Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

మనసు భాష -- స్వాతి శ్రీపాద

మనసు పొరల లోలోనికి
ఇంకా అలలు అలలుగా పాకి పాకి వస్తున్న
ఒక మసక వెలుతురు నీడ
పెదవులపై ఆరని నీటి తేమ సంతకాలు
స్వప్నాల హరివిల్లులు సీతాకోక చిలుకలై
కనురెప్పలపై అలవోకగా వాలి
పులకింతలు నెమరువేస్తున్న అలికిడి

ఒక తపస్సులోనో తమకంలోనో
పూర్తిగా అణువణువూ
నీటి చుక్కల్లా ఇ౦కిపోయాక
ఉనికి, ఒక నీరెండ చాలు, తెలీకుండానే
మమేకపు సందుల్లో౦చి నిశ్శబ్దంగా
జారిపోయాక
ఎవరికి వారు అదృశ్యమై
ఎవరికి వారుశూన్యమై
ఎవరికి వారు నీలాన్ని పులుముకున్న ఆకాశమై
చుట్టూ అలుముకున్న ఒకేఒక్క ప్రపంచంలో
లోలోపలి నీలో ఒదిగి ఒదిగి
సరిహద్దులు చేరిపేసుకున్నాకా ...
ఇహ అంచులు లేని అంతుచిక్కని సముద్రమేగా
నిండు వెన్నెల వి౦దునారగిస్తూ...

నిశ్శబ్దపు ఊహ
హిమవన్నగాలపై విస్తరిస్తూ ఎప్పటికప్పుడు
కొత్త నెత్తావి పరిమళమై అలుముకు౦టు౦ది
మూసేసుకున్న తలుపుల వెనక
గోడలూ కిటికీలూ ఏవీ లేని
ఒక సువిశాల హరితవనం
ఎప్పటికప్పుడు కొత్త చిగుళ్ళ ఆరాటంలో
పసిపాపై పారాడుతూ ఉంటుంది.

నాజూకు వేలికొసల చివరంచుల్లో  దాచుకున్న
కొత్త ప్రపంచం
అక్షరాలై ,మంచుపూలై
అలా ఉ౦డీ ఉ౦డీ రాలుతూనే పోతుంది.

తమసోమా జ్యోతిర్గమయ‬‬ -- రామమోహన్

తొలిజీవం ఎలా పురుడు పోసుకుందో తెలీదు
ఒకటిలేనిదే రెండు లేదుకదా ఎపుడైనా
ఎలా పెరిగిందో ఏమి చూసిందో ఎలా మరోజన్మకు మార్గమైందో ఊహకందని విషయం

లక్షలో కోట్లో చీకటి సంవత్సరాలు చెట్లు చేమల్లాగే
పశుపక్షుల్లాగే ద్విపాద యాత్రికుడు ప్రకృతిని తన భుజాలమీద మోశాడో
తన కన్నులకు చూపులున్నవని
తన తలలో ఒక ఆలోచనా యంత్రమున్నదని ఎప్పటికి గ్రహించాడో

శిలాజాలు తాళపత్రాలు శిలాశాసనాలు వాడిన వస్తువుల
ఆనవాళ్లు దొరకని అజ్ఞానాఖాతం ఎంత లోతైనదో
తన కడుపుకొక ఆకలి ఉందని తన చుట్టూ తన అవసరాలు తీర్చే ప్రకృతి శక్తులున్నవని పరిశీలించే
ప్రయత్నం మొదలయి ఎన్నాళ్లయ్యిందో

ప్రకృతితో రమిస్తూ క్షతిస్తూ తనను తాను పెంచుకుంటూ
పరిసరాలను పంచుకుంటూ పంచభూతాలను మలుచుకుంటూ ప్రగతి దారిలో పడి ఎంత కాలమయ్యిందో

ఏ చరిత్రలూ చెప్పని అంధకార గుహ నివాస సమయం
అంచనాలకు అందేది కాదు అసలప్పుడు వాడు మనిషి కాదు ఒకానొక ప్రకృతి జీవి, చరాచరవస్తువులలో ఒక వస్తువు
ప్రతి బుద్ధి జీవికీ తన జీవిత కాలచరిత్రనే ఒక అస్పష్ట సత్యం
ఇక గతం, క్రమానుగత మనోగతం, దొరికిన ద్రాక్ష పండు తిన్నంత అల్పసత్యం

గవేషణ అన్వేషణ ఆత్మరక్షణ నిరీక్షణ పరిశీలన పర్యవేక్షణ
దశలు దశలుగా కథలు కథలుగా అనంత ఆత్మయాత్ర
జీవన ఋతుచక్ర భ్రమణాలుగా ఉగాదులై సంక్రాంతులై
భూగ్రహ భ్రమణలాగే వెలుతురు చుట్టూ పరిభ్రమణం లాగే సాగుతున్నది సాగుతూ వస్తుంది సాగిపోతూ ఉంటుంది

సత్యమొక్కటే నువ్వే ఒకప్పుడు మలయానిలానివి
ఒకప్పుడు చెట్టుగాలివి మరొకప్పుడు సుడిగాలివి
నువ్వే  పరీక్షనాళికలో వాయువువి ఎందరకో ప్రాణవాయువువి

నువ్వే సముద్ర జలానివి జలదానివి నదివి దైహిక జలానివి
నువ్వే చిచ్ఛక్తివి సవనాగ్నివి దావాగ్నివి పొయ్యిలో మంటవి
ఆకలి మంటవి

నీకు ఎలా చెప్పను?
పొరలు పొరలుగా కప్పుకున్న ముసుగుల్లో దూరి నిన్ను నీవు గుర్తించకుండా పొయ్యావని
ఎలా  విప్పను?
తెరలతెరలుగా మసకలు పూసుకున్న నీ కన్నుల్ని?
సుఖం నుండి దుఃఖం వైపు నడుస్తున్నావని
మనిషిననుకునే నువ్వు అసలైన మనిషివి కావని
‘తమసోమా జ్యోతిర్గమయ’

అనుమండ్ల భూమయ్య

రాలి పోయెడి ఆకుతో రాలిపోదు
చెట్టు ప్రాణము; క్రొత్తవి పుట్టుచుండు;
ఆకు రాలుట, పుట్టుట నరయుచున్న
చెట్టు నవ్వుకొనెనొ!? పూలు పుట్టె పుట్టి.

నమ్మకం -- డొక్కా శ్రీరామం (2014, ఆత్మానందం)

నీటి సుడులకు
భయ పడుతూ
కూర్చోదు నావ,
గాలితో చెలిమి చేసి,
చుక్కానిని ఎక్కు పెట్టి,
తెరచాపను ఎత్తి పట్టి,
ఏటికి ఎదురీదైనా సరే,
ప్రయాణ దాహం తీర్చుకొని,
మళ్ళీ వస్తానని,
మాట ఇస్తుంది రేవుకి..

అదృష్టాన్ని
తలచుకొంటూ
కూర్చోదు గువ్వ,
తన ప్రాణాన్ని
పణంగా పెట్టైనా సరే
ఆహారంతో తిరిగి వస్తానని,
మాట ఇస్తుంది
తన గూటిలోని పిల్లలకి..

ఆరిపోతున్న
చుక్కల దివ్వెలను 
లెక్కిస్తూ కూర్చోదు రాతిరి,
వేకువ తరిమేస్తున్నా,
తిరిగి ఆకాశాన్ని జల్లెడపట్టి,
మరింత తారాబలంతో
మాపటికి తరలి వస్తానని,
మాట ఇస్తుంది చంద్రునికి..

ఉరికే గ్రీష్మంపై కోపించి,
ఊరికే భీష్మించుకొని
కూర్చోదు ఆమని,
మార్పుకు స్వాగతమిచ్చి,
మరుసటి వత్సరంలో,
మంచి పాట కోసం,
మరలి వస్తానని,
మాట ఇస్తుంది కోయిలకి..

చెదరని నమ్మకమే
చరిత్రను సృష్టించే బాటలో
తొలి గెలుపు..

అచంచల ఆత్మవిశ్వాసమే
వేయి విజయాలగాథకు
పై మలుపు..

నేను (దీర్ఘ కవిత) - విశ్వర్షి వాసిలి

నేను
కృష్ణబిల విశ్వగర్భను
విశ్వగర్భ భూగోళాన్ని
భూగోళ మాతృగర్భను
మాతృగర్భ జీవన అస్తిత్వాన్ని
జీవన అస్తిత్వ మానవ అవతారాన్ని
మానవ అవతార కుండలినీ తత్వాన్ని.

***

నేను
కోటానుకోట్ల క్షణగమనాన్ని
క్షణగమన యుగధర్మాన్ని
మానవరూప కణసముదాయాన్ని
కణసముదాయ జ్ఞానశాస్త్రాన్ని
క్షణాని కొక పరిణామశస్త్రాన్ని
కణాని కొక ఆవిష్కరణాస్త్రాన్ని
ఆత్మసాధనా శక్తిసంగమాన్ని
వేయిపడగల ఏకదళాన్ని
ఏకకణ మానవ రూపాన్ని.

***

నేను
ఒక మానససరోవర పద్మాన్ని
లలాట పుప్పొడుల బీజాన్ని
ఆత్మతత్వ పరిణామ వికాసాన్ని
ఇడ పింగళుల బ్రహ్మపథాన్ని
పరిణత రహస్య పత్రాన్ని
ఏడేడు భువనాల చక్రవ్యూహాన్ని.

***

నేను

చతుర్దళ మట్టితత్వాన్ని
పరివ్యాప్త పసుపు పారాణిని
తేనెటీగ సొదల లంకారాన్ని
భూత భవిష్య వర్తమాన సిద్ధిని
మూలాధార యౌగిక అస్తిత్వాన్ని.

షట్దళ జలతత్వాన్ని
వర్ణసంగమ శ్వేత సౌధాన్ని
వీణానాద వొరల వంకారాన్ని
దూరదృష్టి గురుత్వ సిద్ధిని
స్వాధిష్టాన సుఖ సాగరాన్ని.

దశదళ అగ్నితత్వాన్ని
రుధిరవాహిని ఎర్రటి వస్త్రాన్ని
స్వరతంత్ర నిశ్శబ్ద రంకారాన్ని
ప్రాణ రక్షణ అమృత సిద్ధిని
మణిపూర స్వఇచ్చా రాగాన్ని.

ద్వాదశదళ వాయుతత్వాన్ని
ఫాలరేఖల విభూతి వర్ణాన్ని
మౌనహృదయ యంకారాన్ని
అప్రతిహత అజాత సిద్ధిని
అనాహత ప్రేమ పరాగాన్ని.

షోడశదళ స్థితితత్వాన్ని
లోచూపుల నీలి వర్ణాన్ని
కడలి గళ హంకారాన్ని
అతీత మానస సిద్ధిని
విశుద్ధ సత్య సౌందర్యాన్ని.

ద్విదళ జ్ఞానతత్వాన్ని
అంతర్వీక్షణా కాంతి పర్వాన్ని
అహంకార జనిత ఓంకారాన్ని
అతీంద్రియ సృజన సిద్ధిని
త్రిలోచన ఆజ్ఞా వర్తనాన్ని.

దళరహిత ఆదితత్వాన్ని
పారదర్శక శుద్ధ ఖగోళత్వాన్ని
ఆత్మ కల్పిత యౌగికమౌనాన్ని
నిర్వికల్ప చైతన్య సమాధిని
ఓజస్సంపన్న సహస్రారాన్ని.

డా.కోడూరు ప్రభాకరరెడ్డి - రాగవిపంచి( ఖండకావ్యం -1978) నుండి.

మొదటి చూపులో నాలోన

     ముద్రవేసి

నాదు హృదయమ్ము దోచు

     కున్నావు చెలియ!మల్లెకన్నను తెల్లని

  మనసులోన

దాచుకున్న నీ వలపులు

     దోచుకొందు!

నిత్య యవ్వన మైనది

     నీదు ప్రేమ

నిత్య నూతన మైనది

      నీదు వలపు

ఎన్ని యుగములు గడచిన  

       నిగిరిపోక

ప్రణయగంధము నిత్యము

        పరిమళించు!

స్వాంతమున దల్చినంత

        సాక్షాత్కరించి

వాలుచుంటివి వెన్నెల

        పక్షి వోలె

ఇప్పుడేమాయె వలపు?

         కోపించి ఇటుల

సొంపు చూపుల కెంపుల

          నింపనేల?

పుణ్యనదిలోన పాపులు

    పొర్లియాడ

పంకిలమ్మయ్యె గంగాప్రవాహ

    మకట!

స్వచ్ఛ హృదయవు నీవైన

    జలకమాడి

దివిజనదికి పవిత్రత

    తెచ్చిఇమ్ము!

బంతి కొట్టుచు నుంటివి

    ఇంతి నీవు

బంతిలోపల దాగే నా

    పడుచు గుండె

అట్టే కాకున్న నేలపై

    కొట్టునపుడు

క్రిందపడినది తిరిగి

    లంఘిపనేల?

చెలియ! తెలిసి ఏ తప్పును

    చేయలేదు

చేయరానట్టి తప్పులు

    చేసియున్న

నీదు కౌగిలిలోన                                                 

     బంధించారాదొ 

కురుల కొరడాలతో నన్ను

     కొట్టరాదొ!

విశ్వమంతయు పావన

    ప్రేమ మయము

తరుణ హృదయాల కెపుడు

    బంధనము లేదు

మూడు లోకమ్ము లొక్కటై

    ముసురుకొనిన

ఆరిపోదులే అనురాగ

    మనెడి జ్యోతి!

 

జగతి బాహ్య సౌందర్య

    మశాశ్వతమ్ము

అంతరంగ సౌందర్యమే

    అందగించు

అందమును గూడి నిర్మల

    స్వాంతమున్న

అచ్చమగు పసిడికి తావి

    అబ్బినట్లు!

మాయకుండును గాక

    నీ మౌనగీతి

మారకుండును గాక

    నీ మధురప్రేమ

నీలి మబ్బులు కదలాడు

    నీదు కనుల

పొంగుగాక లావణ్య

    తరంగమాల!

Posted in September 2019, సాహిత్యం

2 Comments

  1. అనుపమ

    రామమోహన్ గారు,ధన్యవాదాలు.జీవితం అంటే ఏంటో చాలా బాగా చెప్పారు.

    నీకు ఎలా చెప్పను?
    పొరలు పొరలుగా కప్పుకున్న ముసుగుల్లో దూరి నిన్ను నీవు గుర్తించకుండా పొయ్యావని
    ఎలా విప్పను?
    తెరలతెరలుగా మసకలు పూసుకున్న నీ కన్నుల్ని?
    సుఖం నుండి దుఃఖం వైపు నడుస్తున్నావని
    మనిషిననుకునే నువ్వు అసలైన మనిషివి కావని
    ‘తమసోమా జ్యోతిర్గమయ’

  2. అనుపమ

    శ్రీరామం గారు,చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.

    చెదరని నమ్మకమే
    చరిత్రను సృష్టించే బాటలో
    తొలి గెలుపు..

    అచంచల ఆత్మవిశ్వాసమే
    వేయి విజయాలగాథకు
    పై మలుపు..

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!