Menu Close
గ్రంథ గంధ పరిమళాలు
చాటు (మరుగు) వీడిన
చాటుపద్య, గద్య మణి మంజరులు

సందర్భం వచ్చింది గనుక – మహాకవి, సంగీత కళానిధి, శ్లేష కవితా చక్రవర్తి యొక్క కవితామృతాన్ని కొద్దిగా పాఠకులకు రుచి చూపితే మంచిదన్న అభిప్రాయంతో నేనెరిగిన కొద్ది విజ్ఞానంతో వసుచరిత్ర లోని కొన్ని శ్లేష సౌభాగ్య భరిత పద్యాలను, వాటి వైభవాన్ని గూడా సహృదయుల ముందు ఉంచుతున్నాను.

వసుచరిత్ర ఆంధ్ర పంచ కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇందలి కథ వసుమహారాజు, గిరికల ప్రణయ ప్రేమకథ. భట్టుమూర్తి దీనిని శ్లేష కావ్యంగా రచించాడు. ‘శ్లేష’ అంటే ఒక పదానికి రెండు అంతకు మించి అర్థాలు ఉన్నట్లయితే దానిని శ్లేష అంటారు. ఉదా; కొమ్మ అంటే చెట్టుకొమ్మ లేక స్త్రీ అని అర్థం.

భట్టుమూర్తి ఈ విధంగా ప్రతి పద్యం శ్లేష, ధ్వని కల్గిన పద్యంగా తన ప్రబంధమైన వసుచరిత్రను తీర్చిదిద్ది శ్లేష కవితా చక్రవర్తిగా పేరుగాంచాడు. శ్లేషలో భట్టుమూర్తి సంగీత రహస్యాలను, అవలీలగా పోషించి ‘సంగీత కళా రహస్యనిధి’ అని పేరుగాంచాడు. అలాగే పార్వతి, ఆంజనేయస్వామి, రాముడు మొదలైన దేవతలను స్తుతించాడు. ఉదా:

గంధ గజయాన గీతి ప్రబంధ కలన
నలరి యతి తియ్యమై వచ్చు నరిది, మగువ
లారా! కనుగొంటిరే యన .....”

ఈ పద్యంలో ఒకే ఒక పదం ‘యతి’ అన్న దానిని వాడి అంతఃపుర స్త్రీలైన గిరిక, ఆమె సఖీ జనాన్ని కలుసుకోవడానికి వర్మ సఖుడు (రాజుకు ప్రియమైన సఖుడు) దారి ఏర్పరుచుకోవడం జరుగుతుంది. ఈ యతి అన్న పదం – మూడు రకాల అర్థాలను కలిగి ఉంది. ౧. య(అ)తి = ఎక్కువ, ౨.యతి = ప్రబంధమనే పేరు గల సంగీత విభాగంలో ఉన్న యతి, ౩. యతి = సన్యాసి లేక ఋషీశ్వరుడు.

(‘అతి’ అన్న పదంలో పర పదంతో సంధి జరగదు. అప్పుడు యట్  అనేది ఆగమంగా వచ్చి అతి – యతి అవుతుంది. దీనినే యడాగమ సంధి అని అంటారు.  సూత్రం: సంధి లేని చోట స్వరంబున కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.) ఒకే ఒక పదంతో కథను మలుపుతిప్పి నాయికా నాయకుల కలయికకు దారి సుసంపన్నం చేసిన మహాకవి భట్టుమూర్తి.

ఆయన వ్రాసిన ప్రతి పద్యం ఒక రత్నం. రాజ రాజ భూషణుడి కవితను నిరసించిన రామకృష్ణుని పద్యం చదివి ఇది రామకృష్ణునిది కాదేమో అని తృప్తి పడటానికి గూడా లేకుండా రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు పాండురంగ మహత్యానికి వ్రాసిన పీఠిక నిజాన్ని చెప్తున్నది.

తెనాలి రామలింగ కవి వ్రాసిన పాండురంగ మహత్యము నకు రాళ్ళపల్లి వారు పీఠిక వ్రాశారు. “రాళ్ళపల్లి పీఠికలు” దానిపేరు. అందులో రామలింగ కవిని గూర్చి “రామకృష్ణుని వంటి శివ-విష్ణు భక్త శిఖామణి ఇట్టి అపభ్రష్టు రచన చేసి ఉంటాడా అని అనుకోవాల్సిన పనిలేదు” అని రాశారు. అంతేకాదు రామలింగ కవి రాసిన మరో గ్రంథం “ఘటికాచల మహత్యం” గూర్చి కూడా విమర్శించారు. అలాగే సంస్కృతమున “కుట్టికవి” రచించిన మహిష శతకము కలదు కదా! ఆక్రోశమునకు, అసభ్యతకును అందుకొరత మేమియు లేదు. శ్రీనాథుని పెక్కు చాటువులు, రామకృష్ణుని కొంటె తనపు కథలును ఇట్టివే. వానిని అసత్యములని, ఆరోపితములని వాదించుట వట్టి అభిమానాడంబరము. సంస్కృతమైన చిత్తవృత్తి గలవారు అట్టివానిని ఉదాసీన దృష్టితో చూతురంతే. స్వతంత్రుడై సమర్థుడైన వానికి ఉల్లాసమో, ఉద్రేకమో కలిగినప్పుడు అసభ్యత, అవివేకము, అలక్ష్యము వంటి తెరలు పైకి తేలి యడగుట మేర్పడును, ఏమియూ వింత కాదు...(రాళ్ళపల్లి పీఠికలు-పేజీ 100-101)

ఎంత గొప్పవారైననూ ఈర్ష్య, అసూయ, అహంకారాది గుణాలు వారిలోని మానవత్వాన్ని కప్పివేస్తాయని ఇట్లాంటి అసందర్భ సందర్భాలు తెలియజేస్తాయి.

అక్టోబర్ సంచికలో, ఈ చాటువుల వ్యాసం గురించి నా (రచయిత్రి) విశ్లేషణను విపులంగా విశదీకరించి పిమ్మట ముగిస్తాను.

Posted in September 2019, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *