Menu Close
పెద్ద కొడుకు
-- డా. వి.వి.బి. రామారావు

ఉత్తరం చదువుకున్న వెంకట్రామయ్య గారు కొంతసేపు అలా ఉండిపోయారు. కొంతసేపయాక తేరుకుని

‘ఓయ్, అబ్బాయి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది’ అంటూ భార్య గదిలోకి వచ్చారు. ‘ఓ నిద్రపోతున్నావా?’ వెనక్కి వెళ్ళిపోబోయారు.

‘లేదండి, అలా మోగన్ను పడిపోయింది.’

‘అబ్బాయి ఉత్తరం రాశాడు’

‘అంతా కులాసానా వస్తున్నారా?’ లేని బలం తెచ్చుకుని తలగడ నిలబెట్టి నడుం దానికి జేరవెయ్యబోయింది పేరిందేవమ్మ.

‘ఏదండి ఉత్తరం?’

నీరసంతో వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకుని కళ్ళు చిట్లించి ఓ క్షణం చూసి ఉస్సురని నిట్టూర్చింది.

‘నాకో కార్డు ముక్క ఇవ్వండి. రెండు ముక్కలు రాసిపడేస్తాను.’

కార్డు తీసుకుని శ్రీకారం చుట్టబోయిన పేరిందేవమ్మకి కళ్ళు మసక మసకగా అయి చీకట్లు కమ్ముకున్నాయి. ఒళ్లంతా చెమట పట్టేసింది.

‘వాడిని రావద్దని రాయండి. నా కిప్పుడప్పుడే భయం లేదు. మీరే రాసి పోస్టులో పడెయ్యండి.’

భార్య మాటలు విని వెంకట్రామయ్య ఆశ్చర్యపోలేదు. ఆలోచనలో పడ్డాడు.

కడుపున పుట్టిన బిడ్డ వస్తానంటే ఎందుకు కాదంటుందో తనకు తెలియక పోలేదు. తల్లి ప్రాణం తల్లి ప్రాణమే. అందుకనే చూపించారు ఉత్తరం. రావద్దని రాయమంటోంది. తీరా ఏదైనా జరగరానిది జరిగితే ...అభాండం మీద పడితే కష్టం. కష్టాలన్నిటినీ భరించవచ్చు – మాటపడటం తనవల్ల కాని పని. రమ్మని రాయడం భావ్యం. రావద్దని రాయడమెలా? వస్తున్నానని రాస్తున్న కొడుక్కి రావద్దంటున్న తల్లి మాట ఎలా రాయాలి?

‘ఏమిటండీ ఆలోచన?’

మగతనుండి మేల్కొని అడిగింది పేరిందేవమ్మ. అయినా అది మాటవరస కడిగిన ప్రశ్న. మనసులోని ఆలోచనల్ని ముఖంమీద చదవగలిగిన ప్రజ్ఞ అన్యోన్య దాంపత్యం కొన్ని దశాబ్దాలు సాగించిన తరువాత భార్యా భర్తలిద్దరికీ కరతలామలకమే.

‘ఏంలేదు. చిన్నాడు రాసిన ఉత్తరానికి జవాబు..’ వాక్యం ఎలా ముగించాలో తెలియక ఆపేశారు.

‘నేనెలానూ బ్రతకను. దగ్గరా, దాపలా? అంత దూరం నుంచి  రావడం మాటలా? వచ్చినప్పుడల్లా, సెలవూ, పిల్లల చదువులూ, బోల్డు డబ్బూ దండగ.’

ఆరముగ్గిన జీవితానుభవం – నాకంటె నీ తెలివితేటలే ఎప్పుడైనా ఎక్కువ – చాలా జటిలమైన సమస్య. దీనికి పరిష్కారం ఎంత సులువుగా సూచించింది.! రావద్దనే తాత్పర్యమైనా అందులో ఎంత నాజూకుదనం!

వెంకట్రామయ్య గారు తృప్తిగా చిరునవ్వు నవ్వారు.

‘అయితే నేనే రాస్తా’ రెండు వాక్యాలు రాసి ఆమె వంక చూసి ‘పూర్తి చేసి చదువుతా’ అన్నారు.

‘నువ్ రాసిన ఉత్తరం అందింది. అమ్మ కులాసా. మొన్ననే వచ్చి వెళ్ళావ్. నువ్వు వచ్చినప్పటికంటే కొంచెం నయంగా ఉంది పరిస్థితి. పిల్లలకు బడీ, నీకు సెలవూ పోతుంది. రావద్దని అమ్మ రాయమంది. డాక్టరు మందులు మార్చి రాశాడు. పెద్దాసుపత్రికి కూడా తీసుకెళ్ళాను. అదే వైద్యం కొనసాగించమని చెప్పారు. కోడలుకీ, పిల్లలకీ ఆశీస్సులు.’

రాసిన ఉత్తరం చదివి వినిపించారు వెంకట్రామయ్య గారు. మొదటి వాక్యమైనా వినకుండా నిద్రమగతలోకి జారిపోయింది పేరిందేవమ్మ గారు.

ఆమె వంక అలా తదేకంగా చూస్తున్నారాయన.

‘షుగర్ ఎక్కువైతే ఈ నీరసంమీద కోమా వచ్చేస్తుంది. గుండెపోటు ఎక్కువైతే పక్షవాతం వచ్చేస్తుంది. మధుమూత్రం, గుండెజబ్బు, రెండూ జతకూడితే ప్రమాదమే. ఒకదానికి తిండి పనికిరాదు. రెండోదానికి తినక వీల్లేదు. మరేం చేస్తాం మాష్టారు –జాగ్రత్తగా ఈ మందులు వాడండి. పథ్యంగా ఉండాలి.’

డాక్టర్ అయిదేళ్ళ నుంచి చేస్తున్న వైద్యమే. నెల నెలకీ, ఈ మధ్య పరిస్థితి మరీ అయోమయం అయిపోతూంది. డాక్టర్లు ఎంత మంచివాళ్ళయినా, ఎంత చదువుకున్న వాళ్ళయినా, వాళ్ళు చేయగలిగిన దానికీ మేర లేకపోలేదు. గట్టిగా ఆలోచిస్తే చివరకు జలుబుకే మందు లేదు. కాలం చెయ్యవలసిన పనులు మనిషికెలా సాధ్యం! వాళ్ళ వృత్తి ధర్మం కాబట్టి, తమ కుటుంబంయెడల, తనకున్న పేరు ప్రతిష్టల యెడల ప్రత్యేకమైన అభిమానం ఉండబట్టీ వివరంగా ఉన్న సంగతి చెప్పాడాయన.

కొన్ని వారాల క్రిందట ఆయన సలహామీద పెద్దాసుపత్రికి వెళ్ళారు. పరీక్షలన్నీ పకడ్బందీగా చేసి, జాగ్రత్తగా ఉండాలన్నారు.

అయితే వాటి వల్ల వెంకట్రామయ్య గారిలో ఓ రకమైన ఆశ కలగడం ప్రారంభించింది. పేరిందేవమ్మ మాత్రం తను మళ్ళీ ఇంత చేసుకుతినగలననే నమ్మకం పోయింది. అలా అలా మంచం ఎక్కినావిడ మూడు నెలల్లో రెండు సార్లు ‘సరిసరి’ అనిపించేసింది.

పెద్దబ్బాయీ, కోడలూ, పిల్లలూ, రెండుసార్లు చూసి వెళ్ళారు. రెండో అబ్బాయి వాళ్ళు వచ్చి ఓ నెలరోజులున్నారు. కొంచెం కులాసాగా ఉన్నాక తనే వెళ్ళమని పంపించేసింది.

పెద్దబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనుకుని లేని బలం తెచ్చుకుని కూచుంది. దస్తూరి చూడగానే గుండెల్లో రాయి పడింది పేరిందేవమ్మకి.

ఆయన ముఖం చూస్తే జాలి కలుగుతోంది. ఇద్దరు పిల్లల్నీ ఎలా సాకిందీ తల్లిగా తనకు తెలుసు. ఇద్దరి ఎడలా ప్రేమ ఉన్నా పెద్దాడిమీద ఆయన ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తే తనేమనుకుంటుందోనని ఆయన మనసులో మెర. చిన్నబ్బాయి మీద ఆయన ఆపేక్ష చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆవిడకీ తెలుసు.

‘అబ్బాయి ఉత్తరం రాశాడు’ అని చెప్పడంలో భావం ‘నీ కొడుకు రాశాడోయ్’ అని. తన కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని చెబితే, తన చిన్న కొడుకు వస్తున్నాడని తను కొండెక్కినంత సంతోషం పొందుతుందని ఆయన ఉద్దేశ్యం.

‘పాపం, ఈయన కష్టాల్లోంచి యెలా బైటపడతారో! నాకే వాడి మీద కంటే పెద్దాడి మీదే మమకారం ఎక్కువని ఈయన్ను నమ్మించడం ఎలా? అబద్ధాలాడడానికి, కల్లబొల్లి కబుర్లు చెప్పడానికి కళ కావాలి. వీటిని నమ్మనట్టు సూటిగా చెప్పిన నిజాన్ని ఎవరూ సులువుగా నమ్మరు.’ ఆలోచనల అలసటతో నిద్ర ముంచుకొచ్చింది పేరిందేవమ్మకి.

‘పెద్దాడిని పిల్చి ఓ రెంణెల్లుండమంటే బాగుణ్ణు.’ ఆ రోజు పదోసారి మనసులో అనుకొన్నారు వెంకట్రామయ్య గారు. ‘వాడొస్తే కొండంత బలం వచ్చినట్టుంటుంది. వాడే తన బాధ్యతలను పంచుకోగల మనిషి. కాని, అలా తొందరపడకూడదు – పాపం, నేడో, రేపో అని ఉన్న మనిషి, దానికి కష్టం కలిగించకూడదు. నా విధిని నేను నిర్వర్తించాలి. ఒక భార్యను చిన్న వయసులోనే సాగనంపినవాడిని. నేనెటూ రాటుదేలిపోయాను.’ కంటిలోనికి రాని కన్నీళ్లు గుండెలోనే ఆవిరై ఉస్సురని నిట్టూర్చారాయన. ‘కడుపుతీపి తనకు తెలియనిది కాదు. పెద్దాడు దాని కొడుకు కాదు. చిన్నాడు ఇద్దరికీ కొడుకు. చిన్నాడు వస్తాడంటే లేచి కూర్చుంటుందనుకున్నాడు – కాని వద్దని రాయమంది. వాడి మనసు నొప్పించకుండా ఎలా రాయాలో సూచన కూడా చేసింది.’ ఆలోచిస్తున్న కొద్దీ పరిస్థితి వింతగా తోస్తోంది.

చిన్నబ్బాయి రాసిన జవాబు పోస్టు చెయ్యడానికి బయలుదేరారు వెంకట్రామయ్య గారు. ‘జాగ్రత్తమ్మా! ఆవిడ నిద్రపోతోంది. తలుపు చేరవేసి వెళుతున్నా’ అని చెప్పి.

మగతలోంచి మేలుకోగానే తలనిండా పేరిందేవమ్మకి ఆలోచనలు.

“వెయ్యి రూపాయలు రైలు ఖర్చులు పోసుకుని వచ్చాం. మాకేఁవయినా విలువుందా? మా మాట ఎవరిక్కావాలి? ఏదో ఆయన వెర్రి కాని. ఆయనకీ, ఆవిడకీ పెద్ద కొడుకంటేనే ఇది. మనిషి విలువ తెలియని మనుషులు. కొంతమందికి కడుపుతీపి కూడా తెలియదు.”

చిన్న కోడలు పనిమనిషితో అంటున్న మాటలు వినగానే మనసు పిండినట్లయింది పేరిందేవమ్మకి. ‘ఇంకా నయం ఆయన చెవిన పడితే యెంత బాధపడతారో’ అనుకుంది. ‘అత్తయ్యా’ అని ఒక్క రోజు నోరారా ఆప్యాయంగా పిలుస్తుందేమోనని ఆశపడింది తను. తన వెర్రి గాని మేడమీదనుంచి దిగి తన గదిలోకి రావడమే గగనం చిన్న కోడలికి. ‘జబ్బు మనిషి దగ్గర ఎవరో ఒకరు ఉండాలమ్మా. నే వంట చూసుకుంటా! మీరు అత్తయ్యగారి దగ్గర కూచోండి.’ వాళ్ళు వచ్చిన రెండో రోజు అంది బతిమాలుతూ వంటమనిషి.

‘జబ్బు మనిషి దగ్గర కూచుంటే, ఆయన సంగతి, పిల్లల సంగతి ఎవరు చూసుకుంటారు. మందు ఇవ్వాల్సినప్పుడు పిలిస్తే వచ్చి ఇస్తాను.’ కసురుకుంది చిన్న కోడలు.

‘మేడ యెక్కడం మానేసి చాలా రోజులయింది పేరిందేవమ్మ. రక్తపుపోటు ఎక్కువగా ఉందనీ, మధుమూత్రం వల్ల గుండె చెడిపోయిందని డాక్టర్ చెప్పగానే తనకు చేతనయినంతవరకూ జాగ్రత్తగానే ఉంటోంది. ‘ఇంటికి కాపలాగైనా ఉంటాను. కింద గదిలో వుంటేనే నాకు బాగుంది’ అంది భర్తతో.

‘చిన్నకోడలు వైశాలి మనసులో కలత రేపుతోంది. అయినా బయటకేమని ఏం లాభం? కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. పిల్లలకీ, ఆయనకీ కూడా ఇడ్లీ లేకపోతే వీల్లేదు. పొద్దున్న సాంబారు, ఇడ్లీ లేకపోతే ముఖాలు కడుక్కోరు తండ్రీ, పిల్లలూ; సాయంకాలం పూరీ కూరా తప్పదు మా ఇంట్లో.’ వచ్చిన రెండవరోజు నుంచీ ఊపిరాడని పని అప్పచేప్పేసింది వంటావిడకి.

నాలుగు రోజులు చూసి భార్యను వెంకట్రామయ్య గారు అడిగారు ‘అబ్బాయి అసలు కిందికి దిగడమే లేదు. ఒంట్లో బాగోలేదా’ అని.

‘వెళ్లి చూడండి’ అనాలన్నంత విసుగు వేసింది పేరిందేవమ్మకి. కానీ కొడుకుమీద కోపం, కోడలిమీద విసుర్లూ భర్త మీద చూపించడం అవివేకమనుకుంది. ‘నేను కనుక్కుంటా కోడల్ని’ అనేసింది.

మేడ మెట్ల దగ్గరకొచ్చి కోడల్ని పిలిచింది. కోడలైతే పలికింది కాని కిందకొచ్చింది మనవరాలే.

‘తల్లీ దా కూచో...’

ఎనిమిదేళ్ళ పిల్ల పంజాబీ డ్రెస్సు వంకే చూసుకుంటూ గదిలో కొచ్చింది.

‘మావూరు బాగుందా, మీ వూరు బాగుందా?’ పాప చెక్కిళ్ళు గోముగా రాస్తూ అడిగింది పేరిందేవమ్మ.

‘మా ఊరే బావుంది. అక్కడయితే ఎంచక్కా టి.వి ఉంది. ఛీ ఇదేం వూరు, ఇక్కడ కరెంటు ఉండనే వుండదు. –గడియ గడియకీ పోవడమే. మా ఇంటి పక్కన పిల్లలూ మేమూ యెంతో బాగా ఆడుకుంటాం. మజాగా ఉంటుంది.’

‘స్కూల్ పోతుందని అమ్మ ఏమైనా అంటోందా?’

‘రోజూ చదువుకోమంటుంది. ఏం చదవం? పుస్తకాలన్నీ అక్కడే వదిలి వచ్చా. రెండు రోజుల్లో తిరిగొచ్చేద్దాం అన్నారు నాన్నగారు.’

అడిగినదానికి సమాధానం అయితే చెబుతుంది కాని ‘మామ్మా’ అనైనా పిలవలేదు చిన్నది. మనసు కలుక్కుమంది పేరిందేవమ్మకి.

(ఆంద్ర సచిత్ర వార పత్రిక సౌజన్యంతో..)

చివరి భాగం వచ్చే సంచికలో..

Posted in May 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!