Menu Close

Adarshamoorthulu -- డా. మధు బుడమగుంట

శ్రీ గిడుగు వెంకట రామమూర్తి
Gidugu Venkata Ramamurthy

మన తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది. అయినను నేటికీ ఎనిమిది కోట్లమంది తెలుగు ప్రజలలో ఎంతమందికి తెలుగు భాష మీద పట్టు లభించి తెలుగు పదాలతోనే ముచ్చడించుకొనే స్థాయిలో ఉన్నారని ప్రశ్నించుకొంటే ఆ శాతం బహు తక్కువే. అందుకు కారణము సామాజిక జీవన శైలిలో నిత్యం సంక్రమిస్తున్న మార్పులు మరియు పరభాషా ప్రమేయాలు. ఆదికవి నన్నయ్య మొదలు బ్రిటిష్ వారు మనలను పరిపాలించే సమయం వరకూ ఉన్న తెలుగు భాష రీతి వేరు. ఆంగ్లేయుల పరపతితో మన బడులలో ఆంగ్ల భాష బోధించే ప్రక్రియ మొదలైనప్పటి నుండీ మన తెలుగు భాష మరీ అధ్వాన్నంగా తయారైంది. జనపదాలకు, పాఠ్య పుస్తకాలలో బోధించే తెలుగు భాషకు ఎంతో వ్యత్యాసం కనపడడం మొదలై సామాన్య ప్రజలు అయోమయానికి గురి అవడం జరిగింది. అందుకనే ఆంగ్ల భాష వైపు సులభంగా మొగ్గు చూపడం జరిగింది. అయితే ఆ సమయంలోనే తెలుగు భాషావేత్తలు కొందరు ‘వాడుక తెలుగు భాష’ ఉద్యమానికి శ్రీకారం చుట్టి అందుకొఱకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టారు. శ్రీ కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో ఎంతో మంది తమ జీవితంలో సింహభాగాన్ని వ్యావహారిక తెలుగును కూడా గ్రంథరచనకు అనువుగా మలిచేందుకు  వెచ్చించారు. అటువంటి వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ కర్త, పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు నేటి మన ఆదర్శమూర్తి.

పందొమ్మిదవ శతాబ్దంలో, సరైన విద్యా వసతులు లేని సమయంలోనే ఉన్నత చదువులు చదివిన ప్రముఖులలో రామమూర్తి గారు ఒకరు. ఆయన ఒక్క తెలుగే కాదు, బహు భాషావేత్త. మిగిలిన భాషల లోని రచనలను ఆకళింపు చేసుకొని, మన తెలుగుకు వాడుక పదాలతో సరికొత్త వ్యాకరణానికి రూపకల్పన చేశారు. కనుకనే ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29వ తేదీని ఈనాడు మనం తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నాము.

ఆగష్టు 29, 1863న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు మన రామమూర్తి  జన్మించారు. 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యే సమయానికి ఆయనకు తెలుగు, ఆంగ్ల భాషల మీద మంచి పరిజ్ఞానం లభించింది. అంతే కాదు చారిత్రాత్మక అంశాల మీద కూడా చక్కటి అవగాహన ఏర్పడింది. అందుకే  1880లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనారు. ఒక ప్రక్క చరిత్రను బోధిస్తూనే గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడైనారు.

మనలో ఎంతోమంది అనేక విధములుగా ప్రతిభను కలిగి ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదించుకొని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. మరి అటువంటి వారిని వారి జ్ఞాన సమృద్ధి పరంగా ఆదర్శమూర్తులు అని అనలేము. ఎందుకంటే వారి జీవితం, వారి యొక్క వ్యక్తిగత ఎదుగుదల కొరకే ఎక్కువ శ్రద్ధ చూపి తమ అభివృద్ధి, తమ పిల్లల అభివృద్దే ముఖ్యమని తలచారు, తలుస్తున్నారు. అటువంటి వారు సమాజానికి ఎటువంటి మేలు చేకూర్చలేరు మరియు వారి ఆదర్శాలు ఎదుటివారిని ప్రభావితం చేసే విధంగా లేవు.

మరి మన గిడుగు గారి వ్యక్తిత్వం, చదువు, సంస్కారం, ఆ మహనీయుని సంఘ సంస్కర్త గా, భాషా సేవకునిగా మార్చివేసింది. మరెందరికో మార్గదర్శకం అయ్యింది. మంచి విషయం ఏమిటంటే ఆయన చేసిన సేవలకు సరైన గుర్తింపు ఎన్నో పురస్కారాలు, బిరుదుల రూపంలో లభించింది. తన డెబ్బై ఏడు సంవత్సరాల జీవితంలో దాదాపు మూడువంతులు ఆధునికాంధ్రభాషా సంస్కరణ కొరకు వెచ్చించిన ఈ బహుభాషా శాస్త్రవేత్త, జనవరి 22, 1940న మరణించారు. కానీ ఆయన ఆత్మ రూపంలో నేటి మన తెలుగు భాష మనతోనే ఉంటుంది.

Posted in September 2019, వ్యాసాలు

1 Comment

  1. Anupama

    మధు గారు ధన్యవాదాలు. శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి గురించి చాలా గొప్ప విషయం తెలుసుకున్నాము.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!