Menu Close
prabharavi

దేశం “మొబైల్”
అందరూ వాడుకోవా లంటే
టాక్స్ “కార్డు” వేయాలి,
శ్రమ “చార్జ్” చేయాలి.

అభ్యర్ధికి దండలుగా
బలి పువ్వులు ఎన్నో,
రేపు గెలిచొస్తే
అమ్మో, ఎన్నెన్నో.

ఇంట్లోనో రోడ్డుమీదో
పడితే బాగుపడతావు,
ఆత్మీయుల మనసుల్లోంచి
పడకు - పగిలిపోతావు.

మనసు యంత్రానికి
చిరునవ్వు కావాలి,
కాని ఆ “ఆయిల్”
కల్తీ కారాదు.

ఇద్దరి అహంకారాలవల్ల
“కారం” పెరిగిపోయి
ఆంధ్రప్రదేశ్ పసికందుకు
ఒళ్ళు మండిపోతోంది!

ఎండకంటే వానకే
భయపడతారు మనుషులు,
తగిలేలా మంచి చెబితే
దూరంగా పారిపోతారు.

అవయవా లన్నీ
మనసుకు బిగించబడ్డాయి,
అక్కడ లూజయితేనే
ఏదైనా బూజు పట్టేది.

పళ్ళు నూరీ నూరీ
ఊడిపోయాయి ప్రతిపక్షానికి,
కళ్ళు ఉరిమీ ఉరిమీ
మూసుకుపోయాయి అధికారానికి.

బందెల దొడ్డిలో
గొర్రెల్లా నక్షత్రాలు,
రాత్రితో ఒప్పందం
“నాన్ వెజిటేరియన్” చంద్రుడు.

దొంగల్ని చంపేస్తానని
కుక్క కెన్ని అరుపులో,
కట్టిన గొలుసు విప్పాను
నోరు పెగల దెందుకో!

రబ్బరు తప్పును
తుడిచేస్తుం దంతే!
మళ్ళీ ఒప్పును
రాసుకోవాల్సింది పెన్సిలే.

నీతి
గాలివంటిది,
కాలుష్యం పెంచే కొద్దీ
మనకే ఇబ్బంది.

బయటి ప్రపంచం
లోని ప్రపంచం
మరిచిపోయాడు మనిషి
“నెట్” ప్రపంచంలో మునిగి.

రవ్వ
కవిత్వం కాదు
దీపంగా మారాలి
చిన్నదో పెద్దదో.

గడియారం ముళ్ళ
కాళ్ళ మీద కాలం,
కొందరికి గుర్రంలా
కొందరికి నత్తలా.

కుక్కా పిల్లిని చూసి
కోడికి పెద్ద అసూయ
మనిషి పెంచుకొనే
రహస్యం తెలియక!

మురికి బట్టల్ని
ఉతుక్కుంటున్నాడు రోడ్డుమీద,
మురికి నీళ్లన్నీ
జనం ముఖం మీద!

అదేంటోగాని
పగలు
చీకటిని మింగుతుంది
వెలుతురు పంచుతుంది.

కొళాయిల్లో
మంచినీళ్ళకు బదులు
మందు పంపుతారట-
బాగా ఓట్లు పడటానికి!

వర్ష కవిత్వం
ఎంత చదువుతున్నా
తనివి తీరదు
భూమి మహా పాఠకురాలు.

Posted in September 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!