Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

పక్షి – బంగారపు రెట్ట

అనగనగా ఒక పర్వత శిఖర ప్రాంతంలో ఒక మహావృక్షం. ఆ వృక్షం పైన ఒక పక్షి  నివసిస్తుండేది. అది అన్ని పక్షులలాగ కాకుండా ఒక ప్రత్యేకత కలిగి ఉండేది. అదేమిటంటే ఆ పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా మారిపోయేది.

ఒకనాడు ఒక వేటగాడు పక్షుల్ని వేటాడుతూ ఆ వృక్షం క్రిందకి వచ్చి నిలబడ్డాడు. వేటగాడు చూస్తుండగానే పక్షి రెట్ట వేయడం తక్షణమే రెట్ట బంగారు కణికలుగా మారడం జరిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసిన వేటగాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.

‘ఆహా! ఇదేం వింత? నా చిన్నప్పటినుంచీ పక్షుల్ని వేటాడి పట్టుకుంటున్నాను. కానీ ఇవాళ ఈ వింత ఏమిటీ? పక్షి రెట్ట బంగారంగా మారడమేమిటీ ఎన్నడూ వినలేదు, చూడలేదు’ అనుకున్నాడు.

ఎలాగైనా ఆ పక్షిని పట్టుకోవాలని వల పన్నాడు.

పాపం వేటగాణ్ణీ, వాడి పన్నాగాన్నీ తెలుసుకోలేక పక్షి వలలో చిక్కుకుంది. వింత పక్షిని వలలోంచి తీసి పంజరంలో బంధించాడు వేటగాడు. అప్పుడే వాడికొక ఆలోచన వచ్చింది ‘ఈ వింత పక్షి గురించి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాజుగారికి తెలియక ముందే నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఈ పక్షిని బహుమతిగా ఇస్తాను. ఆయన ఎంతో సంతోషిస్తాడు’ అనుకుని హుటాహుటిన పంజరంలో బంధించిన పక్షితో సహా రాజుగారి వద్దకు వెళ్ళాడు.

రాజుగారు తన మంత్రులతో సమావేశమై ఉన్నాడు. వేటగాడు రాజుగారికి నమస్కరించి పక్షి గురించీ దాని ప్రత్యేకతను గురించీ వివరించి చెప్పాడు.

వేటగాడి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే సేవకుల్ని పిలిచి ‘ఈ పక్షిని జాగ్రత్తగా చూడండి. అది తిన్నంత తిండి పెట్టండి’ అని ఆజ్ఞాపించాడు.

అయితే రాజుగారి మంత్రులకు వేటగాడు చెప్పిన మాటలపై నమ్మకం కలుగలేదు.

‘మహారాజా! ఎవరో ఎక్కడనుంచో ఒక వేటగాడు వచ్చి ఏదో చెప్పగానే నమ్మేయడం ఎంతవరకూ సమంజసం? పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా మారడం అసంభవం. కనుక ఈ పక్షిని ఇలా పంజరంలో బంధించి ఉంచడం సరికాదు. దీనిని స్వేచ్ఛగా ఎగురనిద్దాము’ అన్నారు.

వేటగాడు చెప్పిన దానిలో నిజానిజాలు పరీక్షించకుండానే మంత్రుల చెప్పుడు మాటలు విని పక్షిని పంజరం నుంచి విడిచిపెట్టమని చెప్పాడు సేవకులకి.

రాజాజ్ఞను పాటించి సేవకులు పంజరం తెరిచి పక్షిని వదలగానే అది వెళ్ళి కోట దర్వాజా మీద కూర్చుని రెట్ట వేసింది. మహారాజు, మంత్రులూ, సేవకులూ చూస్తుండగానే రెట్ట బంగారంగా మారిపోయింది.

‘నేనే తెలివి తక్కువతనంతో వేటగాడి వలలో చిక్కానని అనుకుంటే, ఈ తెలివిమాలిన వేటగాడు నన్ను తీసుకొచ్చి రాజుగారికి అప్పగించాడు. వేటగాడి మాటల్ని నమ్మకుండా రాజూ మంత్రులూ అంతకంటే తెలివితక్కువగా నన్ను పంజరంలోంచి విడిచిపెట్టారు. అందరూ అందరమే ప్రబుధ్ధులం’ అనుకుంటూ పక్షి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది.

నీతి: తెలివితక్కువ తనం, తెలివితక్కువ వాళ్ళ సహవాసం ఎప్పుడూ నష్టాన్ని కలిగిస్తుంది.

Posted in May 2020, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!