Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్లు

తడబాటు

విద్యాపురి మహారాజు విక్రమకేసరి. ప్రజారంజకుడైన పరిపాలకుడు. మహారాజు షష్టిపూర్తి మహోత్సవం గొప్పగాచేయాలని మహామంత్రి తలంచి ముఖ్య పరివారంతో సమాలోచన సలిపాడు.

ఆ సందర్భంగా రాజ మహలుకు రంగులు దిద్దేపనిని మహామంత్రి ఒక విశ్వాస పాత్రుడైన వానికి అప్పగించాలని నిర్ణయించాడు. విశ్వాస్ అనే వానిని పిలిచి జాగ్రత్తలన్నీ చెప్పాడు.

అతడితో “అంతఃపురం లోపల రంగులు దిద్దేపనికి నమ్మకస్తులనే పని లోకి తీసుకో. ఏమాత్రం తేడా వచ్చినా తలలు ఎగిరిపోతాయి, తెల్సుకదా! పని చేసేవారంతా నోటికి గుడ్డలు కట్టుకుని , ఏమీ సద్దు చేయక పనిపూర్తి చేయాలని చెప్పు." అని హెచ్చరించాడు.

విశ్వాస్ తనకు నమ్మకస్తులూ, పనిలో మంచి చాకచక్యంగల పనివారిని వందమందిని నియమించుకున్నాడు. రక్షక భటులతో పాటు తానూ జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ రోజుకు కొన్నిగదులు పూర్తి చేయిస్తున్నాడు విశ్వాస్.

రాజుగారి పడక గదికి, హంసతూలికా తల్పానికి రంగులు దిద్దే పనిని, పనిలో మంచి నైపుణ్యం గల, నమ్మకస్తులైన రామప్ప, కృష్ణప్ప, వెంకప్ప, సూరప్ప లకు మాత్రమే అప్పగించాడు. వారు నలుగురూ నాల్గు వైపులా మహారాజు నిద్రించే తల్పాన్ని మెత్తని బట్టతో తుడిచి పూర్వపు రంగులు అతి జాగ్రత్తగా దిద్దసాగారు. తల్పం తలవైపున పని చేస్తున్న సూరప్పకు తల్పం క్రింద నేలపైన మహారాజు వజ్రపుటుంగరం కనిపించింది.

అతడి కళ్ళు జిగేలుమన్నాయి. 'అది తన స్వంతం చేసుకుంటే తన దరిద్రమంతా తీరిపోతుందనీ, తన ముసలి తల్లికి కలకాలంగా ఉన్న జబ్బుకు వైద్యం చేయించవచ్చనీ, తనూ భార్యాపిల్లలతో హాయిగా బ్రతకొచ్చనీ, జీవితాంతం రంగులు పూసుకుంటూ బ్రతుకక్కర్లేదనీ, అంతగా ఐతే ఈ రాజ్యం వదలి మరో చోటికి వెళ్ళి మహారాజులా బతకొచ్చనీ' అనుకున్నాడు.

ఉంగరాన్ని ఎలా బయటికి తీసుకెళ్ళాలా అనే ఆలోచనలో పడి రంగులు దిద్దడంలో కొద్దిగా పొరబాటు చేశాడు. దాన్ని గమనించుకుని స్పృహలో పడి ఏమైతే ఐందని గబుక్కున ఉంగరాన్ని తీసి నోటి గుడ్డ పక్కకు లాక్కుని నోట్లో వేసుకుని చక చకా పనిలో పడ్డాడు.

మధ్యాహ్నం భోజన సమయంలో పని వారికి భోజనం పెట్టే చావడిలో 'లఘుశంఖ' మిషతో చాటుకెళ్ళి దాన్ని ఎవ్వరూ చూడకుండా తీసి పంచె కొంగున కట్టుకున్ని మొలలో దోపుకున్నాడు సూరప్ప. సాయంకాలం వరకూ పని చేసి ఉంగరాన్ని నోట్లో పెట్టుకుని అందరితో కలసి  బయటి కెళ్ళాడు.

మహారాజు రాత్రి నిద్రించే సమయంలో అలవాటుగా ఉంగరాన్ని చూసుకుంటూ నిద్రిస్తాడు. ఆరోజు తన చేతికి ఉంగరం లేకపోవడాన్ని గమనించి, ఎక్కడో పెట్టి ఉంటానని భావించి, సేవకులను వెతక మని ఆఙ్ఞాపించాడు. వారు అంతా వెదికి ఎక్కడా కనపడలేదని చెప్పారు. ఆ విషయం మహామంత్రికి తెలిసి, రాజుగారి శయన మందిరం లో పనిచేసిన నలుగురి గురించీ విశ్వాస్ ను అడిగాడు.

విశ్వాస్ "మంత్రిగారూ! నాకు కొంత సమయం ఇవ్వండి. ఎక్కడ ఎవరి వద్ద ఉన్నాతేలుస్తాను." అని విన్నవించుకుని, ఆ వారమంతా వారిని నలుగురినీ పరిశీలించ సాగాడు. సూరప్ప పనిలో కాస్త పరధ్యానంగా ఉండటం గమనించాడు. కాని ఋజువులతో పట్టుకోవాలని తగిన సమయం కోసం వేచి ఉన్నాడు.

పదిరోజులయ్యాక మహారాణి అంతః పురంలో రాణీగారి శయన మందిరానికీ, హంసతూలికా తల్పానికీ రంగులు దిద్దను ఆ నలుగురినే నియమించాడు.

విశ్వాస్ ఒక నకిలీ నవరత్నాల ఉంగరాన్ని రాణిగారి తల్పం క్రింద ముందుగానే రహస్య ప్రదేశంలో ఉంచి పని జాగ్రత్తగా మొదలెట్టమని ఆనలుగురికీ చెప్పాడు. తాను ఉంగరం తీసిన విషయం ఎవ్వరూ గమనించ లేదనే ధీమాతో సూరప్ప తిరిగి తాను రంగులు దిద్దే తూర్పువైపునే మరో ఉంగరం కనిపించ గానే ముందువలె దాన్నీ తీసి నోట్లో వేసుకున్నాడు.

మధ్యాహ్న భోజన సమయంలో చాటుగా దాన్ని తీసి వెనుకటిలా పంచకొంగున కట్టి మొలలో దోపుకున్నాడు. భోజన సమయంలో అక్కడే ఉన్న విశ్వాస్ "ఏం సూరప్పా! వెంకప్పా! పని జరూరుగా జరుగు తున్నది కదా!" అని పలకరించాడు. ఆ సాయంకాలం విశ్వాస్ సూరప్ప ను చాటు చాటుగా అనుసరించి అతడి ఇంటి కెళ్ళాడు. కిటికీ పక్కన మాటేసి గమనించాడు.

మరునాడు విశ్వాస్ సూరప్పను మహామంత్రి ఎదుట హాజరు పరచాడు.

"మంత్రిగారూ! మన్నించండి, ఏదో చాపల్యంతో చేశాడు, వస్తువు దొరికింది కనుక క్షమించి వదిలేయమని మనవి, మహారాజుకు తెలిస్తే తల తీస్తారు, మీరే ఇతడిని కాపాడాలి." అని విన్నవించుకున్నాడు.

"సూరప్పా! ఎందుకు చేశావీపని? నీ మీది నమ్మకంతోనే కదా నిన్ను అంతః పురంలో పనికి పెట్టాను?" అని నిలదీయగా, సూరప్ప మహా మంత్రి కాళ్ళుపట్టుకుని "ప్రభూ!తప్పు కాయండి. కన్నుచెదిరి, బుధ్ధి గడ్డి తినింది, నాలేమి నా చేత ఈ పని చేయించింది." అని ఏడ్చాడు.

మంత్రి “తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్లు మనలందరినీ కన్న బిడ్డల్లా చూసుకునే రాజు గారి ఉంగరాన్నే దాచుకుంటావా?  సరే రేపటిలోగా, నగరం విడిచి వెళ్ళు, మరెప్పుడూ ఈ నగర ఛాయలకు రాను సాహసించకు. నీకిదే శిక్ష,రక్ష కూడాను.." అని ఆదేశించాడు.

సూరప్ప వెళ్ళాక "విశ్వాస్! ఆ నలుగురిలో సూరప్పను ఎలా పట్టుకో గలిగావు?" అని ప్రశ్నించగా

"ఏముంది ప్రభూ! తప్పుచేసిన వాడు బెదురుతో తన పని సరిగా చేయలేడు, సూరప్ప పనిలో లోపం గమనించాను. ఆతర్వాత మహారాణిగారి అంతఃపురలో ఒక నకిలీ ఉంగరం ఉంచాను. దాన్ని సింధూరం లో అద్ది ఉంచడం తో కొంగున కట్టుకోగానే ఆ సింధూరం సూరప్ప పంచె కొంగున అతుక్కుంది. అది అతడి చేతులకూ అయింది. అది తాను అద్దే రంగే అని అతడు  భ్రమపడ్డాడు. కంగారులో వాడది అంతగా గమనించలేదు. సూరప్ప ఇంటి వెనక కిటికీ చెంత దాగి గమనించగా, సూరప్ప ఇంటి కెళ్ళాక ఉంగరాన్ని ఎండు మిరపకాయల  బానలో దాచినట్లు తెలిసిపోయింది, సూరప్ప మిరపకారుకు దగ్గడం విన్నాను. అంతే ప్రభూ!" అని చెప్పిన విశ్వాస్ మాటలకు తృప్తిగా తల ఊపాడు మహామంత్రి. తప్పు చేసినవాడు తడబడటం సహజం.

Posted in September 2019, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *