నేను ఒంటరి నని, నా కోసం ఎవరూ లేరని 'మనసు' బాధ పడింది.
ఎవరూ లేకపోవడమేమిటి! నీకో 'శరీరం' ఉందిగా, తోడుగా,
దానితో కలిసి పని చెయ్, దానితో కలిసి భోంచెయ్,
దానితో కలిసి ఏకాంతంగా ధ్యానం చెయ్, లేదా యోగా చెయ్,
నువ్వు దాన్ని ఆరోగ్యంగా ఉంచు,అది నిన్ను ఆనందంగా ఉంచుతుంది.
ఇద్దరూ కలిసి ఆరోగ్యకరమైన ఆనందాన్ని పొందండి. అందరికీ పంచండి.
ఇద్దరూ కలిసే పుట్టారు. రేపు కలిసే పోతారు.
మధ్యలో మాత్రం ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తావు?
ఇంకో తోడు కోసం ఎందుకు ఎదురు చూస్తావు?
నువ్వు నీ శరీరంతో ఏకం అయినట్టు, ఇంకో దానితో అవ్వగలవా?
'నేను' అని నువ్వనుకున్నప్పుడల్లా శరీరాన్నికూడా కలుపుకో.
లేకపోతే నీకు పూర్ణత్వం లేదు.
నువ్వు శరీరాన్ని వంచన చెయ్యడమంటే, ఆత్మ వంచన చేసుకోవడం.
నువ్వు దాన్ని హత్య చెయ్యడమంటే ఆత్మహత్య చేసుకోవడం.
నువ్వు ఎక్కడున్నా మైమరచిపోకు(శరీరాన్ని మర్చిపోకు)
ఎప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకో.
పరమ శివుడి విజయ రహస్యమిదే.
ఆయనెప్పుడూ అర్ధనారీశ్వరుడి గానే ఉంటాడు.
తన శరీరాన్ని(అర్ధాంగిని) ఎప్పుడూ విడిచిపెట్టడు.
అందుకే మృత్యుంజయుడు.
జీవితం లోని కష్టసుఖాల్ని ఇద్దరూ కలిసి పంచుకోండి.
జీవితాంతం ఒకరికొకరు తోడుగా, నీడగా.కలసి జీవించండి.
అని అంతరాత్మ మనసుకు నచ్చ చెప్పింది.....
(ఈ కరోనా సమయంలో ఒకరికొకరు దూరంగా ఒంటరిగా ఉండవలిసి వచ్చినపుడు, గుర్తించవలసిన సత్యం ఇదేనని నా అభిమతం)