచిషుడు 3) ఉత్తముడు 4) తామసుడు 5) రైవతుడు 6) చాక్షుషుడు 7) వైవస్వతుడు 8) సూర్యసావర్ణి 9) దక్షసావర్ణి 10)  బ్రహ్మసావర్ణి 11) ధర్మసావర్ణి 12) రుద్రసావర్ణి !3) రౌచ్యుడు 14) భౌచ్యుడు.  ( కొన్ని గ్రంథాలు  ఈ చివరి ఇద్దరినీ దేవసావర్ణి, ఇంద్రసావర్ణి అని  పేర్కొన్నాయి). వీరిలో ప్రతి మనువు ప్రళయకాలపు అంధకారంతో కూడిన గందరగోళ స్థితి  (Chaos) లోనుంచి సృష్టి కార్యం మొదలెట్టి సకల చరాచర జగత్తును, సకల జీవరాశులను, ప్రజాపతులను, ఋషులను, మానవులను సృష్టించి వారిని రక్షించి పాలిస్తాడు. ఒక మనువు పాలనాకాలాన్ని మన్వంతరము అంటారు. ఒక మన్వంతరము అంటే 71 దివ్య యుగాల కాలమట. అంటే 43 లక్షల 20 వేల మానవ సంవత్సరాలట. అది బ్రహ్మ రోజులో పద్నాల్గవ వంతు. అంటే మొత్తం పద్నాలుగు మన్వంతరాలూ కలిసి బ్రహ్మకు ఒక రోజు లేక ఒక అహోరాత్రము.  ప్రతి మన్వంతరంలో వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాలూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఏడవవాడైన  వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఈ మనువు వివస్వంతుడు అంటే సూర్యుడి కుమారుడైన కారణంగా ఆయనకాపేరు. ఆరవ వాడైన చాక్షుష మనువు యొక్క పాలనాకాలమైన చాక్షుష మన్వంతరం ముగిసే సమయంలో నెలల తరబడి కుండపోతగా కురిసిన ఒక వర్షానికి సముద్రాలన్నీ ఒక్కటై ఒక మహా జలప్రళయం వచ్చిందట. అప్పుడు విష్ణువు సూర్యుని కుమారుడైన వైవస్వత మనువు పట్ల కరుణతో ఒక ఒంటి కొమ్ము గల మహామత్స్యం రూపంలో ఆయన్ని కాపాడబూని, యావజ్జీవులనూ మేదినీ రూపమైన ఒక ఓడలో నింపి, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా తన కొమ్ముకు కట్టి ఆ ఓడను లాక్కెళ్లి శతశృంగ పర్వతం మీద నిలిపాడట. ( జలప్రళయం గురించి, అన్ని జీవులలోని ఆడ, మగ జాతులను మోసుకెళ్లిన ఓడ (Ark)  గురించి ఇదే తరహా కథలు దాదాపు అన్ని మతాల పవిత్ర గ్రంథాలలో ఉండడం, భారతీయుల పురాణాలలో ప్రస్తావించబడిన  ‘మను’, క్రైస్తవుల ‘బైబిల్’  లోని ‘నోవా’, మహమ్మదీయుల ‘ఖుర్ - ఆన్’  లోని ‘ను’ ల పేర్లలోని సారూప్యత కారణంగా ఈ మతాల మూలాలన్నీ ఒక్కటేననేది మనం గ్రహించవచ్చు. అలాగే కొన్ని అశాస్త్రీయమైన విషయాలను పక్కనబెడితే ఒకప్పుడు ఒక బ్రహ్మాండమైన జలప్రళయం ప్రపంచాన్నంతటినీ ముంచెత్తడం కూడా సత్యమే అయివుండవచ్చనీ మనం భావించవచ్చు). ఇక అక్కడినుండి వైవస్వత మనువు మానవ సమాజాన్ని పునర్నిర్మించి, దానికి తగువిధమైన ధర్మసూత్రాలను నిర్దేశించి, ఆ మన్వంతరానికి మార్గదర్శకునిగా ప్రసిద్ధికెక్కాడు. అష్టాదశ (18) స్మృతులలో ప్రసిద్ధమైనది ‘మనుస్మృతి’ అనే ‘మానవ ధర్మశాస్త్రం’. ఇది పన్నెండు అధ్యాయాల బృహద్గ్రంథం. మొదట ఈ ధర్మశాస్త్రాన్ని బ్రహ్మ రచించి, తానే స్వయంగా మొదటి మనువుకు ఉపదేశించాడట. మనువు దానిని మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు మొదలైనవారికి ఉపదేశించగా, దానిని భృగువు మునులందరికీ విశదీకరించాడట.]

ఒకప్పుడు మహర్షులంతా కలిసి, ఏకాగ్రమైన చిత్తంతో నిశ్చలంగా కూర్చునివున్న మనువును సమీపించి, ఆయన్ని యథావిధిగా సత్కరించి, ఇలా అన్నారట -

“భగవన్! ( ఓ భగవంతుడా ! ) నాలుగు వర్ణాల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల) ప్రజలు, వారి మధ్య అనులోమ, విలోమ వైవాహిక బంధాల కారణంగా ప్రభవించిన ఉపజాతుల (కులాల)  ప్రజలు పాటించవలసిన పవిత్ర ధర్మములను మాకు క్రమపూర్వకంగా వివరించండి.” (అగ్రవర్ణ పురుషుడికీ, నిమ్న వర్ణ స్త్రీకీ జరిగే వివాహాన్ని అనులోమ వివాహం అనీ, నిమ్నవర్ణ పురుషుడికీ అగ్రవర్ణ స్త్రీకీ జరిగే వివాహాన్ని ప్రతిలోమ లేక విలోమ వివాహం అనీ అంటారు. ఆ క్రమంలో ఏర్పడిన వర్ణాలనే మనువు ‘అంతర ప్రభవములు’  అన్నాడు. అవే వర్ణసంకరం కారణంగా ఏర్పడిన నేటి సమాజంలోని వివిధ కులాలు)

త్వమేకోహ్యస్య సర్వస్య విధానస్య స్వయంభువః |
అచింత్యస్యాప్రమేయస్య కార్యతత్త్వార్థవిత్ప్రభో ||   (1- 3)

“ ప్రభూ ! అచింత్యుడు ( ఆలోచనకు అంతుచిక్కనివాడు), అప్రమేయుడు
(మితిలేనివాడు) అయినట్టి  స్వయంభువు ( భగవంతుడు )  యొక్క కార్యములు, తత్త్వార్థములు తెలిసినవాడివి నీవు ఒక్కడివే కనుక నిన్నే అడుగుతున్నాం.”

స్వయంభువు అంటే తనకు తానే ఆధారమైనవాడు అంటే భగవంతుడు. బ్రహ్మ పుత్రుడైన మొదటి మనువును స్వాయంభువ మనువు అంటారు. ఈయననే స్మృతికారుడుగా భావిస్తున్నారు.

ఆ భగవంతుడి తత్త్వార్థాలు ( స్వరూప, స్వభావాలు), కార్యముల
(ఆయన్ని సంతుష్టపరచేందుకు చేసే యజ్ఞముల) గురించి వేదాలలో చెప్పబడిన పరిజ్ఞానం మొత్తం వేదవిదుడైన మనువుకే బాగా తెలుసునని మహర్షుల అభిప్రాయం.

[ ఇక్కడ రెండవ శ్లోకంలో మహర్షులు మనువుని ‘భగవన్’ అనీ, మూడవ శ్లోకంలో

‘ప్రభో’ అనీ సంబోధించడం గమనార్హం. రాజు దైవాంశ సంభూతుడనే భావం క్రమంగా బలపడుతున్న రోజులవి. గొప్ప ద్రష్టలైన మహర్షులకు ఒకప్పుడు రాజులు పాదపూజలు చేశారు.  చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మాత్రం ఉపనిషత్ ల రచనాకాలానికి సమాజంలో బ్రాహ్మణాధిపత్యం (జ్ఞానుల ఆధిపత్యం)  తగ్గి రాజుల (క్షత్రియుల) ఆధిపత్యం బాగా పెరిగింది. (ప్రతి వేదంలోనూ సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్ లు అనే నాలుగు భాగాలుంటాయి. సంహితలు బ్రహ్మచారులకు, బ్రాహ్మణాలు గృహస్థులకు, ఆరణ్యకాలు వానప్రస్థులకు, ఉపనిషత్ లు సన్యాస దశకు ఉద్దేశించినవి.) ఉపనిషత్తులకు ‘రాజగుహ్య విద్యా’ అనే మరో పేరుంది. రాజగుహ్య విద్యంటే రాజులలో దాగినది అని అర్థం.  అప్పట్లో ఉపనిషత్తుల పరిజ్ఞానం కేవలం క్షత్రియులకు మాత్రమే పరిమితమైనందున ఉపనిషత్తులకు ఆ పేరు వచ్చింది. రామాయణకాలంలో మిథిలానగర ప్రభువైన జనక మహారాజు సకల ఉపనిషత్ ల సారమెఱిగిన జ్ఞానిగా  ప్రసిద్ధుడు. బ్రాహ్మణ వర్గం, మహర్షులు అనంతరకాలంలో రాజులను ఆశ్రయించి, అప్పటిదాకా క్షత్రియులకు మాత్రమే  పరిమితమైన ఉపనిషత్ విద్యలు వారినుండి నేర్చి, క్రమంగా వాటిలోనూ తాము ప్రావీణ్యం సాధించారట. జ్ఞానులైన మహర్షులు రాజైన మనువును ఆశ్రయించి ధర్మశాస్త్ర మర్మాలను తెలుసుకోవడం కూడా అలాంటిదే.]

మనువు కూడా మహర్షులకు సాదరంగా స్వాగతం పలికి, వారిని యథావిధిగా పూజించి ఇలా చెప్పాడు -

ఆసీదిదం తమోభూత మప్రజ్ఞాత మలక్షణం |
అప్రతర్క్యమవిజ్ఞేయం  ప్రసుప్తమివ సర్వతః || ( 1-5 )

ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా  చీకటి రూపంలో  ఉంది. ఏమీ కనిపించదు, వినిపించదు. అప్పుడు ఏదీ ఏ ప్రత్యక్షానుభవానికీ  అందదు. ఏ లక్షణాలూ లేకుండా, ఊహించేందుకు కూడా వీల్లేనిదిగా, అజ్ఞేయంగా, అంతా దీర్ఘ నిద్రలో మునిగి ఉంది.

[ నాలుగు వర్ణాలవారు, వారినుంచి ప్రభవించిన పలు కులాల ప్రజలు పాటించవలసిన ధర్మసూత్రాలు చెప్పమని ఋషులు మనువును అడిగితే ఆయన సృష్టికి పూర్వస్థితి, సృష్టి క్రమం, ప్రళయాలు, యుగ పరిణామం, యుగధర్మాలు మొదలైనవన్నీ వివరించి, ఆ తరువాతనే వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు మొదలైన వాటి గురించి వివరిస్తాడు. దాదాపు ఇతర మత గ్రంథాలన్నింటిలోనూ ఇదే తరహా సృష్టి క్రమం వివరించబడింది. ఋగ్వేదంలోని ‘నాసదీయ సూక్తం’ లోనూ సృష్టికి పూర్వ స్థితిని వివరిస్తూ  ‘తమ ఆసీత్తమసా గూఢమగ్రే’, ‘ప్రకేతం  సలిలం సర్వమా ఇదమ్’ అంటూ అంతా నిగూఢమైన చీకటి, నీరు మాత్రమే ఉన్నట్లు వివరించబడింది. ( నాసదీయ సూక్తం - ఋగ్వేదం 10-129-1.)  పదార్ధం, పదార్థ పరిణామంలో భాగంగా వివిధ జీవజాతుల పరిణామం  గురించి శాస్త్ర విజ్ఞానం ఆవిష్కరించిన సిద్ధాంతానికీ, రకరకాల జీవుల్ని భగవంతుడు నేరుగా సృష్టించాడని చెప్పే ఈ సృష్టి సిద్ధాంతానికీ ఎక్కడా పోలికే ఉండదు. మనువు వివరించిన సృష్టిక్రమం ఏమిటో క్లుప్తంగా చూద్దాం. ]

అప్పుడు స్వయంభువుడూ, అవ్యక్తుడూ, అంతులేని సృష్టి సామర్థ్యం కలిగినవాడూ అయిన భగవానుడు తనకు తానుగా చీకటిని పోద్రోలే తమోనుదుడై ఆవిర్భవించి, మహాభూతములు మరియు ప్రకృతిని ప్రకాశింపజేశాడట. తమోనుదుడు అంటే ప్రళయావస్థను నాశనం చేసేవాడట.

అలా సూక్ష్మశరీరుడూ, బహిరింద్రియాల ద్వారా కాక అంతరింద్రియం ద్వారా మాత్రమే తెలియబడేవాడూ, అవ్యక్తుడూ (అవయవరహితుడూ) , సనాతనుడూ, సకల చరాచరములూ  తనలోనే ఇమిడియున్నవాడూ, అచింత్యుడూ (ఊహకు అందనివాడూ)  అయినట్టి భగవానుడు తనకు తానుగా ఉద్భవించాడు.

అప్పుడు భగవంతుడికి తన నుండి రకరకాల జీవులను సృష్టించాలనే కోరిక కలిగి ముందుగా తన నుంచి నీటిని సృష్టించి దానిలో తన బీజాన్ని ఉంచాడు.

ఆ బీజం సూర్యకాంతితో సమానమైన తేజస్సుగల అండంగా రూపొందింది. ఆ అండంలో భగవంతుడు సమస్త సృష్టికీ మూలకారకుడైన పరమాత్మగా తానే అవతరించాడు. ఇలా ప్రభవించిన పరమాత్మను నారాయణుడు అంటారని చెపుతూ ఇలా వివరించాడు మనువు -

ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః |
తా యదస్యాయనం పూర్వం తేన నారాయణః స్మృతః || ( 1- 10)

ఆపములను (నీటిని) నారా  అని కూడా అంటారు. నీళ్లు (నారములు) నరుని నుంచే పుట్టాయి కనుక అవి నరసూనములు. (భగవంతుడిని ‘నర’ అనడం కూడా ఉంది). నారములే ఇలా ప్రభవించిన పరమాత్మ మొదటి ఉనికిపట్టులు కనుక అతడిని నారాయణుడు అంటారు.

పుట్టుకగల వాటికెల్లా కారణమై, బాహ్యేంద్రియాలకు అగోచరుడై, పుట్టుక, వినాశనం రెండూ లేనివాడూ, నిత్యుడూ, అనిత్యుడూ కూడా అయినట్టి ఆ పరమాత్మచే సృష్టింపబడిన పురుషుడే బ్రహ్మ అని పిలువబడుతున్నాడు. అతడే సర్వలోకములకు కారణభూతుడైన హిరణ్యగర్భుడు. అప్పుడు రూపొందిన ఆ బ్రహ్మ ఆ అండంలోనే ఒక బ్రహ్మమాన సంవత్సరంపాటు ఉన్నాడట. ఆ తరువాత అయన సంకల్పమాత్రాననే ఆ అండాన్ని రెండుగా పగలగొట్టుకుని బయటికొచ్చి, భగవంతుడి నుంచి మనస్సునూ, అహంకారాన్నీ గ్రహించాడట. ఆయన ఆ బ్రహ్మాండం యొక్క పై సగాన్ని ఆకాశంగా, కింది సగాన్ని భూమిగానూ ఏర్పరచి, ఎనిమిది దిక్కులనూ, శాశ్వతమైన నీటిపట్టునూ (సముద్రాన్నీ) ఏర్పరచాడట. మహత్తత్త్వాన్ని, ఆత్మకు ఉపకారకాలైన సత్త్వరజస్తమో గుణాలను, పంచ జ్ఞానేంద్రియాలనూ, పంచ కర్మేంద్రియాలనూ ఆయన క్రమంగా సృష్టించాడు. అనంతమైన శక్తి కలిగిన, సూక్ష్మ రూపంలో ఉన్న శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే పంచ తన్మాత్రలతో తన అహంకారాన్ని మేళవించి సకల జీవులనూ సృష్టించాడు. నిత్యములైన పంచ మహా భూతములు, మహత్తత్త్వము, అహంకారము అనే ఏడింటి కారణంగా అనిత్యములైన కార్యరూప ప్రపంచం ఏర్పడింది. హిరణ్యగర్భరూపంలో ఉన్న ఆ పరమాత్మ  తాను సృష్టించిన అన్నిటికీ వేదాలలో చెప్పబడిన తీరులో పేర్లు, విధులు, వేర్వేరు లౌకిక వృత్తుల్ని ముందుగానే కల్పించాడట. కర్మాత్మలైన దేవతలను సృష్టించాడు. ప్రాణులను సృష్టించాడు. సూక్ష్మ గణమైనట్టి సాధ్యులను సృష్టించాడు. (ఈ సాధ్యులు   మనువు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు  మొదలైన పన్నెండు మంది). నిత్యములైన యజ్ఞాలనూ సృష్టించాడు. యజ్ఞాలు చేయాలంటే మంత్రాలు, అందుకోసం వేదాలు అవసరం. అందుకోసం ఆయన సనాతనములు, నిత్యములు అయినట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనే మూడు వేదాలనూ అగ్నినుంచి, వాయువు నుంచి, సూర్యునినుంచి తీసుకున్నాడట. కాలములను, మాసములు, ఋతువులు, అయనములు మొదలైన కాల విభాగాలను సృష్టించాడు. నక్షత్రాలనూ, గ్రహాలనూ, నదులు, సముద్రాలను, పర్వతాలు, సమతల ప్రదేశాలను, లోయలను, తపస్సును, వాక్కును, శ్రద్ధను, కామాన్ని, క్రోధాన్నీ సృష్టించాడు. (యజ్ఞములు మొదలైన) సత్కార్యాలు చేయాలనీ, (బ్రాహ్మణ హత్య మొదలైన) అసత్కార్యాలు చేయరాదనీ మానవులకు వివేకం కలిగించేందుకు ధర్మాధర్మాలను వేరుచేశాడట. పాపకార్యాలు, పుణ్యకార్యాలను వేరుచేశాడు. మానవులకు సుఖదుఃఖాలు, రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలను కల్పించాడట. అనశ్వరములైన పంచ మహా భూతములయొక్క నశ్వర రూపాలైన పంచ తన్మాత్రలతో ఈ సమస్త ప్రపంచాన్నీ సృష్టించాడు. సృష్టికర్తయైన బ్రహ్మ మొదటి సృష్టిలో ఏ యే జాతిని ఏ యే కార్యమునందు నియమించాడో తదుపరి జరిగే ప్రతి ఒక్క సృష్టిలో కూడా అవి ఆ యా కార్యాలను తామే అసంకల్పితంగా  స్వీకరిస్తున్నాయట.  చంపే స్వభావం, కనికరం, మెత్తదనం, క్రౌర్యం, ధర్మం, అధర్మం, అసత్యం, నిజం - ఇలాంటి గుణాలలో ఏ గుణం ఏ జాతికి మొదటి సృష్టిలో బ్రహ్మ నిర్ణయించాడో, ఆ జాతి తదుపరి సృష్టిలోనూ అవే గుణాలు పొందిందట. ఋతువులు  ఏ విధంగా అయితే తమ తమ చిహ్నాలు పొందుతాయో, అలాగే జీవులన్నీ తమతమ గుణాలను పొందుతాయట.

లోకానాం తు వివృద్ధ్యర్థం ముఖబాహూరుపాదతః |
బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్ || ( 1-31)

భూలోక వివృద్ధి (విస్తరణ) కోసం బ్రహ్మ తన ముఖము, బాహువులు, ఊరువులు (తొడలు), పాదముల నుంచి వరుస క్రమంలో బ్రాహ్మణులనూ, క్షత్రియులనూ, వైశ్యులనూ, శూద్రులనూ సృష్టించాడట. బ్రహ్మ తన దేహమును రెండుగా విభజించుకుంటే ఒక భాగం పురుషునిగా మరొక భాగం స్త్రీగా అయిందట. ఆ స్త్రీ, పురుషుల కలయికతో ఒక విరాట్ పురుషుడు ఉద్భవించాడట. ఆ విరాట్ పురుషుడు తపస్సుచేసి మనువును సృష్టించాడట. “నేను ఘోరమైన తపస్సుచేసి, ముందుగా పదిమంది ప్రజాపతులను సృష్టించాను. వారే - మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వసిష్ఠుడు, భృగువు, నారదుడు,” అంటూ మనువు ఆ ఋషులందరికీ వివరిస్తాడు.

***సశేషం***

Posted in September 2019, సాహిత్యం

2 Comments

  1. Bhaskar

    స్వయంభూ మనువు(ఆర్యులు)మరియు సప్తరుషులు ఈ దేశానికి వచ్చినపుడు కర్ధమ ప్రజాపతి(మాతంగముని)కి స్వయంభు మనువు మరియు శతరూప బిడ్డ అయిన దేవహుతి కిచ్చి వివాహం చేశారు.వీరి సంతానం అరుంధతి,అనసూయ, కళ,ఆవిర్భు,క్రియ,క్యాతి,శాంతి,గీత,శ్రధ్ధ వీరినే సప్తరుషులు,మరో ఇద్దరు మునులు పెళ్ళిచేసుకుంటారు.మరీచి కళకు పుట్టినవాడే కశ్యప ప్రజాపతి ఇతనికి 20 మంది భార్యలు.వీర సంతానమే దేవతలు,గంధర్వులు, అప్సరసలు, రాక్షసులు.మానవులు.కానీ ఆర్యులు వచ్చింది క్రీపూ 2000 అప్పటికే ఇక్కడ 2లక్షల సం!!క్రితం ఆదిమానవులు వున్నారు.అంటే మీరు చెప్పిన సిధ్ధాంతం తప్పు.సింధూనాగరికతను ద్రావిడులు నీగ్రోలు గిరిజనులు నిర్మించే కాలానికి ఆర్యులు ఇండియాలో లేరు.స్వయంభూ మనువు ఇండియాలో పుట్టలేదు.యురేసియాలో పుట్టాడు.ఓడద్వారా జమదాగ్ని పరుశరాముడు సప్తరుషులు వచ్చారు.ఇక్కడి ద్రావిడ ప్రజలైన మాతంగరాజులతో వివాహసంబంధాలు పెట్టుకున్నారు.తర్వాత కులవ్యవస్థను తయారుచేశారు.త్రేతాయుగం ద్వాపరయుగాలు వైవస్వత మనువులు అంతా భూటకం.

    • ముత్తేవి రవీంద్రనాథ్

      ఈ విమర్శలో ప్రస్తావించిన ముఖ్యాంశం మనుస్మృతిలో పేర్కొన్న, మనువు చేసిన మానవ సృష్టి భారతదేశంలో జరగలేదని, ఆర్యులు భారతదేశానికి వచ్చింది క్రీ.పూ. 2000 లోననీ అప్పటికే ఇక్కడ ఆదిమ మానవులు ఉన్నారనీ.

      అయితే మానవ సృష్టి భారతదేశంలో జరిగిందని మనుస్మృతిలో ఎక్కడా ప్రస్తావించలేదు. భారతదేశానికి ఋగ్వేద ఆర్యుల రాక క్రీ,పూ. 1500 ప్రాంతంలో జరిగి ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలలో నిర్ధారణ అయింది. భారతదేశానికి ఆఫ్రికా ఖండం నుంచి మొదటిగా నెగ్రాయిడ్ ప్రజలు( నీగ్రోలు) వచ్చారు. ఆ తరువాత ప్రోటో – ఆస్ట్రలాయిడ్ లు వచ్చారు. తరువాత మధ్యధరా ప్రాంతం నుంచి ద్రావిడులు వచ్చారు. ఆర్యులు చిట్టచివరికి వచ్చిన నార్డిక్ జాతీయులు. వారు వచ్చేనాటికే సింధులోయ ప్రజలు ఉత్కృష్ట నాగరికతా నిర్మాతలుగా భారతదేశంలో స్థిరనివాసం చేస్తూ ఉన్నారు. మనువుభారతదేశంలో పుట్టాడని మనుస్మృతిలో ఎక్కడైనా ఉందా ? ఈ విమర్శలో పేర్కొన్నట్లే మిగిలిన ఆర్య సముదాయంలాగే మనువు కూడా భారతదేశానికి వెలుపల్నుంచి వచ్చిన వాడే. విజయభాస్కర్ గారు నేను చెప్పిన సిద్ధాంతం తప్పు అంటున్నారు. ఇది నేను చెప్పిన సిద్ధాంతం కాదు. మనుస్మృతి పైన ఇదొక శాస్త్రీయ వ్యాఖ్య. మనుస్మృతిలో ఉన్న అసంగతమైన, అశాస్త్రీయమైన విషయాలను నేను ఖండిస్తూ వచ్చాను. ప్రతి శ్లోకంలో మనువు చెప్పినదాని సారాంశం లేక విపులమైన వివరణలు ఇస్తూ, అశాస్త్రీయమైన విషయాలను నేను ఘాటుగానే విమర్శించాను. మొదటి అధ్యాయము ( ఈ ) భాగంలో మనువు చెప్పిన కాల విభజన సిద్ధాంతంలోని అసంగతమైన విషయాలను, పౌరాణిక సాహిత్యంలోని కాలగణనకూ దానికి పొసగకపోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టాను. ఆ కాలగణన మొత్తం అశాస్త్రీయమని తేల్చాను. ఆ సందర్భంగా సుమేరియన్, ఈజిప్షియన్, చైనీస్ కాల గణనల గురించి కూడా వివరించాను. అదే భాగంలో మనుస్మృతిలో చేసిన యుగ పరిమాణ సిద్ధాంతాన్నీ తప్పుపట్టాను. యుగాల గురించి మనుస్మృతిలోని అశాస్త్రీయమైన సిద్ధాంతాలను విమర్శించాను. త్రేతాయుగ, ద్వాపరయుగాల గురించి చెప్పిన విషయాలలోని అశాస్త్రీయతను ఎత్తిచూపాను. కార్బన్ డేటింగ్ ప్రకారం శాస్త్రవేత్తలు చేసిన నిర్ధారణలను పేర్కొన్నాను. రెండు లక్షల ఏళ్ళ క్రితం మానవజాతి ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించిందని, 90 వేల సంవత్సరాల క్రితం వారిలో కొందరు ఆఫ్రికాను వదలి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారని శాస్త్ర పరిశోధనలద్వారా రుజువు అయిందని పేర్కొన్నాను. కాలగణనలో ఉన్న గందరగోళం కారణంగానే మనుస్మృతిలో యుగ పరిమాణం విషయంలోనూ ఒక స్పష్టత, పారదర్శకత లోపించాయని తేల్చాను. విజయభాస్కర్ గారు నేను రాసింది సరిగ్గా చదవకుండానే నా వ్యాఖ్యను విమర్శించినట్లు నేను భావిస్తున్నాను.

      — మీ.. రవీంద్రనాథ్.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!