అప్పటిదాకా చీకటి
ఎప్పుడూ మాట్లాడలేదు.
అప్పుడు పొందిన రుచిని
ఏ రాత్రి ఇవ్వలేదు.
మనసు ఆకలికి
విశ్రాంతి కరువైన కనురెప్పలకు
దగ్గరగా ధైర్యం చెబుతూ
కంటికి జోల పాడి
కలను చేతికిచ్చి
నిద్రలో నంజుకు తినమని
పక్కకిందగా
దిండుచాటుగా
మేల్కొన్న ఓ అండ
గాలి సవ్వడికి గోడ కట్టి
సందడికి సంకెళ్లువేసి
వెలుతురు జల్లు కొట్టకుండా
దిక్కుల ముఖంపై నల్లటి దుప్పటి కప్పి
ఆ రాత్రి చేసిన సేవతో
ఆ చీకటి చూపిన ప్రేమతో
శరీరం, మనసు కలసి ఒకే కంచంలో
వింత రుచులతో చేసిన
విందుభోజనం నిద్ర.
పడక సింహాసనంపై దర్జాగా
జాములపై స్వారీ చేస్తూ
కాలాన్ని అదిలిస్తూ,
ప్రభావాలకు దూరంగా
ఆజ్ఞను భక్తిగా పాటించే సమయానికి
పలుబంధాలు, సకలసౌకర్యాలు
కష్టనష్టాలు, కోపతాపాలు
దూదిపింజలై ఎటు కొట్టుకుపోయాయో
గుర్తుల్లేవు... గుర్తుకురావు.
దేవుడు వ్రాసిన వీలునామాలో
విలువైన ఆస్తిని
చదవని పక్షంలో ఎంత గొప్పవారైనా
ఏదో ఒక రోజు పడక వాకిలి వద్ద
రాత్రి ముందు చేతులు కట్టుకుని
చీకటి పాదాలపై వాలి
నిద్ర భిక్ష పెట్టమని మోక్కాలిసిందే.