Menu Close
prabharavi
వెలుగు నీడల కిరణాలు

వెలుతురు తోటకు
ముళ్ళ కంచె చీకటి,
జాగ్రత్తగా తీసి వెళితేనే
పూలూ, ఫలాలు దొరికేది!

రెప్ప తెరిస్తే వెలుతురు
రెప్ప మూస్తే చీకటి,
సుఖానికి దుఃఖానికి దూరం
రెప్పపాటు కాలమే.

నన్ను తప్ప అన్నీ
చూడం డని వెలుతురు,
నన్ను తప్ప ఏదీ
చూడొద్దని చీకటి...

నా వెలుతురు ప్రేయసి
చాలా అభిమానవతి,
చీకటిలో ఎక్కడుందో,
దీపంగా మారి వెతుక్కోవాలి.

పగలూ రాత్రి ...
కవల పిల్లలు,
ఒకరిది తెల్ల చొక్కా,
ఒకరిది నల్ల చొక్కా.

నూనె లాగేసుకున్నా
దీపాలు వెలిగించుకోగలం,
మా కళ్ళే దీపాలు.
వెలుతుర్ని పూసుకొని
నలుపు తెలు పవుతున్నది,
తెలుపుకు అంటువ్యాధి,
నల్లబడిపోతోంది.

చీకటి గుహలో పడితేనేం,
అక్కడ వెలుతురు తోట,
చంద”మామ” దొరికాడు,
చుక్కల పిల్లలతో ఆట...

చీకటి నూనె
ఉంటేనే
వెలుతురు వత్తి
వెలిగేది!

చీకటిలో సర్వం
పోయాయని దిగులుపడకు,
వెలుతురు రాగానే
అన్నీ దొరుకుతాయి.

మంచు మోహినికి
చీకటి ఇష్టం,
వెలుతురుతో
చాలా కష్టం.

నల్లని చీకటి
చూడకు,
తెల్లని చుక్కల్ని చూడు...

చీకటి అంచుదాకా వెళ్ళాలి
వెలుతురుకోసం,
అంచుమీద గెలవగలిగితేనే
జీవన సౌందర్యం.

కిటికీ తెరిచి
స్వాగతం చెబుతుంది చీకటి,
చీకటి గుండెలోకి చేరి
దిగులును పంచుకునే వెలుతురు...

వెలుతురులో కూడా
చీకటి ఉంది కాబట్టే
వెలుతురు ఉచ్చ్వాసం
చీకటి నిశ్వాసం.

టపాకాయలతో పాటు
లక్షల రూపాయలు కాల్చటం కాదు,
ఒక్క చీకటి గుండెలో
ఒక్క దీపం వెలిగించు!

రాత్రి మంచిదే-
చీకటిని ప్రేమించినా
చుక్కల్ని మూయదు,
మూయలాడి మబ్బే.

చలికి పగలు భయం,
కరిగిపోతా నని.
రాత్రంటే ఇష్టం
బలిసిపోదా మని.

ఎంత చీకటిని
పిండితేనో
ఉదయం గిన్నెలో
ఒక సూర్యుడు.

Posted in May 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!